‘‘యావస్థాస్యంతి గిరియః సరితశ్చమహీతలే
తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచలిష్యయతి’’
భూమండలంపై పర్వాతాలు ఉన్నంతకాలం, నదులు, ప్రవహించినంతకాలం రామాయణ కథ అన్ని లోకాల్లో వ్యాపించి ఉంటుందని ఈ శ్లోకార్ధం. రామాయణ గాథ కావ్యాలుగా, ప్రబంధాలుగా, శతకాలుగా, కీర్తనలగానే కాదు, జానపద కళారూపాల్లో కూడా బహుళ ప్రచారంలో ఉంది. అట్టి వాల్మీకి విరచిత రామాయణాన్ని తనదైన శైలిలో పలు సంకీర్తనలలో పొందుపర్చటమేకాక, ద్విపద రామాయణాన్ని కూడా రచించి శ్రీరామనామామృతాన్ని తాను సేవించటంతోపాటు, ‘ఇతఁడే పరబ్రహ్మ మిదియే రామకథ, శతకోటి విస్తరము సర్వ పుణ్యఫలము’ అంటూ, భక్తులకందించాడు అన్నమయ్య.
నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడుగాక
ధరణిఁ గిరితికెక్కె దశరథసుతుఁడు
యీతఁడా తాటకిఁజంపె నీమారీచసుబాహుల-
నీతఁడా మదమణఁచె నిందరుఁజూడ
యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె
సీతఁ బెండ్లియాడెను యీ చిన్నరాముఁడా
చుప్పనాతిముక్కు గోసి సోదించి దైతుయులఁ జంపి
అప్పుడిట్టె వాలి నేసినాతఁ డీతఁడా
గుప్పించి కోఁతుల నేలి కొండల జలధి గట్టి
కప్పి లంక సాధించె నీ కౌసల్యనందనుఁడా
రావణాదులనుఁ జంపి రక్షించి విభీషణుని
భావిం చయోధ్య నీతఁడు పట్టమేలెను
శ్రీవేంకటేశుఁ డితఁడే సృష్టి రక్షించె నితఁడే
యీవల మాపాలనున్న యీ రామచంద్రుఁడా
24వేల శ్లోకాలున్న శ్రీమద్రామాయణాన్ని సంక్షిప్తంగా పది పంక్తులలో రమణీయంగా చెప్పగలడం సాహసం. అట్టి సాహసాన్ని అన్నమయ్య పలు కీర్తనలలో చేయటమేగాక, శ్రీరామ వైభవాన్ని, విశిష్టతను అనేక కీర్తనలలో పొందుపర్చాడు. ‘హరుని తారక బ్రహ్మమంత్రమైయమరిని యర్ధము రాముడు, మనసులోపల పరమ యోగులు మరుగుతేజము రాముడు, హరియె యీతఁడు హరివించుల కాదిపురుషుఁడు రాముడు,’ భక్తసులభుడని, దైవాంశసంభూతుడని, వేదాలచే నమస్కరింపదగినవాడని రామ శబ్ధానికి తన కీర్తన ద్వారా అర్ధాన్ని వివరించాడు. రాముడు లోకాభిరాముడు, ఇందీవరశ్యాముడు, షోడశకళాసోముడు, నీలమేఘవర్ణుడు, సర్వగుణాకరుడు, శుభకరుడు, ధర్మవిదారుడు, బ్రహ్మసాకారుడు, నిశ్చలుడు, రవికులుడు, రాక్షససంహారుడు, త్రైలోక్యధాముడని శ్రీరామ గుణగణాలను తెలుపుతూ, ‘శరణ, శరణు విభీషణవరదా, శరధిబంధన రామ సర్వగుణస్తోమ’ అని ఆ రాజీవనేత్రునికి, రాఘవునికి, సౌజన్యనిలయునికి ప్రణమిల్లుతూ రామ స్తోత్రాన్ని గానం చేశాడు.
