నా స్మృతిపథం – 6
ఎన్నికల కురుక్షేత్రం - నా అనుభవాలు

నా స్మృతిపథం – 6 <br> ఎన్నికల కురుక్షేత్రం - నా అనుభవాలు
నా స్మృతిపథం – 6
ఎన్నికల కురుక్షేత్రం - నా అనుభవాలు

దేశంలో ఎన్నికల యుద్ధభేరి మోగింది. రాజకీయ పార్టీల కార్యకర్తలు కురుక్షేత్ర సమరంలో యోధుల్లా పోరాటానికి సమాయుక్తమవుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలతో నా అనుభావలను నెమరేసుకుందామన్పిస్తోంది. నేను ఇదివరకే చెప్పినట్టు, సబ్ ఎడిటర్ గా చేరడం వల్ల మొదట్లో రిపోర్టింగ్ చేయకుండా కేవలం ఆఫీసుకే పరిమితమయ్యాను. ప్యూన్ ఉద్యోగం మినహాయించి, ఆఫీసులో అన్ని పనులు చేసేదాన్ని. పొద్దున్న 11 గంటలకు ఆఫీసుకు వెడితే రాత్రి 11 గంటలవరకు ఒకరకంగా పన్నెండు గంటలు వెట్టి చాకిరి. నేనొక్కదాన్నే అలా చేసానని చెప్పలేను. నాకు తెలిసినంతవరకు వార్తలో ఆకాలంలో పనిచేసిన చాలామంది జిల్లా సబ్-ఎడిటర్ల, రిపోర్టర్ల పరిస్థితి అంతే. ఇంత చేస్తే, నాకు మా ఆఫీసు బాయ్ కంటే జీతం తక్కువుండేది. అంటే ఆనాడు తెలుగు దినపత్రికల్లో జీతాలు ముఖ్యంగా వార్తలో పనిచేసిన వారి దుస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోగలరు. అది గమనించిన మా బ్యూరో చీఫ్, ఢిల్లీలో ఇలాంటి జీతాలతో పనిచేయటం కుదరదని యాజమాన్యంతో మాట్లాడి నా జీతం పెరిగేటట్టు చేసారు. జిల్లా విలేకర్లకు ఆ అవకాశం దక్కలేదు. ఆయనతో నా అనుబంధం గురించి, నన్ను ఆయన తీర్చిదిద్దిన విధానం గురించి మరోసారి చెపుతాను. ముందుగా, మనసనే కోతి ఒక చోట కుదురుగా ఉండదు. మదిలో దాగిన జ్ఞాపకాలను ఒడసి పట్టకోవడానికి, ఒక కొమ్మ నుంచి మరో రెమ్మపైకి దూకుతుంటుంది. ఆ దూకే క్రమంలో మరేవో ఆలోచనలు స్ఫురణకు వచ్చి ఇలా పక్కదారి పడుతుంది. అందుకని కొంచెం ఓపిక పట్టండి. ఎన్నికల కురుక్షేత్రం అని హెడ్డింగ్ పెట్టి కథని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకువెడుతున్నాననుకోకండి. ఢిల్లీలో పనిచేయటం వల్ల నాకు పత్రికా అనుభవం, రాజకీయ పరిజ్ఞానం, మెండైన అవకాశాలు నా సమకాలీన విలేకర్లతో పోలిస్తే కొంచెం తొందరగా అలవడ్డాయి, దక్కాయని చెప్పకతప్పదు.

