అమెరికా అనేగానే అందరిలోనూ ఏదో ఆసక్తి. అక్కడ ఏం జరిగినా ఒక వింతే. ముఖ్యంగా భారతీయులకి అందునా తెలుగువారికి. ఇక అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలైతే చెప్పనే అక్కర్లేదు. అమెరికా అధ్యక్షుడు ఎన్నిక ప్రభావం యావత్తు ప్రపంచ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే యావత్తు ప్రపంచం నవంబర్ 5 ఎన్నికల అనంతరం ఎవరు అమెరికా అధ్యక్ష పదవిని చేపడతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ ల మధ్య పోరు, నువ్వా, నేనా అన్న రీతిలో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 6కోట్లమంది ముందస్తు ఓటింగ్ పద్దతి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ కూడా ఉన్నారు. జార్జియా, నార్త్ కారోలినాలలో హారిస్ ట్రంప్ల మధ్య పోరు హోరాహోరిగా సాగుతోంది. జార్జియాలో ట్రంప్కు 48శాతం, హారిస్ కు 47శాతం మద్దతు ఉండగా, నార్త్ కారోలినాలో ట్రంప్ కు 47, హారిస్ కు 48శాతం మద్దతు ఉన్నట్టు సర్వేలు తెలుపుతున్నాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరు మధ్య పోరు తీవ్రత ఎలా ఉందో.
ఈ నేపథ్యంలో అమెరికా వలసదారులలో మెక్సికన్ల తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. 2022 లెక్కల ప్రకారం అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వారు దాదాపు 52 లక్షలమంది నివసిస్తున్నారని అంచనా. వీరు అత్యధికంగా కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఆరిజోనా రాష్ట్రాలలో నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 39లక్షల మంది నేడు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ సంఖ్య అమెరికా ఓటర్లలో కేవలం 1.5శాతం. అయినా, భారతీయ మైనారటీ గ్రూపు తాజాగా జరుగనున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ భవిత్యాన్ని నిర్ధేశించ గల సామర్థ్యం కలిగి ఉన్నారు. వీరు ఎవరికి ఓటు వేస్తే, వారి అవకాశాలు మెరుగవుతాయంటే అతిశయోక్తి కాదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో భారతీయ సంతతి ఓటర్ల ప్రాధాన్యత ఎంతగా పెరిగిందంటే, తెలుగు, తమిళ భాషల్లో, ‘సంస్కృతి, సన్మార్గం, దేశానికి ఆధారం’ అనే నినాదంతో డల్లాస్ లో రిపబ్లికన్ పార్టీ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. భారతీయ తమిళ సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పత్ర్యక్షంగా పోటీపడుతుండగా, మన తెలుగు సంతతికి చెందిన ఉషా చిలుకూరి పరోక్షంగా ఈ ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె భర్త జెడి వాన్స్ రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఇది మారుతున్న అమెరికన్ ఎన్నికల రూపురేఖలకు ఒక చిన్న నిదర్శనం.
అనాదిగా డెమోక్రటిక్ పార్టీకి భారతీయ సంతతి వారు మద్దతు పలుకుతుంటారు. ఈసారి భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఆ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో భారతీయ అమెరికన్ల మద్దతు ఆమెకు సంపూర్ణంగా లభించవచ్చనే భావన ప్రబలంగా ఉంది. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక సంక్షోభం, విదేశీ విధానాలు పలువురు దృష్టిని ట్రంప్ వైపు మళ్లిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బైడన్ ప్రభుత్వం అక్రమ వలసదారులను అరికట్టడంలో విఫలమైందని, గ్రీన్ కార్డు బ్లాకలాగ్ను క్లియర్ చేయటంలోనూ ఆయన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అనేకమంది భారతీయులు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంలో తాము త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్న ట్రంప్ పలుకులపై భారతీయులు విశ్వాసం వెలిబుచ్చుతున్నారన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ సందర్భంగా అసలు భారతీయ అమెరికన్ల ఆలోచనా సరళిని పరిశీలిస్తే, వీరు పన్నులలో రాయితీలు, ఆరోగ్య వసతులు, వలస విధానాలు వంటి అంశాల గురించి ఆలోచిస్తున్నాను. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు చాలా వరకు ఉన్నత వర్గానికి చెందిన వారు కావటం, అలాగే అధిక వేతనాలు కలిగిన ఉద్యోగాలలో లేదా వ్యాపారాలలో స్థిరపడటం వల్ల వారి జీవన ప్రమాణాలు స్థానిక అమెరికన్లతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటాయి. ఒక సగటు భారతీయుడు ఏడాదికి దాదాపు 1.5మిలియన్ డాలర్లు సంపాదిస్తాడు. ఇది సగటు అమెరికన్ ఆదాయం కంటే రెట్టింపు. అందువల్ల వీరిలో చాలామంది రిపబ్లిక్ పార్టీ ఎర చూపిస్తున్న పన్ను రాయితీల పట్ల ఆకర్షితులవుతున్నారు.
