కమలా ఓటమికి కారణాలు అనేకం

కమలా ఓటమికి కారణాలు అనేకం
కమలా ఓటమికి కారణాలు అనేకం

కర్ణుడి చావుకి కారణాలు అనేకం. ఎన్నికల బరిలో నిలిచాక గెలుపు, ఓటములు సహజం. ఓడిపోయాక కారణాలు వెతుక్కోవటం కంటే, కారణాలు గ్రహించి, వాటిని సరిదిద్దుకునే వాడే రాజనీతిజ్ఞుడు అనవచ్చు. ఓటమిని అంగీకరించి హుందాగా వ్యవహరించటం అందరి వల్ల అయ్యే పనికాదు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంపే పెద్ద ఉదాహరణ. ఈ ఎన్నికలలో కూడా ఓడిపోతానేమో అన్న చిన్న సందేహం మదిలో మెదిలిందేమో, ఎన్నికలలో ఎటువంటి అవకతవకలు జరగకపోతే మనమే గెలుస్తామని ముందుగానే తన మద్దతుదారులను పోరాటానికి సిద్ధం చేశాడు. వారు మళ్లీ కాపిటల్ హిల్ పై దాడి చేయాల్సిన అవసరం రాకుండానే విజయం ట్రంప్ సొంతమవటంతో ప్రజాస్వామ్యం తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంది.

అసాధారణ పరిస్థితులలో అమెరికా అధ్యక్షడు జో బైడన్ స్థానంలో ఎన్నికల బరిలోకి దిగిన కమలా హారిస్ కు ట్రంప్ తో తలపడడానికి తగినంత సమయం దొరకలేదని, అదే ట్రంప్ అయితే గత ఎన్నికల ఓటమి నుంచి తనను తాను సంసిద్ధం చేసుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది ఒకరకంగా హారిస్ ఓటమికి కారణమంటున్నవారు కూడా లేకపోలేదు. అలాగే చాలామంది కమలా హారిస్ బైడన్ నెగ్గిన రాష్ట్రాలలో ఓడిపోయిన విషయాన్ని ఎత్తిచూపిస్తూ, ఆమె ట్రంప్ కు తగిన అభ్యర్ధి కాదని, అదే ఓటమికి కారణమని ఇప్పుడు అంటున్నారు. కానీ, బైడన్ ఎన్నికలు నెగ్గిన రోజున, ట్రంప్ అధికారంలో ఉన్న విషయాన్ని, ఆ సమయంలో ప్రజల మనోభావాలని విస్మరిస్తున్నారు. అదీకాక, ట్రంప్ అప్పుడు బైడన్ని అంటే మరో పురుష అభ్యర్ధిపై పోటీ చేసి ఓడిపోయాడు. ఇంకా, వివరంగా చెప్పాలంటే, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రెండుసార్లు అతని పోటీ పడినది హిలరీ క్లింటన్ మరియు కమలా హారిస్, ఇద్దరు మహిళలతో అన్నది ఈ సందర్భంగా గమనార్హం. అంటే అమెరికా ప్రజలు ఒక మహిళను అధ్యక్ష పదవిలో చూడటానికి ఇష్టపడలేదా? అందుకే ప్రతిప్రక్ష అభ్యర్థి ఎలాంటి వాడైనా గెలిపించారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పటం కష్టం. కానీ, ఎన్నికల తీరును గమనిస్తే, అదే నిజం అని అనకతప్పదు.

నేడు కమలా హారిస్ ఓటమి ఒకరకంగా, ఆమెది కాదు. అమెరికా ప్రజలది. మహిళలకు సాధికారికత ఉండకూడదనుకునే వారి సంకుచిత మనస్తత్వానిది. కాకపోతే, మహిళల ‘రక్షకుడి’గా తనను తాను అభివర్ణించుకున్న, ఇదే ట్రంప్ మహిళలపై లైంగిక అత్యాచారం చేసిన కేసులో దోషిగా కోర్టు గుర్తించదన్న విషయాన్ని ఎలా విస్మరించారు? ‘‘సమాజంలో మనం ప్రముఖులమైతే మహిళలను ముద్దు పెట్టుకోవచ్చు. వాళ్లను చూస్తే నేను ఆగలేను. వారు కూడా ముద్దు పెట్టకోనిస్తారని,’’ ఎంతో అసభ్యంగా మాట్లాడిన ట్రంప్ మహిళలను రక్షిస్తాను అంటే, నమ్మడానికి మహిళలు తెలివితక్కువ వారు కాదని కమలా హారిస్ తన ఎన్నికల ప్రసంగాలలో పదే, పదే చెప్పింది. సర్వేలన్నీ కూడా ఎక్కువ శాతం మంది మహిళలు కమలా హారిస్ కు మద్దతు పలుకుతున్నారని చెప్పాయి. చివరికి ఏం తేలింది? మహిళలు నిజంగానే తెలివితక్కువ వారని, స్వాభిమానం లేనివారని ట్రంప్ కు ఓటు వేసి గెలిపించటం ద్వారా చెప్పకనే చెప్పారు. మహిళలు, యువత తనకు మద్దతునిస్తారని ఆశించిన కమలా హారిస్ ఆశాలు నిరాశే అయ్యింది. ఇది ఆమె ఓటమికి ప్రధాన కారణం.

అలాగే, ఈ ఎన్నికలలో పెద్ద సమస్యగా చెప్పుకుంటూ వచ్చిన గర్భనిరోధక (అబార్షన్) బిల్లు ఓటర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ వివాదం చుట్టే కమలా హారిస్ ఎన్నికల ప్రణాళికంతా ఆధారపడింది. ట్రంప్ మాత్రం తెలివిగా ఈ విషయాన్ని ఎన్నికల ప్రసంగంలో దాటవేస్తూ వచ్చాడు. అల్బామా, ఇదాహో, టెన్నెస్సీ రాష్ట్రాలలో అబార్షన్ చేసుకోవటం చట్ట విరుద్ధమే కాదు, నేరం కూడా. టెక్సాస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, అబార్షన్ చేసుకోవడానికి తమ ప్రాంతాల గుండా, రహదార్ల గుండా కార్లలో వెళ్లడాన్ని కూడా నేరంగా పరిగణిస్తాయి. కేంద్ర అబార్షన్ చట్టాన్ని ట్రంప్ ప్రభుత్వం రాష్ట్రాలకు బదలీ చేయవచ్చు. అబార్షన్ నిరోధక చట్టం, నిరోధక మందుల పంపిణీ చట్టవిరుద్ధంగా చేసే ప్రాజెక్ట్ 2025 గురించి ఇంక మనం బహిరంగంగా మాట్లాడవచ్చు ఆ పార్టీలోని కొంతమంది మద్దతుదార్లు అనడం మొదలు పెట్టారు. ప్యూ పరిశోధనా సంస్థ జరిపిన సర్వేలో 63శాతం మంది అమెరికన్లు అబార్షన్ ను చట్టబద్ధం చేయాలని కోరుకుంటున్నారని తెలిపింది. మరి వీరంతా ఏమైనట్టు? వారి ఓట్లన్ని ఏమైనట్టు? కీలక రాష్ట్రాలుగా చెప్పుకునే ఆరిజోనా, నార్త్ కారోలినా వంటి రాష్ట్రాలలో అబార్షన్ సమస్య ఎన్నికల అంశం కాలేదు. ఈ విషయాన్ని కమలా హారిస్, డెమోక్రటిక్ మద్దతుదారులు, వ్యూహకర్తలు గ్రహించలేకపోయారు. గ్రహించేటప్పటికి ఆలస్యమైనా అయ్యుండాలి. లేదా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా నిలవాలంటే మహిళల సమస్యను ప్రధాన అంశంగా చేసుకుని ఎన్నికలలో పోటీపడాలనే తప్పుడు నిర్ణయమైనా ఆ పార్టీ వ్యూహకర్తలు తీసుకుని ఉండాలి. ఏదిఏమైనప్పటికీ, మహిళా ఓటర్లపై కమలా హారిస్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.

వీరికి తోడు యువత కూడా అనుకున్న విధంగా కమలా హారిస్ కు మద్దతు పలకలేదు. ట్రంప్, హారిస్ ఇరువురు యువతను ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాలను ఆశ్రయించారు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, లైవ్ స్ట్రీమలతో వారికి దగ్గరవ్వాలని తీవ్రంగా ప్రయత్నించారు. మరోసారి సర్వేలు కమలా హారిస్, డెమెక్రట్లను తప్పుదారి పట్టించాయి. న్యూయార్క్ టైమ్స్, యుగౌ, సిబిఎస్స్ ఇలా అన్ని సర్వేలు పదే, పదే దాదాపు 60శాతం మంది యువత హారిస్ కు మద్దతు పలుకుతున్నారని చెప్పాయి. కానీ ఫలితాలు మాత్రం తారు, మారయ్యాయి. చారిత్రాత్మికంగా చూస్తే, యువత పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్ లో పాల్గొనరు. నవంబర్ 2022 మధ్యంతర ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే, 18 నుంచి 29 మధ్య వయసు గల వారిలో కేవలం 25.5శాతం మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. కానీ 60 ఏళ్ల పైడిన వారిలో 63.1శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే 2020 అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే 78శాతం మంది 60 ఏళ్ల పైడినవారు, 52.5శాతం యువత ఓటింగ్ లో పాల్గొన్నారు. అంటే యువత మద్దతు పలికితే చాలదు. వారు పెద్ద ఎత్తున వచ్చి ఎన్నికలలో పాల్గొనాల్సి ఉంటుంది. 2020లో బైడన్ గెలుపులో యువత కూడా తమ వంతు చేయూతనిచ్చారు. కానీ మరోసారి ఎన్నికల సర్వేలను తలకిందులు చేస్తూ, యువత కమలా హారిస్ కు చేయి ఇచ్చారు. ఎన్నికల సర్వేలు డెమోక్రటిక్ అభ్యర్ధి గెలుస్తారని చెప్పిన ప్రతిసారీ వారు ఓడిపోయారు. హిలరీ క్లింటన్ విషయంలోనూ వారు ఇదే తప్పిదాన్ని చేశారు. సర్వేలన్నీ హిలరీ నెగ్గుతాయని చెప్పగా, ఏం జరిగిందో మనం చూశాం. ఇప్పుడు మరోసారి సర్వేలన్ని కలిసి కమలా హారిస్ ను ఓడించాయి.

చివరగా, జో బైడెన్ కమలా హారిస్ కు ఒక తెల్ల ఏనుగుగా పరిణమించాడా? అవును, కాదు ఈ రెండు జవాబులు విశ్లేషకుల నోటి నుంచి విన్పిస్తున్నాయి. బైడెన్ భూతం నిను, వీడని నీడను నేను అన్నట్టుగా కమలా హారిస్ ను వీడలేదనే చెప్పాలి. బైడెన్ ప్రభుత్వ అసమర్థతకు, విధాన నిర్ణయాలకు కమలా హారిస్ మూల్యం చెల్లించదంటే అతిశయోక్తి కాదు. బైడెన్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ కు ఆ ప్రభుత్వం విధానాల నుంచి దూరంగా జరిగే అవకాశం లభించలేదు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం, నిరుద్యోగ సమస్య, ఘాజా వివాదం, అక్రమ వలసదారులు గుదిబండలుగా మారి కమలా హారిస్ నిట్టనిలువునా ముంచేసాయి అనే చెప్పాలి. బైడెన్ ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకత ముందు ట్రంప్ దుందుడుకుతనం, నోటి దురుసు, జాత్యహంకారం, ఇదివరలో అతని ప్రభుత్వం పనితీరు, విధానాలు, ఆగడాలు, అరాచకత్వం అని గాలిలో పెట్టిన పేలాల పిండిలా ఎగిరిపోయాయి. ప్రజల జ్ఞాపక శక్తి ఏనుగు మెదడంత. ట్రంబ్ ప్రభుత్వ విధానాలను, తప్పిదాలను ప్రజలకు గుర్తు చేసి, ఆర్థిక, సామాజిక అంశాలపై తన స్పష్టమైన విధానాలను ప్రకటించటంలో కూడా కమలా హారిస్ విఫలమయ్యిందనే చెప్పాలి. బైడెన్ నీడలా కాకుండా, తన వ్యక్తిత్వాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లటంలో కూడా హారిస్ సఫలీకృతురాలు కాలేకపోయింది. దానాదీనా, భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓటమిని అంగీకరిస్తూ, కమలా హారిస్ చేసిన ప్రసంగం వంటి ప్రసంగం ఆమె ఎన్నికల సందర్భంలో చేసిందా? చేసి ఉండుంటే, నేడు ఓటమిని రుచి చూసేది కాదేమో. ట్రంప్ చేతిలో ఓటమిని అంగీకరిస్తూ, ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ, పోరాటం విషయంలో తాను ఓడిపోలేదని స్పష్టం చేశారు. ‘ప్రజలందరి స్వేచ్ఛ, అవకాశాలు, గౌరవం కోసం పోరాడాను. మీరు కూడా పోరాటాన్ని సాగించండి,’ అని తన మద్దతుదార్లకు పిలుపునిచ్చారు. ‘ఆశించిన విధంగా ఫలితాలు రాకపోయినా నిరాశపడవద్దని, చీకటిలోనే నక్షత్రాల వెలుగు’ కన్పిస్తుందన్నారు. ‘నిజాయితీ, ఆశావాదం, సేవాతత్పరత అనే కాంతి పుంజాలతో,’ ఈ నిశీథిని నింపుదామని ఆమె తన మద్దతుదారులను ప్రోత్సహించారు. ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల ఫలితాలు అది ఓటమైనా, గెలుపైనా ఆహ్వానించాలన్నారు.’ తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడని, అధ్యక్షడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు అభినందనలు తెలిపి, శాంతియుత అధికార మార్పిడికి సహకరిస్తామని ఆమె చేసిన ప్రకటన, హుందాగా ఆమె వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంలో కొత్త తెరలు లేపుతాయని ఆశిద్ధాం. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆమె ప్రజల ముందుకు వస్తుందా అన్నది సందేహమే. కానీ కమలా హారిస్, హిలరీ క్లింటన్ల ఓటమి నుంచి అమెరికా ప్రజలు, రాజకీయవేత్తలు చాలా నేర్చుకోవల్సి మాత్రం ఉంది.

సౌమ్యశ్రీ రాళ్లభండి