అష్టాదశ శక్తిపీఠాలు - 2

8. శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం:

దత్తాత్రేయ సమారాధ్యా అవసూయాత్రిసేవితా |
ఏకవీర మహాదేవీ మస్తకే నైవశోభినీ |
రేణుకా మాతా శ్రీక్షేత్రా మాయా సంహార రూపిణీ |
కృపయాపాతునస్సర్వాం మయూరే ఏకవీర్యా ||

అమ్మవారి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రమని కూడా కథనం. ఈ రేణుకాదేవి తల, ఏకవీరాదేవి శిరస్సులో కల్సిపోయిందని స్థల పురాణం తెలుపుతోంది. అందువల్ల అమ్మవారిని రేణుకాదేవిగా భావించి కొలుస్తారు. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి 42 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతం దత్తాత్రేయుని జన్మస్థలంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ మూడుకొండలన్నాయి. వీటిలో ఒకదానిపై అత్రి-అనసూయలు, రెండవదానిపై దత్తాత్రేయుడు, అమ్మవారి హస్తం పడిన మూడవ కొండపై ఏకవీరికాదేవి ప్రతిష్టితమయ్యారు. ఇక్కడి అమ్మవారిని ఛిన్నమస్త, ప్రచండ చండిక, ఇంద్రాణి, మధ్యమా అని కూడా అంటారు. ఈ ఆలయం సింధూరరంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కేవలం శిరోభాగంతో దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖానకి సింధూర రంగు పూస్తారు. మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక వుండగా, మరోప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది.

ఏకవీరా మహాశక్తి మాహుగ్రామ గుహాస్థితా
పురుషార్థ ప్రదామాతా సంపూర్ణామృత వర్షిణీ

9. శ్రీ మహకాళి – ఉజ్జయిని:

త్రిపురాసురసంహర్తా మహాకాలోత్రవర్తతే |
యస్యాట్టహాస సందగ్ధం దుస్సహంతత్ పురత్రయం |
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా |
ఉజ్జయిన్యాం మహాకాళీ భక్తానామిష్టదా స్దా ||

ఈ క్షేత్రంలో సతీదేవి పైపెదవి పడినట్లు దేవీ భాగవతం తెలుపుతోంది. సప్తమోక్షదాయక పట్టణాలలో ఉజ్జయిని ఒకటి. స్కంద పురాణంలో మహాకాళిని రక్తదంతిక, చాముండగా వర్ణించారు. ఈ దేవాలయాన్ని గఢకాళికా దేవాలయమని కూడా పిలుస్తారు. లక్ష్మీ. సరస్వతుల మధ్య అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటుంది. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు మహాకాలుడిగా, పార్వతీదేవి మహాకాళిగా యుద్ధానికి సంసిద్ధమయ్యారు. పంచభూతాలు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడికి అస్త్రాలుగా సహాయపడ్డాయి. పరమేశ్వరుడు, మహాకాళి రాక్షసుణ్ణి సంహరించి విజయం సాధించిన ప్రాంతమే ఉజ్జయిని. ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉంది. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు 55 కి.మీ. దూరంలోని క్షిప్రానదీ తీరంలో వెలిసింది. భూమి నుంచి కుజుడు విడిపోయిన ప్రాంతం ఇదని జ్యోతిష్యవేత్తలు చెపుతారు.

ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళేశ్వరీ
క్షిప్రా తీరస్థితామాతా వాంఛితార్థ ప్రదాయిని

10. శ్రీ పురుహూతీకా దేవి – పిఠాపురం:

ఏలర్షిపూజిత పూజితశ్శంభుః తస్మై గంగామదాత్ పురా |
రురువాకుక్కుటోభుత్వా భగవాన్ కుక్కుటేశ్వరః |
దేవీ చాత్ర సమాయతా భర్తృచిత్తానుసారిణీ |
పురుహుత సమార్ధా పీఠయాం పురుహుతికా ||

ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడింది. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి శివలింగం కుక్కుటాకారంలో ఉండి స్వామివారు కుక్కుటేశ్వర స్వామిగా ప్రసిద్ధి కెక్కారు. ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులలో విత్తనాల [బీజాలు] సంచి , గొడ్డలి [పరశువు], కమలం, మధుపాత్ర ఉంటాయి. మనదేశంలో 3 గయాక్షేత్రాలు ఉన్నాయి. అవి వరసుగా శిరోగయ, నాభిగయ మరియు పాదగయ. శిరోగయ బీహారులోని గయలో వుంది. నాభిగయ ఒరిస్సాలోని జాజిపూర్ లో గిరిజాదేవి శక్తిపీఠ ఆవరణలో వుంది. పాదగయ పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలో ఉంది. గయాసుర సంహార నిమిత్తము లింగరూపుడైన పరమేశ్వరుడు కోడిరూపము దాల్చి – గయాసురుని కోరిక కొరకు శ్రీ కుక్కుట లింగమూర్తిగా ఆవిర్భవించిన స్వయం భూలింగమూర్తి. అలాగే, పూర్వం ఇంద్రుడు, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేస్తాడు. మహర్షి శాపంతో సహస్రాక్షుడవుతాడు. ఆ శాపం పోగొట్టుకోవటానికి ఇంద్రుడు జగజ్జనని కోసం తపస్సుచేసి, ఆవిడ ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు (ఇంద్రుడు) ఆరాధించిన దేవి గనుక ఈవిడ పురుహూతిక అయింది.అమ్మవారి పీఠము పడ్డ ప్రదేశము గనుక అమ్మవారిని పీఠాంబిక అంటారని పురాణ గాథ. ఈ ప్రాంతాన్ని పీఠపురం, పీఠికాపురం, పిష్టపురం అని పిలిచేవారు. ఇది కాలానుగుణంగా పిఠాపురం అయ్యింది.

పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా
పుత్రవత్పాలితా దేవీ భక్తానుగ్రహ దాయినీ

11. శ్రీ గిరిజాదేవి – ఒడిశా:

ఓడ్యాణేగిరిజాదేవీపిత్రర్చనఫలప్రదా |
బిరజా పరపర్యాయా స్థితావైతరణీ తటే |
త్రిశక్తి స్వరూపా చైవ లోకత్రాణపరాయణా |
నిత్యం భవతు సాదేవీ వరదా కులవర్దినీ ||

ఇది సతీదేవి నాభి భాగం పడిన స్థలం. లోకంలో శాంతి నశించి అశాంతిమయమైన సమయంలో లోకశాంతి కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం నుంచి గిరిజా దేవి ఉద్భవించింది. లోకంలో శాంతిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతంలో కొలువైనట్లు పురాణ కథనం. ఈ శక్తిపీఠం ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 113 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరహామూరి రూపంలో విష్ణుమూర్తి కొలుస్తుంటాడు. అమ్మవారు ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి. స్థానికులు అమ్మవారిని బిరిజా దేవి, విరజాదేవి అని పిలుస్తారు. ఇక్కడ వైతరణి అనే ఊరుతోపాటు, అదే పేరుతో పిలవబడే నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంలో యమలోక ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో వైతరణి నది వస్తుంది. ఆ నది అంశగా ఇక్కడ ఈ వైతరణి ప్రవహిస్తోందని భక్తులు విశ్వసిస్తుంటారు. క్షేత్రమును గదక్షేత్రం, నాభిక్షేత్రం, విరాజక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, విరాజతీర్థం, వైతరణితీర్థం మొదలగు పేర్లతో పిలుస్తారు. ఆలయ ప్రాకారంలో నాభిగయ, ఇన్నైశ్వర్‌ శివాలయం, హనుమాన్‌ మందిరం, డోలమండపం, భైరవ, కార్తికేయ, గంగాధర్‌తోపాటు 108 శివలింగాలు, విష్ణురూపాలు దర్శించవచ్చును.

ఓఢ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా
పాలికాఖిల లోకానాం పల్లవారుణ పాణినా

12. శ్రీ మాణిక్యాదేవి – ద్రాక్షారామం:

స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబాతదైవ చ |
సప్తర్షిస్సమానీతం సప్త గోదావరం శుభం |
సూర్యేణసేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః |
భక్తరక్షణ సంవ్యగ్రా దక్షవాటికే||

