సమీక్ష
Most Eligible బ్యాచిలర్

సమీక్ష <br> Most Eligible బ్యాచిలర్
సమీక్ష
Most Eligible బ్యాచిలర్

ప్రేమ, పెళ్లి ఈ అంశాలతో అనేక చిత్రాలు వెలువడ్డాయి. వెలువడుతూనే ఉంటాయి. అనేకమంది దర్శకులు వీటి గురించి అనేక నిర్వచనాలు తమ చిత్రాలలో పొందుపర్చడం కూడా జరిగింది. అయితే ప్రేమకైనా, పెళ్లికైనా ఏమిటి పునాది? ఈ ప్రశ్నకు కూడా చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అలాంటి కోవకు చెందిన సినిమాయే. పెళ్లకి నమ్మకం, ప్రేమ అక్కర్లదన్నదే దర్శకుని అభిప్రాయం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2000లో సర్దుకుపోదాం రండి అనే సినిమా వచ్చింది. ఇందులో భార్యా, భర్తలు సర్దుకుపోయినప్పుడే కాపురాలు నిలబడతాయనే పాయింట్ నొక్కివక్కాణించారు. అయితే నేడు వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అందుకు పూర్తిగా విరుద్ధం. పెళ్లంటే సర్దుకుపోవడం కాదు, రొమాన్స్ ఉండటం అనే కొత్త పాయింట్ లేవనెత్తారు. సమస్యేంటంటే ఈ విషయం గురించి మనకు సినిమా చివర వరకు దర్శకుడు చెప్పకపోవడం. మనకూ ఆ విషయం తట్టకపోవడం. సినిమా క్లైమాక్స్ వరకు దర్శకుడి బాధేంటో మనకు అర్థం కాకపోవడం మన తప్పుకాదు. ఆ తర్వాత కూడా అర్థంకాకపోవడం ఎవరి తప్పూ కాదు?

కథ విషయానకి వస్తే, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి (అఖిల్), ఇండియా వచ్చి 20 రోజుల్లో 20 మంది పెళ్లికూతుర్లని చూసి అందులో ఒకరిని సెలక్ట్ చేసుకుని, పెళ్లి చేసుకుని అమెరికా చక్కా వెళ్లిపోవడం. ఈ విషయంలో అతనికి ఎటువంటి సందేహాలు లేవు. అమెరికాలో స్థిరపడ్డ మన తెలుగు వారు ఆంధ్రదేశం వచ్చి హడావుడిగా పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడం అనే కాంన్సెప్ట్ ని దర్శకుడు ఇక్కడ ఉపయోగించుకోవడం వరకూ పర్వాలేదు. కానీ ఈ ఆధునిక యుగంలో పిల్లలను ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ చూసి మాట్లాడుకుంటుంటే, మన హీరో మాత్రం అమ్మ, నాన్న వెదికి పెట్టిన అమ్మాయిలని, గంటకొకరిని చొప్పున సంతలో గొడ్డును చూసినట్టు చూడటం ఏమిటి అన్న లాజిక్ అర్థం కానిది. అందుకు ఒక అన్నగారి క్యారెక్టర్ (అమిత్ తివారి). అతనికి ఏమి పనిలేదు, డైరీ చూసి పెళ్లికూతురి అడ్రసు చెప్పడం తప్ప. ఈ విషయంపై మహిళా సంఘాలు ఉద్యమాలు లేవనెత్తకపోవడం విడ్డూరమే.