దీనరక్షకుఁ డఖిలవినుతుఁడు దేవదేవుఁడు రాముఁడు
జానకీపతిఁ గొలువుఁడీ ఘనసమరవిజయుఁడు రాముఁడు
హరునితారకబ్రహ్మమంత్రమై యమరినయర్ధము రాముఁడు
సురలఁ గాచి యసురల నడఁచినసూర్యకులజుఁడు రాముఁడుసరయువందను ముక్తిచూరలు జనుల కొసఁగెను రాముఁడు
హరియె యీతఁడు హరివించుల కాదిపురుషుఁడు రాముఁడు
మునులరుషులకు నభయమొసఁగిన మూలమూరితి రాముడు
మనసులోపలఁ బరమయోగులు మరుగుతేజము రాముఁడు
పనిచి మీఁదటి బ్రహ్మపట్టము బంటు కొసఁగెను రాముఁడు
మనుజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముఁడు
బలిమి మించినదైవికముతో భక్తసులభుఁడు రాముఁడు
నిలిచి తనసరిలేనివేలుపు నిగమవంద్యుఁడు రాముఁడు
మెలుపు శ్రీవేంకటగిరీంద్రము మీఁది దేవుఁడు రాముఁడు
వెలసె వావిలిపాటిలోపలి వీరవిజయుఁడు రాముఁడు
‘రామభద్ర రఘవీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమోనమో’ అంటూ రామతత్త్వాన్ని, రామావతార తత్త్వాన్ని అనేక కీర్తనలలో ప్రతిపాదించాడు అన్నమయ్య. ‘చెప్పితే నాశ్చర్యము చేసినచేతలితడు, ముప్పరి మనుజ వేషమున బుట్టెనీతడు, రాముడుదయించె దశరథునికి దమ్ములతో,’ ’అరయు పుత్రకామేష్టి యందు పరమాన్నమున పరగ జన్మించిన పరబ్రహ్మము’ అని రామాయణ గాథకు శ్రీకారం చుట్టాడు అన్నమయ్య. తదుపరి –
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా
సౌమిత్రి భరత శతృఘ్నులతోడ జయమందు దశరథ రాఘవా
శిరసు కూకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవా
గరిమ నావయసున తాటకి జంపిరన కౌసల్యనందన రాఘవా
మరియు
యీతడా తాటకి జంపి జించె యీ పిన్నవాడా
అతల సుబాహు గొట్టి యజ్ఞముగాచె
చేతనే యీ కుమారుడా శివుని విల్లు విఱిచె
సీతకమ్మ బెండ్లాడె చెపగొత్త గదవే
అంటూ బాలకాండ విశేషాలను వర్ణించాడు. ఇక శివుని విల్లువిరిచి నీ పాణిగ్రహణం చేయబోతున్న కళ్యాణ రాముని చూసి సిగ్గుతో తలవంచకమ్మా, సీతమ్మా అంటూ సీతారామ కళ్యాణ వైభోగాన్ని తన కీర్తనలో దృశ్యకావ్యంగా మలిచాడు అన్నమయ్య. ఈ సంకీర్తనలో తెలుగువారి వివాహ పద్దతులైన కన్యాదానం, తెరఎత్తడం, అక్షతారోపణం, కంకణ ధారణ, తలంబ్రాలు పోసుకోవడం వంటి ఆచారాలను చక్కగా పొందుపర్చి మనకందించాడు అన్నమయ్య.
సిగ్గిరి పెండ్లికూతురు సీతమ్మ
దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మా
అల్లనాడే రాఘవుడు హరువిల్లు విరిచెను
యెల్లి నేడే పెండ్లాడీ నిదివో నిన్ను
యెల్లగా జనకుడు నిన్నిచ్చినట వీడె
వెల్లవిరి నీ మాట వినవమ్మా
అదె పెండ్లి తెర యెత్తి రండనె వసిష్టుడుండి
చదివీ మంత్రాలు నెస చల్లవమ్మా
మొదల రామునికంటె ముంచి తలబాలువోసి
సుదతి యాతని మోము చూడవమ్మ
కంకణ దారాలు గట్టి కాలు దొక్కితివి మీరు
పొంకాన బువ్వ మందరో పొత్తులనమ్మ
వుంకవ వావిలపాటనుండి శ్రీవేంకటగిరి
తెంకుల నిన్నుఁగూడి తిరమాయనమ్మా
రామాయణంసారమంతా ఒక్క సుందరాకాండలో నిక్షిప్తమై ఉంది. హనుమంతుడు సాగరం లఘించి, లంకలో సీతాన్వేషణగావించి, లంకాదహనం చేయటంతోపాటు, సీతాదేవికి రాముని ముద్రికను, రామునికి సీతాదేవి చూడామణిని అందచేసి వారిరువురికి స్వాంతన చేకూర్చటం వంటి అంశాలు సుందరాకాండలో చోటు చేసుకుంటాయి. పరబ్రహ్మస్వరూపమైన సుందరుడు హనుమంతుడు. ఆయన గావించిన లీలావిశేషాలను, బలపరాక్రమాదులను, బ్రహ్మస్వరూపత్వమును సుందరాకాండ నిరూపిస్తుంది. అన్నమయ్య కూడా పలుకీర్తనలలో ఈ వృత్తాంతాలన్నింటిని వర్ణించాడు. సీతమ్మవారి జాడను హనుమంతుడు రామునికి తెలుపే ఈ కీర్తన మన హృదయపీఠంపై ఆ సుందరదృశ్యాన్ని సాక్షాత్కరింపచేస్తుంది.
ఇదె శిరసు మాణిక్య మెచ్చి పంపె నీకు నాకె
అదనెఱిగి తెచ్చితి నవ ధరించవయ్యా
రామ నినుబాసి నీ రామనే చూడగ నా
రామమున నిను పాడె రామరామయనుచు
ఆమెలుత సీతయని యపుడునే తెలిసి
నీముద్ర వుంగరము నే నిచ్చితిని
కమలాప్తకులుడ నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారి దూరె
నెమకి యాలేమను నీదేవి యని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని
దశరథాత్మజ నీవు దశశిరుని చంపి, యా
దశమన్న చెలిగావు దశదిశలు పొగడ
రసికుడ శ్రీ వేంకట రఘవీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు
ఇక వేగిర సీతమ్మను రావణుని చెర నుంచి రక్షించమన్న హనుమయ్య ప్రార్థనకు రాముడు స్పందించి, చేసిన ఘనకార్యాలను రామబంటై సీతమ్మకు వినిపించాడు అన్నమయ్య.
వినవమ్మ జానకి నీ విభుఁడింత సేసినాఁడు
యెనసి యీ రఘరాముఁడిఁక నేమిసేసునో
వానరుల దండు గూడి వారధికొండలఁ గట్టె
అని లంకె చుట్టిరా నదే విడిసె
కోనలఁద్రికూటమెక్కె గొడగులన్నియుఁజెక్కె
యే నెపాన రఘరాముఁడిఁక నేమిసేసునో
అంతటితో ఆగక, కానవచ్చె అన్నిటా రామ మహిమలు, ‘శిలను బడఁతిఁ గావించినరామా,’ ‘కూరుచుక యేలితేను కోఁతులు రాజ్యముసేసె, కోరితేనే నీటిపై కొండలు దేలె,’ సంజీవినికొండ బంటుచే తెప్పించి, హరివిల్లు విరిచినట్టి రాముఁడు లోకాభిరాముఁడందిరికి, సర్వేశ్వరుండతడు, తలంప తానే తారకబ్రహ్మము, ఇటు మానుషలీలలు, అటు అతిమానుష (దైవిక) లీలలు చూపుతున్న రాముని శరణని రక్షించీ బ్రతుకరో అని రావణాది అసురలకు హితువు పలికాడు.
ఒవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవని శరణనరో తెలుసుకోరో
జగములో రాముఁడై జనియించె విష్ణుండదె
అగపడి లక్ష్మి సీతయై పుట్టెను
తగు శేష చక్ర శంఖ దైవసాధనములెల్ల
జిగి లక్ష్మణభరతాంచితశత్రుఘ్నులైరి
సురలు వానరులైరి సూర్యుఁడు సుగ్రీవుఁడు
మరిగిఁ రుద్రుఁడే హనుమంతుఁడాయను
సరుస బ్రహ్మదేవుఁడు జాంబవంతుఁడైనాఁడు
వెవరి నలుఁడే విశ్వకర్మ సుండి
కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాఁటిరి
ముట్టిరి లంకానగరమున నీదళము
యిట్టె శ్రీవేంకటేశుఁడితఁడై రావణుఁజంపె
వొట్టుక వరము లిచ్చీ నొనరు దాసులకు
సీతారామలక్ష్మణ భరతశత్రుఘ్న సుగ్రీవ, హనుమంతాదులందరూ దైవాంశ సంభూతులు వారి స్వరూపాలను తెలుసుకొని శరణువేడండని హితబోధ చేశాడు. ‘భువిలోన రాముఁడై పుట్టెనట విష్ణుఁడు,’ ఎదిరించిన వారిని తిరుగులేని దివ్యరామబాణం భం,భం,భం అనే శంఖానాదంతో, పెనువేగంతో పిడుగలు కురిపించి ఎలా రావణ కుంభకర్ణాదులను తుదముట్టించిందో తెలుపుతూ, రామబాణ వైశిష్టతను కొనియాడటంతోపాటుగా, బాలకాండ, యుద్ధకాండల్లోని కథను సూక్ష్మంగా వర్ణించాడు.
