ఓటిటిలకి పెరుగుతున్న ఆదరణ

ఓటిటిలకి పెరుగుతున్న ఆదరణ
ఓటిటిలకి పెరుగుతున్న ఆదరణ

కోవిడ్ యావత్త్ ప్రపంచానికి శాపమైతే, వినోద రంగానికి, ప్రేక్షకులకు మాత్రం ఇది వరంగా పరిణమించింది. కోవిడ్ కు పూర్వం పండగ సమయాల్లో ఇంటిల్లిపాది సినిమా హాళ్లకెళ్లి సినిమాలు చూడటం కద్దు. కానీ, కోవిడ్ తర్వాత సామాజిక దూరాలను పాటించాల్సిరావటం, సినిమా హాళ్లు మూసుకుపోవడంతో సినిమాయే జీవితంగా బ్రతికే ప్రజలకి అందునా ముఖ్యంగా మన భారత దేశ ప్రేక్షకలకి మాత్రం ఈ పరిణామం అశనిపాతంలా తగిలింది. బుల్లితెరలు, కంప్యూటర్లు, స్మార్టఫోన్లు, కేబుల్ నెట్ వర్క్లు ఎన్నిఉన్నా, ప్రతి శుక్రవారం వెండితెరపై విడుదలయ్యే కొత్త సినిమాలు లేకపోవటంతో సినీ ప్రేక్షకులకి ఎంతో వెలితిగా ఉండేది. ఇలాంటి వారి కోసమే అన్నట్టు ఓటిటి (ఓవర్ ది టాప్) ప్లాట్ ఫాం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టకుండానే దేశ, విదేశాల కొత్త సినిమాలు చూడటానికి ప్రేక్షకులకు వీలు కలిగింది. కేబుల్ కనెక్షన్లు, శాటిలైట్ కనెక్షన్లు లేకుండా ఇంటర్నెట్ ద్వారా కొత్త సినిమాలు ప్రతి ఇంట్లో రంగవల్లులు దిద్దుతున్నాయి.

ఓటిటి మార్కెట్: 2019లో 121.67 బిలియన్ డాలర్లున్న ప్రపంచ ఓటిటి మార్కెట్ 29.4శాతం పెరిగి 2027 నాటికి 1,039.03 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇన్ మోబి చేసిన అధ్యయనంలో తేలింది. స్మార్ట ఫోన్ల పుణ్యమా అని కోవిడ్ తో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న వినోద రంగానికి ఓటిటి ప్రాణం పోసింది. కోవిడ్ పుణ్యామా అని డిజిటల్ ప్లాట్ ఫామ్లో సినిమాలు కొని చూసే వారి సంఖ్య దాదాపు 87 శాతం పెరిగినట్లు బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ స్ర్కీన్ ఎంటర్ టైన్మెంట్ తెలిపింది. అలాగే ఓటిటి కార్యక్రమాలు అందచేసే సంస్థల వినియోగదారుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఏడింతలు పెరిగినట్టు మరో అధ్యయనంలో తేలింది.

ఇక మనదేశానికి వస్తే, ఓటిటి ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్పాలి. 2030 నాటికి ఓటిటి మార్కెట్ 55-70 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్టు భారతీయ వ్యాపార రంగ సంస్థ (సిఐఐ) ఒక నివేదికలో తెలిపింది. నేడు వినోదం మరియు ప్రసార మాధ్యమాల రంగంలో కేవలం 7 నుంచి 9 శాతం మాత్రమే మార్కెట్ షేర్ ఉన్న ఓటిటి గణనీయంగా పెరిగి 2030 నాటికి 22-25 శాతానికి చేరుకుంటుందని ఈ నివేదిక తెలుపుతోంది. దాదాపు 51శాతం ఇళ్లల్లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ వంటి ఓటిటి సర్వీసులు విరాజిల్లుతున్నాయి. సెంటర్ ఫర్ మీడియా అండ్ ఎంటరటైన్మ్మెంట్ స్టడీస్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం 35కోట్ల మంది ఓటిటి వినియోగదారులుండగా, ఈ సంఖ్య 2023 నాటికి 50 కోట్లకు చేరుకోగలదు.

