ఈ బొమ్మ నేను, నా పేరు బుడుగు. ఇంకోపేరుంది పిడుగు… ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు…. అంటూ తెలుగువారందరిని నవ్వించి, కవ్వించిన బుడుగు జ్ఞాపకం ఉన్నాడా? వాడితోపాటు అల్లరి చేసిన సీ.గానపెసూనాంబ, వాడి అల్లరికి బలైన పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు? టీచర్లు?
పోనీ, . అలో… అలో… లో…జోగినాథం గారా? ఆకాశంలో మర్డరు జరిగినట్టు లేదూ… ఎప్పుడూ ఎదవ బిజినెస్సేనా… మడిసన్నాక కుసంత కళాపోసనుండాలి, తిని తొంగుంటే గొడ్డుకూ మనిసికి తేడా ఏముంటాది. అన్న డైలాగులు? ముత్యాలముగ్గు చిత్రంలో రావుగోపాలరావు పలికే ఈ డైలాగులు నేటికీ తెలుగు ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. ఈ డైలాగులు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు.
అలాగే, ఈ పాత్రల సృష్టికర్త, మాటలకర్త ముళ్లపూడి వెంకట రమణగారిని కూడా తెలుగువారు ఎన్నటికీ మరువలేరు.
తెలుగువారి జీవితమే ప్రేరణగా రమణగారి కలం నుంచి జాలువారిన పాత్రలు, వాటి మాటలు జీవిత సారాన్ని మధించి హాస్యరసంలో మేళవించి, తిరిగి వారికే సమర్పించాయి. హాస్య రచయితగా వ్యంగ్యాన్ని, పేరడీని కలబోసి నవ్వుల పంటలు కురింపించిన ముళ్లపూడివారు, ‘రక్త సంబంధం’లాంటి శోకభరిత చిత్రానికి మాటలు రాశారు అంటే నమ్మగలమా? ఆయన కొత్తమాటలను చక్కగా కూర్చి, పాతమాటల్ని విరచి, గోదారోళ్ల ఎటకారాన్ని, మాండలికాన్ని తన రచనలలో గుప్పించారు. అందుకు కారణం ఆయన గోదావరి ఒడ్డున ఉన్న ధవళేశ్వరంలో పుట్టి, పెరగటం కావచ్చు. తదనతరం తండ్రిగారి హఠన్మరణంతో మద్రాసు చేరుకున్న రమణగారి పూర్వీకులు బరంపురంకు చెందినవారు.
సున్నితమైన హాస్యం, చమత్కారం, హృదయాన్ని తాకే కరుణ, సునిశతమైన అధిక్షేపణలతో ఉగాది పచ్చడి షడ్రుచులను కలిగిన రచనా వ్యాసాంగం వారిది. ఉదాహరణకు ‘ఋణ రమణీయం’లో ఆయన అప్పుపై చేసిన మాటల ప్రయోగాలు సునిశితమైన హాస్యాన్ని ఒలికిస్తాయి. మచ్చుకకు, ‘అడగ్గానే అప్పు దొరకా,’ అని ఆశీర్వదించటం, ‘నీ దగ్గర అడ్డమైనవాడు అప్పుచేసి ఎగొట్టా,’ అని తిట్టడం, ‘బడిపంతులు చేబదుళ్లులా చిందరవందరగా ఉండే జుట్టూ,’‘అప్పులు తీర్చేసినవాడి మనసులా లోకం ప్రశాంతంగా ఉంది,’ వంటి ప్రయోగాలు. సినిమాల్లో రాసిన డైలాగులు – ‘సిఫార్సులతో సంసారాలు చక్కబడవు,’ ‘నవ్వోచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడే హీరో,’ ‘నువ్వు హాయిగా, సంతోషంగా ఉన్నప్పుడే కన్నవాళ్లను తలుచుకో.. చూడ్డానికి రా.. ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి,’ ‘శివుని మూడో కంట భగ్గుమనే మంటా ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది,’ ‘పెదవుల మీది చిరునవ్వు అల్పమైన సుఖానికి, సంతోషానికి పుడుతుంది. ఇట్టే చెరిగిపోతుంది,’ వంటి జీవిత సత్యాలను తన అనేక డైలాగులలో చొప్పించి ప్రేక్షకులకు అందించారు.
రమణగారి తొలిరచన ‘అమ్మ మాట వినకపోతే’ 1945లో అప్పటి పిల్లల పత్రిక ‘బాల’లో ప్రచురితమైనది. తదనంతరం ఆంధ్ర పత్రికలో సినిమా రిపోర్టరుగా పనిచేశారు. అదే ఆయన సినీరంగ ప్రవేశానికి దారి తీసి, ‘రక్త సంబంధాని’కి సంభాషణ రచయితను చేసింది. ‘దాగుడుమూతలు’ సినిమాకు కథను కూరుస్తున్న సమయంలోనే ‘మూగమనసులు’కి కథ, మాటలు సమకూర్చారు. అప్పటి నుంచి ఎన్నో అద్భుత కథలు, మాటలు తెలుగు తెరను అలరించాయి, మన మనసులను దోచాయి. మూగమనసులు సినిమాకు ఆయన రాసిన కథనాన్ని చూసి ఆత్రేయగారు, ‘సాధారణంగా నేను రాసినది నా అసిస్టెంట్లు ఫెయిర్ కాపీ చేస్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో ఈ కొత్త కుర్రాడు రమణ రాసినది నేను ఫెయిర్ కాపీ చేస్తున్నాను,’ అన్నారుట. ఈ ఒక్కమాట చాలు ముళ్లపూడి వారి కథనం, సంభాషణా రచన చాతుర్యం గురించి చెప్పడానికి. అందుకే కామోసు ముళ్లపూడి వారి ‘సీతాకళ్యాణం’ కథను లండన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో పాఠ్యగ్రంథంగా ప్రవేశపెట్టారు.
