గుడ్ బై 2021

గుడ్ బై 2021
గుడ్ బై 2021

రాబోవు కాలం గతించిన కాలాని కంటే మెరుగ్గా ఉంటుందని, ఉండాలని అందరూ తాపత్రయపడతారు. చూస్తుండగానే 2021 చరిత్రపుటల్లోకి జారిపోతోంది. మరో కొత్త సంవత్సరం 2022 రూపంలో మన వాకిట తలుపులను తట్టడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం కూడా కోవిడ్ మహమ్మారితో పోరాటం సాగిస్తూనే ఉంది. ఇంటి నుంచి పని చేయటం, ఆన్ లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్ లు జనజీవన స్రవంతిలో భాగమైపోయాయి. నియంతృత్వ పరిపాలనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో మార్పు కోరుకున్నా, జాత్యంహాకారం ఆ దేశాన్ని ఇంకా తన కంబంధ హస్తాల్లోనే బిగించి ఉంచింది. బ్రిటన్ మాత్రం రాజరికంలో ఆధునిక పోకడలను చవిచూసింది. ప్రిన్స్ హారిస్ తన రాజరిక హోదాను ఒదలుకుని భావితరం వారికి మార్గదర్శకుడయ్యాడు. ప్రజాస్వామ్యంలో రాజరికానికి చోటులేదని చెప్పకనే చెప్పాడు. ప్రపంచ స్టాక్ మార్కెట్లు రాబడి, నష్టాల మధ్య ఊగిసలాడాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మూడోసారి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. అంతటితో ఆగక ఒక చారిత్రాత్మక తీర్మానం ద్వారా జెన్ పింగ్ ను శాశ్వత అధ్యక్షుడిగా నియమిస్తూ దేశానికి తిరుగులేని నాయకుణ్ణి చేసింది. 7,000 మంది సెంట్రల్ అమెరికా శరణార్థులు అమెరికాలో పాదం మోపడానికి, అలాగే బెలురస్-పోలండ్ సరిహద్దు గుండా యూరోపియన్ యూనియన్ లోకి ప్రవేశించాలని అనేకమంది శరణార్థులు విశ్వప్రయత్నం చేసి విఫలమై ఎదురు తెన్నులు చూస్తున్నారు. ప్రపంచమంతటా శరణార్థుల సమస్య రోజు, రోజుకి ఉధృతమవుతోంది. మయన్మార్, థాయ్ లండ్, హాంగ్ కాంగ్ దేశాల్లో రాజకీయ అణచివేతకు విరుద్ధంగా నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రపంచం నలుమూలలా ప్రబలిన అరాచకత్వం, పేదరికం, నిస్సహాయత, నిర్భాగ్యుల నిట్టూర్పల మధ్య 2021 నెమ్మదిగా నిష్క్రమించింది. గుడ్ బై 2021….

ముగిసిన ప్రస్థానం:

పదహారేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి ఇక సెలవన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్. జర్మనీ తొలి మహిళా ఛాన్సలర్ గా పగ్గాలు పట్టి ఐరోపాలోనే అతిపెద్దదైన ఆర్ధిక వ్యవస్థను ఎంతో చాకచక్యంగా ముందుకు నడిపి ప్రపంచ దేశాల నాయకులందరి మన్ననలను పొందిన మోర్కెల్ డిసెంబర్ 8, 2021న స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త అయిన మోర్కల్ నవంబర్ 22, 2005న తూర్పు జర్మనీ ఛాన్సలర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. గత పదేళ్లుగా ఫోర్బ్స్ ప్రపంచంలో అతి శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకోవడం ఆమె ప్రతిభకు తార్కాణం. జూలై 17, 1954లో జన్మించిన మోర్కల్ తండ్రి ఒక క్రైస్తవ గురువు. ఫిజిక్స్ లో డాక్టరేట్ పట్టా పొందిన మోర్కల్ 1989లో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొనటం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నారు. ఐరోపా ఆర్థిక సంక్షోభ సమయంలో ఆమె చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల మన్నలను పొందటంతోపాటు జర్మనీ ఆర్థికాభివృద్ధి దిశగా నడిపించాయి. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నోఒడిదుడుకులను, విమర్శలను ఎదుక్కొన్న మోర్కల్ సిరియా శరణార్థులను, వలసదారును జర్మనీలోకి ఆహ్వానించటం ద్వారా 2015 సంవత్సరపు టైమ్స్ పత్రిక ఆ సంవత్సరపు కీలక వ్యక్తిగా గుర్తింపు పొందటంతోపాటు, ఆమె చూపిన మానవతా దృక్పథం వల్ల ఐక్య ఐరోపా కూటమికి తిరుగులేని నాయకురాలయ్యారు. ముఖ్యంగా రష్యా, అమెరికాలతో దౌత్య సంబంధాలను నిలకడగా ఉంచటంలో ఆమె కృషి అభినందనీయం. మొదట్లో బహిరంగ సభల్లో మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడ్డ మోర్కస్ తనదైన శైలిలో చూపుడు వేళ్లను కలిపి డైమండ్ ఆకారంలో చేతులను కలపతూ తనకంటూ ఒక బ్రాండ్ ను సృష్టించుకున్నారు. మోర్కల్ పరిపాలన జర్మనీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ ఒక యుగం.

