కార్తీక మాసంలో పర్వదినాలు

ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది.

‘న కార్తీక నమో మాస: న దేవ కేశవా త్పరమ్! నచ వేదం నమం శాస్త్ర, న తీర్థం, గంగా యాన్స్ మమ్!!’ అంటారు.

ఈ మాసం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసం గొప్పదనాన్ని తెలిపేదే కార్తీక పురాణం. కార్తీక మాసం యోక్క గొప్పదనం, ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించాల్సిన విదానాల గురించి వశిష్టుడు జనకుడికి వివరించాడని ప్రతీతి. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.

హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
అంటూ!

ప్రతి ఈశ్వ రాలయంలో రుద్ర నమకం మంత్ర భాగము మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.

ఈ మాసమందు వచ్చు సోమవారములు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతి నిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువార్కి విశేష పుణ్య ఫలం లభిస్తుందని చెప్పపడింది.

ప్రదోష కాలం: కార్తీక మాసం మందు అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వరరూపంగా అర్థనారీశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఈ ప్రదోష సమయంలో పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతిదేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీమహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తాడుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట. ఈ సమయాన శివుని ప్రార్ధించడం ద్వారా అర్ధనారీశ్వర స్వరూపాన్ని పూజించటానికి వీలవుతుంది. దానివల్ల కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తాడుట!

ఉత్థాన ఏకాదశి: ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది. శ్రీ మహావిష్ణూవు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పియోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అను పేరు. ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పది ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ధాత్రివనమందు (తులసీ వనం) ఉంటాడని చెప్తారు.

క్షీరాబ్ధి ద్వాదశి: పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనము చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అనేపేరు వచ్చింది. పాల సముద్రమును చిలికారు కనుక దీనినే చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తులసీవనంలో ఉండటంచేత, మహిళలు తులసిని విశిష్టంగా ఈనాడు పూజిస్తారు.

జ్వాలా తోరణం: కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభములకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీ, పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి ముమ్మారు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు.

కార్తీక దీపాలు: దీపాన్నీ త్రిమూర్తులకు ప్రతీకగా భావిస్తారు. దీపంలో కన్పించే నీలకాంతి విష్ణుమూర్తికి. తెల్లకాంతి పరమశివునికి, ఎరుపు బ్రహ్మదేవునికి ప్రతీకలుగా చెపుతారు. అలాగే దీపకాంతి విద్య, ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మి, సరస్వతులకు ప్రతీకలు. జ్యోతిని వెలిగించటాన్ని మన సాంప్రదాయంలో జ్ఙానానికి సంకేతంకంగా చెపుతారు. అటువంటి దీపాలకు కార్తీక మాసంలో విశిష్ట స్థానం ఉంది.

కార్తీక పౌర్ణమి: సాదారణంగా కృత్తిక సక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అని పేరు. ఈ రోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ కార్తీక దీపాలను పూజామందిరమందు, దేవాలయములో, గృహప్రాంగణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి, బియ్యపిండి ప్రమిధలలో తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇస్తారు.

కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి పూజిస్తారు. ఈ రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుందని నమ్మకం.

కార్తీక సోమవారాలు: ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసం లోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది.

కేదారేశ్వర వ్రతం: కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో ప్రాముఖ్యత ఎక్కువ. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని కూడా అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. అలాగే, కుమారస్వామి లేదా షణ్ముఖుడునకు ఆరు ముఖాలు. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడని, ఈ విధంగా కృత్తికలచే పెంచపడుట వల్ల కుమరస్వామి కార్తీకేయుడయ్యాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచుకుంటారు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *