ఉషస్సు అనగా ఏమిటి?

ఉదయే బ్రాహ్మణోరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తీశ్చదివాకరః

సూర్యోదయకాలమునకు ముందు, తెల్లవారుఝాము ఉషస్సు అనబడును. ఉషాసుందరి రాత్రికి అక్క, ఆకాశమునకు కూతురు, వరుణునకు చెల్లెలు, స్వర్గమునకు పుత్రిక, కాంతులు విరజిమ్మెడి ఒక యువతి వలె శోభిల్లుచు ఆమె సకల ప్రాణులను మేల్కొలుపును. ఆమె తన ఆరాధ్య దైవమైన సూర్యుని మార్గమునకు సుగమము చేయును. రుషులు ఈ సమయమును మోక్షప్రాప్తికై సాధనలు సల్పుదురు. సూర్యుని తేజంను బట్టి సూర్యునికి వివిధ పేర్లు కలవు. సంవత్సరంలోని ప్రతి నెలలకు ఒక్కొక్క సూర్యుడు అధిపతిగా వెలుగొందుతాడు.

చైత్రమాసంలో సూర్యుడు ఎలా వెలుగొందుతాడు?
ధాతౌ యను సూర్యుడు చైత్రమాసంలో కృతస్ఠలి అను అప్సరస, పుస్త్యుడు అను ఋషి, వాసుకి అను సర్పం, రథకృత్ అనే యక్షుడితో కలిసి ఉండును. ధౌతయను సూర్యుడు ఎనిమిదివేల కిరణాల ప్రభతో రక్తవర్ణుడై వెలుగొందుతాడు.

వైశాఖమాసంలో సూర్యడెలా ఉంటాడు?
వైశాఖమాసంలో సూర్యభగవానుడు అర్యముడు అనే పేరుతో, పులహుడు అనే రుషితో, అథౌజుడు అను యక్షునితో, పుంజకస్థలి అనే అప్సరసతో, ప్రహేతి అనే రాక్షసునితో, కచ్ఛనీరము అను సర్పంతో, నారదుడు అనే గంధర్వడితో కలిసి రథముపై శయనించును. అర్యముడు పదివేల కిరణములతో ప్రకాశించుచూ, పీతవర్ణుడై, మేరు పర్వత శిఖరములపై తిరుగుచు, కమలములను వికసింపచేయును.

జ్యేష్ఠమాసంలో సూర్యడెలా ఉంటాడు?
జ్యేష్ఠమాసంలో సూర్యడు మిత్ర అను పేరుతో, అత్రి అను రుషితో, రథస్వనుడు అనే యక్షునితో, మేనక అనే అప్సరసతో, పౌరుషేయుడు అనే రాక్షసునితో, తక్షకుడు అనే సర్పంతో, హాహా అనే గంధర్వనితో కలిసి తన రథంపై పయనించును. మిత్రాదిత్యుడు రాత్రిని నివారించటంలో సమర్ధుడై, ఉదయాద్రిని ఆశ్రయించినవాడై, చీకట్లను పారద్రోలుచూ ఏడువేల కిరణములతో ప్రకాశించుతాడు. ఈయన అరుణవర్ణుడు.

ఆషాడమాసంలో సూర్యడెలా ఉంటాడు?
ఆషాడమాసంలో సూర్యుభగవానుడు వరుణడను పేరుతో మిగుల తపింపచేయును. అప్పుడు వశిష్టమహర్షి, సహజన్యడను యక్షుడును, రంభ అనే అప్సరస, చిత్రస్వనుడను రాక్షసుడు, శుక్రుడు అనే సర్పం, హూహూ అను గంధర్వడితో కలిసి రథముపై పయనించుదురు. ఈ ఆదిత్యుడు ఐదువేల కిరణములతో ప్రకాశించుచూ, శ్యామలవర్ణముతో విలసిల్లుచుండును.

శ్రావణమాసంలో సూర్యడెలా ఉంటాడు?
శ్రావణ మానసమునకు అధిపతైన సూర్యుడు ఇంద్రాదిత్యడు. ఈయన రథముపై అంగిరుడు అను ఋషి, శ్రోత అను యక్షుడు, ప్రమ్లోచ అను అప్సరస, వర్యుడు అను రాక్షసుడు, ఏలవ్రతము అను సర్పం, విశ్వవసువు అను గంధర్వడు సంచరించుదురు. ఈయన సహస్రకాంతులతో ప్రకాశించుచూ ఏడువేల కిరణములతో విరాజిల్లును. ఈయన శ్వేతవర్ణుడు.

భాద్రపదమాసమున సూర్యడెలా ఉంటాడు?
భాద్రపదమాసమున సూర్యడు వివస్వంతుడను పేరుతో రథముపై పయనించును. ఆయనతో భృగు మహర్షి, అసారణుడు యక్షుడు, అనుమ్లోచ అను అప్సరస, వ్యాఘ్రుడను రాక్షసుడు, శంఖపాలుడను సర్పం, ఉగ్రసేనుడను గంధ్వరుడు కలిసి పయనించుదురు. మహాతేజస్వియైన వివస్వంతుడు పదివేల కిరణములతో ప్రకాశించుచూ, గోథుమ వర్ణంతో విలసిల్లుచుండును.

ఆశ్వయుజమాసమున సూర్యుడెలా ఉంటాడు?
ఆశ్వయుజమాసమున తన రథముపై త్వష్ట అను సూర్యుని వెంట జమదగ్ని అను మహర్షి, శతజిత్ అను యక్షుడు, తిలోత్తమ అప్సరస, బ్రహ్మపేతుడను రాక్షసుడు, కంబళుడను సర్పం, ధృతరాష్ట్రుడను గంధ్వరుడు పయనించుదురు. ఈ త్వష్టాదిత్యుడు పెక్కు శిల్పములకు నిర్మాత, వివిధ ధాతువుల వన్నెలలో ప్రకాశించుచూ, ఎనిమిది వేల కిరణములతో ప్రకాశించును. ఈయన చిత్రవిచిత్రములైన వర్ణముతో నుండును.

కార్తీకమాసమున సూర్యుడెలా ఉంటాడు?
కార్తీకమాసమునందు విష్ణువు అనుపేరుగల సూర్యడు తన రథముపై సంచరించును. విశ్వామిత్రను ఋషి, మఖాపేతను రాక్షసుడు, రంభ అను అప్సరస, సత్యజిత్తును యక్షుడు, అశ్వతరము అను సర్పం, సూర్యవర్చసుడను గంధర్వడు వెంటనుందురు. ఈయన సూర్యమండలం మధ్య స్థితుడై యుండును. మూడు వేదములు ఈయనను స్తుతించరు. గాయత్రీ మంత్రము చేత ప్రతిపాద్యుడై ఈ విష్ణువునకిదే నమస్కారము. విష్ణాదిత్యుడు ఆరువేల కిరణములతో అరుణవర్ణుడై శోభిల్లును.

మార్గశిర మాసమున సూర్యుడెలా ఉంటాడు?
మార్గశిరమాసమున అంశమంతుడను సూర్యుడు తన రథముపై సంచరించును. కశ్యప మహర్షి, విద్యుచ్ఛత్రువు అను రాక్షసుడు, ఊర్వశి అను అప్సరస, తారక్ష్యడును యక్షుడు, మహాశంఖమను సర్పం, ఋతుసేనుడను గంధర్వడు వెంటనుందురు. ఈ సూర్యుడు, ఐశ్వర్యంను గ్రహించును. తొమ్మిదివేల కిరణములతో ప్రకాశించుచూ, ఆకుపచ్చ వర్ణముతో శోభిల్లును.

పుష్యమాసమున సూర్యుడెలా ఉంటాడు?
పుష్యమాసమున సూర్యుడు భగ నామధేయుడై తన రథముపై సంచరించును. ఆయువను ఋషి, స్పూర్జను రాక్షసుడు, పూర్వచిత్తి అను అప్సరస, ఊర్జను యక్షుడు, కర్కోటకుడను సర్పం, ఆరిష్టినేమను గంధర్వుడు వెంటనుందురు. తిధి, వార, మాస, సంవత్సర, ఆయన, ఘటికులు మొదలగు కాల విభాగములకు భగాదిత్యుడు అధిదేవత. పదకొండువేల కిరణములతో రక్తవర్ణముతో శోభిల్లును.

మాఘమాసంలో సూర్యడెలా ఉంటాడు?
మాఘమాసమున సూర్యభగవానుడు పూష పేరుతో తన రథముపై పయనించును. ఆయనతో గౌతమ ఋషి, సురుచి అనే యక్షుడు, ఘృతాచి అను అప్సరస, వాతుడను రాక్షసుడు, ధనుంజయుడను సర్పం, సుషేణుడను గంధర్వుడు వెంట పయనించుదురు. పుషాదిత్యుడు సహస్రకిరణుడై సకలపాపములను హరించును. ఆరువేల కిరణములతో ప్రకాశించుచూ, లత్తుక వర్ణంతో భాసిల్లును.

ఫాల్గుణమాసంలో సూర్యుడెలా ఉంటాడు?
ఫాల్గుణ మాసమున సూర్యభగవానుడు పర్జన్యుడు పేరుతో సంచరించును. ఆయనతో భరద్వాజ మహర్షి, క్రతువను యక్షుడు, సేనజిత్తను అప్సరస, వర్చను రాక్షసుడు, ఐరావతమను సర్పం, విశ్వుడను గంధర్వడు రథముపై నుందురు. ఈ పర్జన్యాదిత్యుడు మొదట సమస్త సృష్టిని తపింపచేసి, పిమ్మట వర్షముల కురిపించను. ఈయన తొమ్మిదివేల కిరణములతో ప్రకాశించుచూ, అరుణ వర్ణముతో ఉండను.

ఆదిత్య శ్లోకం: మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచాదిత్య, సవిత్రర్క భాస్కరేఖ్యోనమః

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *