ఆదిత్య హృదయం ప్రాశస్త్యం

ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యునికి సవిత, రవి, అర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దివాకరుడు, ప్రభాకరుడు ఇలా అనేక పేర్లున్నాయి. ఈ పేర్లన్ని సూర్యుని శక్తి సామర్ధ్యాలను, గుణగణాలను వివరిస్తాయి. ‘ఆదిత్యానాం మహా విష్ణుః’ అని గీత మనకు చెపుతోంది. ఆదిత్యులు పన్నెండు మంది, అందులో ఆద్యుడు విష్ణువు. విష్ణువును ఉద్దేశించి చెప్పిన స్త్రోతమవుట చేత దీనికి ఆదిత్య హృదయమనే పేరు సార్ధకమయింది. విష్ణుసహస్రనామాల్లో జ్యోతిరాదిత్యుడిగా బాసిల్లే ఆదిత్యుని సూర్య తేజస్సును 31 శ్లోకాలలో వాల్మీకి మనకు అందించాడు.

సర్వప్రహరణాయుధాలతో రావణునితో పోరు సలుపుతూ అలసిన శ్రీరాముని వద్దకు అగస్త్య మహర్షి వచ్చి సూర్యభగవానుని ఆరాధించమని ఆదిత్యహృదయాన్ని అందిస్తాడు. ఈ వృత్తాంతం వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో 107వ సర్గలో మనకు కన్పిస్తుంది. ఆదిత్య హృదయంలోని సర్గసమాప్తిని సూచించే చివరి శ్లోకాన్ని శాంతిపఠంగా భావిస్తే మిగిలిన 30 శ్లోకాలలో మొదటి 9 శ్లోకాలు స్తోత్రానికి పూర్వరంగాన్ని సమకూరిస్తే, చివరి తొమ్మిది శ్లోకాలు స్తోత్రపాశస్త్యం, ఫలశ్రుతి సూచిస్తాయి. మిగిలిన 12 శ్లోకాలు దాద్వశాదిత్యులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. రుద్రప్రశ్నలోని నమకం చమకం వలె, ఆదిత్యహృదయంలో ఉత్తరభాగం భాస్కరుని ప్రభవ వైభవాలను కీర్తిస్తే, ఉత్తరభాగంలో ఆరాధ్యదేవతలకు అంజలి అర్పించటం ద్వారా ఈ రెండు భాగాలు ఈ స్తోత్రంలోని శబ్ధాలకు శ్రుతిగౌరవాన్ని సంక్రమింపచేస్తాయి.

ఆదిత్యహృదయంలోని మొదటి రెండు శ్లోకాలు స్తోత్రసందర్భాన్ని సూచించగా, మూడవ శ్లోకం అగస్త్యుని సంబోధనతో ప్రారంభమవుతుంది. ‘రామ రామ మహాబాహో’ అని సంబోధించడం ద్వారా, భార్గవరాముని పరాక్రమం, దశరథరాముని దాక్షిణ్యం నీలో మేళవించి ఉన్నాయని అగస్త్యుడు చెప్పకనే చెప్పుతాడు. అంతేకాకుండా, మహాబాహూ అనడం ద్వారా చతుర్బాహుడైన మహావిష్ణువు తేజస్సు నీలో ఉందని సూచించాడు. నాల్గవ శ్లోకం నుండి స్తోత్రపాశస్యం మొదలవుతుంది. అంతఃశత్రువులను దహింపచేయగలిగే శక్తిగల ఈ స్తోత్రం జపించిన వారికి ఆయుస్సు పెరిగి, జయం చేకూరుతుందని ప్రతీతి.

కిరణకరణములతో తేజోమూర్తిగా బాసిల్లే భాస్కరుడు సర్వదేవతా స్వరూపుడు. తన కిరణజాలంతో లోకబాంధవుడు సమస్తలోకాలను సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపచేస్తాడు, కనుకనే బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు సూర్యకాంతిలోనే ఉన్నారు. ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృదేవతలు, ఎనిమిదిమంది వసువులు, ఇద్దరు అశ్వినీదేవతలు, మరుద్గణాలు, సాధ్యులు అందరూ భాస్కరునికి ప్రతిరూపాలుగా గోచరిస్తారు.