తాలిబాన్ వశమైన ఆఫ్గనిస్తాన్:

గత 20 సంవత్సరాలుగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తాలిబాన్ ఉక్కుపాదల కిందకు చేరింది. 1994లో అవినితీపై శంఖారావం చేసిన తాలిబాన్లు క్రమంగా షరియా ఇస్లామిక్ విధానాలను అమలు చేస్తూ ఉగ్రవాద రూపాన్ని దాల్చారు. 1996 నాటికి దాదాపు దేశాన్నంతటిని నియంత్రణలోకి తెచ్చుకుని తమ ఇనుప పాదాల కింద నొక్కి పట్టారు. 2001లో అమెరికా ఆధ్వర్యంలో పలు ప్రప్రంచ దేశాల సైనికదళాలు తాలిబాన్లను అధికారం నుంచి కూలదోసి ప్రజాస్వామ్య పరిపాలనను, నాయకత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆఫ్ఘన్ లో శాంతిభద్రతలను నెలకొల్పడానికి తాలిబాన్లు, అమెరికా మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 2020లో టర్కీలో జరిగిన శాంతి ఒప్పందం మేరకు, తాలిబాన్ ఒప్పందం నిబంధనలకు కట్టుబడి ఉంటే, 14 నెలలో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా దాని మిత్ర దేశాల సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. విదేశీ సైనిక దళాలు పూర్తిగా నిష్క్రమించకుండానే, ప్రజాస్వామ్యం ఆ దేశ పునాదులను పటిష్టం చేసే లోపలే తాలిబాన్లు తమ బలాన్ని పెంచుకొని ఆఫ్ఘన్ రాజధానిని చుట్టుముట్టాయి. విదేశీ సైనిక జోక్యం, ఉగ్రవాద మూకల ఆక్రమణ, మితిమీరిన ఛాందసవాద పాలన, విపరీతమైన జననష్టం, ఆర్ధిక సంక్షోభం మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ముంగిట నిలిచాయి. ఆఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణం కోసం 143 బిలియన్ డాలర్లూ, ఆఫ్ఘన్ సైన్యం ఆధునికీకరణకోసం 90 బిలియన్ డాలర్లూ, పరిపాలన కోసం, ఆర్థికాభివృద్ధికోసం 36 బిలియన్ డాలర్లూ అమెరికా ఖర్చు చేసినా గడిచిన 20 సంవత్సరాలలో 50వేల మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినా, 70 వేల మంది ఆఫ్ఘన్ సైనికులు అశువలు బాసినా చలించని తీవ్రవాదం కోరాలు సాచి పగడ విప్పింది. అభివృద్ధి బాటపై ప్రయాణం ప్రారంభించిన ఆఫ్ఘన్ పౌరుల, ముఖ్యంగా మహిళల భవితవ్యం అగమ్యగోచరమైంది.

