సంక్రాంతి
కృష్ణశాస్త్రి

సంక్రాంతి <br> కృష్ణశాస్త్రి
సంక్రాంతి
కృష్ణశాస్త్రి

‘‘విన నిష్టపడను, వినకు
న్నను తోచదు, విన్నచో మనస్సు వికలమౌ
దినదినము గగన వాణీ
స్వన వీచీ నివహ వాహ వార్తావళులన్!

కొరియా రణ మ్మనుచు, మలయా వ్రణ మ్మనుచు,
కురిసి రణ్వస్త్ర భీకర పరంపర యనుచు,
దరియు సంగ్రామమని, వరదలని, వరపులని,
కరవు కాటకములని,మరణమని, మసనమని!

ఈ లోకమ్ము దరిద్రతా కృపణతా హింసా రిరంసా రుషో
ద్వేలోల్లోములన్ మునింగి విల యాభీల స్థితిన్ మాయునే
మో – లేకున్న సహోదరాస్థి పలలమ్ముల్ తిందురే యెందు? త
త్మీలా లాసవ పాన లలాస మదాంధీభూతులై మానవుల్!’’

అని తలంచి కొనుచు అల్లన శయ్యపై
ఎపుడు తార్చినానో ఏను మేను
నిదుర దారులంట కదలుచు కలచుచు
పిలు పొకండు మేలుకొలిపె నన్ను!

ముని వాకిట నిల్చి రేకొసన్
ముసిరే చీకటి నీడ లూర్చుచున్
జరఠచ్ఛదపక్ష్మవిస్రవ
త్తర ళాజస్రహిమాశ్రు లోడ్చుచున్ –

తోచె నిబంతరువు, తోచెను దూరాన
భోగిమంట చుట్టి మూగు నీడ
లరుణదారుణా గ్రహట్టహాసము రేప
ముసిరిపోవు వంతమసక లట్లు!

అంత మెత్తని చేయి నా యంస పాళి
తాకినట్లయ్యో : మరియు మెత్తని రవమ్ము
ఊదిన ట్లయ్యె చెవి పొంత, ఉండి ఉండి
సీతువును దోచు తొలి చైత్రగీతి వోలె!

‘‘ఏమండీ ! ఇంకలెండి ! వాకిటికి రానెవచ్చె సంక్రాంతి, ఏ
మేమో ఎన్నడు యోచనల్ తెగవు మీ, కీలాగు కూర్చుందురం
డీ! మానండి దిగుళ్ళు మీ మనసులో! ఈ లోక భారమ్ము మీ
రే మోసేరె సుకమ్ముగా నడపలే రీ కాస్త సంసారమున్!

ఉండునో ఊడునో మరెపుడో విలయావసరమ్ము నందు బ్ర
హ్మాండము లంచు వేడుకలు మానుదురా ఇపుడెవ్వరేని? ఏ
పండువులో ప్రతిక్షణము పబ్బములో ఇటురావో – ఆసలున్
పండిన కోరికల్ పసిడి స్వప్నములున్ వసివాడిపోవవా?

మన చిన్న సీత లేవనెలేద, గోమయ
హిమవారి కలయంపి యెవ్వ రిడిరి?
కూర్చున్న వప్పుడే కొలువులో గొబ్బిళ్ళు
వన్నె వన్నెల రంగవల్లు లందు!
ఎందుకో తొందర లీ బంతి పూవులకు
కొమ్మల రవ్వంత కునుకరాదో?
ఎలమావి లేత యాకుల తోరణాల గు
మ్మాల బుజ్జాయి కాబోలు కూర్చె!

పండు వాయెను – ఎటు లూరకుండు, మాయ
మసక లెరుగని పసికందు మనసు లాయె?
కలలొ కొరికలో పూలు కాయ లగుచు
ప్రాకికొనిపోవు ఆ బీరపాదు లట్లు!’’

మెడచుట్టి మంచులో తడసిపోయిన ముద్ద
బంతి కడాని లలంతికలును,
బుజములపై గుత్తముగ నొత్తియుండని
తెలిచీర చెరగుల మిలమిలలును,
పచ్చపచ్చని పైరు పరికిణి మడతల
సగము కప్పెడెడు సెనెగ పువులను,
కెంగేల జాళువా గిండిలో బుస బుస
మని పొంగు మైరేయ మాధురులును,

కేతముపై హసంతిక, శీతవాత
వీచికా సైంధవమ్ములు, వెడలివచ్చె
సుందరమ్ము సేవంతికా స్యందనమ్ము
పైని సంక్రాంతినాటి ప్రాభాత లక్ష్మి!

తలయెత్తి చూతునుగదా దవులందు పారున్
చలికారు ఈదర హుమాయి పయిన్ బయలళ్ళన్
వలిపంపు మంచుమును గంచులు తేలిపోగా
చలియించు లోధ్రసుమఖేల తూలిపోగా!

దవులన్ దోచెను నవమా
ధవ మాగధ గీతు లంత, తరుణి పెదవులన్
మివులన్ బూచిన మంకెన
పువులన్ తొలినాటి పండువులు స్ఫురియించెన్!

నా యింటి ముంగిట, నా
ప్రాయపు వాకిట, వలగ్నలగ్న శ్రీ చాం
పేయ మధు పాత్రతో సతి
తీయని సంక్రాంతి లక్ష్మి తెరగున్ తోచెన్!

‘‘మున్ను హిమవేళ ప్రోదోల ఉన్న వగరు
పొగలు, మృగమద వీటికా భుగ భుగలు, ప్రి
యాంగనాలింగనాలు, నేడనవసరములు
కుంపటులు దుప్పటులు మాకు కుప్పసములు!’’

మసరు సరసా లంత మగువ చెవిలో సుంత
గుస గుసలుగా నెవో కొసరితినో లేదో –
మిస మిస యెలనగవు లొసపరి పెదవి దాచి
విసరుకొను చిల్లాలు వీటి లోపలి కేగె!

కృష్ణశాస్త్రి గారి పల్లకీ అనే పద్య సంపుటి లోని పద్యం