నామ విశేషాలు: ఆదిదేవుడైన ఆదిత్యుడు సర్వస్వం ప్రసవింపచేసేవాడు కాన అతనికి సవిత అని పేరు. ఎవ్వరు చోరరాని చోటులో కూడా సూర్య కిరణాలు చొచ్చుకొనిపోతాయి కావున సూర్యడు. ఆకాశంలో పయనిస్తుంటాడు కాబట్టి ఖగనామధేయుడు. ప్రాణకోటిని పోషించేవాడు కాబట్టి, పుషనామం వచ్చింది. కిరణాలతో శోభిల్లుతూ ఉంటాడు కావున గభస్తిమంతుడని పిలుస్తారు. పసిడివన్నెలతో వెలుగుతూ, పగటి వెలుగును వెలయిస్తాడు కాబట్టి స్వర్ణరేతస్కుడని అనిపించుకుంటాడు. సప్తి అనే పేరు గల ఏడు ఆకుపచ్చని గుర్రాలపై పయనిస్తాడు కాబట్టి సప్తసప్తి అనే పేరు వచ్చింది. శూన్యం నుండి వెలువడ్డ సూర్వకిరణాలు అజ్ఞానమనే చీకటికిని చిలికి, శివతత్త్వమనే నవనీతాన్ని వెలికి తీస్తాయి. కావున మహర్షులు సూర్యుణ్ణి శంభువుగా భావిస్తారు. రేయింబవళ్లను, తిథులను, నక్షత్రాలను, మాసాలను, ఋతువులను, ఆయనాలను, సంవత్సరాలను కల్పించే సూర్యుడు నిజమూన త్వష్ట. ‘‘హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతి రేక ఆసీత్’’ అని శ్రుతి కీర్తించిన హిరణ్యగర్భుడు సూర్యుడే. ఆకాశానికి అధిపతి కావడం వల్ల వ్యోమనాథుడనే పేరు వచ్చింది.

ఏడు వర్ణాలు ఇమిడివున్న సూర్యకిరణాలు భూర్భువస్సువరాది సప్తలోకాలలో ప్రసరిస్తుంది. సప్తమినాడు సర్వలోకపర్వగా సూర్యకాంతి ప్రజ్వలిస్తుంది కాన రథసప్తమి సూర్యపర్వంగా రూపొందింది. ఆకాశంలో కన్పించే చుక్కలు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ సూర్యమండలంలో భాగాలే. మనకు కన్పించే సూర్యుడిలాంటి సూర్యులనేకులు బ్రహ్మాండంలో ఉన్నారు. అలాంటి పన్నెండు మంది ఆదిత్యులలో వెలిగే ద్వాదశాత్మ సంస్మరణలో ఆదిత్య హృదయంలోని పూర్వభాగం అంటే స్తుతి భాగం ముగుస్తుంది. ఆ తర్వాత ఉత్తరార్ధంలో నుతిభాగం – నమయం ఆరంభమవుతుంది. బ్రహ్మను, ఈశానుని, అచ్యుతని -ముగ్గురినీ స్వాధీనం చేసుకున్న సూర్యనారాయణనుకి నమస్కారం. తరగని అక్షయకాంతితో శోభిల్లే జోతిరాదిత్యునికి నమస్కారం. భక్ష్యం, అభక్ష్యం అనే బేధం లేకుండా సర్వం హరించి, తపించే రుద్రమూర్తికి, సూర్యడుదయించి, అస్తమించే తూర్పు, పడమరలకు నమస్కారం. సకల కార్యసమర్ధుడైన విశ్వకర్మకు, బహిరంతర తిమిరాన్ని ఛేదించి, కాంతిని ప్రసరించే లోకసాక్షికి నమస్కారించటం ద్వారా నమకం పూర్తవుతుంది.

‘ఆగ్నేత్వం సూజాగృహి, వయం సుమం దిశీమహీ ’అని శ్రుతిగీతలో చెప్పినట్టు సర్వకాల సర్వావస్థల యందు మనలో వెలుగుతుండే ఆదిత్యరూపం సర్వాదా ఆరాధ్యం. మన వాక్కే ఋగ్వేదం, మనం చేసే పనులే యజుర్వేదం, మన మనస్సులోని సామ్యమే సామవేదం. ఈ మూడింటిని నడింపించే ప్రాణస్వరూపుడు సూర్యడు. ఆ జగదీశ్వరుని స్తోత్రం మూడుసార్లు పఠిస్తే విజయం సిద్ధిస్తుందని అగస్త్యుడు రాముని బోధించటం ద్వారా ఆదిత్య హృదయంలోని మంత్రభాగం ముగిసి, ఫలశ్రుతి ప్రారంభమవుతుంది.

సూర్యుడుదయించడానికి ఎంతకాలం పడుతుందో, సరిగ్గా అంతే సమయం అంటే మూడు, నాలుగు నిమిషాలు ఆదిత్యహృదయం చదవడానికి పడుతుంది. మనిషికి కావల్సిన కాంతిని, శాంతిని, నిలకడను, సరసతను, హాయిని, స్థాయిని ఆదిత్యహృదయం ప్రసాదిస్తుంది.

తేటగీతి

(డా. ఇలపావులూరి పాండురంగారావుగారు రచించి, తిరుపతి తిరుమతి దేవస్థానం వారు ప్రచురించిన ఆదిత్య హృదయం ఆధారంగా క్లుప్తంగా రాసిన వ్యాసమిది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *