నా స్మృతి పథం – 4
వార్తలో నా మొదటి రచన

నా స్మృతి పథం – 4 <br> వార్తలో నా మొదటి రచన
నా స్మృతి పథం – 4
వార్తలో నా మొదటి రచన

వార్త దినపత్రిక మొదలు పెట్టడానికి దాదాపు రెండు సంవత్సరాల ముందు నేను హైద్రాబాద్ లో ట్రైనీగా జాయినయ్యాను. విలేకర్లకు, సబ్ ఎడిటర్లకు కంప్యూటర్లను అందించి, కంప్యటర్ ఆపరేటర్లను పూర్తిగా తొలగించటం ద్వారా వార్త సంస్థ పత్రికా రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తెచ్చిందనే చెప్పాలి. అప్పటికి ఇంకా పత్రికలలో విలేకర్లు ముఖ్యంగా ప్రాంతీయ దినపత్రికల్లో కంప్యూటర్లను ఉపయోగించటం లేదు. పత్రికల్లో కంప్యూటీకరణ మొదలైంది. విలేకర్లు వార్తలను ఇస్తే, వాటిని ఆపరేటర్లు టైపు చేసి, కంప్యూటర్లపై పేజీలు తయారు చేసేవారు. ఆ పేజీల ప్రింట్లను సబ్ఎడిటర్లు చూసి అచ్చు తప్పులుంటే సరిదిద్దేవారు. కానీ వార్త, సబ్ ఎడిటర్లకే కంప్యూటర్ నేర్పటం ద్వారా ఫ్రూఫ్ రీడర్ల, కంప్యూటర్ టైపిస్టుల విభాగాలను పూర్తిగా తొలగించి వేసింది. ఆపిల్ కంప్యూటర్లను పెద్ద సంఖ్యలో తెప్పించి, ప్రధాన పట్టణాలలోనే కాక, జిల్లాలు, పల్లెలలో కూడా తమ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం ద్వారా వార్తలను వేగంగా ప్రధాన ఎడిషన్ కేంద్రాలకి చేర్చగలిగింది. దాంతోపాటు ముఖ్య కేంద్రంలో హాట్ లైన్ ఏర్పాటు చేసి కేంద్రాల మధ్య సమన్వయం సాధించింది. ఆంగ్ల పత్రికల్లో కంప్యూటర్ వాడుతున్నప్పటికీ, ఇలా ఒక ప్రాంతీయ భాషా పత్రిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించటం మాత్రం నాకు తెలిసి వార్తతోనే మొదలైంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో కేవలం రిపోర్టరే ఉండేవాడు. అతనే సబ్ ఎడిటర్ గా కూడా పనిచేసే వాడు. కంప్యూటర్ లో తెలుగులో టైపు చేయడం, ఫోటోలను ఎడిట్ చేయటం, పేజీలను తయారు చేయటం లాంటి పనులు ట్రైనీలందరికి నేర్పించటం జరిగింది. కేవలం కంప్యూర్ వినియోగం నేర్చుకోవడమే కాకుండా, వార్తలను ఎలా రాయాలి, అనువాదంలో ఎదుర్కోనే సమస్యలు, పత్రిక భాషకు, పామరుల భాషకు వ్యత్యాసం, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై రోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు నడిచేవి. ఉద్యోగంలో చేస్తూ నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ఉద్యోగం మొదలు పెట్టే ముందు అవగాహన పెంచుకోవడం మరో ఎత్తు. ఆ రోజుల్లో మాకు నేర్చుకోవడం కూడా ఒక ఉద్యోగమే. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని శ్రీశ్రీ గారు ప్రశ్నించినట్టు అనుభవం గల పత్రికా విలేకర్లు తర్వాత కాలంలో పత్రికలో జాయిన్ అయ్యారు. కానీ వార్త నిర్మాణానికి అక్షరాలు మోహరించిన కూలీలు మాత్రం మా ట్రైనీలే. మఖ్యంగా మా మొదటి బ్యాచ్ వాళ్లం వార్త బిల్డింగ్ కు శంఖుస్థాపన చేయకముందు నుంచి ఆ సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్నాం. వార్త లోగో ఏ కలర్లో ఉండాలి అన్న ప్రశ్న ఉదయించినప్పడు మా అమూల్యమైన ఓటుతో లోగోకి రంగులు దిద్దింది మేమే.

నేను హైద్రాబాద్ లో జాయిన్ అయినా, పత్రిక బయటకు వచ్చేనాటికి పెళ్లి చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోవల్సి వచ్చింది. అప్పుడు మా ఎడిటర్ ఎబికె ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లి శుభలేఖతోపాటు, రాజీనామా పత్రం కూడా ఇవ్వడంతో. ఏం పెళ్లయ్యాక అబ్బాయి ఉద్యోగం చేయద్దన్నాడా? అని ప్రశ్నించారు. అదేం లేదు సార్ నేను ఢిల్లీ వెళ్లిపోతున్నాను అనగానే, మనకి ఢిల్లీలో సెంటర్ ఉంది కదా? ఎవరిని పంపాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వయితే మరీ మంచిది. నీలాంటి చాకులాంటి అమ్మాయి అలాంటి సెంటర్ ఉంటే ఇబ్బంది ఉండదని రాజీనామా పత్రం చించి బుట్టలో వేసి, శుభలేఖ మీద పోస్టెడ్ టు ఢిల్లీ అని రాసుకున్నారు. అలా నేను ఢిల్లీ వార్తకు చేరుకున్నాను.

వార్త దిన పత్రికలో నా మొదటి రచన అని చెప్పి ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో తేలానేంటి అని కంగారు పడకండి. మనసు కోతి. కుప్పింగతులు వేయకపోతే దాని ఆరాటనం తీరదు మరి. నిజ జీవితంలో పెళ్లి పేరుతో తెలియని మనిషితో సహగమనం, ఢిల్లీ నగరం, ఆఫీసులో మనుష్యులు అన్నీ కొత్తే. సబ్-ఎడిటర్ ఉద్యోగం కనుక ఆఫీసుకు అంటిపెట్టుకు ఉండాలి గాని, బయటకు వెళ్లి వార్తలు సేకరించటం మన పని కాదు. అందువల్ల చేతిలో బోళ్లంత సమయం ఉండేది. ఆఫీసు నిండా పత్రికలుండేవి. ఏదైన వార్త ప్రేరేపిస్తే మస్తికంలో మెదలిన ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వటమే మన ఉద్యోగం. అలా ఇచ్చిన అక్షరరూపమే ఈ కింది వ్యాసం. ఈ వ్యాసానికి వెనక, ముందు కథా కమామీషులు ఏమీ లేవు. కాకపోతే, కొత్త పత్రిక అవటంతో ప్రతిరోజు వ్యాసాలతో పేజీలు నింపటం ఇన్ ఛార్జీలకు కష్టమయ్యేది. అలాంటప్పుడు ఇలా రాసిన ప్రతీ వ్యాసం ముద్రణకు నోచుకునేది. అంటే నేను బాగా రాయలేదని కాదు. ఇందులో నా అనుభవరాహిత్యం, పరిణితి చెందని ఆలోచనలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. నేడు రాయాల్సి వస్తే ఈ వ్యాసాన్ని ఇలాగే రాస్తానా అంటే, ఏమో చెప్పలేను. తప్పకుండా నా పాళీ రాటుదేలి, పదునుగా మాటలు పడేవి. ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం చేయకుండా, సినిమా సమాజం మీద ప్రభావం చూపుతుందని ఖశ్చితంగా చెప్పుండేదాన్ని. ముఖ్యంగా, ఇటీవల విడుదలైన సలార్, యానిమల్, పుష్ప, కెజిఎఫ్, డెవిల్, లియో, జైలర్ ఇలా చెప్పుకుంటూ పోతో అనేక సినిమాల్లో చూపిస్తున్న అర్థరహిత హింస, తలలు నరకడం, నెత్తురు కాలువలు కట్టించటం, బలం ఉన్నవాడిదే రాజ్యం అని చాటేయ్యడం, అది నిజమే అనుకుని తేలికగా తీసుకునే మనస్తత్వాన్ని ప్రజలు అలవర్చుకోవడం చూస్తుంటే ఒంటికి కారం పూసుకున్నట్టుంటుంది. దాదాపు రెండు దశాబ్ధాలు కావస్తున్నా, ఈ ప్రశ్న, ప్రశ్నగానే మిగిలిపోవడం, మన సినిమాల పోకడలలో మార్పులు రాకపోగా, మరింత హంసాయుతంగా మారడం చూస్తుంటే, ఎటుపోతోంది ఈ మానవ సమాజం అని అనుకోవాల్సి వస్తోంది. ఇటీవల ప్రముఖ గేయ, మాటల రచయిత జావిద్ అక్తర్ యానిమల్ సినిమా సమాజానికి ప్రమాదకరం అని చేసిన వ్యాఖ్యలు మరోసారి సినిమా సమాజంపై ఎటువంటి ప్రభావం చూపుతోంది, చూపిస్తోంది అన్న దానిపై చర్చించాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి.

ఇవన్నీ పక్కకు పెడితే, ఈ వ్యాసం చదివి మీరేమైనా ఈ ప్రశ్నకు సమాధానమివ్వగలిగితే, కింద కామెంట్ పోస్ట్ చేయండి.

సినిమా సమాజంపై ప్రభావం చూపేనా?

చలనచిత్రం పుట్టి ఇప్పటికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. నేటికి కూడా దానిలోని కొత్తదనం సమసిపోలేదనే చెప్పవచ్చు. నిజజీవితోంని సమస్యల వలయం నుంచి వేదనల నుంచి తాత్కాలికంగా ప్రేక్షకులకు విముక్తిని కలిగించే సాధనం సినిమా. మొట్టమొదటి నుంచి సినిమా మానసిక ఉల్లాసాన్ని, వినోదాన్ని అందించడానికి మాత్రమే ఉపయోగపడుతూ, అశేష ప్రజానీకం అభిమానం పొందుతూ వచ్చింది, వస్తోంది. సినిమా అభూత కల్పనలకే కాదు సమాజానికి దర్పణం కూడా. ఇది ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేయగలదు. అయితే సినిమా సమా.లో మార్పును తేగలదా అన్నది మాత్రం ఇతిమిద్ధంగా ఎవ్వరు స్పష్టపరచలేని విషయం. ఏది ఏమైనప్పటికీ సినిమాని సాధనంగా చేసుకుని సమాజంలోని అత్యాచారాలను, అవినీతిని ఎందరో చూపడానికి ప్రయత్నించారు. సామాజిక, మానవత్వ, నైతిక విలువల గురించి చర్చించారు. అలాంటి ఎన్నెన్నో సినిమాలు ప్రజల, విమర్శకుల మన్ననలను కూడా పొందాయి. అయినా ఈ నాటికి కూడా సినిమా ప్రజలలో చైతన్యం తీసుకురాగలదని విశ్వాసంతో చెప్పేవారు, నమ్మేవారు కూడా కరువే. సత్యజిత్ రాయ్ లాంటి ప్రముఖ దర్శకుడు కూడా సినిమా సమాజాన్ని ప్రభావితం చేయగలదన్న ఆలోచనతో ఏకీభవించలేకపోయాడు. సమాజ స్థితిగతులకు అద్ధంపట్టే ‘పథేర్ పాంచాలి’, ‘దేవీ’ లాంటి సినిమాలను నిర్మించిన ఆయన సమాజంలో మార్పును తీసుకురావడం సినిమా ద్వారా సాధ్యంకాదన్న అభిప్రాయం కలిగి ఉండటం శోచనీయం.