మన దేశంలో ఒక దౌర్భాగ్యం ఉంది. మనిషిలోని ప్రజ్ఞాపాటవాల కంటే, ఉద్యోగాలలో టైటిల్స్ కే ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తారు. నా విషయంలో అదే జరిగింది. సబ్ ఎడిటర్ గా జాయిను అయ్యాను కనుక బయటకు వెళ్లి వార్తలు సేకరించడానికి వీలులేదని నాపై ఆంక్షలు విధించడానికి నా సీనియర్ విలేకర్లు ప్రయత్నించారు. వార్త ఢిల్లీ బ్యూరో చాలా చిన్నది. బ్యూరో చీఫ్, ఒక స్పెషల్ కరస్పాండెంట్, నేను, మాకో ఆఫీసు బాయ్. ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో ముగ్గురు విలేఖర్లంటే చాలా కష్టం. అయితే మాకు చాలామంది ఇతర పత్రికల్లో పనిచేసే విలేఖర్లు కంట్రిబ్యూటర్లగా ఉండి వార్తలను అందచేసేవారు. నేను అప్పుడప్పుడే పత్రికారంగంలో ప్రవేశించటం వల్ల నాలో ఏదో నేర్చుకోవాలి, సాధించేయాలి, అనే తాపత్రయం ఉండేది. దానికి తోడు కొద్దో, గొప్పో ఇంగ్లీషులో మాట్లాడగలగటం, హిందీలో ధారాళంగా మాట్లాడటం, చదవ గలగడం వల్ల అందరితోనే చాలా సులువుగా కలిసిపోగలిగాను. అది ఒకరకంగా నాకు ప్లస్ పాయింట్. ఢిల్లీకి స్పెషల్ కరస్పాండెంట్ గా వచ్చిన వారికి నాకంటే పదిరెట్లు జీతం ఎక్కువనేగాని, వారి అనుభవం మాత్రం నా అనుభవమంతే. అంటే, వారు అంతకు ముందు జిల్లాలలో పనిచేసి వచ్చిన వారు మాత్రమే. దానికి తోడు హిందీ రాకపోవడంతో వాళ్లు కేవలం ఢిల్లీలోని ఆంధ్రాభవన్ కు మాత్రమే పరిమితమై, అక్కడికి వచ్చే స్థానిక రాజకీయనాయకులతో మాట్లాడటం, లేదా మన తెలుగు పార్లమెంటు సభ్యులతో కబుర్లాడి, వాళ్లు ఇచ్చిన పత్రికా ప్రకటనలను మాత్రమే వార్తలుగా రాసి పంపేవారు. మిగిలిన ప్రధాన రాజకీయ పార్టీల వార్తలకు కంట్రిబ్యూటర్లు ఉన్నారు కదా అనే ధీమా, వారిచ్చిన వార్తలను ప్రచురిస్తారు, మన పేరు వేయరని నిరుత్సాహం వారిలో మెండుగా ఉండేవి.

మనకప్పట్లో (ఇప్పుడు కూడా) అన్ని రాజకీయాలు తెలిసేవికావు. 1996లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు, అనేకమంది వివిధ భాషా పత్రికా విలేకర్లు మా ఆఫీసుకు వచ్చేవారు. వాళ్ల సంభాషణల్లో నేను కూడా పాల్గొనేదాన్ని. ఏ మాటకామాటే చెప్పాలి, నేను చిన్నదాన్ననిగాని, అనుభవం లేనిదానినని గాని వాళ్లెవ్వరు ఆలోచించేవారు కాదు. నేను ఏం చెబుతానో అని ఆసక్తిగా వినేవారు. నన్ను ప్రశ్నలు వేసి నా ఆలోచనలకు పదును పెట్టేవారు. నేను చెప్పేది విని, తప్పులుంటే సరిదిద్దేవారు. పార్టీల విధానాల, సిద్ధాంతాల పూర్వాపరాలు చెప్పేవారు. మన