కోవిడ్ మహమ్మారి:

కోవిడ్ నుంచి 2021లో కూడా ప్రపంచ ప్రజలకు విముక్తి లభించలేదు. కోవిడ్ వైరస్ జన్యుపరమైన మార్పులు చెందుతూ, డెల్టా, ఓమిక్రాన్ అంటూ పలు రకాల రూపాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. వైరస్ తగ్గుముఖం పడుతోందని అనుకునేలోపలే మరో రూపంతో ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2019లలో చైనాలో తలెత్తిన ఈ వ్యాధి బారిన పడి డిసెంబర్ 20 నాటికి 53.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 27.7 కోట్ల మందికి ఈ వ్యాధి సోకింది. అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, భారతదేశం రెండవ స్థానంలోనూ, బ్రెజిల్ మూడవ స్థానంలోనూ ఉన్నాయి. 50లక్ష్లలకు పైగా కేసులు నమోదైన దేశాల్లో యునైటెడ్ కింగడమ్, రష్యా, టర్కి, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, అర్జెంటినా, ఇటలీ మొదలగు దేశాలున్నాయి. కోవిడ్ మరణాలు కూడా ఈ దేశాల్లో అధికంగానే ఉంది. దీనివల్ల ఆయా దేశాల వైద్యవసతుల మీద, వైద్య సిబ్బంది మీద తీవ్ర ఒత్తిడి కలుగుతోంది. నిరంతర కర్ఫ్యూలు, లాక్ డైన్ల వల్ల దేశాల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనపరుస్తోంది. వైరస్ ను నిరోధించడానికి అనేక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్. ఆస్ట్రోజనికా, మోడ్ర్ నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు దాదాపు 100 దేశాల్లో విస్తృతంగా ప్రజలకిస్తున్నారు. డిసెంబర్ 20 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 881కోట్ల జనాభాకు కోవిడ్ డోస్లు ఇచ్చారు. దాదాపు 377 కోట్ల అంటే 48.4 శాతం ప్రపంచ జనాభా ఇప్పటికే రెండు విడతల టీకాలను పోందారు. కాగా వైరస్ అనేక ఇతర రూపాలు పోందుతుండటంతో వివిధ దేశాలు బూస్టర్ డోస్లను ఇచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆస్ట్రేలియాలో దాదాపు కోటీ 97 లక్షలు అంటే 76.5శాతం ప్రజలు రెండు మోతాదుల వ్యాక్సిన్ ను పోందారు. భారతదేశంలో జాతీయ కోవిడ్ -19 టీకా కార్యక్రమం కింద మొత్తం 139.7 కోట్ల డోసులను ఇప్పటి వరకు పంపిణీ చేశారు.

టోక్యో ఒలింపిక్స్:

2020లో జరగవల్సిన ఒలింపిక్ క్రీడలు ఎట్టకేలకు 2021లో జపాన్ రాజధాని టోక్యోలో అనేక నిబంధనలు, నియంత్రణల మధ్య పూర్తయ్యాయి. ఇదివరకు కూడా మూడు సార్లు (1964, 1972, 1988) ఒలింపిక్స్‌కు జపాన్ ఆతిథ్యం వహించింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడోత్సవాలు కోవిడ్ కారణంగా సంవత్సరంపాటు వాయిదా పడ్డా, క్రీడాకారుల్లో మాత్రం ఉత్సాహం సడలలేదు. ఈ క్రీడల్లో 33 విభాగాల్లో 339 ప మొత్తం 11,600 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. 39 స్వర్ణ పతకాలును గెలుచుకొని అమెరికా ఈ క్రీడల్లో ప్రథమ స్థానాన్ని పొందగా, చైనా, జపాన్లు తదుపరి రెండు స్థానాలను చేజికించుకున్నాయి. క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకల్లో స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించలేకపోవడం, ఆఖరికి క్రీడలను కూడా వీక్షించడానికి అంతర్జాతీయ ప్రేక్షకులు రాలేకపోవడం దురదృష్టకరమే అయినా క్రీడా స్ఫూర్తికి మాత్రం ఎటువంటి కొరత కనబడలేదు. ఈ సారి ఐదు ప్రత్యేక క్రీడల విభాగాలను – సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే, బేస్‌బాల్‌లను కొత్తగా ఒలింపిక్స్‌లో చేర్చారు.