సినిమాలు రూపొందడం మొదలైన కొత్తలోనే హరిజనోద్ధరణ ఇతివృత్తంగా గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘మాలపిల్ల’, విధవా పునర్వివాహ ఇతివృత్తంగా బిఎన్.రెడ్డి తీసిన ‘సుమంగళి’, సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అవుతూ ప్రజలను మభ్యపెట్టే విద్రోహుల ఇతివృత్తంగా కె.వి.రెడ్డి తీసిన ‘పెద్ద మనుషులు’ మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశమంతటా అన్ని భాషల్లోనూ ఆయా సమాజాలకి దర్పణం పట్టే సినిమాలు వచ్చాయి. ఉదాహరణకి బిమల్ రాయ్ ‘దో భీగా జమీన్,’ బొంబే టాకీస్ ‘అచ్యుత్ కన్య’, వి. శాంతారాం ‘దో ఆంఖే బారా హాత్’ ఆయా కాలాల్లో ప్రజల ఆదరణ పొందిన సినిమాలు. ఇవే కాక, రాజ్ కపూర్ ‘ఆవారా’, ‘శ్రీ 420’లు ధనిక, పేద వర్గాల మధ్య ఘర్షణలను చూపాయి. ప్రతి సినిమా సమాజంలోని ఏదో ఒక దురాచారాన్ని ఎత్తి చూపాయి. సమాజంలోని లోటుపాట్లను ప్రజల ముందుంచాయి. బాల్య వివాహాలు రూపుమాసినా, హరిజనోద్ధరణ, వితంతు వివాహాలు జరుగుతున్నా ఇవన్నీ సినిమా తెచ్చిన మార్పులు కాదు. సమాజంలో ఏర్పడిన అనేక ఆర్ధిక, రాజకీయ, సామాజిక మార్పేలే కారణం. అయితే ఈ దురాచారాలు పూర్తిగా సమసిపోయాయని మాత్రం చెప్పలేం. ఇప్పటికీ బాల్యవివాహాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. వితంతు వివాహాలు ప్రజల ఆదరణకి పూర్తిగా నోచుకోవట్లేదు. ఇంకా హరిజనులు, వెనుకబడ్డ కులాలు, తెగలు అంటూ సమాజంలో విభజనలున్నాయి. అనాదిగా వస్తున్న దురాచారాలను కూకటవేళ్లతో పెకలించటం ఒక రోజుతో అయ్యే పనికాదు. కాని సినిమా వీటికి ఎంతవరకు తోడ్పడుతుంది, తోడ్పడగలదు అన్నదే ప్రశ్న. వి. శాంతారాం ‘దో ఆంఖే బారా హాత్’లో జైళ్లలో, శిక్షాస్మృతిలో తేవాల్సిన మార్పులను తన ఆలోచనలతో మేళవించి సమర్థవంతంగా చూపినప్పటికి ఆచరణ సాధ్యమా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఒకరంగా సాధ్యమే అని చెప్పవచ్చు. తిహార్ జైల్లో కిరణ్ బేడి ప్రవేశపెట్టిన, తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులే ఇందుకు నిదర్శనం. శాంతారం ఆలోచనలని కిరణ్ బేడి ఆచరణలకి గల సామీప్యం ‘సినిమా సమాజాన్ని మార్చగలదు’ అన్న వాదనకి బలం చేకూరుస్తుంది. అయితే ఇలాంటి మార్పులన్ని ప్రతి వ్యకి సమాజం పట్ల తన బాధ్యతనెరిగి, అంకితభావంతో వ్యవహిరంచినప్పుడే సాధ్యమవుతుంది. సమాజంపై సినిమా ప్రభావం అనే అంశంపై ఢిల్లీలో జరిపిన ఒక అధ్యయనంలో అత్యధికులు సినిమాని ఉల్లాసాన్ని కలిగించే సాధనంగా మాత్రమే భావించారు. సినిమా ద్వారా ప్రజలలో సామాజిక స్పృహ, బాధ్యత పెంచవచ్చని అభిప్రాయపడినవారు అతికొద్దిమంది, మొత్తం మీద సినిమా ఉద్దేశం ఏమైనప్పటికీ అది సమాజంలో ఒక భాగం అనటంలో సందేహంలేదు. అలాగే సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూసిస్తుందనటంలో కూడా సందేహంలేదు. ప్రభావం చూపినా, చూపకపోయినా, సినీచరిత్రలో ఎన్నో సామాజిక సమస్యలను చర్చించిన సినిమాలు వెలువడ్డాయి, వెలువడుతూనే ఉంటాయి.