రామునికి శరణంటె రక్షించీ బ్రదుకరో
యేమిటికి విచారాలు యిఁక దైత్యులాలా
చలమునఁ దాటికిఁ జదిపిన బాణము
లలి మారీచసుబాహులపై బాణము
మెలఁగి పరుశురాము మేట్లేసిన బాణము
తళతళ మెరసీని తలరో యసురలు
మాయామృగముమీఁద బరి వేసిన బాణము
చేచి చాఁచి వాలి నేసిన బాణము
తోయధిమీఁద నటు తొడిగిన బాణము
చాయలు దేరుచున్నది చనరో దైతేయులు
తగఁగుంభకర్ణునితల ద్రుంచినబాణము
జిగి రావణుఁబరిమార్చిన బాణము
మిగుల శ్రీవేంకటేశు మేఁటిపొద(ది)లో నున్నది
పగ సాధించీ నిఁకఁ బారరో రాకాసులు
‘భళిభళిరామ, నీ బలిమి కెదురు లేరు,’ ‘రావణుఁ జంపి పుష్కరథమెక్కి సీతతోడ,’ అయోధ్యాసింహాసనం బెక్కి, కుశలవ పుత్రులంగాంచిన నీ మహత్త్వము జగమెల్లానిండిందని, నీవు సర్వరక్షకుడైన సర్వేశ్వుఁడేకాని, ఉర్వి జనులలో నొకడివి కావని శరణాగత వజ్రపంజరుడని అన్నమయ్య తన కీర్తననలో కొనియాడాడు. చివరగా, సేవించే శిష్టులకు మేలు చేకూర్చే సేవకశుభకరుడైన రామచంద్రుని, ఏవిధంగానైతే ‘అంటరాని గద్దకుల మంటి జటాయువుకు నీ వంటి పరలోక కృత్యములు సేసితివో,’ ‘యిరవైన శబరి రుచు లివియె నైవేద్యమై పరగెనట శేషమును బహు నిషేధములనక,’ అట్టే తన పట్ల కూడా భక్తవాత్సల్యాన్ని చూపి తన పాపాలను నశింపచేయమని అన్నమయ్య వేడుకున్నాడు.
రామా రమాభ్రద రవివంశ రాఘవ
యేమి యరుదిది నీ కింతటివానికి
నాఁడు రావణుతలల నఱికినలావరివి
నేడు నా పాపములు ఖండించరాదా
వాఁడిప్రతాపము తోఁడ వారిధిగట్టిననాటి –
వాఁడ విట్టెనామనోవార్ధిఁ గట్టరాదా
తనిసి కుంభకర్ణాదిదైత్యుల గెలిచితివి
కినిసి నాయింద్రియాల గెలువరాదా
యెనసి హరునివిల్లు యెక్కు వెట్టి వంచితివి
ఘనము నాదుర్గుణము కడు వంచరాదా
వరుస విభీషణుఁడు శరణంటేఁ గాచితివి
గరిమ నే శరణంటిఁ గావరాదా
తొరలి శ్రీ వేంకటేశు దొడ్డు గొంచ మెంచనేల
యిరవై లోకహితాన కేదైనా నేమీ
అదౌరామ తపోవనాది గమనం హత్వామృగం కాంచనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం సముద్ర తరణం లంకాపురీదాహనం
పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్దిరామయాణం
సౌమ్యశ్రీ రాళ్లభండి