నా స్మృతి పథం – 1

నా స్మృతి పథం – 1
నా స్మృతి పథం – 1

కాల గమనంలో చాలా ముందుకు ప్రయాణించాక, ప్రతి మనిషీ ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండడు. తాను దాటి వచ్చిన మజిలీలు, తాను విడిచి వచ్చిన స్నేహితులు, బంధువులు, సంబంధ, బాంధవ్యాలు పెదవిపై చిరునవ్వును తెప్పించవచ్చు. లేదా కన్నులలో నీటి ధారలైన నింపవచ్చు. మనిషి జీవితం వెలుగునీడల సమాహారం, సుఖ దుఃఖాల కలయిక. కరిగిపోయిన కాలాతీత స్మృతుల సమ్మేళనం. యాభై ఏళ్ల నా జీవితంలో నాతో దోబూచులాడిన ఘటనలు ఎన్నో. ఆ జ్ఞాపకాల దొంతరలో నా వ్యాసాంగానికి సంబంధించిన కొన్ని మధుర స్మతులను నెమరు వేసుకోవడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ నా స్మృతిపథం…

ఒక పత్రికా విలేకరిగా, రచయిత్రిగా నా అనుభవాలు, పరిచయాలు, కష్టాలు, కన్నీళ్లు వాటి మధ్య నేను రాసిన నా రచనల పుట్టుపూర్వోత్తరాలు గుర్తుచేసుకోవడమే ఈ శీర్షిక ఉద్దేశం. నేనేమి పత్రికా విలేకరి అయి దేశాన్ని ఉద్ధరించాలనే సంకల్పంతో ఈ రంగంలోకి ప్రవేశించలేదు. ప్రతీ సగటు విద్యార్ధినిలాగేనే డాక్టరో, ఇంజనీరో, లాయరో, ఎంబిఎ (నేను చదివే కాలంలో ఎంబిఎకి కూడా చాలా డిమాండ్ ఉండేది) లాంటి ఉన్నత చదువు ఏదో వెలగబెట్టాలనే అనుకున్నాను. మిగితావి ఎలా ఉన్నా ఎంబిఎ, ఎంఎ (ఎకానిమిక్స్)కి నాకు ప్రైవేటు కాలేజీలలో సీట్లు వచ్చాయి. కానీ, ప్రైవేటు కళాశాలలో చదువుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో, దారితెన్ను లేకుండా ఉన్న నాకు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో జర్నలిజం డిపార్టమెంటు నుంచి బిసిజె (బ్యాచలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం) కోర్సులో సీటిస్తామంటూ పిలుపు వచ్చింది. మా నాన్నగారు రంగస్థల నటులు కావడంతో నాకు కూడా కొంత సాహిత్యం పట్ల, రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు వక్తృత్వ పోటీలు, వ్యాసరచనా పోటీలకు వెళ్లి చిన్నా, చితక బహుమతులు గెలవడం, ఆకాశవాణి వారి యువవాణి కార్యక్రమాలలో పాల్గొనడం వంటి పనులు చేస్తుండే దాన్ని. దానికి తోడు ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కే అవకాశం, ఖాళీగా ఉండి చేసేది ఏమీలేదు. సరే కానీ.. మనకూ.. పైసా ఖర్చులేదు కదా అని ఆ కోర్సులో చేరాను. ఆ నిర్ణయం, ఆ కాలేజీ అనుభవం నాకు జీవితంలో మరిన్ని దారులు చూపింది. తర్వాత అక్కడే ఎంసిజె (మాస్టర్స్) కోర్సు కూడా పూర్తిచేశాను. ఎంఫిల్ లో చేరినప్పటికీ, మండల్, తదితర రిజర్వేషన్ల ఉద్యమాల పుణ్యమా అని రెండు, మూడుసార్లు పరీక్షలు వాయిదా కావడంతో పూర్తి చేయలేకపోయాను, ఎందుకంటే అప్పట్లో నేను న్యూఢిల్లీలో ఉండేదాన్ని దాంతో పరీక్షలకు వెళ్లడే ప్రతీసారి కుదిరేది కాదు. నేను ఎం.ఫిల్ చేయాలనుకున్నది కేవలం పి.హెచ్.డి చేయడానికే. అందుకే పట్టువదలని విక్రమార్కురాలిలా ‘డా’ అన్న ఒక్క పొడి అక్షరం నా పేరు ముందు చేర్చుకోవాలనే తాపత్రయంతో, మంగళూరు యూనివర్సిటీలో పి.హెచ్.డిలో చేరి దాదాపు మూడేళ్లు చదివినప్పటికి, అదృష్టం మరోసారి నా నుంచి దూరంగా పారిపోయింది. దాంతో అదీ పూర్తి చేయలేకపోయాను. పిహెచ్ డి పూర్తి చేయలోకపోయాన్నదొక్కటే నా జీవితంలో నాకున్న అసంతృప్తి. కొన్ని కోరికలు అలా ఉంటేనే వాటి విలువ తెలుస్తుందేమో. నా జర్నలిజం కోర్సు, పత్రికారంగ ప్రవేశం వీటన్నింటి గురించి ముందు, ముందు ముచ్చటించుకుందాం.