వీటిలో ఎక్కువ భాగం పేద, ధనిక వర్గాల విబేధాలను, నిరుద్యోగంతో విసుగెత్తి సమాజంపై తిరగబడే యువకుల గాథల, వరకట్న సమస్యలు, కుల,మత వైషమ్యాలు, పెచ్చు పెరుగుతన్న హింస, గుండాయిజం వంటి అంశాలను ప్రేరణగా తీసుకున్నవే. ఉదాహరణకి హిందీలో వచ్చిన ‘అర్జున్’, ‘ఘాయల్’ తెలుగులో వచ్చిన ‘శివ’, ‘గాయం’లాంటి సినిమాల్లో గూండాయిజం మాత్రమే న్యాయాన్ని రక్షింస్తుందని, న్యాయం పొందటానికి హింసాయుతమార్గమే శ్రేయస్కరం అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించటంతో ఆ కోవలో అనేక చిత్రాలు వెలువడ్డాయి. ముల్లుని, ముల్లుతోనే తీయాలన్నది నేటి సమాజం నీతిగా చిత్రీకరణ జరుగుతోంది. ఇలా చిత్రీకరించడం ద్వారా సమాజంలో లేని రుగ్మతలకి తావిచ్చినట్టవుతోంది.

అలాగే, సమాజంలోని తోటి వ్యక్తిపట్ల జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి వెనుకాడరాదన్న ఇతివృత్తంపై కూడా చాలా సినిమాలు వెలువడ్డాయి. వీటిలో చాలా వరకు న్యాయం, చట్టం, బాధితలకు న్యాయం చేకూర్చలేవనే చెప్పాయి. కాని ‘అంకురం’, ‘దామిని’ వంటి సినిమాల్లో న్యాయం, చట్టం పరిమితిలోనే సామాజిక విలువలను కాపాడే ప్రయత్నం జరిగినా, సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు ప్రభావితం చేశాయన్నది ప్రశ్నార్థకమే. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఈ సినిమాలు ప్రజలలో అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ప్రేరణ కలిగించాయో, లేదో చెప్పలేం. ‘ప్రతిఘటన’లో ఝాన్సీ న్యాయాన్ని తన చేతిలోకి తీసుకుని దుర్మాగుడిన హతమార్చడం, ‘జక్మీ ఔరత్’ లో బలాత్కారానికి గురైన స్త్రీ చెప్పిన విప్లవాత్మక తీర్పు ఆచరణ సాధ్యాలు కావు. కనీసం రెండు, మూడు దశాబ్ధాల క్రితం బాపు ‘సాక్షి’లో చూపినట్టు, ఒక హత్యకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి సమాజంలో ఎదుర్కొనే పరిణామాలు నేటి సమకాలీన సామాజిక పరిస్థితులకు ప్రతీక. నాడు, నేడూ కూడా తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం కదా అనుకునేవారే కానీ, అన్యాయాన్ని నిలువరిద్దామనుకునే వారు శూన్యం.

ఇక వరకట్న సమస్యలపై ఎన్నో చిత్రాలు వెలువడ్డాయి. ప్రతి సినిమా జన జాగృతినే కోరింది. మనిషి ఆలోచనా విధానంలో మార్పును ఆశించాయి. నేటికి ఈ సమస్య, సమస్యగానే మిగిలిపోయింది. జాతీయతా భావాన్ని ప్రభోదిస్తూ, మతవైషమ్యాలను నిరసిస్తూ అనేక చిత్రాలు వచ్చాయి. ఇటీవలే విడుదలై దేశమంతటా నీరాజనాలు అందుకున్న ‘రోజా’, ‘బొంబాయి’, ‘క్రాంతివీర్’ సినిమాలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయన్నది కాలమే చెప్పాలి.

