సృష్టి, స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి అంశాలు అనేక శక్తి ప్రధాన క్షేత్రాలలో శక్తిపీఠాలుగా విశిష్టతను సంతరించుకున్నాయి. శివపురాణం మనకు ఈ శక్తిపీఠాల ఆవిర్భావ కథను తెలుపుతోంది. బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడుతుంది. దీంతో దక్షుడు శివద్వేషిగా మారి, శివుని అవమానించడం కోసం నిరీశ్వర యాగాన్ని తలపెట్టి, సతీ, పరమేశ్వరులను మినహా ఇతర దేవతలందరిని ఆహ్వానిస్తాడు. పుట్టింటిపై మమకారంతో, పితృవాత్సల్యంతో పిలవకపోయినా సతి దక్ష యజ్ఞానికి వెళ్ళి, అక్కడ అవమానింపబడి యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆహుతి అవుతుంది. సతీవియోగుడైన శంకరుడు ఆగ్రహంతో తన జటాజూటం నుంచి వీరభద్రుడుని సృష్టించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. భస్మీపటలమైన దాక్షాయణి సూక్ష్మదేహాన్ని పరమేశ్వరుడు తన భుజంపై వేసుకుని విలయతాండవం చేస్తాడు. బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించగా, ఆ ప్రళయహేలకు అడ్డుకట్టవేయడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 ఖండాలుగా విభజించి పలుచోట్ల విసిరి వేస్తాడు.
అమ్మవారి శరీర ఖండాలు, ఆభరణాలు పడిన ప్రదేశాలు శక్తి క్షేత్రాలుగా వెలిశాయి. వాటిలో శరీర ప్రధాన భాగాలు పడ్డ ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా మిగిలినవి 52 శక్తిపీఠాలుగా, 108 శక్తి క్షేత్రాలు ప్రసిద్ధిగాంచాయి.
అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం:
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ||
అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ||
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా |
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే ||
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ |
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా ||
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ |
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం ||
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం |
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ ||
అష్టాదశ పీఠాలు:
- శ్రీ శాంకరీదేవి – శ్రీలంక:
రావణ స్తుతి సంతుష్టా కృతాలంకాధివాసినీ |
సీతాపహరణరోషేణ త్యక్తలంకామహేశ్వరీ |
సజ్జన స్తితి సంతుష్టా కదంబవన వాసినీ |
లంకాయం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణా ||
సతీదేవి కాలి గజ్జెలు ఈ ప్రదేశంలో పడ్డట్టుగా చెపుతారు.. శ్రీలంకలోని ట్రింకోమలిలోని ఈ శక్తి పీఠం అష్టాదశ పీఠాలలో మొదటిదిగా భావిస్తారు. లంకాధీశుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యమునకు తీసుకు వెళ్ళాలని భావించి, కైలాసమునకు వెళ్ళి బలవంతంగా పార్వతీ దేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా, కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుడిని అస్త్రబంధనం చేస్తుంది. దీనితో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు. రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా – తన రాజ్యంలో కొలువుదీరి తనను, తన ప్రజలను, రాజ్యమును రక్షిస్తూ ఉండమని వరం కోరుతాడు. రావణాసురుని కోరిక మన్నించిన పార్వతీదేవి రావణాసురుడు అధర్మంగా ప్రవర్తించిన మరుక్షణం అక్కడి నుంచి వెళ్లిపోతానని పలికి శాంకరీదేవిగా వెలసింది. అయితే సీతాపహారణ సమయంలో లంకను విడిచి అమ్మవారు వెళ్లిపోయిందని అందుకే ఈ దేవాలయం, శక్తిపీఠం కాలగర్భంలో కల్సిపోయాయని పురాణ గాథ. శ్రీ శాంకరీ దేవి ఆలయం, శ్రీలంక తూర్పు ప్రాంతంలోని కోనేశ్వరంలో త్రిముకోమలై వద్ద వుందని చెప్పబడుతుంది. దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు. త్రిముకోమలై అంటే “త్రిభుజం ఆకారంలో వున్న కొండ” అని అర్థం. అందుకే ఇక్కడ శివుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా కొలుస్తారు.