మరిన్ని జ్ఞాపకాలను తవ్వడానికి ముందు, నేను పాతిక సంవత్సరాల క్రితం రాసిన ఒక వ్యాసంతో ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాను. ఎందుకుంటే, చట్టసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని మోడీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిందన్న వార్త ప్రస్తుతం వార్తా మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇదే మాట 1998 ఎన్నికల సమయంలో నేను ఢిల్లీలో పనిచేసే కాలంలో కూడా జోరుగా విన్పించింది. రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా అదే మాట మళ్లీ విన్పిస్తోంది. నా జుట్టు తెల్లబడిందే కానీ, మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు మాత్రం రాలేదు. మన సమాజం ఏమీ మారలేదనడానికి, మారదనడానికి ఇదే నిదర్శనమేమో. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పిల్లలకి తాయిలం చూపించినట్టు మహిళలకు రిజర్వేషన్లు అనే మిఠాయి పొట్లాన్ని చూపిస్తుంటారు మన రాజకీయ ఉద్దండులు. మేక కసాయి వాడినే నమ్మును అన్నట్టు మహిళా రాజకీయ నాయకులందరూ, మేమే నాయకురాలు నాగమ్మలము అంటూ మళ్లీ, మళ్లీ కొంగులు, ముడులు బిగిస్తుంటారు. బిల్లు ప్రవేశ పెట్టరు. పెట్టినా అది సభ ఆమోదం పొందదు. షరామామూలే. ఈ సందర్భంగా వార్త దినపత్రికలో ఫిబ్రవరి 6, 1998 చెలి పేజీలో ప్రచురితమైన నా వ్యాసంతో ఈ శీర్షికకు శ్రీకారం చుడితే బావుంటుందనిపించింది.

మహిళలకు ప్రాతినిధ్యం ఎండమావే!!

ప్రతి రాజకీయ పక్షం మ్యానిఫెస్టోను పరిశీలిస్తే, మహిళలకు 33శాతం రిజర్వేషన్ కు పెద్దపీఠం వేశారని చూడగానే అర్థమవుతుంది. రిజర్వేషన్ పట్ల పార్టీలు ఎంత శ్రద్ధ కనపరుస్తున్నారన్నది 11వ లోక్ సభ శీతాకాల సమావేశాలే నిరూపిస్తాయి. ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్న వారికే సీట్లనిస్తామని చెపుతూ ప్రతి పార్టీ మళ్లీ మహిళల పట్ల వివక్ష కనపర్చింది. చట్టసభలలో 33శాతం రిజర్వేషన్ కల్పించి నిర్భందిస్తే కాని వివిధ రాజకీయ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించేటట్టు కనపడటంలేదు. ఇలా ఎందుకు చెప్పవల్సి వస్తోందంటే, వివిధ రాష్ట్రాల నుంచి లోక్ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య ఒక్కసారి కూడా 50కు చేరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నా, ఇంకా మహిళలకు మాత్రం సమాన అవకాశాలు లభించట్లేదు. అతివలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు, చేసే చట్టాల గురించి పార్లమెంట్లో ప్రస్తావించడానికి, నిర్ణయాధికారాలలో పాల్గనడానికి తగినంతమంది మహిళలు చట్టసభలలో లేరు.

12వ లోక్ సభకు ఈ నెలలో జరగనున్న ఎన్నికలలో కూడా ప్రధాన రాజకీయ పక్షాలు నిలబెట్టిన మహిళా అభ్యర్ధుల సంఖ్య 50కు మించలేదు. మన రాష్ట్రం విషయానికి వస్తే, 42 నియోజకవర్గాలలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు చెరో ముగ్గురిని బిజెపి ఒక్క మహిళా అభ్యర్ధికి మాత్రమే టికెట్లనిచ్చాయి. తెలుగుదేశం తరపున తెనాలి నుంచి సినీ నటి శారద, నెల్లూరు నుంచి స్వర్ణలత (సిపిఎం), పెద్దపల్లి నుంచి సుగుణ కుమారి పోటీ చేస్తున్నారు. కాగా కాంగ్రెసు తరపున భద్రాచలం నుంచి కమలా కుమారి, నెల్లూరు నుంచి పి.లక్ష్మీ, వరంగల్ నుంచి టి. కల్పనా దేవీ పోటీ చేస్తుండగా, బిజెపి తరపున ఏలూరు నుంచి వై. జయలక్ష్మి బరిలో ఉన్నారు. దీన్ని బట్టి ఆయా పార్టీలు మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాయో అర్థమవుతోంది. దేశమంతటా కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 28కోట్ల 27లక్షల 56వేల ఐదువందల పన్నెండు మంది మహిళా ఓటర్లున్నాను. ఈ సంఖ్యన పరిగణలోకి తీసుకుంటే మహిళలకు ఇస్తున్న అవకాశం నామమాత్రమే. 1996 ఎన్నికలలో 543లోక్ సభ స్థానాలకు మొత్తం 599మంది మహిళలు పోటీ చేశారు. వీరిలో కేవలం 40 మంది మాత్రమే నెగ్గినా, పెద్దసంఖ్యలో మహిళలు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారన్నది గమనార్హం. గత ఎన్నికల్లో మన రాష్ట్రంలో మొత్తం 90మంది మహిళలు పోటీ చేశారు. వీరిలో నలుగురు గెలుపొందారు.

