పట్టణాలపై కోవిడ్ ప్రభావం

పట్టణాలపై కోవిడ్ ప్రభావం
పట్టణాలపై కోవిడ్ ప్రభావం

దేశంలో కోవిడ్ విలయతాండవం అనేక మౌళిక సదుపాయాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తి చూపింది. ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవడమనేది పక్కన పెడితే దేశంలోని పలు పట్టణాలలో ప్రజల జీవనవిధానం, వసతులు, రోజువారీ గమనం మారుతున్న జీవన ప్రమాణాలను మన కళ్ల ఎదుట నిలబెట్టింది. ప్రపంచంలో సగం జనాభా పట్టణాలలోనే నివసిస్తున్నారు. మన దేశంలో 70శాతం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) పట్టణాల నుంచే జరుగుతోంది. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు అన్న మాటలు నేడు నీటిమూటలవుతున్నాయి. పట్టణాలకు ఎగబడుతున్నవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. నిమిషానికి సుమారు 25 నుంచి 30 మంది పట్టణాలకు వలసపోతున్నారు. దాదాపు 31శాతం దేశ జనాభా పట్టణాలలోనే నివసిస్తున్నారు. దీంతో పట్టణాలలో జనసాంద్రత పెరిగి మౌళిక సదుపాయాలు కరువవుతున్నాయి. జీవన ప్రమాణాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ లాంటి మహమ్మారి కనుక తలెత్తితే, ప్రజాజీవనం చిందరవందరే.

ఇదివరలో కూడా ప్లేగు, కలరా, స్పానిష్ ఫ్లూ లాంటి వ్యాధులు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయి. 1964లో పశ్చిమ బెంగాల్ లోని కోలకత్తాలో కలరా విజృంభణ, 90వ దశకంలో గుజరాత్ లోని సూరత్ లో వ్యాపించిన ప్లేగు వ్యాధి, ఇలా ప్రతీ ఒక్క అంటురోగం ప్రబలడానికి ముఖ్య కారణం, వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులతోపాటు ఆయా పట్టణాలలో కొరవడిన మురుగు నీటి పారుదల వ్యవస్థ, నీటి కాలుష్యం. దీనికి తోడు పెరుగుతున్న జనసాంద్రత, తగ్గుతున్న బహిరంగ ప్రదేశాలు, నివాస స్థలాలు అంటురోగాలకి ముఖ్యకారాణాలవుతున్నాయి. మాకిన్సీ గ్లోబల్ సంస్థ లెక్కల పక్రారం 2010లో మనదేశంలో కనీసం 1.7కోట్లమంది జనాభా మరికివాడలలో నివసిస్తున్నారు. సరైన పట్టణ ప్రణాళికలు లేకపోవడం, ప్రజలలో ఆర్ధిక వైవిధ్యం ఈ మురికివాడలు పెరగడానికి దోహదపడుతున్నాయని ఆ సంస్థ పేర్కోంది. అందువల్లే నేటి కోవిడ్ ప్రభావం ప్రజలందరిపై ఒక్కలాగా లేదు.

దురదృష్టవశాత్తు మనం గతం నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు. గతంలో చేసిన తప్పులనే పునారావృత్తం చేస్తుంటే పరిస్థితులు మారే అవకాశమూలేదు. సరైన పట్టణ ప్రణాళికలు లేకపోవటం వల్ల పరిశుభ్రమైన గాలి, వెలుతురు, నీరు కొరవడుతున్నాయి. తగినంతగా బహిరంగ ప్రదేశాలు లేకపోవటంతో జనాలతో కిక్కిరిసిన వీధులు, ప్రభుత్వ ఆసుప్రతులలో నాణ్యతా లోపం, ప్రజారవాణా వ్యవస్థలో లోటుపాట్లు, పెరుగుతున్న జానాభాకనుగుణంగా ఇళ్ల సదుపాయాలు లేకపోవడం కోవిడ్ సమయంలో పట్టణ ప్రజలు సామాజిక దూరం పాటించే అవకాశం లేకుండా చేసిందని ప్రపంచ ఆర్ధిక సంఘం వెలువర్చిన ఒక అధ్యయనంలో పేర్కొంది. రెండోశ్రేణి, మూడోశ్రేణి పట్టణాలను నిర్మించి పట్టణాలలో జనసాంద్రతను తగ్గించేందుకు ప్రభుత్యం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇక మిగిలిందల్లా ఫ్లోర్ స్పేస్ సూచికను పెంచి ఆకాశహార్మ్యాలు నిర్మించమే మార్గం కావచ్చని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

ఈ కోవిడ్ వల్ల పట్టణాలలో తలెత్తిన మరో సమస్య నిర్మాణరంగంలో కార్మికుల కొరత. కోవిడ్ అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో, పట్టణాలలో ఉన్న వలసకార్మికులంతా తమ గ్రామాల వైపు ప్రయాణం కట్టారు. దీంతో గృహనిర్మాణాలకు, ఇతర కట్టడాలకు తగినంతగా పనివారు లేక ఈ రంగం విలవిలలాడింది. దీనికితోడు అద్దెఇళ్లకు డిమాండ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. వలసకార్మికులు తిరిగి పట్టణాలకు చేరుతారో, చేరరో, ఒక వేళ వస్తే, ఎప్పటికి వస్తారో నేడున్న పరిస్థితిలో చెప్పటం కష్టం. ఈ స్థితిలో నిర్మాణ రంగం భవిష్యత్తు అగమ్యగోచరం.