తెలుగు పత్రికా విలేకర్లు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. నేనొకదాన్ని ఉన్నానని కూడా గుర్తించలేదు. నాకు జర్నలిజంలో అలా ఓనమాలు నేర్పినవారిలో సామనా పత్రిక సీనియర్ రిపోర్టర్ ధర్మానంద్ కామథ్, హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి శేఖర్ అయ్యర్ తోపాటుగా అనేకమంది ఉన్నారు. వీరితోపాటు, వార్తలో కాలమ్స్ రాసే ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ కూమీ కపూర్, ఆమె భర్త వీరేంద్రకపూర్ (ఆయన ఎందులో పనిచేసేవారో గుర్తు లేదు), మహేష్ రంగరాజన్ వంటివారి వ్యాసాలు నాకు చాలా నేర్పాయి. ఇక్కడ చిన్న కోతికొమ్మచ్చి… వీరేంద్ర కపూర్ రచనా శైలి చూస్తే ఎవరికైనా చమటలు పట్టకమానవు. ఆయన రాసే ఒక వాక్యం కేవలం పదిలైన్లుంటుంది. అలాంటి రెండు వాక్యాలతో ఒక పేరా పూర్తయ్యేది. ఆయన రచన అర్థం చేసుకోవడానికి హైద్రాబాద్ లోని సబ్-ఎడిటర్లకి తలప్రాణం తోకకి వచ్చేది. దాంతో ఆయన పంపిన ఇంగ్లీషు వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేసే ధైర్యం ఎవ్వరూ చేసేవారు కాదు. ఒకసారి మా బ్యూరో ఛీఫ్ రాజగోపాలన్ గారు నా దగ్గరకి వచ్చి, మనం పంపే ఆర్టికల్స్ హైద్రాబాద్ కు సకాలంలో వెడుతున్నట్టులేదు. వీరేంద్ర కూపూర్ పంపిన ఒక్క వ్యాసం కూడా ప్రింటు కాలేదు. ఈసారి నువ్వు ఏమనుకోకుండా ఇక్కడే తెలుగులో అనువదించి పంపగలవా అని అడిగారు. పచ్చి వెలక్కాయ గొంతులో పడట్టయి, బింకంగా అలాగే అని బదులిచ్చి, ఆయన వ్యాసాన్ని చదవడం ప్రారంభించాను. నిజం చెప్పొద్దు, ఒక్క పదానికి అర్థం తెలిస్తే ఒట్టు. ఇక చేసేదేంలేక నిఘంటువు ముందేసుకుని కూర్చుని తెలియని పదాలకి అర్థాలు వెతుక్కుంటూ, నాలుగు పేజీల వ్యాసాన్ని నాలుగు గంటలు కుస్తీపట్టి స్వేచ్ఛానువాదం చేసి పంపిచాను. మర్నాడు మా ఎడిటర్ ఎబికే గారు హాట్ లైన్లోకి వచ్చి ఏమ్మా నువ్వేనా దీన్ని అనువాదం చేసింది అని ప్రశ్నించారు. బిక్కు, బిక్కుమంటూ అవునండి అని సమాధానమిచ్చాను. చాలా బాగా చేశావు. ‘‘ఇక్కడ వెధవలకి ఏమీ అర్థం కావట్లేదు. ఇంక ప్రతివారం ఢిల్లీ కాలమ్స్ అన్నీ నువ్వే అనువదించి పంపిస్తుండ’’న్నారు. అలా అనుభవజ్ఞులైన విలేకర్లు రాసిన వ్యాసాలు చదవటం వల్ల సామాజిక, ఆర్థిక, రాజకీయాల వ్యవహారాలపై మరింత అవగాన కల్గింది. దానికి తోడు ప్రణయ్ రాయ్ దేశ ఎన్నికల గణాంకాల ఆధారంగా రాసిన ‘ఇండియా డిసైడ్స్’ పుస్తకాన్ని రాజగోపాలన్ గారు నాకిచ్చి చదవమన్నారు.

ఈ అభ్యాసం నాకు ఎన్నికలప్పుడు చాలా ఉపయోగపడింది. ఇప్పుడున్నంతగా ఎలక్ట్రానిక్ మీడియా అప్పట్లో లేదు. స్టార్ టీవి అప్పుడప్పుడే ప్రారంభమయింది. ఎన్నికల సందర్భంగా స్టార్ టీవి ప్రముఖ రాజకీయ నాయకులతో ‘సెంట్రల్ హాల్’ అని ఒక చర్చా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇప్పుడంటే కుక్కగొడుగుల్లాగా మొలిచిన వార్తా చాన్నెళ్లలో నిత్యం అర్థం పర్థంలేని చర్చలనేకం. అప్పట్లో ఆ కార్యక్రమం పెద్ద హైలేట్. దానిని రూపొందించిన న్యూస్ ప్రొడ్యూసర్ షీలా భట్ రాజగోపాలన్ గారికి స్నేహితురాలు. ఆవిడ మొదటి చర్చా కార్యక్రమానికి సమీక్ష రాయమని కోరింది. దానికి ఆయన సౌమ్యని పంపుతాను కాకపోతే నువ్వే తీసుకువెళ్లి, మళ్లీ మా ఆఫీసులో దింపాలి అని షరతు పెట్టారు. ఎందుకంటే స్టార్ టీవి స్టూడియో మా ఆఫీసు నుంచి కారులో గంట ప్రయాణం. నా కొచ్చే జీతం ఆటోకే సరిపోయేది. ఆవిడ సరే తీసుకు వెడతాను, కానీ వేరే పత్రికా విలేకర్లు కూడా వస్తున్నారు వారితో పంపిస్తానంది. సరే కార్యక్రమం రికార్డింగ్ కి ఆమెతో కలిసి స్టార్ టివి స్టూడియోకి వెళ్లాను. అందులో బిజెపి తరపున అద్వానీ, కాంగ్రెసు తరపున ప్రణాబ్ ముఖర్జీ, కమ్యూనిస్టు పార్టీల తరపున రాజా, హరి కిషన్ సింగ్ సుర్జిత్ ఇలా అతిరథ మహారథులు పాల్గొన్నారు. సరే వారి చర్చ జాగ్రత్తగా విని, నాకర్థమయనంత వరకు నోట్స్ రాసుకొని, వారిచ్చిన పత్రికా ప్రకటన తీసుకుని ఎవరితో రావాల్సి వస్తుందో అని ఎదురు చూస్తుంటే, షీలాభట్ గారు వచ్చి, ప్రణాబ్ ముఖర్జీ గారి కారులో వెడతావా, నీతోపాటు ఇంకొక హిందీ విలేఖరి కూడా ఉంటారు, కాకపోతే, అక్బర్ రోడ్డులోని కాంగ్రెసు కార్యాలయంలో వదిలేస్తారు, అక్కడ నాలుగు గంటలకు విలేకర్ల సమావేశం ఉంది, ముఖర్జీగారు పాల్గొనాలి అంది. నువ్వు అక్కడ నుంచి ఆఫీసుకు వెళ్లగలవా అని అడిగారు. నేను కూడా ఆ విలేకర్ల సమావేశానికి వెళ్లాల్సి ఉండటంతో సరే అన్నాను. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఆ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి, దక్షిణాదికి కూడా ప్రణాబ్ ముఖర్జీగారు పార్టీ కన్వీనరుగా వ్యవహరించారు. నా రొట్టె విరగి నేతిలో పడ్డట్టయింది.