పోనీ దర్శకుడి ఆలోచనతో సర్దుకుపోదాం అనుకున్నా, పెళ్లిచూపులకి కూడా అమ్మ, నాన్న, అక్క, పిల్లలు, అత్త, మామ, బాబాయి, పిన్ని, దేశ, విదేశాల స్నేహితులు ఇంతమంది కట్టకట్టుకుని వెడితే, పెళ్లికూతురి తండ్రి నెత్తిమీద చెంగేసుకోవాల్సిందే. పెళ్లిసందండి (1996), కలిసుందాం రా (2000) సినిమాల నుంచి అనుకుంటా తెర నిండా నటీనటులతో నింపేయడం మన కుటుంబ కథా చిత్రాలలో ఒక ట్రెండ్ గా మారింది. అవసరం ఉన్నా, లేకున్నా గుంపుల కొద్ది మనుష్యులు తెర మీద కన్పిస్తారు. అందులో చాలామందికి డైలాగ్ కూడా ఉండదు. ఉత్సవ విగ్రహాలు మాత్రమే. దాని వల్ల సినిమాకి ఏం ప్రయోజనం అంటే ఏమీ ఉండదు. ఈ సినిమాలోనూ అంతే, ఏకకాలంలో 15-20 ముందుంటారు సీన్ లో వారి వల్ల సినిమాకిగాని, ప్రేక్షకుడికి గాని ఏమీ సంబంధం ఉండదు.

స్టాండింగ్ కామెడీ, ఈ తరహా కార్యక్రమాలను విదేశాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ కాన్సెప్ట్ ని దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు రుచిచూపించాలనుకోవడంలోనూ తప్పులేదు. సరే ఇదో కొత్త ప్రయోగం తెలుగు సినిమాల్లో అని సర్దుకుపోదామా అనుకుంటే, ఒక్క హీరోకి తప్ప చక్కలిగింతలు పెట్టినా ప్రేక్షకుడికి నవ్వురాదు. ఈ స్టాండింగ్ కామెడీ పాత్ర చిత్రం హీరోయిన్ (పూజా హెగ్డే)ది. హాస్యం ద్వారా వినోదాన్ని పంచాలనుకున్నప్పుడు అందుకు తగిన సరంజామా అంటే మాటలు రాసుకోవడం చాలా అవసరం. ఇందులో మాటల రచయితలు దర్శకుడు భాస్కర్, సురేంద్ర కృష్ణ పూర్తిగా విఫలమయ్యారనే చెప్పచ్చు. హాస్యమనేది జంధ్యాలతోనే వెళ్లిపోయింది. డైలాగులను టైమింగ్ తో పలకడం కూడా ఒక కళ. సుత్తి వీరభద్రరావు, వేలులతోనే అది అంతరించిందని చెప్పాలి. పరభాష నటులకు మన తెలుగు భాష పలుకుబడి, ఒరవడి అర్థం కావడం అంత సులువు కాదు. భావం అర్థం కాకుండా డైలాగ్ పలకవచ్చేమో కానీ స్టాండింగ్ కామెడీ లాంటి ప్రక్రియను రక్తి కట్టించాలంటే అంత సులువు కాదు. ఈ విషయంలో పూజా హెగ్డేను తప్పు బట్టలేం. అలాని వెన్నెల కిషోర్ లాంటి నటుడున్నాడుకుంటే ఈ రెండునిమిషాల మ్యాగీ వండి పెట్టడం ఏంటో అంతుపట్టదు. అతని పాత్రకు నిడివి గాని, ఒక ప్రయోజనం గాని లేదు. గుంపులో గోవింద.

ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇక మన హీరో పెళ్లిచూపుల్లో అడిగే తలతిక్క ప్రశ్నలు అవన్నీ, హీరోయిన్ మన హీరోగారిని అడిగిన ప్రశ్నలే. పెళ్లి నుంచి మీరేం ఎక్స్ పెక్ట్ చేస్తారు? ప్రతి రోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పనేంటి? డు యూ లైక్ సన్సెట్ ఆర్ సన్రైజ్? ఇలాంటివే మరికొన్ని చొప్పదంటు ప్రశ్నలు. అమెరికా వీథుల్లో తిరిగేస్తే వీటన్నింటికి హీరోగారికి సమాధానాలు ఎలా తెలిసాయో తెలవక ప్రేక్షకులు జుట్టుపీక్కోవాలి. నటుడు అజయ్ (హీరోకి బావ) ఈ సినిమాలో చెప్పినట్టు నీకర్థమైతే, నాక్కూడా చెప్పు అని ప్రేక్షకుడు వాపోతాడు. అలాగే హీరోయిన్ తండ్రికి హీరో నచ్చకపోవడానికి గట్టి కారణమంటూ ఏదీ లేదు. అలాగే హీరోయిన్ కు పెళ్లంటే భయానికి గట్టి కారణంలేదు. తండ్రిని వేరే మహిళతో చూడటం, తండ్రి అందులో తప్పులేదని చెప్పె ఒక నిమిషం సీను తప్పిస్తే. అలాగే పెళ్లి అనే బంధంతో ముడి వేసుకున్న భార్యాభర్తలు సర్దుకుపోతూ బతకటం సరైన పద్దతి కాదని చూపించడంలోనూ దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. సర్దుకోపోవడం నచ్చని హీరోయిన్ అది చెపితే నిజంగానే అది ఒక నేరంగానో, ఘోరంగానో హీరో భావించడానికి కారణం ఒక సీనులో హీరో తల్లి (ఆమని) ఎదో చెప్పబోతే, తండ్రి (వి. జయప్రకాశ్) మనం ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం అనడమే. ఇక కోర్టు సీన్లు, చివరగా వచ్చే క్లైమాక్స్ సీన్లు ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోవు. బొమ్మరిల్లు వంటి సినిమా అందించిన దర్శకుడి నుంచి ఇటువంటి పేలవమైన సినిమాని ప్రేక్షకులు ఊహించి ఉండరు.

ఇక నటీనటుల విషయానికి వస్తే, ఎందరో ఉన్నా, ఎవరూ లేనట్టే. ఆమని, ప్రగతి, పోసాని కృష్ణ, వీరందరూ సినిమాకి అవసరమా అన్పిస్తుంది. ఈ నటుల ప్రతిభను ఉపయోగించుకాలని దర్శకుడు అనుకున్నట్టుగా కూడా అన్పించదు. ఈ ప్రాతలు వేయడానికి ప్రేక్షకులు గుర్తుపట్టగలిగే సహాయ నటులని తీసుకున్నా సరిపోతుంది. బడ్జెట్ కూడా తగ్గేది. ఇక హీరో, హీరోయిన్ల విషయానికి వస్తే, ఇప్పటికే జూనియర్ ఎన్టీ ఆర్, అల్లు అర్జున్, మహేష్ వంటి అగ్ర హీరోలతో నటించిన పూజా హెగ్డే ఇమేజ్ కి ఇది తగిన సినిమా కాదు. ఒకవేళ హీరోయిన్ ప్రాథాన్యత గల సినిమా అనుకుందామా అంటే, అదీ కాదు. ఈ పాత్రకు ఒక పరిపూర్ణత, పరిపక్వత లేకపోవడం వల్ల నటించడానికి ఎటువంటి అవకాశంలేని ఒక మూస పాత్రలో వెలవెల పోయింది. ఇక అఖిల్ విషయానికి వస్తే, పూజా హెగ్డే గ్లామర్, స్టార్ ప్రెజన్స్ ముందు బాగా తేలిపోయాడు. ఇన్నీ చెప్పాక రోమాన్స్ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఎలా? దర్శకుడు భాస్కర్ ప్రకారం రోమాన్స్ అంటే మన భాగస్వామితో 9వేల రాత్రలు కల్సి పడుకోవాలి, వందల కొద్ది విహార యాత్రలకు వెళ్లాలి, అన్నింటికన్నా మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. ఇదే దాంపత్యమైతే, పెళ్లికి అర్థం ఇదే అయితే, బాపు, రమణగార్లు చాలా శ్రమపడి రాసిన పెళ్లిపుస్తకానికి విలువే లేదు.

మెదడుని, బుద్దిని బీరువాలో పెట్టి తాళం వేసి, రెండున్నర గంటల మన జీవితం మనది కాదు, నాకక్కర్లేదు. నాలుగు పాటలు, నాలుగు అర్థంపర్థంలేని డైలాగులు, సీన్లు చూసి జీవిత భాగస్వామితో 9000 రాత్రులలో మరో రాత్రి గడిపేస్తాను అనుకునే వారికి ఈ సినిమా మోస్ట్ ఎలిజిబుల్.

సౌమ్యశ్రీ రాళ్లభండి

WhatsApp