ఇక అమెరికన్ అధ్యక్ష పదవి ఎన్నికలలో ప్రధాన అంశాలైన అబార్షన్ నిషేధ చట్టం, వలస విధానాల పట్ల అమెరికాలోని భారతీయ సంతతివారు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం వస్తే అబార్షన్ నిషేద చట్టాలను తీసుకురావచ్చు. అదే కమలా హారిస్ అధ్యక్షరాలైతే, అబార్షన్ను చట్టబద్ధం చేసి మహిళల లైంగిక హక్కులను సంరక్షించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుండగా, అమెరికన్, నేటివ్ హవాయిన్ మరియు ఫసిఫిక్ ద్వీపవాసుల కమ్యూనిటీ సంస్థ సెప్టెంబర్ లో జరిపిన ఒక సర్వేలో 10 మంది అమెరికన్ భారతీయులలో 7 మంది కమలా హారిస్ కు ఓటు వేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ ఓటర్లను అబార్షన్ హక్కులు, పర్యావరణ సంరక్షణ, గన్ నియంత్రణ, వలస విధానాలు వంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయని, 10లో 8 మంది భారతీయ సంతతి వారు అబార్షన్ను అన్ని రాష్ట్రాలలో న్యాయబద్ధం చేయాలని, అలాగే కఠినమైన గన్ నియంత్రణ చట్టాలను తీసుకురావలని కోరుకుంటున్నట్టుగా కూడా ఈ సర్వే తెలిపింది. కాగా, ట్రంప్ ప్రకటిస్తున్న పన్నుల కోత పట్ల అనేకమంది భారతీయ సంతతికి చెందిన ఉన్నతవర్గంవారు, ముఖ్యంగా వ్యాపారస్తులు సానుకూలంగా స్పందిస్తున్నారని ఈ సర్వే తెలిపింది.
ఇక, ఇమ్మిగ్రేషన్ చట్టాలలో ముఖ్యంగా కుటుంబ సభ్యులకిచ్చే వీసా స్పాన్సర్షిప్ కి సంబంధించిన నియమాలను సరళీకృతం చేయాలని చాలామంది భారతీయ సంతతికి చెందిన ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఇందుకు సుముఖంగా ఉన్నారో ఆ అభ్యర్ధికే ఓటు వేయాడానికి సగం పైగా భారతీయ ఓటర్లు మొగ్గుచూపుతున్నారని ఈ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. చివరగా, కోస్తాతీర ప్రాంతాల వారిపై, బడుగు వర్గాల వారిపై పర్యావరణంలో మార్పులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అనేకమంది భారతీయ సంతతి ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇదివరకటితో పోలిస్తే, ప్రస్తుత ఎన్నికలలో పర్యావరణ సంరక్షణకు భారతీయు ఓటర్లు పెద్ద పీట వేస్తున్నారు. పర్యావరణ సంరక్షణకు పటిష్టమైన చట్టాలను తీసుకురావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దాదాపు 77శాతం మంది భావిస్తున్నట్టు సర్వే తెలుపుతోంది.
జూలైలో అధ్యక్ష పదవి పోటీ నుంచి బైడన్ తప్పుకునేంతవరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే కమలా హారిస్ రంగంలోకి దిగారో, ఎన్నికల సమీక్షలు పూర్తిగా తారుమారయ్యాయి. హారిస్ మద్దతుదారులలో మూడొంతుల మంది ట్రంప్ విధానాలతో ఏకీభవించట్లేదని చెపుతున్నారని, అదే సమయంలో ట్రంప్ మద్దతుదారులలో 10 మందిలో 8 మంది హారిస్ విధానాలను వ్యతిరేకిస్తున్నారని ప్యూ పరిశోధనా కేంద్రం సర్వేలో తేలింది. దీంతో వీరిరువురి మధ్య ఎన్నికల యుద్ధం పోటా, పోటీగా జరుగనుంది.