సరే అందరం ఆయన కారెక్కి కూర్చున్నాం. నాకు మనసులో కంగారు మొదలైంది. ఎలాగైనా ఈయనతో ఇంటర్యూ చేయడానికి టైం తీసుకోవాలి. ఎలా అడగాలి? కారు దిగే లోపల అడగాలి. ముఖర్జీగారు ముందు సీట్లో, నేను మరో ఇద్దరు వెనకాల, కూర్చున్నాం. అక్కర్లేనప్పుడు జలపాతంలా నోట్లోంచి మాటలు కురుస్తాయి. అవసరమైనప్పుడు హైద్రాబాద్ కుళాయిలో నీళ్లలాగా ఒక్క మాట జారదు. సరే ధైర్యం చేసి సార్ నేను వార్త తెలుగు పత్రికా విలేఖరిని, మీతో ఇంటర్వూ చేయడానికి ఏదైనా టైం ఇవ్వగలరాని అడిగాను. దానికి ఆయన రేపు నేను కలకత్తా వెడుతున్నాను. 10 రోజులదాక రాను. వేరే టైం ఎందుకు? ఏంకావాలో ఇప్పుడే అడగండి. మనం కాంగ్రెసు కార్యాలయానికి చేరడానికి ఇంకా 40 నిమిషాలు పడుతుంది కదా. ఇంతకంటే ఎక్కువ సమయం నేను ఎలాగూ కేటాయించలేను అన్నారు. అంతే నా కాళ్ల కింద భూమి బద్దయ్యింది. ఏదో టైం ఇస్తే తీరిగ్గా ప్రశ్నలు తయారు చేసుకొని తాపీగా అడగచ్చు అనుకున్నా. ఆయన అప్పటికప్పుడు కారులో ఇంటర్వ్యూ అంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. కారు దిగి పారిపోయే అవకాశం లేదు. అందుకే అన్నారు మన పెద్దలు, పుస్తక పఠనం, పెద్దలతో ఇష్ఠాగోష్టి ఉండాలని. నేను పైన చెప్పినట్టు అంతమంది విలేకర్లు గురువులై నాకు నేర్పిన పాఠాలు వృధా కాలేదు. నేను చదివిన వ్యాసాలు నాకు విషయ పరిజ్ఞానాన్ని అందించాయి. అప్పుడే విన్న చర్చాగోష్టి నా బుర్రలో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది.

ఏదిఏమైతే గాని అనుకొని నా మొదటి ప్రశ్న వేసాను. ఆయన సమాధానం మరో అనుబంధ ప్రశ్నకు తావిచ్చింది. అలా నా ప్రశ్నల, ఆయన సమాధానాల పరంపర సాగింది. మా సంభాషణ ఇంగ్లీషులో జరగడం వల్ల పక్కన కూర్చున్న హిందీ విలేకరి కూడా నాకు తోడయ్యాడు. నలభై నిమిషాలు కాంగ్రెసు కార్యాలయానికి చేరుకునే లోపల నా ఇంటర్వ్యూ పూర్తయింది. ఆయన కారు దిగి లోపలికి వెళ్లిపోయారు. నా కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. నలభై నిమిషాల ఇంటర్వ్యూ నేను కాగితం, కలం చేతిలో లేకుండా చేశాను. నేను ఏం అడిగానో, ఆయన ఏం చెప్పారో నా మస్తిష్కంలోకి ఎంత చేరిందో చెప్పటం కష్టం. కాంగ్రెసు పార్టీ విలేకర్ల సమావేశం అనంతరం నేను ఆఫీసుకు వెళ్లేటప్పటికి ఎంత జ్ఞాపకం ఉంటుందో తెలియదు. అదృష్టవసాత్తు, నాలుగు గంటలకి జరగాల్సిన విలేకర్ల సమావేశం, ఐదింటికి వాయిదా వేశారు. అదే అదును అనుకొని, విలేకర్ల సమూహం నుంచి, కాంగ్రెసు కార్యాలయం నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చి ఇప్పుడు ఏమిటి తక్షణ కర్తవ్యం అని నిలుచుని చూస్తేంటే, ఆపద్భాంధవుడిలా రోడ్డుపక్కన మలయాళీ చెట్టియార్ టీ దుకాణం కన్పించింది. రక్షించావురా భగవంతుడా అనుకొని, అక్కడికి వెళ్లి ఒక టీ ఆర్డర్ ఇచ్చి, రోడ్డు మీద అడ్డంగా చతికిలపడి, హడావుడిగా బుర్రలో ఉన్న గుజ్జంతా కాగితం మీద ఒలకబోసి, హమ్మయ్యా అని నిట్టూర్చి, విలేకర్ల సమావేశం పూర్తిచేసుకొని, సాయంత్రం ఏడింటికి ఆఫీసుకి చేర్చుకున్నాను.

లోపలికి అడుగుపెట్టడం ఆలస్యం మా బ్యూరో చీఫ్, ప్రణాబ్ ముఖర్జీతో ఏమైనా మాట్లాడావా అని అడిగారు. ఒక్కసారి నిర్ఘంతపోయి, మీకెలా తెలుసు అని ప్రశ్నార్థకంగా చూసాను. ఆయన చిరునవ్వుతో, శేఖర్ నువ్వు ప్రణాబ్ ముఖర్జీ కారులోంచి దిగటం చూసి ఫోన్ చేశాడు అని చెప్పారు. పెదవి దాటితేనే కాదు, కనులు దాటినా పృధ్వి దాటుతుందని నాకారోజే తెలిసింది. ఎలా ఇంటర్వ్యూ చేసింది చెప్పాను. వెంటనే ఆయన ఆఫీస్ బాయ్ ని పిలిచి మేడంకి టీ ఇవ్వు. నువ్వు వెంటనే ఏం మాట్లాడావో గుర్తుచేసుకుని నోట్స్ రాయి అన్నారు. ఆ పని రోడ్డుపక్కన టీ బడ్డీ దగ్గర పూర్తి చేసానని అమాయకంగా జవాబిచ్చిన నన్ను మెచ్చుకోలుగా చూసి, ఎబికే గారికి చెపుతాను ఇంటర్వ్యూ వస్తోందని అని తన రూంలోకి వెళ్లిపోయారు. నేను గర్వంగా ఇంటర్వ్యూ టైప్ చేసి పంపించాను. పత్రిక మొదటిపేజిలో నా పేరు వేసి మరీ ఎబికే గారు ఆ ఇంటర్వ్యూ ప్రచురించారు. ఈ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉంటుంది. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా కాకుండా, ఆ ఎన్నికల కురుక్షేత్రంలో నేను విజయం సాధించానని. ఆ తర్వాత ప్రణాబ్ ముఖర్జీ దేశానికి రాష్ట్రపతి అయ్యారు కూడా. నేను రాష్ట్రపతి అయిన వ్యక్తిని, కాదు కాదు, ఒక రకంగా మన దేశ రాష్ట్రపతిని ఇంటర్వ్యూ చేసానని మా పిల్లలకు చెప్పుకునే వీలు కల్గింది.

ఎన్నికల సమయంలో మరో అనుభవం కూడా నాకు కించిత్ గర్వ కల్గించింది. ఇంతకు ముందే చెప్పాను కదా, దేశ వ్యవహారాల్లో మా వార్త సీనియర్ విలేకరి వేలు పెట్టేవారు కాదని. 1996 సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారా అని అందరూ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. మా బ్యూరో చీఫ్ అదే సమయంలో మద్రాసు (ఇప్పటి చెన్నై)కు వెళ్లాల్సి వచ్చింది. రోజులాగే ఆఫీసుకు వెళ్లి యథాలాపంగా పిటిఐ కాపీ చూస్తేంటే, సాయంత్రం నాలుగింటికి ఎన్నికల కమీషన్ విలేకర్ల సమావేశం అని కన్పించింది. సరే ఊరికే ఉన్నాం కదాని విలేకర్ల సమావేశానికి వెళ్లాను. నక్కని తొక్కి వెళ్లానేమో సమావేశంలో ఎన్నికల తేదీలు ప్రకటించారు. నేను సమావేశం పూర్తిచేసుకొని బస్సులు పట్టుకొని ఆఫీసుకి చేరే సరికి ఆరు కావచ్చింది. ఈ లోపల ఎడిటర్ గారు హాట్ లైన్లో నాలుగుసార్లు నాకోసం వచ్చారని మా ఆఫీసు బాయ్ చెప్పాడు. వెంటనే ఎబికే గారికి లైన్ కలపమని మా హైద్రాబాద్ సిబ్బందిని అడగాను. ఆయన వెంటనే లైన్ లోకి వచ్చి, సౌమ్యా, రాజా ఫోన్లో దొరకట్లేదు. మన స్పెషల్ కరస్సాండెంట్ (పేర్లు ఎందుకులేండి) ఎక్కడున్నాడు. ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. మాకు ఇంకా ఆంధ్రప్రదేశ్ తేదీలు ఇక్కడ ఏజెన్సీ కాపీలో రాలేదు. మీకు అక్కడ ఏమైనా వచ్చాయా. చూడు. మన విలేకరితో మాట్లాడి నాకు ఫోన్ చేయమను అంటూ సగం కోపంగా, సగం హడావుడిగా, ఫస్ట్ ఎడిషన్లో తేదీలు వేయాలనే కంగారుతో ఆయన నన్ను ఒక దులుపు దులిపేసారు. ఇంత ముఖ్యమైన సమయంలో సీనియర్లు ఎవరూ ఆఫీసులో లేరని వాపోయారు. నేను చాలా శాంతంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తేదీలు ఆయనకు చెప్పాను. వెంటనే నీకెలా తెలుసు. నిజమేనా అని సందేహంతో అడిగారు. సార్ నేను ఆ విలేకర్ల సమావేశానికి వెళ్లాను. ఎన్నికల కమిషన్ నోటీసు నా చేతిలో ఉంది అనగానే, ఆయనకు ప్రాణం లేచొచ్చినట్టయింది. వెంటనే, అయితే స్టోరీ చేసి పంపించు, నేను ఫస్ట్ పేజీ నీ వార్త కోసం అట్టేపెడతాను అని ఫోన్ పెట్టేశారు. మా సీనియర్ విలేకరి తీరిగ్గా, తొమ్మిందికి ఫోన్ చేసి, ఇవాళ ఎన్నికల తేదీలు విడుదలయ్యాయి, నేను స్టోరీ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పారు. నేను వార్త పంపిన విషయం ఆ సమయంలో చెప్పడం సమంజసం కాదని ఊరుకున్నాను. నేను ఒక సబ్-ఎడిటర్ హోదాలో విలేకర్ల సమావేశానికి హాజరయి, రాసిన వార్తను పత్రికలో మొదటిపేజీలో నా పేరు వేసి మరీ, ఎబికే గారు ప్రింట్ చేశారు. మర్నాడు మా సీనియర్ విలేకరి మొహం చూడాలి కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. ఈ విషయంలో ఎబికె గారిని మెచ్చుకోవాలి. ఆయన పెద్ద, చిన్నా వ్యత్యాసాలు చూపేవారు కాదు. ప్రతిభకు పట్టెం కట్టేవారు. వినదగు నెవ్వరు చెప్పినా అనే రీతిలో ఉండేవారు. నేను ఢిల్లీ బ్యూరోలో పని చేయటం వల్ల ఆయనతో తరుచుగా మాట్లాడే అవకాశం దక్కేది. ఆయన కూడా అనుభవంలేని పిల్ల అనుకోకుండా ప్రోత్సహించేవారు. అలా ఎన్నికల సమయంలో నేను రాజేష్ పైలట్, మాధవరావు సింధియాల ఇంటర్వ్యూలు కూడా చేసి పంపాను. ఆయన వాటిని కూడా నా పేరుతో ప్రచురించారు.