లోక్ సభలో మహిళల ప్రాధాన్యత

లోక్ సభ	మొత్తం  మహిళా సభ్యుల సంఖ్య
        సీట్లు	సభ్యులు	 శాతంలో
3వ	503	34	6.7
6వ	544	19	3.4
8వ	544	44	8.1
9వ	529	28	5.3
10వ	514	39	7.1
11వ	543	40	--

ఎన్నికల్లో ప్రముఖ మహిళలు:

మహిళలకు రిజర్వేషన్ కల్పిచినా, కల్పించకపోయినా, కొందరు మహిళలు మాత్రం ప్రస్తుత ఎన్నికలపై తమ ముద్ర వేశారు. వీరిలో అగ్రతాంబూలం సోనియా గాంధీది. కాంగ్రెసు స్టార్ ప్రచారుకురాలైన సోనియా వల్ల కాంగ్రెసుకు జవసత్వాలు వచ్చాయన్నదాంట్లో సందేహంలేదు. 112ఏళ్ల చరిత్ర గల కాంగ్రెసు తన బలాంన్ని పెంచుకోవడానికి ఒక మహిళపై ఆధారపడుతోంది. 10, జనపథ్ కాంగ్రెసు రాజకీయాలకు కీలక స్థానంగా తీర్థస్థానంగా తయారైంది. సోనియా అనంతరం అన్నాడిఎంకె అధినాయకురాలను జయలలిత ఒంటరిగా పార్టీని విజయపథం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. నటిగానేకాక తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రతిష్ట అందరికి తెలిసిందే. బిజెపికి అత్యధిక సంఖ్యలో సీట్లు వస్తే, జయలలిత కూడా కేంద్రంలో ప్రముఖ ప్రాత వహించే అవకాశంలేకపోలేదు. ఇక పశ్చిమబెంగాల్ ఆడపులిగా పేరెన్నికగన్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెసుకు నేతృత్వం వహించి కాంగ్రెసుతో ఢీకొంటున్నారు. కాంగ్రెసు అధ్యక్షుడు సీతారాం కేసరికి వ్యతిరేకంగా కాంగ్రెసు నుంచి వెలుపలికి వచ్చి కొత్తపార్టీని ఆమె ఏర్పాటుచేశారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మాయావతి బిఎస్పీలో కీలకపాత్ర వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనేత లక్ష్మీపార్వతికి ఈ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆమె రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలు ఒక కొలమానం కాగలవు. బిజెపితో పొత్తు విషయంలో ఇబ్బందులనకు ఎదుర్కొని కేవలం నాలుగు స్థానాలనే పొందిన లక్ష్మీపార్వతి రాజకీయ ప్రతిభకు ఇది పరీక్షా సమయం. వీరుకాక వివిధ పార్టీలకు చెందిన మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు.

నిజంగా మహిళలకు అవకాశం ఇవ్వడానికి ఏ చట్టం, రిజర్వేషన్లు అవసరం లేదు. కాకపోతే, రిజర్వేషన్ కల్పించటం ద్వారా పార్టీల ముందర కాళ్లకు బంధం వేయవచ్చు. పంచాయితీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత అధిక సంఖ్యలో మహిళలు పంచాయితీలకు ఎన్నికయ్యారు. అదే విధంగా రిజర్వేషన్ అమలు తర్వాత చట్టసభలలో కూడా మహిళలకు ప్రాతినధ్యం మెరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చిత్తశుద్ధిలేని పార్టీలు, వ్యక్తులు ఉన్నంతకాలం రిజర్వేషన్లు అవసరం ఎంతైనా ఉంది. సమానత్వాన్ని కోరుతున్న మహిళలకు కేవలం 33శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పించాలి, 50శాతం కల్పించవచ్చు కదా అని అంటున్నవారు లేకపోలేరు. విజయం సాధించే వ్యక్తులకు మాత్రమే టికెట్లనివ్వాలని పార్టీలు భావిస్తున్న పరిస్థితుల్లో రిజర్వేషన్ల ద్వారా మహిళలకు ఎన్నికల్లో విజయం సాధించే సామర్థ్యం వస్తుందా! ఏదిఏమైనప్పటికీ, రిజర్వేషన్లు అమలులోకి వచ్చాకైనా మహిళలకు అవకాశం ఇస్తారా, మరో ఇతర సమస్య లేవనెత్తుతారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న!

సౌమ్యశ్రీ రాళ్లభండి