నా స్మృతి పథం – 5
కాపీలా? ప్రేరణా?

నా స్మృతి పథం – 5 <br> కాపీలా? ప్రేరణా?
నా స్మృతి పథం – 5
కాపీలా? ప్రేరణా?

గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు సినిమా తాను 2012లో స్వాతి పత్రికకు రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’కు కాపీ అని ఆ నవల రచయిత శరత్ చంద్ర దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్ కేసు ధాఖలు చేసిన వివాదం పత్రికలలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివాదం ఎలా పరిష్కరించబడుతుంది అనేదాన్ని కొంచెం సేపు పక్కన పెడదాం. ఈ సినిమాయే మొదటిసారి ఇలా కాపీ చేసిన కథతో నిర్మించబడిందా? అంటే లేదనే చెప్పాలి. కాపీ మా జన్మ హక్కు అన్నట్టు విచ్ఛల విడిగా ఇతరుల మేథా సంపత్తును కొల్లగొట్టడం ఈ కాలంలో చాలా మామూలు విషయం అయిపోయింది. కాకపోతే ఇప్పడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదిగా మారి, ప్రతి మనిషి చేతిలోనూ ఇమిడిపోయింది. పుస్తకాలు, సినిమాలు భాషా ప్రమేయం లేకుండా అందరికి అందుబాటులోకి వచ్చి చేరాయి. దీంతో ఏ పాట, ఏ మాట ఎక్కడి నుంచి కాపీ కొట్టబడ్డాయో అందరికి తేటతెల్లమవుతున్నాయి. ఏదైనా పుస్తకాన్ని మరో భాషలోకి తర్జుమా చేస్తుంటే, ఆయా రచయితలను సంప్రదించి అనుమతి పొందటం పరిపాటి. కానీ ప్రేరణకు అలాంటి ఇబ్బందులేమి ఉండవు. హక్కులు, అనుమతలు దరి చేరవు. ఆ ప్రేరణ బయట పడినప్పుడు, సదరు రచయిత ముందుకొచ్చి మాట్లాడినప్పుడే వివాదాలకు తావి నిస్తాయి.

నిజానికి కాపీ, ప్రేరణ కొత్తేమి కావు. నేను చాలాకాలం క్రితం యండమూరి ప్రార్థన నవల చదవినప్పుడు అది నాకు రాబర్ట్ కుక్ నవల ‘ఫీవర్’కు ప్రేరణ అని తెలియదు. తర్వాత కాలంలో కుక్ నవల చదువుతున్నప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. భూమికి అటు పక్కన రాసిన నవలకు, ఈ నవల ప్రేరణ అని సగటు తెలుగు పాఠకునికి తెలిసే అవకాశం రెండు, మూడు దశాబ్ధాల క్రితం లేదు. అంతెందుకు ఇటీవల కాలంలో గ్రేట్ రాజమౌళి తీసిన ‘ఈగ’, ల్యూక్ ఈవ్ తీసిన ‘కాక్రోచ్’ సినిమా ప్రేరణతో తీసినదే. ఈ సినిమా అంత ప్రాచుర్యాన్ని పొందక పోవడం వల్ల జనం దృష్టిలో అంతగా పడి ఉండదు. ఈ సినిమా 2010లో విడుదలయ్యింది. కావాలంటే, అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూడవచ్చు. రాజమౌళి తండ్రిగారు విజయేంద్రప్రసాద్ గారు చాలా ఇంటర్వ్యూల్లో తాను అనేక చిత్రాల ప్రేరణతో కథలు రాస్తాను అని చెప్పుకోవడం వల్ల కాబోలు జనాలు అంతగా రాజమౌళి చిత్రాలను పట్టించుకోవట్లేదు. 1972లో గుల్జార్ తీసిన ‘పరిచయ్’ సినిమా ఎవరికైనా గుర్తుందా. సరిగ్గా చూస్తే, ఈ సినిమా ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ సినిమాకు ప్రేరణ అని చాలా సులువుగానే అర్థమవుతుంది. ఇక భారతీయ చలన చిత్ర చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోయిన ‘షోలే’ సినిమాలో చాలా సన్నివేశాలు హాలీవుడ్ సినిమా ‘వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ది వెస్ట్’ సినిమా ప్రేరణతో రూపొందించినవి కాగా, మూల కథ మరో హాలివుడ్ సినిమా ‘మాగ్నిఫిషెంట్ సెవన్’ కి కాపీ అనచ్చు లేదా ప్రేరణగా చెప్పుకోవచ్చు.

నవలలు మన సినిమాలకు ఆధారభూతాలైతే, అనేక నాటకాల ప్రేరణతో కూడా సినిమాలు తెరకెక్కాయి. ఇటీవలే విడుదలైన ‘రంగమార్తాండ’ అందుకు ఉదాహరణ. మరాఠీ రచయిత విష్ణు వామన్ శిర్వాద్కర్ రాసిన ‘నటసామ్రాట్’ అనే నాటికను అదే పేరుతో తీసిన మరాఠీలో సినిమాకు కాపీ. నా చిన్నప్పుడు నెమలికంటి తారకరామారావుగారు రాసిన నాటకం ‘మహాప్రస్థానం’ అనే నాటికకు మా నాన్నాగారు దర్శకత్వం వహించి దాదాపు 100 సార్లకు పైగా ఆంధ్రదేశం నలుమూలలా ప్రదర్శించారు. అందులో మూల పాత్ర లాయరు. ఆ పాత్రను మా నాన్నగారు పోషించేవారు. మా నాన్నగారు వేసిన అనేక పాత్రల్లో నాకు బాగా నచ్చిన పాత్ర అది. నేను చాలాసార్లు చూడటం వల్ల ఆ నాటకం నాకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత కాలంలో నందమూరి తారకరామారావుగారు నటించి, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘జస్టిస్ చౌదర చిత్రాన్ని మొదటిసారి చూసినప్పుడు ఈ సినిమా ఆ నాటకానికి కాపీ అని నా చిన్ని మనసుకి అప్పట్లో అన్పించింది. కాకపోతే, ఆ చిత్రం శివాజీ గణేశన్ నటించిన ‘నీతిపతి’కి రీమేక్ అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి కాపీ చేశారో, ప్రేరణ పొందారో చెప్పటం కష్టం.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, కాపీలు, రీమేక్ లు, ప్రేరణలు సాహితీ రంగంలో, సినిమా ప్రపంచంలోనూ కొత్తేమి కాదు. ఒకప్పుడు వీటి జోరు మరీ ఎక్కువగా ఉండేవి. మారుతున్న కాలంలో ఉత్తర, దక్షిణాల సరిహద్దులు చెరగి, నేడు పాన్ ఇండియా పేరుతో అన్ని సినిమాలను దేశమంతటా విడుదల చేస్తున్నారు. ఓటిటి పుణ్యమా అని అలా దేశ, విదేశాల్లో విడుదలకాలేకపోయిన సినిమాలు ఓటిటిలలో ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూసుకునే విధంగా డబ్ చేస్తున్నారు. నేను జర్నలిజంలో చేరిన కొత్తలో ఆఫీసుకి మాత్రమే పరిమితమైన కాలంలో ఈ కాపీలు, రీమేక్ భాగోతం మీద ఒక చిన్న వ్యాసాన్ని రాశాను. ఈ సందర్భంగా వార్త దినపత్రికలో సెప్టెంబర్ 26, 1996లో సినిమా పేజీలో ప్రచురితమైన ఈ వ్యాసం మీకోసం…