శ్రీ సతి శాంకరీ దేవి త్రింకోమలి పురస్థితా
ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా
2. శ్రీ కామాక్షీదేవి – కాంచీపురం:
శివనేత్రిని మీల్యైవ ధృతాకాత్యాయనీవపుః |
గంగాప్లావసముద్విగ్నా సైకతం లింగమాశితా |
భక్తానామిష్టదానిత్యం కామాక్షీ కాంచికాపురే |
ఏకాంరనాథ గృహిణీ శుభం కుర్యాన్మహేశ్వరీ ||
సతీ దేవి శరీరము వీపు భాగం పడిన చోటు కంచి. భూమికి లేదా భూమి యొక్క తూర్పు అర్ధభాగానికి నాభి స్థానం లేదా కేంద్ర బిందువు కంచి. “కా” అంటే “లక్ష్మి”, “మా” అంటే “సరస్వతి”, “అక్షి” అంటే “కన్ను”. కామాక్షి దేవి, లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవిని కన్నులుగా కలదని భావం. ఈ దేవాలయములో అమ్మవారు స్థూల, సూక్ష్మ, శున్య అనే మూడు రూపాలలో ఉంటుంది. సోమస్కంద రూపంగా శివుడు (ఏకాంబరేశ్వర్), ఉమ (కామాక్షి) మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) ఇచ్చట కొలువుదీరి ఉన్నారు. దేవతల విన్నపం మేరకు లోకకళ్యాణార్థం భండాసురుని సంహరించడానికి బాలాత్రిపుర సుందరి రూపంలో ఉగ్రరూపాన్ని దాల్చి వచ్చిన ఈ అమ్మవారి విశిష్టతను ‘చిదగ్నికుండ సంభూత, దేవకార్యసముద్యత’ అనే లలితా సహస్రనామాలు తెలుపుతాయి. కామాక్షి అమ్మవారు ఇక్కడ యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై క్రింది హస్తాలలో చెఱుకుగడ, పుష్పాలు మరియు చిలుకను, పై చేతులలో పాశాన్ని, అంకుశాన్ని ధరించి మనకు దర్శనమిస్తుంది. అమ్మవారు మనకు శ్రీ కంచి కామాక్షి (మూలస్థానంలో ఉన్న తల్లి), తపో కామాక్షి (మూలస్తానమునకు ఎడమ వైపు ఉన్న తల్లి), శ్రీ ఉత్సవ కామాక్షి (మొదటి ప్రాకారమున), శ్రీ విమాన కామాక్షి (తూర్పు రాజగోపురము నందు), శ్రీ బంగారు కామాక్షి అనే ఇక్కడ ఐదు రూపాలలో దర్శనమిస్తుంది. ఈ శక్తి పీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి 76 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడే భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి కామకోటి పీఠం కూడా ఉంది. ఈ కాంచీ క్షేత్రాన్ని సత్యవ్రత క్షేత్రమని, భాస్కర క్షేత్రమని, తేజస క్షేత్రమని, శివశక్తి క్షేత్రమని, శక్తి క్షేత్రమని పిలుస్తారు.
కాంచీపురాశ్రితే దేవి కామాక్షీ సర్వమంగళా
చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థ ఫల ప్రదా
3. శ్రీ శృంఖలాదేవి – ప్రద్యుమ్న:
విశృంఖలాస్వయందేవీ భక్తానుగ్రహకారిణీ |
భక్యానాంశృంఖలా హర్త్రీ స్వయం బద్దాకృపాపరా |
శృంఖలాకటికబద్దా చ జగన్మాతాయశశ్విని |
మాంగల్యదా శుభకరీ వేదమార్గాను పాలినీ |
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ ఏౠష్యశృంగసమర్చితా |
శుభం తనోతుసాదేవీ కరుణాపూరవాహినీ ||
సతీదేవి ఉదరం పడిన ఈ ప్రాంతంలో వెలసిన శక్తిపీఠమిది. శృంఖల అనగా బంధనం అని అర్థం. అలాగే బాలింతరాలు కట్టుకునే నడికట్టును కూడా శృంఖల అంటారు. అందుకే అమ్మవారు ఇక్కడ బాలింత రూపంలో నడికట్టుతో కనబడుతుంది. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్టించినట్టు పురాణ కథనం. శృంగుడు ప్రతిష్టించిన అమ్మవారు కాన శృంగలాదేవి, కాలక్రమేన శృంఖలా దేవిగా రూపాంతరం చెందింది. అష్టాదశ శక్తి పీఠాలలో మూడవదైన ఈ పీఠం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ప్రద్యుమ్నంలో ఉందీ. కోల్ కతాకు 135 కి.మీ. దూరంలో గల గంగాసాగర్ క్షేత్రం గొప్ప శక్తిపీఠంగా పేరొందింది.