ఈ క్షేత్రంలో సతీదేవి కణత భాగం పడింది. శివపార్వతుల తనయుడు కుమారస్వామి ఈ ప్రాంతంలోనే తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడి కంఠంలోని ఆత్మలింగం ముక్కలు కాగా ఏర్పడిన పంచారామాల్లో కూడా ఇది ఒకటి. అష్టాదశ శక్తిపీఠాలలో పన్నెండవదయిన ఈ పీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 33 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారు శ్రీమాణిక్యాంబా దేవిగా ఆవిర్భవించింది. హిమవంతుని భార్య అయిన మేనకాదేవి కుమార్తెగా ప్రార్వతీదేవి మైనకాంబగా శ్రీ భీమేశ్వరునితో కలసి ఈ క్షేత్రంలో వెలసింది. దక్షవాటికన దాక్షాయిని (సతీదేవి) ఆత్మాహుతి చేసుకున్న స్థానమున, పరమేశ్వరుడు భీమరూపమున స్వయంభువుడైనాడు. స్వయంభువ లింగమును భీమేశ్వరునిగా కొలుస్తారు. కాలక్రమేణా మైనకాంబ ‘మాణిక్యాంబ’గా రూపాంతరం చెందింది. శ్రీ భీమేశ్వర లింగమునకు ఈశాన్యవైపున, దక్షిణముఖముగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కొలువుతీరింది. పూర్వం దక్షుడు యజ్ఞం చేసిన ఈ ప్రదేశం దక్షరామం, కాలక్రమేణా ద్రాక్షారామంగా మారి దక్షిణకాశీగా, వ్యాసకాశీ ప్రసిద్ధికెక్కిన పుణ్య క్షేత్రం.

దక్షావాటీస్థితా శక్తీః విఖ్యాతా మాణిక్యాంబికా
వరదా శుభదాదేవీ భక్తమోక్ష ప్రదాయిని

13. శ్రీ కామరూపాదేవి – హరిక్షేత్రం:

కామేఖ్యే కామదే ద్వివి నీలాచల నివాసిని |
కామస్యసర్వదేమాతః మాతృసప్తక సేవితే |
జామదగ్న్యస్యరామస్య మాతృహత్యా విమోచినీ |
పంచ శంకర సంస్థాణ భక్త పాలన తత్పరా |
కల్యాణదాయినీ మాతా విప్రదర్శిత నర్తనా |
హర్షిక్షేత్రే కామరూపే ప్రసన్నాభవ సర్వదా ||

ఈ క్షేత్రంలో సతీదేవి యోని భాగం పడింది. ఈ శక్తిపీఠం అస్సాం రాజధాని గౌహతికి 7 కి.మీ దూరంలో నీలాచల పర్వత ప్రాంతంలో ఉంది. బ్రహ్మపుత్రానదీ తీరంలో ఈ క్షేత్రంలో ఏటా ఆషాడమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. కాముడికి మళ్ళీ రూపం వచ్చిన ప్రాంతం కాబట్టి కామాఖ్య క్షేత్రమని, కాపారూప క్షేత్రమని అంటారు. ఖాసీ అనే గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అని అర్థం. ఇక్కడి నీలాంచల పర్వతం విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి హరిక్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో యోని ఆకృతిలో శిలా నిర్మాణముంటుంది. యోనిని సృష్ఠికి, సృజనశక్తికీ సంకేతంగా భావిస్తారు. దీనివలన కామరూపాదేవికి ”భగవతి” అను నామం సార్ధకమైనది. భగము అనగా యోని అని అర్ధము. అమ్మవారి భగమును (యోని) పూజించేవారిని వామాచారులని పిలుస్తారు. కామాఖ్యమాతను తార, ఛండీ, సరస్వతి, దుర్గ, కాళీ మొదలగు రూపాలలో కూడ పూజిస్తారు.

కామరూపిణి విఖ్యాతా హరిక్షేత్రే సనాతనీ
యోనిముద్రాత్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా

14. శ్రీ మాధవేశ్వరి – ప్రయాగ:

త్రివేణీ సంగమోద్భుతా త్రిశక్తీనాం సమాహృతిః |
ప్రజాపతికృత్యా శేష యాగమాభిలాషాభి వందితా |
బృహస్పతికరాంతస్థ పీయూష పరిసేవితా |
ప్రయాగే మాధవీ దేవీ సదాపాయాత్ శుభాకృతిః ||