కాపీలో రీమేక్ కూడా భాగమే

వెలుగుజిలుగుల సినీ ప్రపంచంలో ప్రతి కలదలిక ఒక కొత్త పోకడే. వీటిలో భాగమే ‘రీమేక్’, ‘డబ్బింగ్’ చిత్రాలు. ఈ ప్ర్రక్రియలు కొత్తవి అంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు. నిజం. ఈ ప్ర్రక్రియలు ఇంతకు ముందు లేవని కావు. కాకపోతే ప్రస్తుతం ఈ ‘స్ఫూర్తి’ వెల్లువ ఉధృతంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. సినిమాలు ప్రారంభమైననాటి నుంచి నేటి వరకు అనేక రీమేక్ చిత్రాలు వెలవడ్డాయి. వీటితోపాతే డబ్బింగ్ చిత్రాలు కూడా. ఇదివరకు అన్య భాషల్లో హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేయటం పరిపాటైతే, నేడు డబ్బింగ్ చిత్రాల హోరు పెరిగింది. స్పీల్బర్గ్ ‘జ్యురాసిక పార్క్’ని తెలుగులోనో, హిందీలోనో మరో భాషలోనో ఎవరు అంత గొప్పగా రీమేక్ చేయలేరు. అందుకే వీటిని డబ్ చేసి యధాతధంగా ప్రేక్షకులకిందిస్తున్నారు. జ్యురాసిక్ పార్క్ విజయం మరిన్ని హాలివుడ్ చిత్రాలను డబ్ చేయడానికి ప్రేరేపించాయి. ఉదాహరణకు సిల్వస్టర్ స్టాలిన్ నటించిన ‘స్పెషలిస్ట్’, ‘క్లిఫాంగర్’లతో పాటు ‘స్పీడ్’, ‘బేబ్సీ డే అవుట్’ ఇలా ఎన్నో చిత్రాలు. అయితే ఈ డబ్బింగ్ చిత్రాలన్ని చెప్పుకోదడ్గ విజయం సాధించలేదు. దీంతో ఈ వెల్లువకు అడ్డుపడింది. తిరిగి రీమేక్ చిత్రాలు మొదలయ్యాయి.

దక్షిణ భారత భాషల నుంచి హిందీ తదితర బాషల్లోకి అక్కడి నుంచి మన దక్షిణాదికి చిత్రాలు రీమేక్ కావటం కొత్తకాదు. కానీ హాలీవుడ చిత్రాలను రీమేక్ చేయటం, తప్పు, తప్పు స్ఫూర్తిని పొందటం ఈ మధ్య ఎక్కువైంది. వీటిలో అగ్రతాంబూలం ‘స్లీపింగ్ విత్ ది ఎనిమీ’, ‘ఇన్ డీసెంట్ ప్రొప్రోజల్’ చిత్రాలది. ఈ రెండు చిత్రాలాధారంగా ఇప్పటకి కనీసం రెండు డజన్ల సినిమాలు విడుదలయ్యాయి. ఒకే చిత్రం ద్వారా ఇన్ స్పైర్ అయి దర్శక, నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. వీరిలో కొందరు అదృష్టవంతుల సినిమాలు హిట్ అవటంతో మరో కొద్దిమంది దురదృష్టవంతులకి మార్గదర్శకత్వం చూపుతున్నాయి. ఉదాహరణకు ‘స్లీపింగ్ విత్ ది ఎనిమీ’ చిత్రం ఆధారంగా నిర్మితమైన హిందీ చిత్రం ‘అగ్నిసాక్షి’ సూపర్ హిట్ కాగా, అదే చిత్రం ఆధారంగా మాధురితో రూపొందిన ‘యారానా’ సూపర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ‘ఆర్ యా పార్’ తదితర సినిమాలు రాబోతున్నాయి. ఒకే చిత్రానికి ఇన్ని స్ఫూర్తిదాయక చిత్రాలా అని ఆశ్చర్యపోకండి. ఇది ఒక్క ఈ సినిమాకే పరిమితం కాదు. ‘ఇన్ డీసెంట్ ప్రొప్రోజల్’ చిత్రం ఆధారంగా కూడా హిందీలో రెండు, మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘సౌదా’ వీటిల్లో ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్న విషయం పాఠకులకు చెప్పనక్కర్లేదు. ఇక అదే సినిమా ఆధారంగా తెలుగులో నిర్మితమైన ‘శుభలగ్నం’ ఘన విజయాన్ని సాధించింది. ఎవరి అదృష్టం వారిది. అయితే ఇపుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారన్నది గమనార్హం. ఇంతకి ఈ దర్శక, నిర్మాతలు హాలీవుడ్ సినిమాతో స్ఫూర్తి నొందారా లేక తెలుగు సినిమా విజయంతోనా అన్నది వారి, వారి, బుద్ధి కుశలతకే వదిలేద్దాం.