కోవిడ్ ప్రభావం రవాణ వ్యవస్థ మీద కూడా విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదివరలో ప్రభుత్వ రవాణా సౌకర్యాలను ఉపయోగించిన వారిలో కనీసం 36శాతం మంది తమ స్వంత వాహనాలను గాని, ప్రైవేట్ వాహనాలను గాని వినియోగించవచ్చని ఒక సర్వేలో తేలింది. అదే కనుక జరిగితే ఇప్పటికే పట్టణాలలో అరకోరగా ఉన్న రోడ్లపై మరిన్ని వాహనాలు చేరి రద్దీలను విపరీతంగా పెంచుతాయి. 2019లో టామ్ టామ్ ప్రయాణ సూచిక ప్రకారం ప్రపంచంలో అతిరద్దీయైన పది పట్టణాలలో మనదేశంలోని నాలుగు పట్టణాలున్నాయి. వీటిలో బెంగుళూరు మొదటిస్థానంలో ఉండగా, ముంబాయి నాలుగోవ స్థానం, పూణే ఐదు, న్యూఢిల్లీ ఎనిమిదవ స్థానాల్లో ఉన్నాయి. ఇంటి నుంచి పని చేయటం, సామాజిక దూరం పాటింపు, లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పటికే రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. ప్రైవేట్ వాహన సంస్థలో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంస్థలో పనిచేసే అనేకమంది గ్రామాలకు వెళ్లిపోయారు. రవాణా వ్యవస్థను పునఃరుద్దరించాలంటే ప్రభుత్వానికి ఒక సవాలే. ప్రతీవారు స్వంత వాహనాలు బయటకు తీస్తే, రోడ్లపై రద్దీ అంటుంచి, వాయు కాలుష్యం పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పట్టణాలలో స్వచ్ఛమైన గాలి కరువైన తరుణంలో వాయు కాలుష్యం మరిన్ని రోగాలకు దారితీయకపోదు.

ఈ సమస్యలన్నీ ఒక ఎత్తైతే, ఆరోగ్యం, ఆసుపత్రి సదుపాయాలలో లోపాలను కోవిడ్ మన కళ్లెదుటే నిలబెట్టింది. కోవిడ్ సమయంలో పట్టణాలలో ఆసుపత్రి వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రపంచంలోని మొదటి పది వాయు కాలుష్యం గల పట్టణాలలో ఆరు మనదేశంలోనే ఉండటం విషాదకరం కాగా న్యూఢిల్లీ వీటిల్లో ముందుంది. పెద్దపట్టణాలే కాదు కాన్పూర్, పాట్నా వంటి చిన్నస్థాయి పట్టణాలలో రోడ్లపై రద్దీతో కాలుష్యం పెరిగిపోతోంది. గ్రామాలలో కూడా ఈ పోకడ కన్పిస్తోంది. దీని వల్ల గత 25 సంవత్సరాలలో శ్వాససంబంధ వ్యాధులు దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. కోవిడ్ లాంటి అంటువ్యాధులు ఇలాగే ప్రబలుతుంటే ఆసుపత్రులపై కనీసం 70 నుంచి 80శాతం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ల కొరత, బెడ్ల, మందుల కొరత తీర్చడానికి తగినన్ని ఆర్ధిక వనరులు లేక ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఒక అధ్యయనంలో తేలింది.

పైన పేర్కోన్న సమస్యలన్నీ, అందరికి కన్పించేవి. నివురు గప్పిన నిప్పులా మన సమాజంలో దావాలా వ్యాపిస్తున్న సమస్య గృహహింస, పెరుగుతున్న లింగ వివక్షత. మన దేశంలో 2005తో పోలిస్తే, 2019నాటికి మహిళా కార్మికుల సంఖ్య 37శాతం నుంచి 24శాతంకి తగ్గింది. కోవిడ్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారిలో కూడా మహిళే ఎక్కువగా ఉన్నారు. ఇంటి నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించటం వల్ల, ఉద్యోగినులపై ఇంటి, పిల్లల ఆలనపాలనతో ఒత్తిడి మరింత పెరిగింది. అలాగే పురుషులకు, స్త్రీలకు మధ్య వేతనాలలో దూరం కూడా పెరిగిపోయింది.

ఇలా ఒక్కటేంటి, మానవ సంబంధిత అన్ని వ్యవస్థలపైనా, బంధాలపైన, సమాజంపైన కోవిడ్ కొరడా ఝళిపించింది. ఇప్పటికైనా మనం కళ్లు తెరచి, రవాణా, ఆరోగ్య, గృహ రంగాలలో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చకోకపోతే ఇప్పటికే దెబ్బతిన్న పర్యావరణం మనపై కన్నెర చేయకమానదు. అప్పుడు ఉత్పన్నమయ్యే మరిన్ని మహమ్మారులను ఎదుర్కోవటం మానవాళికి శక్యంకాదు.

తేటగీతి