కోపరూపాలు

కోపరూపాలు
కోపరూపాలు

‘‘నీకు కోపం వస్తే ఎంత అందంగా ఉంటావో తెలుసా’’ అంటాడు మగాడు ఆడదానితో సాధారణంగా పెళ్లికాకముందు. పెళ్లయ్యాక, భార్య కోపంతో రెచ్చిపోతుంటే ‘‘ఏం, కోపంలో చాలా అందంగా ఉంటాననుకుంటున్నావా, వెళ్లి ఒకసారి అద్దంలో ముఖం చూసుకో’’ అంటాడు భర్త.

‘‘నాకు కోపం వస్తే మనిషినికాను. జాగ్రత్త’’ అంటారు మగవాళ్లు కొందరు కోపంతో. నిప్పుతొక్కిన కోతిలా గెంతులేస్తారు కొందరు. తోకతొక్కిన తాచులా బుస్సుమంటారు కొందరు. కొందరు ఆల్సేషన్లా అరుస్తారు. కొందరు చేతిలో ఏముంటే దానిని విసిరేస్తారు. కొందరు ఎదుటివారిని ఏమి చేయలేక నెత్తి మొత్తుకొంటారు. లేకపోతే, లెంపలు వాయించుకుంటారు.

పురాణాల్లో దేవుళ్లు, దేవతలు, మునులు, పతివ్రతలు – ‘పవరు’న్న ప్రతీవాళ్లు కోపంలో శపించేవారు. ఆ శాపాలు తూ.చా. తప్పకుండా పనిచేసేవి. కథలు ముందుకు సాగటానికి ఆ శాపాలే మూలాధారాలు. విశ్వామిత్రుడికి కోపం రాకపోతే హరిశ్చంద్రుడి కథే లేదు. దుర్వాసుడికి కోపం రాకపోతే శకుంతల కథే లేదు. వినాయకుడికి చంద్రుడిమీద కోపం రాకపోతే ఈనాటికీ వినాయకుడిని తలచుకునేవారా!

ఆడవాళ్లకు కోపం వస్తే అలుగుతారు సాధారణంగా. అలకే వారి ఆయుధం. ఆ విషయంలో ఆడవాళ్లందరికీ సత్యభామే ఆదర్శం.

కోపంతో మౌనం వహిస్తే – అంటే మూతి మూడుచుకుని బిర్రబిగుసుకు పోయి కూర్చుంటే ఒక్కొక్కప్పుడు అనుకున్నవి తొందరగా సాధించగలుగుతాము. ఎదుటివాళ్లు ఆ మౌనాన్ని ఎక్కువసేపు భరించలేక కాళ్లబేరానికి దిగుతారు. మరీ బిగుసుకుపోతే తాడుతెగే ప్రమాదం కూడా లేకపోలేదు.

పువ్వుపుట్టగానే పరిమళించినట్లు మనిషి స్వభావం చిన్నప్పుడే కాస్తో కూస్తో వెల్లడవుతుంది. అహంభావం, గర్వం, సహనం, ఔదార్యం, వినయం ఇటువంటి లక్షణాలన్నీ చిన్నప్పటినుంచీ వ్యక్తమవుతూనే ఉంటాయి వారివారి ప్రవర్తనలో. చిన్నప్పుడు నాకు కోపంవస్తే అన్నం తినటం మానేసేదాన్ని (అది గాంధీగారి ప్రభావం కాదు. నా స్వయం ప్రతిభే). అమ్మ నాలుగైదుసార్లు బ్రతిమాలేది. ఇంకొక్కసారి అడిగితే తినేద్దాం అని మనస్సులో నిర్ణయించుకుని అమ్మ పిలుపు కోసం ఎదురుచూచేదాన్ని. కాని, ఒక్కొక్కప్పుడు ఆవిడకి ఓపికలేక మాట్లాడక ఊరుకునేది. ఇక ఆ రోజుకి పస్తే. ఈ చిట్కా పెళ్లయిన తర్వాత పనిచేయ్యలేదు. ‘‘నువ్వు తినకపోతే నేను తినను’’ అని భర్త భీష్మించుకుంటే ఏ భార్య లొంగిపోదు?

మా మేనకోడలు చిన్నప్పుడు ఒకరి పెళ్లిలో అందరితోబాటు తనక్కూడా పళ్లు, తాంబూలం, మిఠాయి ఉన్న సంచీ ఇవ్వలేదని, వెంటనే కట్టుకున్న పట్టు పరికిణీ, జాకట్టూ విప్పేసి పెళ్లిపందిట్లో బోర్లా పడుకుని ఏడవడం మొదలుపెట్టింది. పెద్దాయాక అది మారింది కాబట్టి సరిపోయింది.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తరచూ కోపానికి లోనవుతూ ఉంటారు. వారిని బుజ్జగించి మంచిమాటలతో దారిలోకి తీసుకురాగల సహనం చాలామందికి ఉండదు. చెడామడా తిట్టేస్తారు. ‘‘డొక్క చీల్చేస్తాను,’’ ‘‘కాళ్లువిరగ్గొడతాను,’’ ‘‘తోలు వలిచేస్తాను’’ లాంటి మాటలతో బెదిరిస్తారు. చేతిలో ఏముంటే దానితో కొట్టేస్తారు కొందరు. ఒక్కొక్కప్పుడు సమయానికి ఏమీ దొరక్క ఆ కోపం భార్య మీదకో నౌకరు మీదకో మళ్లుతూ ఉంటుంది.

కొందరికి పిచ్చి కోపం వస్తుంది. అంటే కోపం పిచ్చిదని కాదు. కోపంలో వాళ్లు పిచ్చి వాళ్లలా ప్రవర్తిస్తారు. ‘‘అత్తమీద కోపం దుత్తమీద చూపించింద’’ని, ‘‘అత్తగారిమీద కోపంతో కూతుర్ని కుంపట్లో కుదేసింద’’ని సామెతలు చెప్పినట్లుగా ఒకరి మీద కోపాన్ని మరొకరిమీద చూపిస్తారు. ‘‘బాసు’’ మీద కోపం భార్య మీద చూపించడం మామూలే కాదా.

మా నాన్నగారికి ఒకసారి ఎందుకో వెర్రి కోపం వచ్చింది. ఆయన చేతినున్న వాచీని తీసి నేలమీద గిరవాటేసి, పెరట్లో రోటి దగ్గరున్న పచ్చటిబండతో దాన్ని చితకొట్టి, ఇంకా కోపం చల్లారక, ఆ వాచీని మండుతున్న పొయ్యిలో పడేశారు.

నాకోసారి మావారి మీద ఎందుకో చెడ్డకోపం వచ్చి చేతిలోనున్న పుస్తకాన్ని విసిరిపారేశాను. ఈకలు పీకిన కోడిలా పడున్న ఆ పుస్తకాన్ని చూడగానే చటుక్కున్న గుర్తుకొచ్చింది అది లైబ్రరీ పుస్తకమని. చచ్చినట్లు నేనే వెళ్లి ఆ పుస్తకాన్ని తీసి కవరు సర్ది బల్లమీద భద్రంగా పెట్టేశాను.

కొందరికి కోపంవస్తే తెలుగులో ఉచ్ఛరించరాని పదాలన్నిటినీ వాడుతారు. కొంతమంది ఇంగ్లీషులోనే తిడతారు కోపం వస్తే. కొంతమంది కోపం తాటాకు మంటలా గప్పున వెలిగి తుస్సుమని చల్లారిపోతుంది. కొంతమంది కోపం చిటపట చినుకుల్లా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మరికొందరు కోపం ఆస్తి పంపకాల వరకూనో విడాకులవరకూనో దారి తీస్తుంది. కొందరి కోపం హత్యానేరాలకు కూడా దారితీస్తుంది.

కోపం రావటం కోపం ప్రదర్శించటం మానవ సహజం. దాన్ని ఎప్పటికప్పుడు కక్కేసి మరిచిపోతే పరవాలేదు. కోపాన్ని అణచిపెట్టుకుంటే అనుకోకుండా అది ఎప్పుడో లావాలా పొంగి అనుకోని ప్రమాదానికి దారి తీయవచ్చు. లేదా క్రమంగా వేళ్లు పాతుకుపోయి కక్షగా రూపొంది, మనసుని కలుషితం చేసి, మనిషిని మంచితనానికి దూరం చేస్తుంది.
కోపాన్ని జయించడానికి పురాణకాలం నుంచి ఈనాటి వరకూ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కోపాన్ని జయించడానికి వివిధ ప్రయత్నాలు చేసేదానికన్నా కోపం ఎందుకు వస్తుందో గమనించడానికి పూనుకుంటే కోపంయొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుందిట. అది అర్థమైతే కోపానికి తావుండదట. ఆ చిట్కా ప్రయత్నించ తగినదే.
కోపం తెచ్చుకోవడం ఎంత సులభమో కోపం తెప్పిచడం కూడా అంతే సులభం. మన కిష్టంలేని పనులు ఎదుటివారు చేస్తే మనకి కోపం వస్తుంది. అలాగే ఎదుటివారి కిష్టంలేని పనిని మనం చేసి వారికి కోపం తెప్పిస్తాము. మనకి లేనిది ఎదుటివారికుంటే మనకు కోపం వస్తుంది. మనకి లేకుండా చేసి ఎదుటివారు అనుభవిస్తుంటే మరింత కోపం వస్తుంది. ఎవరికీ కోపం తెప్పించకుండా, ఎవరిమీదా కోపం తెచ్చుకోకుండా ఉండడం ఈ సంఘంలో మానవ సహజీవనంలో ఎంతవరకు సాధ్యం? ఆవేశం వస్తే ప్రయోగించడానికి అప్పడాల కర్ర నించి ఆటంబాంబుదాకా అనేక ఆయుధాలున్నాయి మనదగ్గర.

కోపం కోపావేశంగా రూపాంతరం చెందకుండా ఉండాలి. వాదం ఉగ్రవాదంగా రూపొందకుండా ఉండాలి.

(అబ్బూరి ఛాయాదేవి గారి వ్యాసం, జనవరి 18, 1987లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.)