ప్రద్యుమ్నే వంగ రాజ్యాయాం శృఖలా నామ భూషితే
విశ్వవిమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ
4. శ్రీ చాముండేశ్వరి – మైసూరు:
మహిషంసంహృత్యదేవీ కంట కం త్రిషుజమసు |
చండీ కాళీ స్వరూపేణ దుర్గారూపేణ శాంకరీ |
అథితాసిలోకరక్షణార్ధం చాముండాక్రౌంచ పట్టణే |
దేవీ త్వం ప్రసీదాస్మాన్ సర్వదా సర్వదాశుభే ||
ఇది సతీదేవి కేశాలు పడ్డ స్థలం. మార్కండేయ పురాణం అమ్మవారి మూడవ అవతారంలో మహామాయ, మహాసరస్వతీ రూపిణిగా శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించిందని తెలుపుతోంది. అలాగే అమ్మవారి దేహం నుంచి వెలువడిన కాళికాదేవి చండు, ముండులను సంహరించి ”చాముండి”గా ప్రసిద్ధి పొందింది. త్రిమూర్తులతో సహా సకల దేవతల అంశంతో వారి, వారి అస్త్రాలతో జన్మించి మహిషాసురుని వధించిన శ్రీ చాముండేశ్వరి దేవి అనంతరం మహిషాసురమర్థనిగా ప్రసిద్ధికెక్కింది. ఈ శక్తి పీఠం కర్ణాటకలోని మైసూరు నగరానికి 13 కి.మీ. దూరంలో ఉంది. ప్రాచీన కాలంలో ఈ పట్టణాన్ని క్రౌంచపట్టణం అని పిలిచేవారు.
క్రౌంచపుర స్థితా మాతా చాముండా దుష్టనాశనీ
సర్వసిద్ధి ప్రదాదేవీ భక్తపాలన దీక్షితా
5. శ్రీ జోగులాంబ – అలంపురం:
అలంపురం మహాక్షేత్రేం తుంగాచోత్తర వాహినీ |
బాలబ్రహ్మేశ్వరోదేవః జోగులాంబా సమంవితః |
తీర్ధం పరశురాశ్య నవబ్రహ్మసమంవితం |
అలంపురే జోగులాంబా విశాలాక్ష్యా సమాశ్మృతా |
భువికాశ్యాసమంక్షేత్రం సర్వదేవసమర్చితం ||
సతీదేవి పైవరుస దంతాలు పడిన క్షేత్రమిది. శ్రీ జోగులాంబను ”విశృంఖలా” అని లలితాసహస్రనామములో చెప్పబడింది. నిత్యానాధ సిద్ధుని ”రసరత్నాకరము” నందు అమ్మను యోగాంబాగాను, తాంత్రికుడగు మహాభైరవుడు తన ”ఆనందకరము”లో యోగేశ్వరిగాను పేర్కొన్నారు. అష్టాదశ పీఠాలలో ఐదవదయిన ఈ శక్తి పీఠంలో శ్రీజోగులాంబ, శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈశ్వర ప్రసాది అయిన ఒక యువకుడు ఇక్కడ ఆలయ నిర్మాణం చేస్తుండగా ఆ ప్రాంత పాలకుడైన విలసద్రాజు ఆ యువకుడిని వధించాడు. ఫలితంగా రాజ్యం పోయి తిండిలేక సంచరిస్తున్న సమయంలో కనువిప్పు కలిగి జోగులాంబదేవి ఆలయం నిర్మించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కి.మీ. దూరంలో ఉంది. అలంపుర క్షేత్రంలోని ఆలయ సమూహం నందు శ్రీ జోగులాంబా ఆలయముతోపాటు బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ మరియు పద్మబ్రహ్మ అను నవబ్రహ్మాలయాలున్నాయి. ఇందు తారక బ్రహ్మాలయం శిథిలమైంది. ఆలంపూర్‌లో వేలాది సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేశాడని, తద్వారా పరమేశ్వరుడు ఉధ్బవించాడంటారు బ్రహ్మ కారణంగా బాల బ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. శైవ క్షేత్రాల్లో శివ లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. అలంపూర్లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలిసింది. అందువల్ల ఈ దేవుళ్లను బ్రహ్మేశ్వరులుగా పిలుస్తారు. ఇక్కడ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు యోగంబ, యోగీశ్వారి యోగినీశ్వారి, జోగాంబ, జోగీశ్వారి పేర్లతో పిలవబడుతుంది. జోగులాంబా దేవి శవం ఆసనంగా కలిగి, వేలాడుతున్న స్తనాలతో, వికృత మైన భయంకరమైన కన్నులతో, నాలుగు చేతులతో, మెడలో కపాల మాలతో, దిగంబరంగా, ఊర్ధ్వ కేశాలతో, తల మీద బల్లి కపాలం, గుడ్లగూబ, మండ్ర గబ్బ కలిగి అతి భయంకరంమైన ఆకృతిని కలిగి ఉంటుంది. అందుకనే అమ్మవారిని సూటిగా చూడకుండా, ప్రక్కల నుంచి దర్శిస్తారు .
జోగులాంబ మహాదేవీ రౌద్ర వీక్షణ లోచన
అలంపురీ స్థతా మాతా సర్వార్థ ఫల సిద్థిదా
6. శ్రీ భ్రమరాంబదేవి – శ్రీశైలం:
భ్రమరైరరుణం హత్వా భ్రామ్యంతీ శ్రీగిరౌస్థితా |
భక్తానుకంపినీదేవీ మల్లికార్జున తోషిణీ |
శివానుగ్రాహ సంధాత్రీ బ్ఘక్తరక్షణ తత్పరా |
సానః పాయాత్ సదామాతా శ్రీశైలే భ్రమరాంబికా ||
ఇది సతీదేవి కంఠ భాగం పడిన ప్రదేశం. ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద, బ్రహ్మాండ, శివ పురాణాలలో ఉంది. దేవతల, ఋషుల ప్రార్థనలకు మెచ్చి జగన్మాత తన తొమ్మిదవ అవతారంలో ఝంకారం చేస్తూ ఉన్న భ్రమరాలతో వచ్చి అరుణాసురుని సంహరించి, శ్రీ భ్రమరాంబాదేవిగా శ్రీశైలంలో కొలువుదీరినట్లు స్థల పురాణం. భక్తులు అందుకే అమ్మవారిని ‘భ్రామరి’ అని కీర్తిస్తారు. ఈ శక్తి పీఠం కర్నూలు నుంచి 179 కి.మీ దూరంలో శ్రీశైలంలో ఉంది. కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లేశ్వరుల దర్శనం ముక్తిదాయకమని పురాణ ప్రవచనం. శంకరభగవత్పాదులవారు ఈ క్షేత్రంలోనే సౌందర్య లహరిని రచించారని, ఇక్కడ అమ్మవారిపై భ్రమరాంబికాష్టకం చెప్పారని అంటారు. ఈ క్షేత్రమున ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ భ్రమరాంబా దేవి వెలసిన నాటినుండి ఈమెయే ప్రధాన శక్తి స్వరూపిణి అయినది.
శివపార్శ్వస్థితా మాతా శ్రీ శైలే శుభ పీఠకే
భ్రమరాంబా మహాదేవీ కరుణారస వీక్షణా
7. శ్రీ మహాలక్ష్మి – కొల్లాపూరి:
కోల్హాతపః ప్రీతా దేవీ వరదానమహోజ్వలా |
మహాలక్ష్మీ ర్మహామాతాలోకానుగ్రహకారిణీ |
దత్తాత్రేయఆది సుప్రీతా నానాతీర్ధ నిషేవితా |
కరవీరసుమారాధ్యా కోల్హాసద్గతిదాయినీ |
భావానీచామలాదేవి కరవీరసువాసినీ |
కోల్హాపురే మహాలక్ష్మీర్మమాస్తు శుభదాయినీ ||
ఈ క్షేత్రంలో అమ్మవారి మూడు నయనాలు పడ్డాయని చెపుతారు. దేవతలందరూ మహాలక్ష్మిని ప్రార్థించగా వారి కోరిక మేరకు కాల్హుడిని సంహరించి ఈ క్షేత్రంలో కొలువైంది. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్నఅమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. ఆ పర్వదినాలలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. మణిశిలతో చేయబడిన అమ్మవారి శిరసుపై ఆదిశేషుడు ఐదుపడగలతో ఛత్రం పడుతూ మనకు ఇక్కడ కన్పిస్తాడు. చతుర్భుజి. నాలుగు చేతులలో పండు, గద, డాలు, పానపాత్ర ధరించి ఉంటుంది. స్కాంద పురాణం, దేవీ భాగవతాలలోఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహలక్ష్మి అని ప్రస్తుతించారు. ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. ఈ శక్తి పీఠం మహారాష్ట్రలో గంగానది ఒడ్డున గల కోల్హాపూరిలో ఉంది. కొల్హాపూర్ అనగా కనుమలోయలోని పట్టణమని అర్థం. ఈ అమ్మవారిని అంబాబాయి అని స్థానికులు పిలుస్తారు. మహాప్రళయకాలంలో కూడా అమ్మవారు ఈ ఆలయాన్ని వీడి వెళ్లదని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే కోల్హాపూర్ ను ‘అవిముక్త’ క్షేత్రంగా వ్యవహరిస్తారు. శ్రీమహాలక్ష్మికి ఇరువైపులా శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతీ కొలువై ఉంటారు.
మహాలక్ష్మ్యభిదా దేవీ కరవీర పుర స్థితా
పురుషార్థ ప్రదామాతా మహాశక్తి మాహుగ్రామ
తేటగీతి