ఈ క్షేత్రంలో సతీదేవి చేతి ఉంగరం వేలు పడింది. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతం పంపకానికి శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారమే శక్తి స్వరూపిణిగా ఇక్కడ కొలువుదీరినట్లు స్థలపురాణం. గంగ, యమున, సరస్వతీ నదలు సంగమంతో ఈ ప్రాంతం త్రివేణిగా ప్రసిద్ధికెక్కింది. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదుకు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రంలోని అలోపిదేవిని మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు. విగ్రహారాధనలేని శక్తి పీఠం అమ్మవారి శక్తిపీఠాలలో ఇదొక్కటే. అందుకే అశరీరంతో ఉన్నఅమ్మవారిని అలోపి మాత అని, అలోపి శాంకరి అని భక్తులు పిలుస్తారు. ఇక్కడ గర్భగుడిలో కేవలం ఒక ఉయ్యాల మాత్రమే ఉంటుంది. ప్రళయం తర్వాత జీవ సృష్టి జరగడానికి ముందు ఇక్కడ బ్రహ్మ అనేక యాగాలు చేశాడు కాబట్టి దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది. ‘ప్ర’ అంటే గొప్ప అని ‘యా’ అంటే యాగమని అర్థం అందుకే ఈ ప్రాంతాన్ని ప్రయాగ అని పిలుస్తారు.

మాధవేశ్వరీ మాంగళ్య ప్రయాగ స్థల వాసినీ
త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ

15. శ్రీ వైష్ణవీ దేవి – జ్వాలా క్షేత్రం:

కాలపర్వతాగ్రే జ్వాలారూపాను భాససే |
జ్వాలాముఖీతి విఖ్యాతా జ్యోతిర్మూర్తి నిదర్శనా |
రాధేశ్యామేతి నాదేనవర్ధమానాత్విషాంతితః |
జ్వాలాయాం వైష్ణవీదేవీ సదారక్షతు శాంకరీ ||

సతీదేవి శిరస్సు పడింది ఈ క్షేత్రంలోనే. అమ్మ త్రిమూర్తి స్వరూపిణిగా కొలువుదీరిన క్షేత్రం జ్వాలాక్షేత్రం. అమ్మవారు ఇక్కడ వైష్ణవీదేవిగా దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని జమ్మూ నగరానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో ఉండటం వల్ల భక్తులు ఈమెను జ్వాలాముఖి అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు లంకానగరంపై యుద్ధానికి బయలుదేరే ముందు జగన్మాతను ప్రార్థించగా, సరస్వతి, లక్ష్మి, మహాకాళి రూపాలలో దర్శనమిచ్చిందని పురాణగాథ. త్రికూటపర్వత గుహలో నున్న అమ్మవారి విగ్రహం కింద భాగం ఏకశిలాగా కన్పించినప్పటికి, శిఖర భాగం మూడుగా విభజింపబడి, ఎడమవైపు తెల్లని భాగం సరస్వతిగా, మధ్యలో పచ్చభాగం లక్ష్మిగా, కుడివైపు నల్లని భాగం మహాకాళిగా చెప్పబడుతుంది.

తుహినాద్రి స్థితా మాతా జ్వాలా ముఖీవిశ్రుతా
జ్వాలా మాలా ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్థినీ

16. శ్రీ మాంగళ్యాదేవి – గయ:

గదాధరసహోదరీ గయా గౌరీ నమోస్తుతే |
పితౄణాంచ సకర్తౄణాంచ దేవి సద్గత్తిదాయినీ |
త్రిశక్తి రూపిణీ మాతా సచ్చిదానంద రూపిణీ |
మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్య గౌరికా ||

ఇక్కడ సతీదేవి వక్షోజం పడినట్లు చెబుతారు. పిండప్రదానాలకు, పితృదేవతలకు పూజలకు పేరొందిన ప్రాంతమే గయా క్షేత్రం. ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమైన ప్రయాగ క్షేత్రంలో సమానమై ఫలం అందిస్తోంది. ఈ శక్తిపీఠం బిహార్ రాజధాని పాట్నా నగరానికి 74 కి.మీ. దూరంలో ఉంది. క్షేత్రంలోని విష్ణుపాద దేవాలయమునకు సుమారు 1 కి.మీ. దూరమున గల నారాయణ చుహ అనే ప్రాంతములో కొంత ఎత్తైన కొండమీద శ్రీ మంగళగౌరి పీఠం వుంది. బ్రహ్మదేవుడి కుమారుడైన మరీచి తన భార్య అయిన ధర్మవ్రతను శపించగా, ఆమె మాంగళ్య గౌరీదేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందినట్టుగా స్థల పురాణం చెబుతోంది.