హాయిగా నవ్వడం, హాయిగా నవ్వుకోడం, హాయిగా నవ్విపోవడం, హాయిగా నవ్వేయడం, హాయిగా నవ్వించడం అందరికి సాధ్యమయ్యేపనికాదు. కానీ ముళ్లపూడి వారికి అది కరతాలమలకం. కనబిడిన ప్రతి పుస్తకం చదవటం వల్ల ఆయనకు భావ ప్రకటన, దానికి దీటుగా అందమైన భాష వంటబట్టింది. అందుకే ఆయన మాట రాసినా పాటలాగే ఉంటుంది. ఇదే విషయాన్ని మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఒకానోక సందర్భంలో చెబుతూ, ‘అతను రాసే మాటల్లో రిథమ్ చూడండి. అవన్నీ పాటలే,’ అన్నారు.
‘కన్యాశుల్కం’ నాటకంతో తెలుగునాట ప్రవేశించిన కుహనా సంస్కారి గిరీశం. గురజాడవారి కలంతో ప్రాణంపోసుకున్న ఈ దుష్ట కథానాయకుని ప్రవర్తనను, గురజాడవారిక శైలిని ఆద్యంతం అర్థంచేసుకున్న వాడైన వెంకటరమణగారు, ‘గిరీశం లెక్చర్లు’ పేరుతో సమాజపోకడలపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఉదాహరణకు, ‘మనవాళ్లు ఒట్టి వెధవాయలోయ్. అందుకనే ప్రతివాడూ ప్రతి రెండోవాడిని వెధవాయి అంటాడు.’ ‘మీరంతా ఓ యూనియన్ పెట్టుకోవాలి సార్. యూనిటీ ఉండి తీరాలని కాదు, పోట్లాడటానికైనా ఉండాలిగా.’‘యుద్ధాలుండ బట్టేకాదా, ఐన్ స్టైయిన్ పుట్టుకొచ్చాడు. యుద్ధం వద్దన్న స్విట్జర్లాండులో ఏవుంది? కుక్కూ క్లాకు.’‘మంత్రి కుర్చీ ఎక్కిన మర్నాడే అమెరికా చెక్కెసి ఒక హార్ట్ ఆపరేషనూ, వాళ్లావిడకో కిడ్నీ బదలాయింపు లాగించేశాడు.’
రమణగారి గురించి మాట్లాడుతూ, బాపు గారిని ఊటంకించకపోతే చప్పుళ్లు లేని హృదయం గురించి మాట్లాడినట్టే. అవడానికి తూర్పూ, పడమరలైనా (గోదావరి జిల్లాలు) అరమరికలులేని స్నేహానికి సాక్ష్యులు వారు. రమణగారి మాటలకు, చేష్టలకు తన కుంచెతో బాపుగారు దృశ్యకావ్యంగా మలిస్తే, బాపుగారి బొమ్మలకు రమణగారు మాటలు నేర్పారు. అందుకే వీరివురి కలయికలో వచ్చిన బుద్ధిమంతుడు, ముత్యాలముగ్గు, అందాలరాముడు, సంపూర్ణరామాయణం, పెళ్లిపుస్తకం, శ్రీనాథకవిసార్వభౌమ, శ్రీ రామరాజ్యం వంటి అనేకానేక చలనచిత్రాలు నేటికి ప్రేక్షకుల మనసులో తిష్ఠ వేసుకుని కూర్చున్నాయి.
పురాణగాథలను దృశ్యకావ్యాలుగా మార్చాలంటే అది బాపురమణల తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు! ముఖ్యంగా రామాయణ గాథను, పాత కథనే కొత్త బాటిల్ పోసి అమ్మినట్టు, బాపూ, రమణలు పలుమార్లు చిత్రమాలికలుగా తీర్చిదిద్దారు. సంపూర్ణ రామాయణంతో మొదలుపెట్టి శ్రీ రామరాజ్యం దాకా ఏదో తెలియని కొత్తదనాన్ని కథకు ఆపాదించడం వారికే చెల్లింది.
ముళ్లపూడివారి సాహిత్యం, కథా రమణీయం, కదంబ రమణీయం, సినీ రమణీయం, అనువాద రమణీయం, బాల రమణీయం పేర సంపుటాలుగా వెలువడ్డాయి. తన జీవన సమరాన్ని ‘కోతికొమ్మచ్చి’ పేరుతో పాఠకులకందించారు రమణగారు. హాస్య రచయితగా, జర్నలిస్టుగా, కథకుడిగా, సాహిత్యవేత్తగా, సమీక్షకుడిగా, వ్యాసకర్తగా తాను సృష్టించిన సజీవ ప్రాతల మధ్య సదా కదలాడుతూ, తెలుగువారి ముంగిళ్లలో ముత్యాలముగ్గులు దిద్దుతూనే ఉంటారు.
సౌమ్యశ్రీ రాళ్లభండి
(జూన్ 28 ముళ్లపూడి వెంకటరమణగారి జన్మదినోత్సవ సందర్భంగా…)