టోక్యో ఒలింపిక్స్ ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా క్రీడాలోకాన్ని కలచి వేస్తున్న మానసిక ఆందోళన, తీవ్రతలను బహిర్గతం చేసింది. అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ సువర్ణ పతాకానికి అడుగు దూరంలో ఉండగా పోటీ నుంచి వైదొలగి మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. అంతకు ముందే జపాన్ టెన్నీస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా మానసిక ఒత్తిడి దృష్ట్యా ఫ్రెంచ్, వింబుల్డన్ పోటీల నుంచి వైదొలగి ప్రపంచం దృష్టిని మానసిక ఆరోగ్యం దిశగా మరల్చింది. కోవిడ్ దృష్ట్యా క్రీడాకారులు సామాజిక దూరాన్నిపాటిస్తూ, తమ కుటుంబాలకు, స్నేహితులకు సంవత్సరంపాటు దూరంగా ఉండవల్సి రావటం తమని క్రుంగదీసిందని రష్యా జిమ్నాస్ట్ యాంజిలినా మెల్న్ కోవా తెలిపింది. అలాగే బ్రిటన్ కు చెందిన స్విమ్మర్ టామ్ డీన్ రెండుసార్లు కోవిడ్ బారిన పడ్డాడు. దానాదీనా, ప్రపంచ క్రీడాకారులందరికి గత రెండు సంవత్సరాలు గడ్డు సమయం. అలాగే అనేకమంది క్రీడాకారులు కోవిడ్ వల్ల తమ ఆత్మీయులను కోల్పోయారు. ఇలాంటి సమయంలో పోటీల ఒత్తిడి క్రీడాకారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.సిమోన్ నిర్ణయం ఎంతోమందిని ఆశ్చర్యపర్చినా, మొట్టమొదటసారిగా క్రీడాకారుల మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చకు నాంది పలికింది.

ఇక జాతి, మహిళా వివక్షత. మైనారిటీల అణచివేతలపై కొందరు అథ్లెట్లు ఈ ఒలింపిక్స్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. బ్లాక్ లైఫ్ మాటర్స్, ట్రాన్స్ జెండర్, స్వలింగ సంపర్కం, అనేక దేశాల్లో జరుగుతున్న రాజకీయ, ప్రజాస్వామ్య అణచివేతలు వంటి వివాదాస్పద ఉద్యమాలకు పలువురు అథ్లెట్లు బహిరంగంగా తమ మద్దతును తెలపటం ద్వారా ప్రపంచ క్రీడలు ఇలాంటి వివాదాలకు, నిరసనలకు అతీతం కారాదంటూ నూతన అధ్యాయానికి నాంది పలికింది.

అంతరిక్షంలో సామాన్యులు

చందమామ రావే, జాబిల్లి రావే అని అమ్మ జోలపాటలు పాడుతూ నింగిలోని చందమామను చూపిస్తుంటే ఎంతో అబ్బురంగా ఉండేది. మానవుడు చందమామపై కాలుబెట్టిన నాడు అందరికి సాధ్యమయ్యేది కాదులే అని సరిపుచ్చుకున్నాం. కానీ నేడు అంతరిక్షయానం అందరికి అందుబాటులోకి వచ్చే తరుణం ఇంకెంతో దూరం లేదని 2021 నిరూపించింది. ఇప్పటి వరకు నాసా వంటి ఒకటి, రెండు అంతరిక్ష కేంద్రాల నుంచి మాత్రమే, వ్యోమగాములు అంతరిక్షయానం చేసేవారు. కానీ 2021లో 16 అంతరిక్ష ప్రయాణాలను ప్రైవేట్ సంస్థలు నిర్వహించి, ఇక సామాన్య పౌరులు కూడా అంతరిక్షంలోకి విహారయాత్రలు చేయవచ్చని చెప్పాయి. డబ్బుంటే ఆకాశాన్ని కూడా అరికాలింద తొక్కిపెట్టచని జెఫ్ బెజ్సో, రిచర్డ్ బ్రాన్సన్, ఎలాన్ మస్క్ లు అంతరిక్షయానంలో కొత్త అధ్యాయానికి రూపకల్పన చేశారు. ఎంతమాత్రం రోదసీ అనుభవంలేని నలుగురు సామాన్యులను ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది. బేజ్సో బ్లూ ఆరిజన్, బ్రానసన్ వర్జిన్ గాలక్టిక్ లు కూడా సామాన్యులను తమ ప్రైవేట్ అంతరిక్షనౌకల్లో రోదసీయానం చేయించి తీసుకోచ్చారు. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్, వర్జిన్ గాలక్టిక్ చెరో నాలుగు, బ్లూ ఆరిజన్ ఎనిమిది సార్లు అంతరిక్ష నౌకలను విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష విహారంలో ప్రైవేటు రంగానికి దారి సుగమమం చేశారు. అయితే ఈ అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి మాత్రం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండగలదు. వర్జిన్ గాలక్టిక్ లో అంతరిక్ష విహారం చేయాలనుకుంటే టికెట్ ఖరీదు 3.5కోట్లు. ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ పెరిగి టికెట్ ధరలు నేలను తాకేవరకు సామాన్యులకు అంతరిక్షయానం అందని ద్రాక్షపండే, అమ్మ నోట జోలపాటే.

శీతోష్ణ మార్పులపై శీతకన్ను

భూవాతావరణంలో, శీతోష్ణస్థితిగుతలలో వస్తున్న పెనుమార్పులు ఆందోళన కలిగిస్తున్నా, పర్యావరణ సమస్య పట్ల ప్రపంచ నాయకులు ఏకాభిప్రాయంతో వ్యవహరించలేకపోతున్నారు. పారిశ్రామిక విప్లవం వల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవించి భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని ప్రతీ దేశం తమ వంతు తగ్గించకపోతే సముద్రమట్టాలు పెరిగి అనేక ద్వీపాలు జలగర్భంలోకి చేరి పోతాయి. గత సంవత్సరం ఆస్ట్రేలియాలో ఏర్పడ్డ కారుచిచ్చుల్లాంటివి సర్వసాధారణమైపోతాయి. హిమశిఖరాలు కరిగి నేల కొరుగుతాయి. అకాల వర్షాలు, వరదలు నగరాలను ముంచెత్తుతాయి. ఈ సంత్సరం గ్లాస్గోలో జరిగిన పర్యావరణ సదస్సు సందర్భంగా వేల సంఖ్యలో విద్యార్ధులు, యువత ప్రపంచ నేతల తీరు పట్ల తమ నిరసన తెలుపుతూ వీధులకెక్కారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకూ ‘కాప్‌26’ (Cop26 Glasgow) పేరుతో గ్లాస్గోలో జరిగిన సదస్సులో ప్రపంచ నాయకులు భూతాపాన్ని అదుపులోకి తేవడానికి చర్చలు జరిపాయి. భూ ఉష్ణోగ్రత 1.5 సెల్సియస్ డిగ్రీలు దాటకుండా నియంత్రించాలని ప్యారిస్ సదస్సులో ఒప్పదం కుదిరింది. ఈ మేరకు దేశాలు క్రియాశీలకు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ 2050కల్లా అన్ని దేశాలూ కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలని పిలుపిచ్చారు. అయితే అనేక దేశాలు కర్బన ఉద్గారాలను నెట్‌ జీరో స్థాయికి తగ్గించడమంటే ఆర్థిక వృద్ధికి తిలోదకాలివ్వటమే అన్న అభిప్రాయ కలిగి ఉన్నాయి. అందుకు పలు దేశాలు పర్యావరణ పరిరక్షణపై ఉదాసీనతతో ఉన్నాయి. శిలాజ ఇంధనాలు ఆధారంగా పని చేసే పరిశ్రమలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కర్బన్‌ వాయువులను విడుదల చేసే పరిశ్రమలకు, శిలాజ ఇంధన పరిశ్రమలకు అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇస్తున్నాయి.

సౌమ్యశ్రీ రాళ్ళభండి