ఇదే కోవలో ఇటీవల నిర్మతమైన మరికొన్ని సినిమాలను చూద్దాం. జాకీ చాన్ ‘ట్విన్స్’ తెలుగులో నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’గా తర్జుమా కాగా, ‘బేబ్సీ డే అవుట్’ ‘సిసింద్రీ’గా ‘ఫ్యుజిటివ్’ ‘క్రిమినల్’గా, ‘అన్ లాఫుల్ ఎంట్రీ’ ‘ఫరేబ్’గా ఇలా చెప్పుకుంటూపోతే అనేకం ఉన్నాయి. ఇది భాషలకు పరిమితం కాదు. ఒకే భాషలో వచ్చిన సినిమాలకు కూడా రీమేక్ లు చేస్తున్న కాలమిది. అందుకు ‘దిల్ హైకి మాన్తానహి’, ‘రాజు బన్ గయా జెంటిల్ మాన్’ లు నిదర్శనాలు. ఇవి రెండు సినిమాలు రాజ్ కపూర్ ‘చోరీ చోరీ’, ‘శ్రీ 420’ సినిమాలకు మక్కీకి మక్కి తర్జుమాలు. ఈ చిత్రాలను చూశాకైనా కళ ఎల్లప్పుడు స్ఫూర్తి దాయకమేననడంలో సందేహంలేదు.

ఏ మధ్యాహ్నమో, రాత్రో మన తెలుగు యాక్టర్లు హిందీలోనో మరో అర్థంకాని భాషలోనో మాట్లాడుతూ బుల్లితెరపై ప్రత్యక్షమయితే మనం జీర్ణంచుకోగలమా? ఈ నేపథ్యంలో చిత్రాలను రీమేక్ చేస్తేనే బావుంటుందని అనుకోవల్సి వస్తుంది. లేకపోతే గంభీరస్వరం గల మన ఎస్వీ రంగారావు హిందీలో మాట్లాడుతూ ‘సోనీ’ ఛానల్ లో కన్పిస్తే మనం చూడగలమా? అలాగే మన మెగాస్టార్ చిరంజీవి లేక సూపర్ స్టార్ కృష్ణ అర్థంకాని హిందీలో మాట్లాడుతూ ‘జీ’ సినిమా ఛానల్ లో కన్పిస్తే ఇది సాంస్కృతిక సమన్వయం అనుకోవాలో, మరింకేమి అనుకోవాలో అర్థంకాని విషయం అవుతుంది. ఏ హాలీవుడ్ చిత్రమో తెలుగు, హిందీ భాషల్లోకి తర్జుమా అయితే పర్వాలేదు. కాని, ఈ చిత్రాలను పరిశీలించండి. తమిళంలో హిట్ అయిన ‘చిన్న తంబి’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ ను పెట్టి ‘చంటి’, హిందీలో ‘అనాడి’గా తీశారు. కాకపోతే వీటితో స్ఫూర్తినొంది ‘అబ్బాయిగారు’ లాంటి చిత్రాలు వెలువడ్డాయి. ఇక తమిళ ‘మన్నన్’ తెలుగులో ‘ఘరానా మొగుడు’, హిందీలో ‘లాడ్లా’గా, తమిళ ‘నాటమ్’ తెలుగులో ‘పెదరాయుడు’గా ఇలా ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను ఇతర భాషలో నిర్మించటం ఒక ఆనవాయితీగా తయారైంది.

ఒక భాషలో మీరో చిత్రాలను మరో భాషలో మరో హీరోతో నిర్మించటం కూడా ఇందులో భాగమే. ఉదాహరణకు అమితాబ్ చిత్రాలు తెలుగులో ఎన్టీరామారావు (జంజీర్-నిప్పులాంటి మనిషి, దీవార్ – మగాడు), కృష్ణ చిత్రాలు హిందీలో జితేంద్ర (ఊరికి మొనగాడు -హిమ్మత్ వాలా, సింహాసనం)తో నిర్మించటం తెలిసిందే. ఒక్కసారి అన్ని భాషల్లోను చిత్రాను పరికిస్తే, ప్రతి చిత్రం ఏదో ఒక చిత్రానికి ప్రతిరూపంగానే కన్పిస్తుంది. ఈ రీమేక్, డబ్బింగ్ చిత్రాల నడుమ మాతృక సినిమాలు కొట్టుకుపోతున్నాయి. చిత్రాల ఇతివృత్తాలతో స్ఫూర్తిపొంది సినిమాలు నిర్మిస్తే తప్పులేదు. కాని, రీమేక్ పేరుతో ‘ఫ్రేమ్ టు ఫ్రేమ్’, డైలాగులు, పాటలు, మాటలు, దుస్తులు, ఆఖరికి హెయిర్ స్టైల్ నుంచి ప్రతి ఒక్క అంశాన్ని అనుకరించటం ఎంత వరకు సబబు. ఉదాహరణకు క్రిమినల్ చిత్రాన్నే తీసుకుంటే ఫ్యుజిటివ్ చిత్రంలో పోలీసుల నుంచి తప్పించుకున్న హీరో పెరిగిన గెడ్డాన్ని కత్తిరించుకోవటం, తల దువ్వుకోవడం దృశ్యాలు పరిశీలిస్తే మన తెలుగులో నాగార్జున కూడా అదేవిధంగా మధ్య పాపిడి తీసి పైకి దువ్వుకుంటాడు. ఇది ఒక్క మచ్చుతునక మాత్రమే. ఇలాంటి అనుకరణ ప్రతి రీమేక్ చిత్రంలోనూ ఉంటాయి. అది ఏ భాషా చిత్రమైనా సరే. ఇలా అనుకరించేటప్పుడు మళ్లీ కోట్లు ఖర్చుపెట్టి ప్రత్యేకంగా చిత్రాలను తీయటం ఎందుకు. మూడు, నాలుగు పాటలు ఆ చిత్రాల్లో ఇరికించి నేరుగా విడుదల చేస్తే సరిపోతుంది కదా. కనీసం పాతకాలం నిర్మాతలే మేలు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో కొద్దిమంది మెయిన్ ఆర్టిస్టులని మార్చి తీసేవారు. వారికి తమ సినిమాలపై నమ్మకమైనా ఉండేది. ముందు ఒక భాషలో తీసి అది విజయం సాధిస్తే మరో భాషలో తీయటం కాక మంచి కుటుంబ చిత్రాలను ఏకకాలంలో తీసేవారు. కాని ఇపుడు రిస్క్ తీసుకోకుండా హిట్ అయిన చిత్రాలను మాత్రమే పునర్నిర్మిస్తున్నారు. దీని వల్ల చిత్రం హిట్ అయ్యే అవకాశాలు పెరిగాయా అంటే అది మళ్లీ నిర్మాతల అదృష్టానికే వదిలివేయాల్సి వస్తుంది.

ఏదిఏమైనప్పటికీ, 64 కళలలో ‘రీమేక్’ను కూడా చేర్చవల్సిన సమయం ఆసన్నమయింది. అనుకరణ చాలా కష్టసాధ్యమయిన కళ. అది మన సినీ దర్శక, నిర్మాతలకు కరతళామలకం కావటం విశేషం. మన అదృష్టం?

సౌమ్యశ్రీ రాళ్లభండి