యోగసాధనే మోక్షానికి ముక్తి మార్గం

యోగసాధనే మోక్షానికి ముక్తి మార్గం
యోగసాధనే మోక్షానికి ముక్తి మార్గం

అంతర్జాతీయ యోగాదినోత్సవ సందర్భంగా…

“యజ్యతే ఏతదితి యోగః
యుజ్యతే అనేన ఇతి యోగః”

పంచేద్రియాలను నియంత్రించుకోవటం ద్వారా మనసును, శరీరాన్ని ఏకం చేయడానికి భారతీయ తత్త్వజ్ఞానం ప్రతిపాదించిన సాధనే యోగా. క్రీ.పూ. 200కు, క్రీ.శ.300కు మధ్య కాలంలో మహర్షి పతంజలి ప్రతిపాదించిన ‘యోగ సూత్రాలు,’ భారతీయ యోగ సాధనకు మూలం. కకర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన, మంత్ర, యంత్ర, లయ, కుండలిని మరియు తంత్ర యోగాల సమాహారం పతంజలి అష్టాంగయోగం. దీనినే ‘రాజయోగ’మని కూడా పిలుస్తారు. కఠోరశిక్షణతో గాని సాధ్యం కాని సాధన కావటం వల్ల దీనిని ‘హఠ యోగ’ మని కూడా అంటారు.

ఈ అష్టాంగయోగం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ మరియు ధ్యానసమాధి అని ఎనిమిది విధాలు.

యమము: ఇందు అహింస, సత్యం, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అను ఐదు రకాలు కలవు.

నియమము: దీన్ని కూడా ఐదు రకాలుగా చెప్పారు. అవి వరుసగా, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధామము, ఈశ్వరీ ప్రణిధానము.

ఆసనము: నాడీ వ్యవస్థను పటిష్టపర్చడానికి కూర్చోవల్సిన భంగిమలు.

ప్రాణాయామము: శ్వాసను నియంత్రించటం ద్వారా శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియ.

ప్రత్యాహారము: మనిషిలోని ఐదు జ్ఞానేంద్రియాలను, ఐదు కర్మేంద్రియాలను, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడం.

ధారణము: రూపం, శబ్ధం, ఊహ, మంత్రం ఏదైనా ఒకదానిపై మనసును లఘ్నం చేసి ఏకాగ్రతతో ఉండటం.

ధ్యానం: భగవంతుని తదేకంగా ధ్యానించే సగుణధ్యానం, ఆత్మను లీనం చేసి జరిపే నిర్గుణధ్యానం. ఈ మార్గాల ద్వారా సమాధిస్థితిని చేరటం.

సమాధి: జీవాత్మను పరమాత్మలో కలిపే స్థితి.

‘అయం తు పరమో ధర్మో యద్యోగేనాత్మదర్శనమ్,’ అనగా ధర్మములన్నింటిలోనూ యోగబలముతో ఆత్మ దర్శనము చేయటమే ఉత్తమ ధర్మమని యాజ్ఞ్యవల్క్య మహర్షి తన యోగసంహితలో తెలిపాడు. అనేక ఆసనాల అభ్యాసన ద్వారా స్థిర మనస్కులవడానికి వీలవుతుంది. ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ఆసనం చొప్పున 84 లక్షల ఆసనాలున్నట్టుగా శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఆసనాల వల్ల జ్ఞాన సిద్ధిని పొందటంతోపాటు, సర్వరోగాల నుంచి విముక్తిని పొంది, నవసిద్ధులు పొందవచ్చు. అందుకు అనువైన, మానవులు సాధన చేయదగ్గ 84 ఆసనాలను శివుడు, పార్వతీదేవికుపదేశించాడు. కాగా యోగులు వీటిలో విశిష్టమైన 32 ఆసనాలను అభ్యాసయోగ్యంగా నిర్ధేశించారు. ఇవి వరసుగా – 1. సిద్ధాసనము, 2. పద్మాసనము, 3. భద్రాసనము, 4. ముక్తాసనము, 5. వజ్రాసనము, 6. స్వస్తికాసనము, 7. సింహాసనము, 8. గోముఖాసనము, 9. వీరాసనము, 10. ధనురాసనము, 11. శవాసనము, 12. గుప్తాసనము, 13. మత్స్యసనము, 14. అర్థమత్యేంద్రాసనము, 15. గోరక్షాసనము, 16. పశ్చిమోత్తాసనము, 17. ఉత్కటాసనము, 18. మయూరాసనము, 19. సంకటాసనము, 20. కుక్కుటాసనము, 21. కూర్మాసనము, 22. ఉత్తానకూర్మాసనము, 23. మందు(డు)కాసనము, 24. ఉత్తానమందు(డు)కాసనము, 25. వృక్షాసనము, 26. గరుడాసనము, 27. వృషభాసనము, 28. శలభాసనము, 29. మకరాసనము, 30. ఉష్ణ్రాసనము, 31. భుజంగాసనము, చివరగా 32. యోగాసనము.

ఖగములు, మృగములు, జంతువులు, సర్పములు మొదలగు జీవరాశుల చలనాలననుసరించి ఆసనాల నిర్మాణం మన యోగలు జరిపారు. ఉదాహరణకు, పిల్లి నిద్రలేవగానే, పాదాలను నేలమీద గట్టిగా మోపి, నడుమును, పొట్టను అర్థచంద్రాకారంగా పైకి ఎత్తి శరీరాన్ని రెండు, మూడు సెకన్ల వరకు సాగతీసి, తర్వాత మామూలు స్థితికి వస్తుంది. ఇదే మార్జలాసనం. అలా వివిధ జంతువలు శరీర చలనాలననుసరించి పుట్టినవే, మత్స్యాసనము, మయూరాసనము, హంసాసనము, భూజంగాసనము మొదలైనవి.

ఆసనాలు మొత్తం ఐదు రకాలు:

1. కూర్చేని వేసే ఆసనాలు: వజ్రాసనం, పద్మాసనం…
2. నించుని వేసే ఆసనాలు: వృక్షాసనము, నటరాజాసనము….
3. బోర్లాపడుకొని వేసే ఆసనాలు: భుజంగాసనము, ధనురాసనం…
4. వెల్లికిలా పడుకొని వేసే ఆసనాలు: పవనముక్తాసనం, శవాసనం…
5. తలకిందులుగా వేసే ఆసనాలు: శీర్షాసనము, సర్పాంగాసనము…

తేటగీతి