పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడమాసంగా వ్యవహరిస్తాము. ఈ ఆషాడ మాసాన్ని శూన్య మాసమని కూడా అంటారు. ఈ మాసంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి తిరిగి సూర్యుడు మకరరాశిలోనికి ప్రవేశించేంత వరకు దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ప్రయాణిస్తాడు. ఈ మాసం పితృదేవతలకు ప్రీతికరమని భావిస్తారు. అందువల్ల ఈ మాసంలో చేసే స్నానం, జపం, దానం, పారాయణాలకు విశేష ఫలితాలుంటాయని ప్రతీతి. ఈ మాసంలోని ఆషాడశుద్ద విదియనాడు పూరీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయత్రను జరుపుతారు.
వ్యాసపూర్ణిమ: వ్యాసమహాముని జన్మతిథి ఆషాడశుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమని, వ్యాస పౌర్ణమని పరిగణిస్తారు. నలుపు రంగులో ఉన్నందున కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ వెరసి కృష్ణద్వైపాయనుడని ఈయన పేరు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. మహాభారతంతోపాటుగా, భాగవతం, అష్టాదశపురాణాలను, యోగసూత్రాలకు భాష్యాలను, బ్రహ్మసూత్రాలను జాతికందించి వారికి జ్ఞానబోధ చేసిన ఆధ్యాత్మిక గురువు వ్యాసుడు.
తొలిఏకాదశి లేదా శయన ఏకాదశి: మతత్రయ ఏకాదశి అని పిలవబడే ఈ ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతమారంభమవుతుంది. ఈనాటి మొదలు విష్ణుమూర్తి నాలుగు నెలలు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉంది కార్తీకశుద్ద ఏకాదశినాడు వెనక్కి తిరిగి వస్తాడని, అలాగే, ఈనాటి నుండి విష్ణువు నాలుగు నెలలపాటు శేషశాయిపై యోగనిద్రలో ఉంటాడని, కార్తీకశుద్ద ఏకాదశినాడు మేలుకొంటాడని పురాణాలు తెలుపుతున్నాయి. అందువల్లే శయన ఏకాదశని పేరు వచ్చిందని చెపుతారు.విష్ణాలయాలలో భక్తులు భగవంతునికి పదకొండు ఒత్తులతో దీపారాధన చేసి, పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యం పెట్టటంతోపాటు విశేషంగా పవళింపు ఉత్సవాలు జరుపుతారే. బ్రహ్మవైవర్త పురాణానుసారం నేటి నుంచి చాతుర్మాసవ్రతాన్ని ఆచరించి, ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, అష్టమి తిథులలో ఉపవాసం ఉండి వ్రతాన్ని జరుపుతారు. ఈ వ్రతాన్ని జైనులు స్నానోత్సవంగా ఆచరిస్తారు. ఈ పర్వదినాన గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తారు. గోముఖ భాగమందు వేదాలు, కొమ్ములందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి, అరుపులో ప్రజాపతి ఇలా సర్వదేవతా నివాసస్థానమైన గోవును పూజిస్తే పుణ్యఫలాలను పొందవచ్చని అధర్వణ వేదం, బ్రహ్మాండపురాణం, పద్మపురాణం మనకు తెలుపుతున్నాయి.
బోనాలు: భోజనానికి వికృతి పదమే బోనం. అలాగే బోనం అంటే భువనమని కూడా అర్థం. విశ్వశ్రేయస్సు కోసం జగన్మాతను ఆరాధించడానికి విశ్వరూపంలో ఉండే బిందెలలో ఆ అమ్మకు భోజ్యాలు (నైవేద్యాలు) పట్టుకెళ్లి సమర్పించే పండుగే బోనాలు. తెలంగాణాలో ఆషాడమాసంలో విశిష్టంగా జరిపే ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలలో అమ్మవారికి మట్టికుండలోగాని, రాగికుండలో గాని అన్నంతోబాటు పాలు, పెరుగు, బెల్లం, ఉల్లిపాయలు సమర్పిస్తారు. ఇలా సమర్పించాడాన్ని ‘ఊరడి’ అని పిలుస్తారు. కుండలలో చిన్న వేపరెమ్మలు, పసుపు, కుంకుమ, తెల్ల ముగ్గులతో అలంకరించి, దానిపై ఒక దీపాన్ని వెలిగించి అమ్మకు నివేదిస్తారు. ఈ పండుగ సమయంలో పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మొదలైన గ్రామదేవతలను విశేషంగా పూజిస్తారు. పూర్వం దీనిని ‘ఊర పండుగ’ని పిలిచేవారు.
తేటగీతి