దేశ జనాభాలో అత్యధిక శాతం యువత కావటం వల్ల, అనేక టెలికాం సంస్థలు తక్కువ ధరకే తమ సర్వీసులను అందిస్తుండటంతో ఓటిటి సర్వీసులకు మన దేశంలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. అన్ని విదేశీ ఓటిటి కంపెనీల కళ్లు దాదాపు 138 కోట్ల జనాభా గల భారతదేశంపైనే! భారత మార్కెట్ ను కైవసం చేసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు తమ నెలసరి చందాను 799 నుంచి 649కి తగ్గించి అందిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దేశవాళీ ప్రేక్షకుల అభిరుచులకనుగుణంగా ఉండే విధంగా తమ కార్యక్రమాలను రూపోందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ప్రాంతీయ భాషల్లో నేరుగా 70 కార్యక్రమాలను రూపొందించి, ప్రాంతీయ మార్కెట్ను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ తన వార్షిక చందాను 999 రూపాయలను నుంచి 1499 రూపాయాలకు పెంచినా ప్రేక్షకాదారణ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాక, భాషా ప్రమేయం లేకుండా సబ్ టైటిల్స్ ఉండటంతో విదేశీ సినిమాలను, ఇతర భాష సినిమాలను కూడా మన ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా కొరియన్ భాషా కార్యక్రమాల వీక్షణ 400శాతం పెరిగినట్టు నెట్ ఫ్లిక్స్ ఇండియా తెలిపింది. ఇదిలాఉండగా, ఓటిటికి పట్టణాలలో కంటే పల్లెలలోనే ఆదరణ ఎక్కువగా ఉంది. దాదాపు 65 శాతం మంది ఓటిటి వినియోగదారులు పల్లెవాసులే!
కేవలం విడియో సర్వీసులే కాక, గేమింగ్, ఆడియో ఓటిటి సర్వీసుల డిమాండ్ కూడా అతివేగంగా పెరిగిపోతోంది. ఉదాహరణకు 2017లో మొదలైన కారవాన్ మ్యూజిక్ ఓటిటి మొదట్లో కేవలం హిందీలో ప్రారంభించారు. నేడు అది పంజాబీ, మరాఠీ, తెలుగు, బెంగాలీ, తమిళం, మలయాళంలో కూడా తమ కార్యక్రామలనందిస్తోంది. ఓటిటి మాధ్యమానికున్న మరో లాభం ప్రవాస భారతీయులకు కూడా తమ సేవలను సులువుగా అందించటం.

మొట్టమొదటిసారిగా ఓటిటి మన దేశంలో 2008లో బిగ్ ఫ్లిక్స్ ద్వారా ప్రవేశించినా ప్రజల ఆదరణ అంతగా చూరకొనలేదు. అందుకు ఇంటర్నెట్ సర్వీసులు అంతంతమాత్రంగా ఉండటంతోపాతు, ఛార్జీలు చుక్కలను తాకడం కూడా కారణాలుగా చెప్పోచ్చు. జియో సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఓటిటీ సర్వీసులు ఊపందుకున్నాయి. నేడు మనదేశంలో దాదాపు 300 ఓటీటీ సంస్థలున్నాయి. అయితే ఈ ఓటీటీ కంపెనీలు రెండు రకాలు. ఒకటి, వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందేవి. ఉదాహరాణకు ఎమ్ ఎక్స్ ప్లేయర్ సంస్థ. ఇది దాదాపు 11 భాషల్లో కార్యక్రమాలను అందిస్తుంది. సోనీలైవ్ వంటి సంస్థలతో దీనికి ఒప్పందం కూడాఉంది. దాంతో ఆ ఛానల్ కార్యక్రమాలను ఈ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులు చూడవచ్చు. ఇక రెండవది, సొంత కార్యక్రమాలతో నేరుగా వినియోగదారుల నుంచి చందాలను వసూలు చేసి ఆదాయాన్ని పొందేవి. ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్. ఆహాలాంటి మరికొన్ని ఓటీటీలు కొంత శాతం చందారూపంలో మరికొంత శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని రాబడుతున్నారు.

ఇదివరకటితో పోలిస్తే, నేటి వినియోగదారుడు కార్యక్రామాలు బాగుంటాయనిపిస్తే ఎక్కువ ధరైనా చెల్లించి చూడటానికి నేటి ప్రేక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నెట్ ఫ్లిక్స్, అమెజనా ప్రైమ్ వంటి ఓటిటిల డిమాండ్ కేవలం 2020లోనే 55 నుంచి 60 శాతానికి పెరిగింది. సినిమా రంగం కూడా ఓటిటిలపై మొగ్గు చూపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు ఓటిటి ఓ వరంగా పరిణమించింది. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుస్తారో అని చకోర పక్షుల్లా వేచి చూడక్కర్లేదు. హాళ్లు తెరిచినా, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, సినిమా హిట్టా, ఫట్టా అనే సందిగ్ధావస్థలో నిర్మాతలు ఎదురుచూపులు చూడక్కర్లేదు. కనీసం మినిమం గ్యారంటీ అయితే ఓటీటీల ద్వారా పొందవచ్చు. పెద్ద సినిమా నిర్మాతలు కూడా థియేటర్లలో సినిమా విడుదల చేయాలని చూడట్లేదు. ఓటీటీ యాజమాన్యం కూడా పెద్ద తారల సినిమాలతై అధిక ధరలు వెచ్చించడానికి వెనకాడట్లేదు. ఒక వెబ్ సీరిస్ల సంగతి సరేసరి. మణిరత్నంలాంటి పెద్ద దర్శకులు, మాథవన్, ప్రకాష్ రాజ్ సాయి పల్లవి, సమంతా వంటి తారలు వెబ్ సీరిస్ ల్లో నటించడానికి వెనకాడట్లేదు. దీంతో రాబోవు కాలంలో ఓటీటీలు మరింత ప్రజాదరణ పొంది వినోద రంగంలో చరిత్ర సృష్టించకమానవు.

తేటగీతి