అదే ఎన్నికల్లో నేను మొట్టమొదటిసారిగా బహిరంగ సమావేశాలు ఎలా ఉంటయో రుచిచూశాను. ఢిల్లీకి దగ్గరలో హర్యానాలోని రోథక్ లో సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ ఒక బహిరంగ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. చాలామంది, ఢిల్లీ విలేకర్లు ఆ సమావేశానికి హాజరయ్యారు. నేను, హిందీ వార్తకు సంబంధించిన విలేకరి, మా బ్యూరో ఛీఫ్ తో కలిసి ఆ సమావేశానికి వెళ్లాను. ఇసక వేస్తే రాలనంత జనం. అసలే హర్యానావాసులేమో, కొంచెం దుడుకుగా, పొగరుగా కూడా ఉన్నారు. ఒకటే తొక్కిసలాట, మా ప్రమేయం లేకుండానే ముందుకి నెట్టి వేయబడ్డాం. జనాన్ని దాటుకుని ముందుకు వెళ్లడం మంటే ఒక యుద్ధం చేసినట్టే. రాజగోపాలన్ గారు మమ్మల్ని ముందుగానే హెచ్చరించారు. ఇంత జనంలో మనం తప్పిపోయే అవకాశం చాలా ఉంది. ముఖ్యంగా ప్రసంగం అయిపోయాక, ఒక్కసారిగా జన వాహినిని దాటుకుని రావటం కష్టం. అందుకని, ప్రసంగం అయ్యేవరకు ఆగకుండా, చివర్లో బయటకు వచ్చేయండి. ఇంకొకరి గురించి చూడకుండా కారు దగ్గరకు చేరుకోండి అని చెప్పారు. ఆ గోలలో సోనియా గాంధీ ఏమీ మాట్లాడిందో, మేము ఏం విన్నామో తెలియదు గాని, సామాన్య ప్రజానీకంతో కల్సి ఒక బహిరంగ సభలో పాల్గోనటం, అదొక వింత అనుభూతి. ప్రజల్లో ఒక పార్టీ పట్లగాని, నాయకుల పట్లగాని ఉండే అభిమానం, వాత్సల్యాన్ని ప్రత్యక్షంగా ఆ రోజు నేను చూడగలిగాను. అలాగే, ఢిల్లీ రాష్ట్రంలోని ఆరు లోక్ సభ స్థానాలలో రెండు రోజుల పాటు తిరిగి, జనాలతో మాట్లాడి, వారి నాడి తెలుసుకుని, పార్టీల గెలుపు, ఓటమిల గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాశాను. ఇక్కడ నేను చదివిన ‘ఇండియా డిసైడ్స్’ పుస్తకం బాగా ఉపయోగపడింది. ఏ ఎన్నికలలో ఏ పార్టీ ఢిల్లీలో గెలిచింది. ఎంత మెజారిటీ, ఓటు బ్యాంకు సాధించాయి. ఏ కులం, మతం, వర్గానికి ఎన్ని ఓట్లు, సీట్లు వచ్చాయి ఇలాంటి వివరాలన్ని ఆ పుస్తకంలో లభ్యం కావటంతో, విశ్లేషణ చేసి విపులంగా అరపేజీ వ్యాసం రాయగలిగాను. ఎబికేగారు ఈ వ్యాసాన్ని కూడా పొల్లుపోకుండా, యథాతథంగా ప్రచురించారని చెప్పాల్సిన అవసరం లేదునుకుంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నికల సందర్భంగా నేను మూటకట్టుకున్న అనుభవాలు అనేకం.

చాలా తక్కువ సమయంలో నాకు వచ్చిన ఈ అవకాశాలను గురించి నేడు తలుచుకుంటే నాకే, నమ్మశక్యం కాదు. అందుకే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, నాలో ఏదో తెలియని వెలితి, ఇంకా పత్రికారంగంలో ఉంటే, ఇంకెన్ని వ్యాసాలు రాసుండేదాన్ని అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ అనుభావాలు తాలుకా తృప్తి మదినిండా నిండి, రాశి కన్నా వాసి ముఖ్యమన్న పెద్దల మాటలు జ్ఞప్తికి వచ్చి సంతోషం కల్గుతుంది.


సౌమ్యశ్రీ రాళ్లభండి