
రామాయన్న పదమ్మువిన్న నిదె సర్వస్వమ్ము నుప్పొంగి, ఏ
సామోద్గీథములో ధ్వనించు రసవేషా! నాడులే తంత్రులై
ఆమోదమ్ముగ లీలగా బ్రతుకు తానై రామసంకీర్తన
మ్మై మాధుర్య తరంగమౌను శుభధామా! రామచన్ద్రప్రభూ!
సామము గీతాత్మక నాదం. దానికి సారం – ఓంకారం, అదే శ్రీరామ నామం. ఆ కారణంచేత, రామస్మరణ రసవంతమైన ప్రణవానికీ, ప్రణవ జన్యమైన గీతానికి హేతువౌతోంది. ఓంకార స్వరూపమైన రామము సామమై, జగమై – ఉపాసకుని జీవితమంతా నాదమయం చేస్తుంది. ప్రతి స్పందనా రామమై, జీవితము రామ సంకీర్తన అవుతుంది.
శ్రీరామ నీనామమేమి రుచిరా అంటూ అనేక మంది సహస్రనామ తత్తుల్యమైన రామనామాన్ని, రామాయణాన్ని తమకు తోచిన విధంగా ఆలపించి ధన్యులైనారు. ఆ కోవలేనే తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతినని , ‘రామ’యన బ్రహ్మమునకు పేరంటూ –
రెండేరెండగు చిన్నియక్కరములే లీలన్ జగంబంత తా
పండెన్ సర్వజనాంతరంగహరమై, భాషా ప్రపంచంబునన్
నిండెన్నీ శుభ శబ్ధమే, సహజమౌనే యాత్మకీ పేరు, బ్ర-
హ్మాండంబంతట నిండు బ్రహ్మమిది ‘రామా’! రామచన్ద్ర ప్రభూ!
అని శ్రీ సామవేదం షణ్మఖశర్మగారు ‘రామచన్ద్ర ప్రభూ’ శతకాన్ని రచించారు. వేదాలసారం రామతత్త్వమని, రామనామ మహిమను భక్తులకు తెలియచెప్పటంతోపాటుగా, రామ కథను గానం చేశారు. అంతటితో విడిచిపెట్టక –
సకలేశానుడవీవే గర్భగుడవై సౌందర్యసీమాకృతిన్
ప్రకటీభూతుడవౌచు మానవుడుగా వర్ధిల్లినావయ్య; జా
నకియే నేరుగ దేవతాకృతిగ తానై వచ్చె నీకోసమై
యకలంకాద్భుతమై యయోనిజగ దేవా! రామచన్ద్ర ప్రభూ!
అంటూ, శివశక్త్యైక్య జ్ఞానమంతా రామనామాంకిత స్వర్ణాంగుళిలో నిక్షిప్తమైనది తెలిపారు.
పిదప,
పుట్టెన్ వానరుడౌచు; విక్రమకళాస్ఫూర్తిన్ నృసింహుండుగా
నట్టే దానవహంత; వేగగతిలోనా వైనతేయుండె; తా
జుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై; శోకాబ్ధిలోనుండి పై
బెట్టెన్ భూసుతునిట్టె క్రోడముగ నాభీలోగ్రపంచాస్యుడై
మెట్టెన్ నామది నీదు దూతయిదె స్వామీ! రామచన్ద్ర ప్రభూ!
అంటూ, కౌసల్య, లక్ష్మణ, భరత, సుగ్రీవ, విభీషణ ఇత్యాది రామాప్తులను స్మరించి, ‘దాసోహం కోసలేంద్రస్య’ అంటూ రామకథను సుందరకాండగా మల్చిన ప్రసన్నాంజనేయునికి ప్రణమిల్లారు.
అంతటితో ఆగక రామగుణలీలా వైభవాన్ని కొనియాడి,
‘రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే….’,
అని హనుమ వర్ణించిన రామ సౌందర్యాన్ని మనోనేత్రంతో దర్శించి పునీతులయ్యారు.
అయీ శాస్త్రములన్ మథించి మదిభావావేశ ముప్పొంగగా
వ్రాయంగా తగునా భవత్కథ! తపింపంగా వలెన్ స్వాంతరం–
గాయత్తమ్ముగ దృష్టినిల్పుచు సమాధ్యానంద వల్మీకమం-
దో యీశా! నిను జూడ నీ పలుకులందున్ రామచన్ద్ర ప్రభూ!
వ్యాస మహర్షి, భోజరాజు, తులసీదాసు, విశ్వనాథ సత్యనారాయణ వంటి ఎందరో వాల్మీకి రామయణాన్ని పలురూపాలలో ఆవిష్కరించారని, అలాంటి రామకథను చెప్పడానికి అంతర్ముఖంలో రాముని దర్శించితేగాని సాధ్యంకాదని, ‘రామచన్ద్ర ప్రభూ’ నేను రాసుకున్న చిన్నపాటి రామయణమని సవినయంగా మనవి చేశారు షణ్ముఖశర్మగారు.
‘రామచన్ద్ర ప్రభూ’ అన్న మకుటంతో వారు రాసిన ఈ శతకంలో మున్నూడిలో మూడు పద్యాలు, రామనామన్ని 8 పద్యాలలో, రామ సౌందర్యాన్ని 6 పద్యాలలో, శ్రీ రామ కథా విశేషాంశాలను 11 పద్యాలలో వర్ణించారు. కాగా, సీతమ్మవారి విశేష మహాత్యాన్ని 10 పద్యాలలో తెలిపి, రామాప్తుల వైభవాన్ని 19 పద్యాలలో కొనియాడారు. రామగుణాలీలా వైభాన్ని 25 పద్యాలలో కీర్తించి, రామచంద్రుని సర్వదేవాతాత్మకుడిగా 19 పద్యాలలో ఆవిష్కరించారు.
చివరగా,
ధరకేతెంచిన విష్ణురామ! వరసీతారామ! దైత్యాళి సం
హార రామా! రఘురామ! వందరమయోధ్యారామ! సర్వజ్ఞస
ద్గురు రామా! ఋషివంద్యరామ! నతులో కోదండరామా! పరా
త్పరరామా! వనవాసరామా! హనుమద్రామా! మహానందని
ర్భరరామా! మునివేషరామ! వరదా! పట్టాభిరామా! వసుం
ధరభారోద్ధరరామ! మ్రొక్కులివి యాత్మారామ! నా గుండెలో
దరిసింతున్ శివరామ! యేలుకొన రాదా! రామచన్ద్ర ప్రభూ!
‘రామ’ నామంతో అనుబంధమున్న గుణాలు, మహాత్ములూ ఎందరో! విష్ణురాముడు పలురాములై – ‘ఆత్మరాము’నిగా సాక్షాత్కరిస్తున్నాడు. తనలో తానానందించే రాముడే, ఆత్మ, అదే ‘శివమ్’.
సౌమ్యశ్రీ రాళ్లభండి