ఏటా నాలుగు నవరాత్రి సంబరాలు

భారతదేశంలో విభిన్న సాంప్రదాయాలకు, ఆచారాలకు పుట్టినిల్లు. పేర్లు, పద్దతులు వేరైనా కొన్ని పండగలు దేశమంతటా ప్రసిద్ది చెందాయి. శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతాలు పూర్తికాగానే భాద్రపదమాసంలో గణపతి నవరాత్రులు ఇక ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు మన తెలుగువారే కాక ఉత్తర, దక్షిణాది వారంతా పెద్ద యెత్తున జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్లో దసరా ఉత్సావాలు ఎంతో ఆడంబరంగా చేస్తారు. దేశమంతటా ఆశ్వయుజ మాసంలో దేవీ ఉత్సవాలు రంగ, రంగ వైభవంగా జరుగుతాయి.

ఇలాంటి నవరాత్రి ఉత్సవాల్లో గుజరాత్ కు ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో సంవత్సరంలో నాలుగుసార్లు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మాఘ, చైత్ర, ఆషాఢ, ఆశ్వయుజ మాసాల్లో నవరాత్రి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధనవమిన మహాలక్ష్మిని, ఆశ్వయుజ మాసంలో దుర్గని, మాఘమాసంలో సరస్వతిని పూజిస్తారు. నవరాత్రన్నాళ్లు దేవాలయాల్లో పూజలు జరపటమేకాక, ఇళ్లలో కూడా అమ్మవారి పూజలు చేసి, ప్రజలంతా కోలాటం ఆడుతూ జానపద నృత్యాలు చేస్తూ పాటలు పాడుతారు. గుజరాత్ జానపద నృత్యరీతులల్లో ముఖ్యాం గర్భా, రస్ లు బహుళ ప్రాచుర్యం పొందాయి.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు విడనాడి దేవి తొమ్మిది వివిధ రూపాలను పూజించే ఈ నవరాత్రులను నార్తన్ అని పిలుస్తారు. ఏటా నాలుగు సంవత్సరాలు నవరాత్రులు జరుపుకున్న ఆశ్వయుజమాసంలో జరిపే శరన్నవారాత్రులకే అధిక ప్రాముఖ్యత. వసంతకాలంలో పంటలు సస్యశ్యామలంగా ఉండి, ఎక్కడ చూసినా పచ్చదనంతో ప్రకృతి పులకిస్తుంది. ఆదిశక్తిని ప్రకృతిగా తలచి ఈ కాలంలో చేసే పూజలను మహాపూజలుగా వారు అభివర్ణస్తారు.

ఆశ్వయుజమాసంలో జరిగే నవరాత్రి ఆయా కుటుంబ ఆచారాలకనుగుణంగా ఇంట్లో ఒక ప్రదేశంలో తిన్నె ఏర్పర్చి గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలను దానిపై పరుస్తారు. మొలకెత్తిన విత్తుల తిన్నెలపై కుండలో నీళ్లుపోసి ఉంచుతారు. దీనిని కుంభం అని పిలుస్తారు. వక్కపొడి, వెండినాణాన్ని అందులో వేసి కొబ్బరికాయపైనుంచి కలశాన్ని చేసి అందు అమ్మవారిని ఆవాహనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులు అఖండ జ్యోతిని కలశం ముందుంచుతారు. అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశాన్ని పూలు, అశోక చెట్టు ఆకులు, పట్టుపీతాంబరాలతో అలంకరించి ఎనిమిది రోజులు సాధారణ పూజలు నిర్వహిస్తారు. అయితే హవన అష్టమిగా పిలవబడే ఎనిమిదో రోజున గుళ్లల్లో యజ్ఞాలు చేస్తారు. నవరాత్రి పూజలు ఒకే వ్యక్తి చేతులు మీదగా జరపటం ఆనవాయితీ. తొమ్మిది రోజులు అమ్మవారి పందిట్లో దుర్గా సప్తాశతి లేక చాందీపథ్లను పఠిస్తారు. ఏకాలంలో నవరాత్రలు జరిపినా పూజా విధానంలో మార్పు ఉండదు. ఎనిమిది లేక తొమ్మిదో రోజు జరిపే యజ్ఞాన్ని నవచాందీ లేక షఠ్ చాందీ అని పిలుస్తారు. హోమంలో నెయ్యితోపాటు, క్షీరాన్నం, బిల్వ, రావి, షమ్మి వంటి ప్రత్యేక చెట్లమానులను వేస్తారు. అలాగే హోమం పూర్తయ్యాక పెద్ద గుమ్మడికాయను కోస్తారు. అయితే కొన్ని తెగలువారు జంతుబలిని ఇవ్వటం కూడా ఆచారమే. చివరలో ఇంద్రుడు మహిషాసురమర్ధనిని శాంతింపచేయడానికి పఠించినట్టు చెప్పే, షక్రాదాయ స్తుతిని పఠిస్తారు.

దేవాలయాల్లో కాళీ, అంబ, దుర్గ, బాలా త్రిపురసుందరి, సరస్వతి, మహిషాసురమర్ధని, ఇంద్రాణి, వరాహి, నరస్నిహీ వంటి తొమ్మిది అలంకారాలను రోజుకొకటి చేస్తారు..ఆదివారం సింహం, సోమవారం నంది, మంగళవారం పులి, బుధవారం నెమలి, గురువారం ఏనుగు, శుక్రవారం గరుడ, శనివారం కోడి ఇలా సూరత్ లో తొమ్మిదిరోజులు అమ్మవారిని వివిధ వాహనాలతో అలంకరిస్తారు . అలాగే వివిధరకాల పూలతో అలకరించి తొమ్మిది పిండివంటలతో మహానైవేద్యం అమ్మవారికి సమర్పస్తారు. పూలతో చేసే అలంకారాలను వడి భారవి అంటారు. దేవాలయ ప్రాంగణంలో మాండవీ (దీపం)లను పెట్టి దాని చుట్టూ చేసి నృత్య,గానాలతో అమ్మవారిని స్తుతిస్తారు. దాండియాగా మనకు తెలిసిన గర్భ, రాస్ నృత్యాలను ఈ సమయంలో ప్రదర్శిస్తారు. గర్బా అనే పేరు గర్భదీపం నుండి పుట్టింది. రాస్ స్ర్తీ, పురుషులిద్దరు ఆడతారు. కాగా, గర్భా కేవలం స్ర్తీలు మాత్రమే ఆడతారు. ఈ రెండు నృత్యాల్లో కృష్ణలీలలు గానం చేస్తారు. ఇవే కాక, భావై, తిప్పణి, సిద్ధి, పాధర, డాంగీ అనే జానపడ నృత్యరీతులు కూడా ప్రాచుర్యలంలో ఉన్నాయి. రాత్రంతా పాటలుపాడి, నృత్యం చేసి తెల్లవారుజామున అమ్మవారికి హారతులిస్తారు.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp