ప్రియవాణి

ప్రియవాణి
ప్రియవాణి

చరవాణి మధురవాణి మానవుల మహారాణి
ప్రతి ఇంటా వెలిగే యువరాణి
సర్వ ప్రపంచమును నీలో వుంచుకొని
సర్వశక్తి సమన్వితురాలవై
సర్వులను ఆడించి పాలించే నియంతవై
నిరంతరంగా వెలిగే దివ్యవాణివై కొండంత అండవై ఒంటరిలో దిక్కై
తోడుగా వుండే తొబుట్టువై
నిను ఎంచ నేనెంత ఓ చరవాణి
నీ కోసం చాతక పక్షి లాగా ఎదురు తెన్నులు చూసి కన్నులు అలసి సొలసి
నీకై కలవరించి నిన్ను పోగొట్టుకోన్నందున ప్రాణముతప్పి భగవంతుని మ్రొక్కి
నీ కోసం ఉపవాసాలు చేసి నిన్ను దక్కించుకొన్న ఆనందములో
ఉబ్బితబ్బిబ్బై నా పాలిట దైవము నా ముద్దు మొబైల్ అంటూ
కళ్యాణి రాగంలో సరాగాలు తీస్తూ నా చిన్ని ప్రపంచంలో
నీ లీలలు ఇన్నిన్ని కాదు అని నీ వైభవం ఉగ్గడించి వర్ణించ నేనెంత
నోకియా ,బ్లాక్బెర్రీ,యాపిల్, గూగుల్, సాంస్సుంగ్ ల ముద్దు బిడ్డవై
శుక్లపక్ష చంద్రునివలె ఐఫోన్, సాంస్సుంగ్ గాలక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్,హుఅవెఇ
రూపాంతరాలు చెంది ఇంతై,అంతై,ఆకశామంతై, చివరికి మా నెత్తిపై నృత్యం చేసి
పాతాళానికి తొక్కి మ్మమ్మల్ని నీ బానిసల్ని చేసి మా తోనే ఊడిగం చేయించుకొన్న
ఓ చరవాణి నీకిదే మా వందనం.
నా సౌలభ్యం కోసం నిన్ను సృష్టిస్తే నన్నే నెట్టి నా నట్టింట్లో తిష్టేసి నాకు చాటింగులు, మీటింగులు, రేటింగులంటూ కారోనాకంటే భయంకరంగా నన్ను పీడిస్తూ నా కాలాన్ని హరిస్తూ
నన్ను నే మర్చిపోయేట్టు చేసి తాను మాత్రం చిత్రంగా చూస్తోంది, నన్ను పిచ్చి దాన్ని చేస్తోంది.
నా ఉనికినే మార్చేసింది.
ఓ చరవాణి! ఈ కరోనాలో రోనా లేకుండా నేను నా వాళ్ళని ప్రేమగా పలుకరించి సేద తీర్చిన నీకు, నీ ఔదార్యానికి కృతజ్ఞతా బంధుడనై నిరంతర నీ ధ్యాన నిమగ్నుడనై సదా నిన్ను తలచి, వలచి నీకై
పరితపించే ఈనాటి పిచ్చి ప్రజల మోహాంధకార వ్యసనాల మనోజ్ఞారాణి మా హస్త భూషణమై
అందరిని అలరించే నిరంతరవాణి ప్రియవాణి చరవాణి నమో నమః

దేవులపల్లి శేష భార్గవి

WhatsApp