కాగా, ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు 4 లక్షలమంది దక్షిణాసియా సంతతివారు నివసించే ఆరిజోనా, జార్జియా, మిచిగాన్, నార్త్ కారోలినా మరియు పెన్సిల్వేనియా రాష్ట్రాలలో జరిపిన సర్వేలో ఈ సంతతివారిలో దాదాపు 48శాతం మంది కమలా హారిస్ కు పూర్తి మద్దతను పలుకుతున్నట్టు చెప్పింది. 1957లో దలీప్ సింగ్ సౌనద్ అమెరికా కాంగ్రెసుకు ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు భారతీయ సంతతికి చెందిన వారు కాంగ్రెసుకు 40 వివిధ అమెరికా రాష్ట్రాల చట్టసభలకు ఎన్నికయ్యారు. అమెరికా దేశ రాజకీయాల్లో, నాయకత్వంలో భారతీయ సంతతి వారు ఇంత వేగంగా పురోగతిని సాధించటం ఆశ్చర్యకరమని ఆసియన్ అమెరికన్, నేటివ్ హవాయిన్ మరియు ఫసిఫిక్ ద్వీపవాసుల కమ్యూనిటీ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్తిక్ రామకృష్ణన్ అన్నారు. ఉన్నతవర్గానికి చెందిన విద్యావంతులైన భారతీయ సంతతి ఓటర్లు తమకున్న అనుభవంతో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయగలరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపర్చారు.
ఓటింగ్ తప్పనిసరి కాకపోయినప్పటికీ, గత రెండు అధ్యక్ష ఎన్నికలలో భారతీయ అమెరికన్లు పెద్దఎత్తున ఓట్లు వేశారు. 2020 ఎన్నికలలో 71శాతం మంది భారతీయ అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో దాదాపు 74 శాతం మంది జో బైడన్ కు ఓటు వేశారు. ఇండియన్-అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే కనీసం 96 శాతం మంది భారతీయ మూలాలు కల వారు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని స్పష్టం చేసింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి డెమోక్రటిక్ పార్టీకి భారతీయ సంతతి వారి మద్దతు కొంత తగ్గినట్టు కారినేజ్ ఎన్డ్వోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ తాజాగా జరిపిన సర్వేలో వెల్లడయింది. గత ఎన్నికలతో పోలిస్తే, డెమోక్రెట్లకు మద్దతు పలికే వారి సంఖ్య 66 నుంచి 57శాతానికి పడిపోయింది. అలాగే, 40ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు గల భారతీయ సంతతికి చెందిన మగవారిలో 48శాతం మంది ట్రంప్ కు మద్దతు తెలుపుతుండగా, 44శాతం మంది కమలా హారిస్ కు మద్దతు పలుకుతున్నారని ఈ నివేదక వెల్లడించింది. అయితే, 67శాతం మంది భారతీయ అమెరికన్ మహిళలలు మాత్రం హారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
కాగా, కమలా హారిస్ భారతీయ, నల్ల జాతి సంతతికి చెందినది కావటం, అందునా మహిళ కావటం ఆమెకు ఎన్నికలలో వ్యతిరేకంగా పరిణమించవచ్చని ఓటర్లు భావిస్తున్నట్టు ప్యూ రీసర్చి కేంద్రం జరిపిన ఒక అధ్యయనంలో తెలింది. కానీ అదే ఆమెకు వరమని ట్రంప్ సానుభూతిపరులు విమర్శిస్తుండగా, ట్రంప్ తెల్లజాతీయుడు కావటం, మగవాడైయ్యుడడం అతనికి సానుకూలంగా మారుతుందని అనేకమంది ఓటర్లు, హారిస్ మద్దతుదారులు చెపుతున్నట్టు ఈ అధ్యయనం పేర్కొంది. అధ్యయనాలు ఎలా ఉన్నా, ఇంతవరకు ఒక మహిళ, అందునా ఆసియా జాతికి చెందిన అభ్యర్ధి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టలేదన్నది గమనార్హం.
ఏదిఏమైనప్పటికీ, అభ్యర్థుల జాతి, లింగ బేధాల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవటంతోపాటు అనేక సామాజిక, రాజకీయ అంశాలపై ఏకాభిప్రాయం కరువవుతున్న ఈ తరుణంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతున్నారన్నది తేల్చి చెప్పటం కష్టం. ఇదివరలో కూడా సర్వే నివేదికలకు భిన్నంగా ఫలితాలు వెలువడిన సందర్భాలు మనకి తెలుసు. ఈ నేపథ్యంలో, ప్రపంచంలో శక్తివంతమైన పదవిగా భావించే, అమెరికా అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందో నవంబర్ ఐదో తారీఖున ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడేవరకూ వేచిచూడాల్సిందే.
సౌమ్యశ్రీ రాళ్లభండి