ఫలానా సినిమాలో చూపినట్టుగా నేను హత్య చేశాను అని ఒప్పుకున్న ముద్దాయిల కథలు మనకు అప్పుడప్పుడు వినవస్తుంటాయి. కాని ఫలానా సినిమా ప్రేరణతో ఈ అన్యాయాన్ని సమర్థవంతంగా ఎదిరించామన్న ఒక్క వార్త మనకు వినపడదు. ఇలా ఎందు జరుగుతోంది? ఒకే సాధనం ద్వారా వెలువడ్డ రెండు వేర్వేరు సందేశాల్లో చెడును స్వీకరించినట్టుగా, మంచిని ఎందుకు స్వీకరించలేకపోతున్నాం. లోపం సాధనందా? లేక కథనా రీతిదా? ‘రోజా’, ‘బొంబాయి’లను ఆదరించిన ప్రేక్షకులే ‘ఘాయల్’, ‘శివ’, ‘ఖల్ నాయక్’ లాంటి సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. దానర్థం ప్రేక్షకులు సినిమాని ఒక వినోద సాధనంగా మాత్రమే ఆదరిస్తున్నారు. అంతేకాని సినిమాలో నిగూఢమైన నీతిని, సందేశాన్ని వారు గ్రహించటంలేదు. అలాంటప్పుడు సినిమా సమాజంపై ప్రభావం చూపుతుందన్న వాదన ఎంతవరకు సమంజసం. సినిమా సమకాలీన స్థితిగతులకు దృశ్యమాలిక మాత్రమే. మానవసంబంధాలను వినోదాత్మకంగా చూపే ప్రక్రియ అంటే తప్పు కాదేమో. వాస్తవాలను చిత్రీకరించటంలో సినిమా సమర్థవంతంగా ఉపయోగపడుతున్నప్పటికీ ప్రజల అభిప్రాయాలను మార్చేశక్తి విషయంలో అది విఫలమవుతోందని, సామాజిక సమస్యలపై నేటివరకు విడుదలైన వందలాది సినిమాలే సాక్ష్యాలు. ఈ సినిమాలన్ని కళాత్మక సినిమాలగానో, ఆఫ్ బీట్ సినిమాలగానో ప్రఖ్యాతిగాంచి, వివిధ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్నాయి. ఈ సినిమాలకి, దర్శక, నిర్మాతలకి, కళాకారులకి విమర్శకుల మన్ననలు దక్కుతున్నాయి. అంతేకాని సినిమాని మెచ్చుకునే ఏ వ్యక్తి అందులోని సందేశాన్ని ఆచరించట్లేదు.

అందుకే ఒక ఆలోచనని, వాస్తవికతను సెల్యులాయిడ్ పై చూపగలమేమోకాని సమాజంపై ప్రభావం చూపేటట్లు చేయగలమా అన్న విషయాన్ని ఇంకా కూలంకుషంగా చర్చించవల్సి ఉంది. ఒక శక్తివంతమైన, సమర్థవంతమైన సాధనాన్ని ఉపయోగించే రీతిని క్షుణ్ణంగా పరిశీలించి అందులోని లోటుపాట్లను సరిచేయాల్సి ఉంది. సినిమా నిజంగానే సమాజంపై ప్రభావం చూపగలిగే శక్తిని కలిగి ఉంటే, మనం ఈ సాధనాన్ని సరైనరీతిలో వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాం అన్నదాంట్లో సందేహం లేదు.

(వార్త దినపత్రికలో సినిమా పేజీలో ఫిబ్రవరి 10, 1996లో ప్రచురితమైంది.)

సౌమ్యశ్రీ రాళ్లభండి