సర్వ మంగళ మాంగళ్యా గయా మాంగల్య గౌరికా
అర్థదా మోక్షదాదేవీ అక్షయ్య ఫలప్రదాయినీ

17. శ్రీ విశాలాక్షి – వారణాసి:

కాశీంతు పునరాగత్య సంహృష్టంతాండవోన్ముఖం |
విశ్వేశందేవ మాలోక్య ప్రీతివిస్తారితేక్షణా|
సానురాగాచ సాగౌరీ దద్యాత్ శుభ పరంపరాం |
వారాణస్యాం విశాలక్షీ అన్నపూర్ణా పరాకృతిః |
అన్నం జ్నానం చ దదతి సర్వాన్ రక్షతినిత్యశః |
త్వత్పసాదాన్మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే ||

ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడింది. అమ్మలగన్నయమ్మ అశేష భక్తులపై తన కృపాకటాక్షాలు ప్రసరించే క్షేత్రమే వారణాసి. కాశీ అనగా కాంతినిచ్చే లేదా జ్ఞాన జ్యోతినిచ్చే స్థలం అని అర్థం. అందుకేనేమో కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం. అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి విశ్వేశ్వర, అన్నపూర్ణాంబికలను ఆరాధించేవాడు. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. క్షేత్రములో పావన గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. గంగానదికి ఉత్తరంగా వరుణానది, దక్షిణాన అసి నదులు గంగానదిలో సంగమిస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యనున్న పట్టణమవడం వల్ల వారణాసిగా ప్రసిద్ధి చెందినది. ద్వాదశ జ్యోతిర్లింగములలో 9వది అయిన శ్రీవిశ్వనాధలింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో పదిహేడవది అయిన శ్రీ విశాలాక్షి పీఠమును వారణాసి నందు దర్శించగలము. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు ఆలయం నందు రెండు మూర్తులు దర్శనమిస్తాయి. ముందు భాగములో గల మూర్తిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు స్థాపించినారు. వెనుకభాగంలో గల మూర్తి స్వయంభూమూర్తిగా ఖ్యాతిపొందినది.

విశాలాక్షీదేవి విఖ్యాత వారణాస్యాం శివాంతికే
నిరతాన్న ప్రదాత్రీచ నిర్భగ్య జనతోషిణీ

18. శ్రీ సరస్వతీ దేవి – కాశ్మీర్:

సరస్వతి నమస్తుభ్యం సర్వవిద్యా స్వరూపిణి |
రాగ ద్వేషాదియుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్చసి |
కాశ్మీరదేశ వద్రమ్యా విశదాభవదాకృతిః |
సాంత్వయంతీ మహాదేవీం తదుక్త్యా శారికా అభూః |
ప్రసన్నతాం సమాంబుద్ధిం విశదాం పాండితీశుభాం |
విద్యావృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరశ్వతీ ||

కపటంతో పార్వతీదేవి ఇంటిని సొంతం చేసుకున్న రావణాసురునిపై కోపగించుకున్న పార్వతీదేవిని బుజ్జగిస్తున్న సరస్వతిని ఇక్కడే కొలువై ఉండమని చెప్పిన ప్రాంతమే కాశ్మీర్ క్షేత్రం. ఈ క్షేత్రంలో సతీదేవి దక్షిణ హస్తం పడినట్లు చెబుతారు. ఇక్కడ వెలసిన అమ్మవారిని శారదాదేవీగా కొలుస్తారు. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని శ్రీనగర్ కు 10 కి.మీ. దూరంలో ఉంది. స్థానికులు అమ్మవారిని కీర్ భవాని అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శాంతమూర్తి, శ్రీహరి ప్రియ. నాలుక చేతులలో వీణా, పుస్తకం, జపమాల ధరించి అభయముద్రతో దర్శనమిస్తుంది. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. శిథిలావస్థలో ఉన్న ఇచ్చటి దేవాలయం నుంచి అమ్మవారి శక్తిని స్వర్ణ సరస్వతీదేవి రూపంలోకి ఆవాహన చేసి ఆదిశంకరాచార్యులు శృంగేరీ మఠానికి తీసుకువచ్చి శారదాంబలో నిక్షిప్తం చేసినట్టు ప్రతీతి. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఈ క్షేత్రం నేడు శిథిలమై అమ్మవారి విగ్రహం పూర్తిగా సమసిపోయింది.

జ్ఞాన ప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భుక్తి ముక్తి ప్రదాయినీ

 

అష్టాదశేషు పీఠేషు యోగి భిర్దేవ నిర్మతమ్
తాసాం స్మరణ మాత్రేణ మృత్యుదారిద్ర నాశనమ్

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *