ఉత్సాహాల ఉగాది

వసంత రుతువు ఆరంభంలో వచ్చే ప్రధాన పండుగ ఉగాది లేదా యుగాది. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. కాలక్రమేణా యుగాది ఉగాదిగా స్థిర పడింది. అయితే “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’. ‘ఉ’ అంటే ఉత్తమమైన ‘గ’ అంటే జ్ఞానం అనే అర్థంలో – సృష్టిలో మొదట ఏర్పడింది ‘వేదం’ అనే అర్థంలో కూడా ‘ఉగాది’ అన్న భావన ఉంది.

కోయిల కూజితాలు, తుమ్మెద రాగాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లె, జాజులతో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉండే ఈ వసంతకాలం చైత్రమాసంలో అడుగిడుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది లేక ఉగాదిగా మనం పండుగ జరుపుకుంటాం. చైత్రశుద్ధ పాడ్యమినాడు బ్రహ్మ తన సృష్టిని ఆరంభిచాడని, మత్స్యావతారం ధరించి సోమకుడుని వధించి విష్ణుమూర్తి వేదాలను సంరక్షించి బ్రహ్మకు వాటిని తిరిగి అప్పగించిన రోజు కూడా ఈ దినమేనని, ఆ సందర్భంగా కూడా ఉగాది ప్రాశస్త్యాన్ని సంతరించుకుందని మన పురాణాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు చైత్రశుద్ధ పాడ్యమినాడే పట్టాభిషక్తులయ్యారు. ఈనాడే మనం ఆనవాయితీగా వినే పంచాంగాన్ని వరహమిహిరుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినది.

ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు బైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

తెలుగు సంవత్సరాలు: మనకు ప్రభవ, విభవలతో మొదలెట్టి వికృత, వ్యయ, రుణ, విక్రమ,, ప్రమాదాది అరవై సంవత్సరాలున్నాయి. ప్రారంభాన్ని సూచించే ప్రభవతో మొదలై అక్షయతో ఈ తెలుగు సంవత్సరాలు ముగుస్తాయి. ఈ అరవై సంవత్సరాలూ తిరిగి పన్నెండు భాగాలుగా చేశారు. అయిదు సంవత్సరాలు కలిసి ఒక్కో భాగం. దానికి ‘ఖండ యుగం’ అని పేరు. ‘నందన’ ప్రభవాదుల్లో 26వది కాగా, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖి అనే అయిదు సంవత్సరాలూ కలిసి ఒక ఖండ యుగం.

తెలుగు సంవత్సరాల పేర్లు: 1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. అంగీరస, 7. శ్రీముఖ, 8. భావ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాధి, 14. విక్రమ, 15. వృష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్తు, 22. సర్వధారి, 23. విరోథి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవళంబి, 32. విళంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ 36. శుభకృత్తు, 37. శోభకృత్తు, 38. క్రోథి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్తు, 46. పరీధావి, 47. ప్రమాదిచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్తి, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్ముఖి, 56. దుందుభి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, మరియు 60. అక్షయ.

‘కలౌషష్టిర్విధీయతే’ అని కలియుగంలో 60 సంవత్సరాలు జీవించడం పరమావధి. అలా జీవించిన వ్యక్తి జరుపుకునే పండుగే షష్టిపూర్తి. ఒక రకంగా చూస్తే ఈ సంవత్సరం ఉగాదికి కూడా షష్టిపూర్తే. 1952లో నందన సంవత్సరాది జరుపుకున్నాం. అరవైఏళ్ల సంత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు! నందన ఉగాది నాటికి ఈ సృష్టి జరిగి అన్ని యుగాలతో కలిపి 195,58,25,112 సంవత్సరాలైందని ఒక సిద్ధాంతం.

ఉగాది విశిష్టత పంచాగ శ్రవణం. పంచాంగం అంటే ఏమిటి? పంచ అంగాలు- లేదా అయిదు భాగాలు….. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అన్నవే అయిదు అంగాలంటారు. ‘తిథి’ సంపదను, ‘వారం’ ఆయుష్షును ఇస్తుంది. ‘నక్షత్రం’ పాపాలను పోగొడుతుంది. ‘యోగం’ రోగ నివారణ చేస్తుంది. ‘కరణం’ కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇవి 15 తిధులు, 7వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు. వీటి గమనాన్ని తెలిపేదే “పంచాంగం”. సౌలభ్యం కోసం నేడు రోజువారి చర్యలకు గ్రెగేరియన్ (ఇంగ్లీషు) క్యాలెండర్ను ఉపయోగిస్తున్నా, మన పండగలు, పూజా,పునస్కారాలు, శుభకార్యాలు వచ్చేటప్పటికి మన పంచాగాలనే ఆశ్రయిస్తాం. పంచాగ శ్రవణంలో ముఖ్యంగా సంవత్సర రాశి ఫలితాలు, నవనాయక ఫలితాలు తెలుపుతారు.

ఉగాది పచ్చడి: ఉగాది జీవితగమనంలో ఏర్పడే కొత్త,పాతల, కష్టసుఖాల అనుభవాలను గుర్తుచేసే షడ్రుచుల సమ్మేళనం. ఈ అనుభూతులను తెలియ చేసే తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు కూర్చి ఉగాది పచ్చడిని తినడం మన తెలుగువారి ఆనవాయితీ. కొత్త చింతపండు, పచ్చి మిరపకాయలు, కొత్త బెల్లం, మామిడి పిందెలు, వేప పూత, ఉప్పు కలిపితే తయారయ్యేదే ఉగాది పచ్చడి. వీటినే మధుర, ఆమ్ల (పులుపు) లవణ, కటు(కారం), తిక్త, (చేదు), కషాయం అని సంస్కృతంలో అంటారు. పూర్వం ఈ పచ్చడిని ఉగాది రోజు మొదలుపెట్టి ప్రతిరోజు కొద్దిగా శ్రీరామనవమి వరకు తొమ్మదిరోజులు పుచ్చుకునేవారు. నేడు ఆ ఒక్క రోజు తినడమే గగనమై పోతోంది. కాల మహిమ!

త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు,

ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పద్దతీ కాలగర్భంలో కలిసిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *