శ్రీశ్రీ చమత్కారాలు

శ్రీశ్రీ చమత్కారాలు
శ్రీశ్రీ చమత్కారాలు

శ్రీశ్రీ ఛలోక్తులు ఆయన రాసిన కవిత్వం, వచనాలలాగా చాలా పదునైనవి. వాటికి గురైనవాడు నార్ల వారన్నట్లు గుడ్లనీరు కుక్కుకుంటాడు. పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు, ప్రశ్నలకు జవాబులు చెబుతున్నప్పుడు, లేఖలు రాస్తున్నపుడు… ఒకటేమిటి? అన్ని సందర్భాల్లోనూ శ్రీశ్రీ వాక్యం నవ్విస్తూనే చెళ్లుమనిపిస్తుంటుంది.
శ్రీశ్రీ నిశ్శబ్ధంలో హాస్యం చూడండి. నోరి నరసింహ శాస్త్రి గారు ‘రుద్రమ దేవీ’లో ఈ ప్రాకృత పద్యం రాశారు:
‘‘దో ఇ ఆ రహి ఓ అహి అందు హి ఓ
వి రుహూ ణుగ ఓ పరిమాధిశ ఓ
గిరికా ణణ ఏ కుసుముజ్ఞుల ఏ
గ అ జూ హ ఏ ఈ ఉ అఘీణ గ ఈ’’

దీనిపై శ్రీశ్రీ వ్యాఖ్య:
‘‘??? ‘‘ ‘‘ ‘‘ ‘‘ ……………….(‘‘ ( ( ………….. ! ! ! ! ‘‘ ’’ ???’’
శ్రీశ్రీ నిర్వచనాలు గొప్పగా ఉంటాయి.
‘‘ప్రభుత్వమంటే భావిని భూతమని భావించే వర్తమానం.’’
‘‘జైయిలన్నా ప్రిజనన్నా ఒకటే – కాబట్టి జైయిలర్ అన్నా ప్రిజరన్నా ఒకటే.’’
శ్రీశ్రీ సూక్తులు కొన్ని:
లుంగీకి స్త్రీ లింగం లంగా
పాలు నిత్య బహువచనం
కొందరు అదృష్టవంతులకు ఆలు బహువచనం
ఎక్కడికైనా వెళ్లాలంటే
నిన్న బయల్దేరాలి

కవులు హాలికులైన నేమి? అన్నాడు పోతన.
ఆల్కహాలికులైన నేమి అంటాడు శ్రీశ్రీ.
టైముకు రావడం శాస్త్రీయం
టైముకు రాకపోవడం కృష్ణశాస్త్రీయం.
‘ముత్యాల ముగ్గు’ తర్వాత రావల్సిన చిత్రం ‘రత్నాల రగ్గు’
ఆ తర్వాత రావలసిన చిత్రం ‘దయ్యాల దగ్గు’
కృష్ణుడు రుక్మిణీనాథుడు కాబట్టి
కృష్ణశాస్త్రికి పర్యాయపదమే రుక్మిణీనాథు శాస్త్రి.
కుందేలుకు ఒక్క తెలుగు భాషలోనే కొమ్ములున్నాయి.

చక్కని నవలా, కథా రచయిత అయిన గోపీచంద్ సినిమా ప్రపంచంలో కాలుపెట్టి చేయి కాల్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన 1952లో ‘పేరంటాలు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా విడుదల కాకముందే, అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం శ్రీశ్రీకి ఆ చిత్రాన్ని చూపారు.
చిత్రం చూసిన చూడగానే శ్రీశ్రీ ఆశుకవిత వచ్చేసింది –
‘‘చూచితి పేరంటాలిని
వాచెను నా రెండు కళ్ళు వలవల ఏడ్వన్
లేచీ లేవక మునుపే
గోచీ వీడె నేమనందు గోపీచందూ.’’

శ్రీశ్రీ గోరా శాస్త్రి ఒకసారి ఆత్మవిశ్వాసం మెండై, ‘‘ఇపుడు తెలుగు దేశంలో నాపాటి రాసేవాళ్లు ఎవరూ లేరనే నేను అనుకుంటున్నాను’’ అన్నారు. శ్రీశ్రీ వెంటనే తల పంకిస్తూ ‘‘నేను అదే అనుకుంటున్నాను’’ అన్నారు.

అద్వితీయం రంగస్థ నటుడు బళ్ళారి రాఘవ అభినందన సభకు శ్రీశ్రీ, శివశంకర శాస్త్రి, దేవులపల్లి మొదలైనవారు వెళ్లారు. వయోవృద్ధులైన రాఘవగారితో నాలుగైదు రోజులు కులాసాగా, సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుంటే మంచి గృహస్థుడి కర్తవ్యం ఎరిగిన రాఘవ ‘‘ఇక్కడికి దగ్గర్లోనే హంపీ ఉంది. అక్కడి శిథిలాలు చూసి పోదురుగాని’’ అన్నారు.

వెంటనే శ్రీశ్రీ ‘‘మిమ్మల్ని చూస్తున్నాంగా’’ అన్నారు.

కాకినాడలో శ్రీశ్రీ సన్మానసభ జరుగుతోంది. అందరి ప్రసంగాల అనంతరం శ్రీశ్రీ ప్రసంగిస్తూ,
‘‘నన్ను మొట్టమొదట అచ్చేసి దేశం మీదకి వదిలింది పురిపండా’’ అన్నారు. శ్రీశ్రీ మొదటి కావ్యం ‘‘ప్రభవ’’ ప్రచురణకర్త పురిపండా అప్పల స్వామి అని వేరే చెప్పాలా.

శ్రీశ్రీ శ్లేషకు ప్రసిద్ధి. ఏ భాష పదాన్నయినా, సర్వనామాన్నయినా యమకమో, శ్లేషో చేయడం ఆయనకు అలవాటు. ఒక రోజు మధ్యాహ్నం ఒక పత్రికా కార్యాలయానికి వెళ్లారు శ్రీశ్రీ. సంపాదకుడు కవరుపేజీ ఏం వెయ్యాలా అని తికమకపడుతున్నాడు.
‘‘కొచ్చిన్ సిస్టర్స్ వేద్దామా, వద్దా అని ఆలోచిస్తున్నాను బ్రదర్’’ అన్నాడు శ్రీశ్రీ తో.
‘‘ఎందుకొచ్చిన సిస్టర్స్; భోజనానికి వెళ్దాం పద’’ అన్నారు శ్రీశ్రీ.
అలాగే పార్కులో విశ్రాంతిగా కూర్చున్న శ్రీశ్రీని రంగస్థల నటుడు శ్రీ వల్లం నరసింహారావు ‘ఓ నాటిక రాయి’ అని అడిగారు. శ్రీశ్రీ జవాబు, ‘‘ఏనాటికైనా రాస్తాను మిత్రమా.’’

1981లో బెజవాడలో సాహితీమిత్రులు చేసిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న:
‘అంజయ్యగారిదే అసలైన తెలుగు అని ఆస్థానకవి దాశరథి అన్నారు. దానిమీద మీ అభిప్రాయమేమిటి?’
శ్రీశ్రీ జవాబు: ‘అంజయ్యగారి తెలుగునేనెప్పుడూ వినలేదు. దాశరథి గారిది విన్నాను. అంజయ్యగారిది అసలు తెలుగైతే దాశరథిగారిది కాదేమోనని అనుమానించాల్సి వస్తుంది.’

శ్రీశ్రీ విసుర్లకు దాశరథి లాగే ఆరుద్ర కూడా అక్కడక్కడా బలి అయ్యారు:
‘ఆరుద్రకు ఎందువల్లనో నారయణబాబు మీద భక్తి కుదిరింది. కుక్కకు మనిషే దేవుడు… ఎందువల్లనంటే మనమేం చెప్పలేం.’

గాంధీని ‘జాతిపిత’ అనడానికి శ్రీశ్రీకి అట్టే అభ్యంతరం ఉన్నట్టు లేదు గాని, ‘నెహ్రూ ఎవరు?’ అన్న ప్రశ్నకు ‘జాతీయపిత’ అని సమాధానమిచ్చారు.

వివిధ పత్రికల ఇంటర్వ్యూలలో ఛలోక్తుల –
‘మనిషికి జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ సుఖం కలిగించేది ఏది?’ అన్న ప్రశ్నకు ‘మృత్యువు మనదికాదు. మన విరోధులది’’ అని జవాబిచ్చారు శ్రీశ్రీ.

‘మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణా సమస్య పరిష్కారానికి మీరు తీసుకునే ప్రథమ చర్య ఏమిటి?’ అన్న ప్రశ్నకు ‘ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇవ్వడం’ అన్నారు శ్రీశ్రీ.

ప్ర: విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనవచ్చా?
జ: నా అనుమతితో నిమిత్తం లేకుండానే విద్యార్థులంతా ఎవరికి నచ్చిన రాజకీయాల్లో వారు పాల్గొంటున్నారు.
ప్ర: సృష్టిలో తీయనది ఏది?
జ: తీయనిదేది లేదు. అన్ని తీసినవే.
ప్ర: కమ్యూనిస్టు దేశాలలో కుక్కకు, సింహానికి తేడాలేందంటారు. ఇది ఎంతవరకు నిజం?
జ: సగం వరకు…. అలా అనేవాళ్లని కూడా కలిపితే మిగిలిన సగం పూర్తి అవుతుంది.
ప్ర: ఈనాడు సాహిత్యానికి, రాజకీయాలకి ఉన్న దూరమెంత?
జ: ఇదివరకు మైళ్ళ లెక్కన ఉండేది. ఇపుడు సెంటీమీటర్లలోకి వచ్చింది.

ప్ర: నన్నయ్య కాలం నుండి నేటివరకు తెలుగు కవితలో ఎంతవరకు ప్రగతి సాధించారు మన తెలుగువారు?
జ: అరసున్నాలు, బండిరాలు వదిలి పెట్టేంతవరకు.
ప్ర: పుడమి తల్లికి పురిని నొప్పులు ఇంకా ఉన్నాయా?
జ: పుడమి తల్లికి ఇంకా ఫామిలీ ఫ్లానింగ్ ప్రారంభం కాలేదు. ఎప్పుడూ నొప్పులు పడుతూనే ఉంటుంది.
ప్ర: మీ శిష్యరత్నమైన ఆరుద్రగారి పూర్తి పేరేమిటి?
జ: శిష్యుడంటే అతనొప్పుకోడు. రత్నమంటే నేనొప్పుకోను. ఆరుద్ర పూర్తి పేరు భాగవతుల (వెంకట సూర్య సోమసుందర సత్యం) శంకర శాస్త్రి. (బ్రాకెట్లలోనివి నా గెస్ వర్క్ మాత్రమే).

ప్ర: శ్రీనాథ మహాకవికి, శ్రీశ్రీ మహాకవికి తేడా ఏమిటి?
జ: శ్రీనాథుని కావ్యాలను శ్రీశ్రీ చదివాడు, ఆనందిచాడు. శ్రీశ్రీ కావ్యాలను చదివే అవకాశం శ్రీనాథుడిని లేకపోయింది.
ప్ర: బీదవాడికి, ధనవంతుడికి గల బేధం ఏమిటి?
జ: బీదవాడు ఎప్పటికైనా ధనవంతుడిని కావాలని కోరుకుంటాడు. ధనవంతుడెపుడు బీదవాణ్ణి కావాలని కోరుకోడు.
ప్ర: చంద్రుడు ఆడా? మగా?
జ: డుమువులు ప్రథమా విభక్తి. తెలుగు చంద్రుడు మగవాడు.

ప్ర: భగవంతుని ప్రార్థించేటప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారండీ?
జ: తమది గుడ్డి నమ్మకం అని తెలియచేయడానికి.
ప్ర: మన ఆస్థాన కవిగారు అభిప్రాయం ప్రకారం మన పత్రికలలోని భాష తెలుగు కాదా?
జ: నన్నయభట్టుగారు ఒక చోట ‘వీని బాస వేరు’ అన్నారు. ఇది మన ఆస్థాన కవిగారికి కూడా అన్వయిస్తుంది. (నన్నయ ఈ మాట అన్నది బకాసురుని వర్ణిస్తున్నపుడు.)
ప్ర: జగన్నాథుని రథచక్రాలు లాంటి గొప్ప రచనలు చేసిన మీరు ‘అరవ్యాడి దోసై మీద తోచింది రాసై’ అనడానికి కారణమేమిటి?
జ: ఎప్పుడ విందు భోజనాలే కాదు – అప్పుడప్పుడూ చేగోడీలు కూడా తినవచ్చునని నేననుకోవడమే కారణం.

విశాలంధ్రాలో 1973లో రాసిన లేఖ – శ్రీశ్రీ మాటల గారడికి మరో ఉదాహరణ:
‘భగవంతుడే రగుల్కోల్సిన ఈ జ్వాలని గిరిగారు గాని, ఇందిరమ్మగాని, సియ్యార్సి గాని, పోయ్యార్పిగాని ఎవరూ ఆర్పెయ్య లేరని సవినయంగా మనవి చేస్తున్నాను.’

(జూన్ 15న శ్రీశ్రీగారి వర్థంతి సందర్భంగా సేకరించి మీకు అందిస్తున్న వ్యాసం.
డా. సి. మృణాళిని గారు రాసిన ‘తెలుగు ప్రముఖులు – చమత్కార భాషణలు’ అనే పుస్తకం నుంచి తీసుకోబడింది.)