మౌనంగా మహానటి

మౌనంగా మహానటి
మౌనంగా మహానటి

మూడు దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకుల మనసును దోచి సమ్మోహనం చేసిన మహానటి సుదీర్ఘతీరాల నుంచి పయనించి వచ్చి మళ్లీ తెరమీద సాక్షాత్కరించింది. ఈసారి బయోపిక్ రూపంలో. ఆనాడు ఏవిధంగా అయితే తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుందో, నేడు అంతకు రెట్టింపు స్థాయిని దక్కించుకుంది. నాడు, నేడు, ఎల్లప్పుడు ఆమె మహానటే. కాకపోతే, నాడు తానెవరికి సంజాయిషీ ఇచ్చుకోవల్సిరాలేదు. ఎవ్వరూ ఆమె జీవితాన్ని ప్రశ్నించనూ లేదు. కానీ నేడు, తనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ, తన గురించి తెల్సిన వారు, తెలియని వారు, సినీ చరిత్రకారులు, సినీ ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు అందరూ ఆమె జీవితాన్ని గురించి అభిప్రాయాలు చెప్పేవారే. అందరూ వేలెత్తి చూపేవారే.

ఆమె మహానటి. అందులో సందేహం లేదు. ప్రేక్షకుల హృదయాలలో నిదురించిన చెలి. అందుకు తార్కాణం ఇన్నేళ్ల తర్వాత కూడా థియేటర్ల ముందు రాశులు కుమ్మరిస్తున్న జనం. సావిత్రి ఆ ఒక్క పేరు చాలు తెలుగు వారి గుండెలని తట్టి లేపడానికి. అందుకే ఎవరూ చేయని సాహసం నిర్మాతలు చేసి ఉండవచ్చు. ఆ ఒక్క పేరుతో రాశులు మూట కట్టుకోవచ్చని అభిప్రాయపడి ఉండవచ్చు. కాకపోతే సావిత్రి జీవితాన్ని వెండి తెరకు ఎక్కించవల్పిన అవసరం ఏం ఉంది? ఇంతమంది విమర్శకుల మధ్య ఆ మహానటిని ఒంటరిని చేయాల్సిన అవసరం ఏం ఉంది?

ఒక మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుకులుంటాయి. అవి వారి,వారి సామర్ధ్యాన్ని బట్టి వారు ఎదుర్కుంటారు. కాకపోతే సావిత్రి మహానటి. ప్రేక్షకుల సొత్తు. అందుకని ప్రతి ఒక్కరికీ ఆమె జీవితం గురించి తెలుసుకోవడానికి కుతూహలం ఉండవచ్చు. కానీ తన జీవితాన్ని అందరి ముందు పరచాలని ఆ మహానటికి ఉందా. నేడు ఆమె జీవితాన్ని గురించి పంచాయితీ పెట్టి ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు చెపుతున్నారు. తప్పు సావిత్రిదే. ఎంత హాస్యాస్పదమైన వ్యాఖ్య. ఒక మనిషి గురించి ఎవరికైన ఎంత తెలుస్తుంది. మనిషి గతించిన నాలుగుదశాబ్ధాల తర్వాత ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం. పూలదండలో దారం దాగుందని తెలుసు, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా? అని ఆనాడే ఆచార్య ఆత్రేయగారు ప్రశ్నించారు. ఆ మహానటి మనసులో ఎన్ని బడబాగ్నులు దాగున్నాయో ఎవరికి తెలుసు. అయినా అందరూ ఆమె జీవితాన్ని చదివి ఉత్తీర్ణులైన నిష్ణాతులే. ఆమె గురించి తీర్పునివ్వగల న్యాయమూర్తులే.

ఇక సామాజిక మాధ్యమాల్లో రోజుకో కొత్త పుకారు షికార్లు కొట్టించి, ప్రాచుర్యం పొందే వారి సంగతి చెప్పనక్కర్లేదు. మీకీ విషయం తెలుసా? మహానటి సావిత్రి సీక్రెట్స్. మహానటైనా కష్టాలు తప్పలేదు. మహానటి సినిమాలో తప్పులు. మహానటి జీవితం గురించి మీకు తెలియని రహస్యాలు. సావిత్రిగారు కోమాలోకి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనలివే. సావిత్రి చివరి క్షణాలు ఎంత దారుణమో? సావిత్రి గురించి తెలిస్తే షాక్. మహానటి జీవితం గురించి మరికొన్ని నిజాలు. మహానటి రెమ్యునరేషన్ ఎంత తీసుకునేదో తెలుసా?సావిత్రి గురించి అడిగితే మేము చెప్పమా అన్న రమాప్రభ. మా అమ్మ గురించి తప్పుగా చూపించారంటున్న రేఖ. జెమినీ మంచివాడే, సావిత్రే? సావిత్రి జీవితలో విలన్లు వీళ్లే. మహానటి నిజస్వరూపం. మహానటి జీవితంలో చీకటి కోణం. ఆఖరికి మహానటి సావిత్రి కులం ఏది? ఇలా రాసుకుంటూ పోతే అంతంలేదు. యూట్యూబ్ నిండా సావిత్రి జీవితాన్ని చిందరవందన చేసిన వీడియోల మధ్య మౌనంగా ఆ మహానటి నలిగిపోయిందన్నది వాస్తవం.

వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడం మామూలే. కొందరి జీవితాల ను తెరపైకెక్కించడం పరిపాటే. ఆదిశంకరాచార్య, షిరిడీ సాయిబాబా, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, వేమన, పోతన, గాంధీ, భగత్ సింగ్, అంబేద్కర్, ఆంధ్ర కేసరి, ఇలా అనేక వాగ్గేయకారుల, స్వాతంత్ర్య సమరయోధుల, భగవంతుల జీవితాలతో పాటు, ఇటీవల మిల్కాసింగ్, ధోని, అజర్, తెండుల్కర్ లాంటి క్రీడాకారులపై కూడా బయోపిక్ లు వెండి తెరకెక్కాయి. ఇంతకు మునుపే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీపిక్చర్, బాలివుడ్ నటుడు సంజయ్ దత్ బయెపిక్ సంజయ్ తెరకెక్కాయి.

ఈ మహానటి ప్రభావం ఏమోగానీ, ఇప్పుడు ఎన్టీఆర్, కాంతారావు, వైఎస్ఆర్, వివాదాల వర్మ, లక్ష్మ్సీ ఎన్టీఆర్, బ్యాడ్మెంటన్ క్రీడాకారులు పుల్లల గోపీచంద్, సైనా నెహ్వాల్, క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్లు తెరకెక్కనున్నాయన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దురదృష్టవసాత్తు జీవించిన, మరణించిన ఎందరో ప్రముఖులు నేడు బయోపిక్ కథావస్తువులుగా మారనున్నారు. బాక్సాఫీసు దగ్గర విజయం ఒక్కటే బయోపిక్లకు ఆధారామా? కొంత నాటకీయత, కొంత ప్రజాదరణ ఉంటే, ఎవరైనా కథా వస్తువుకాగలరా? అయితే వివాదాస్పద పరిస్థితుల్లో మరణించిన అతిలోకసుందరి శ్రీదేవి పేరు ఇంకా చర్చకు రాకపోవడం ఆశ్చర్యకరమే.

ఒక వ్యక్తి జీవితాధారంగా పుస్తకం రాయాలన్నా, సినిమా తీయాలన్నా ఆ వ్యక్తికంటూ కొన్ని అర్హతలు అవసరంలేదా. సాహిత్యం కూడా ఒక పాత్ర కథానాయుకుడవ్వాలంటే కొన్ని లక్షణాలను ప్రతిపాదించింది. కాని వెండితెరకు ఈ నియమాలేవి వర్తించవు. రాశిగా రాశులు కురస్తాయంటే పొయినోళ్లందరూ కథావస్తువులే, ఉన్నోళ్లు పోయినోళ్ల చేదు గుర్తులే. ఇప్పటికే ఈ విషయం మహానటి నిరూపించింది. బాక్పాఫీస్ దగ్గర ఎంత ఘన విజయం సాధించిందో, సామాజిక మాధ్యమాలలోనూ అంతే పెను తుఫాను రేపింది. సృజనాత్మకతకు, సంస్కారానికి మధ్య ఉన్న ఉల్లిపొర కాగితమంత తేడాని అర్ధం చేసుకోకుండా తమదైన జీవితాన్ని అంగడివీథిలో విక్రయిస్తుంటే, ఆ మహానటే కాదు, ఎవరైనా మౌనంగా రోధించకమానరు. ఒక మనిషి జీవితాన్ని తెరకెక్కించాలనుకొన్న సదరు వ్యక్తులందరూ ఆయా వ్యక్తుల జీవితాన్ని బజారుకీడ్చే హక్కు మనకుంగా అని ఆత్మవిమర్శ చేసుకొని అడుగు వేస్తే మహానుభావులందరికి ఆత్మశాంతి కలుగుతుంది.

సౌమ్యశ్రీ రాళ్లభండి