భారతంలో నీతి కథలు – 3
విద్య వివేక హేతువు

విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహావిద్వాంసుడుడేవాడు. ఎందరో మహావిద్వాంసులు అతనితో వాదించి ఓడిపోయారు. దానితో అహంకారభూషితుడైన ఆ విద్వాంసుడు తనని ఓడించలేనివారిని ప్రవహించే నదిలో ముంచుతానని ప్రకటించి అనేకులను నదీమతల్లి ఒడిలోకి చేర్చాడు.

ఆ కాలంలో ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతలలో ఓడి ప్రాణాలు కోల్పాయాడు. అప్పటికే అతని భార్య గర్భవతి. అనతికాలంలోనే ఆమెకు తండ్రి శాపం వల్ల అష్టావక్రుడు అనే కుమారుడు జన్మించాడు. పన్నెండుఏళ్ల ప్రాయంలో అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి, వందితో వాదించడానికి విదేహ రాజ్యాన్ని చేరాడు. నిండా పన్నెండేళ్ల ప్రాయంలేని ఆ బాలుని చూచి, ద్వారపాలకులు అడ్డగించి వంది వంటి మహావిద్వాంసునితో వాదనకు దిగవద్దని ఉద్భోద చేశారు. అయితే విద్యకు వయసుతో నిమిత్తంలేదని, జుట్టు నెరసినవాడు, ముదుసలే విద్యావంతుడని అనుకోరాదని ప్రత్యుత్తర మిచ్చి లోనికి వెళ్లడానికి అనుమతిని కోరాడు. వీరి వాగ్వివాదాన్ని గమనిస్తున్న జనకమహారాజు,

‘‘ఆర్యా, మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్యసముడు. ఆయన ముందు మహావిద్వాంసులందరూ చిన్న, చిన్న నక్షత్రాల వలె వెల, వెల బోయినారు’’ అనగా అష్టావక్రుడు – ‘‘మహారాజా, నా వంటి వారెవరూ మీ సభా భవనానికి ఇంతవరకు వచ్చి ఉండరని’’ సమాధానమిచ్చాడు.

‘‘అయితే ముప్పది అవయవాలతో, పన్నెండు అంశలతో ఇరువది నాలుగు పర్వాలతో మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివి నువ్వా’’ అని జనకుడు ప్రశ్నించాడు.

‘‘మహారాజా, ముప్పది దినాలు అవయవాలు, అమావాస్య, పూర్ణిమలు చెరో పన్నెండు, ఈ ఇరువది నాలుగు పర్వాలు, పన్నెండు నెలల అంశలు, మూడువందల అరువది రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమున కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక’’ అన్నాడు.

జన: వాడు గుర్రాల జంటలవలె కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీదపడే ఆ రెండింటినీ ధరించెదెవరు?

అష్టా: మహారాజా, అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్త్వాల వల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది.

జన: కన్ను మూయకుండా నిద్రించేది ఏది?

అష్టా: నిరంతరం నీటిలో ఉండే చేప.

జన: జన్మించినా చైతన్యం లేనిది ఏది?

అష్టా: పక్షలు పెట్టె గ్రుడ్డు.

జన: హృదయం లేనిది?

అష్టా: బండరాయి.

జన: ఓ వేదవేత్తా, ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా ఆహ్వానించాడు.

తన వద్దకు వచ్చిన అష్టావక్రుని చూసి మహావిద్వాంసుడు వంది ఇలా అన్నాడు. ‘‘బాలకా, నిద్రపోయే సింహాన్ని లేపకు. కాలకూడ విషభరితమయిన పాము పడగ మీద కాలు పెట్టకు.’’ అదివిని,

అష్టా: మహారాజా, పర్వతాలన్నీ మైనం కంటే చిన్నవి. లేగదూడలు ఆంబోతుల కంటే చిన్నవి. రాజులందరూ జనకుని కంటే అల్పులు. దేవతలలో ఇంద్రుని వలె, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం.

అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశిస్తుంది. సూర్యుడోక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృ దేవతాపతి, యముడొక్కడే అని ప్రారంభించాడు వంది.

అష్టా: నందీ, ఇంద్రుడు-అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు. అలానే పర్వత నారదులు, అశ్వినీ దేవతలిద్దరు. రథానికి రెండు చక్రాలు. సతీపతులిద్దరు.

వంది: ప్రాణికోటంతా దేవమానవ తిర్యరూపాలు మూడు ధరిస్తుంది. ఋగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యాహ్నిక సాయం సవనాలు మూడు. స్వర్గమర్త్య నరకాలు మూడే లోకాలు. అగ్ని, సూర్యచంద్రులు ముగ్గురే జ్యోతి స్వరూపులు.

అష్టా: బ్రహ్మ చర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాశ్రమాలు నాలుగు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు. దిక్కులూ నాలుగే. హ్రస్వ, దీర్ఘ, ప్లుత, హల్లు భేదాలతో శబ్దం నాలుగు రకాలు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రకాలు.

వంది: గార్హవత్య, దక్షిణాగ్ని, ఆహవనీయ, నభ్యం, అనభ్యం అనే అవస్థా భేదంతో యజ్ఞాగ్ని అయిదు విధాలు. పంక్తి చంధస్సుకి పాదాలయిదు. దేవ, పితృ, ఋషి, మనుష్య, భూత, యజ్ఞాలు అయిదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని జ్ఞానేంద్రియాలయిదు. విపాశ, ఇరావతి, వితస్త, చంద్రభా, శతుద్రు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం.

అష్టా: బాలకా, అగ్ని స్థాపనవేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరుఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మనస్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞాలు ఆరు.

వంది: విద్వాంసుడా, ఆవు, దున్న, మేక, గుర్రం, కుక్క, పిల్లి, గాడిద – ఏడు గ్రామాలలో ఉండే జంతువులు. సింహం, శార్దూలం, లేడి, తోడేలు, ఏనుగు, వానరం, భల్లూకం – ఇవి ఏడు వన్య మృగాలు. గాయత్రి, బృహతి, జగతి, అతిజగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టువ్, భేదాలతో ఛందస్సు ఏడురకాలు. అత్రి, పుల్యస్త, క్రతు, మరీచి, అంగరీస, వసిష్టులు సప్త మహార్షులు, ధూప, దీప, నైవేద్య, ఆచమానం, గంధ, పుష్ప తాంబులాదులు కూడా ఏడే.

అష్టా: తులాదండాన్ని బంధించే సూత్రాలే ఎనిమిది. సింహాన్ని సంహరించే శరభ మృగానికి ఎనిమిది పాదాలు. యజ్ఞశాల సమీపంలో యూపస్థంభానికి కోణాలు ఎనిమిది. వసువులు ఎనమండుగురు.

వంది: పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మది. ప్రకృతి, పురుష, అహంకార, మహాత్తత్త్వ, పంచతన్మాత్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందుస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మదే అక్షరాలు. గణితశాస్త్రం యావత్తూ తొమ్మది అంకెమీద ఆధారపడి ఉంది.

అష్టా: దిక్కులు పది. గర్భంలో జీవుడు పదిమాసాలుంటాడు. రోగి, దరిద్రుడు, శోకార్తుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయినవాడు, పిచ్చివాడు, కాముకుడు, అసూయాపరుడు, మూర్ఖుడు, మొండివాడు ఈ పదిమందీ నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రిసోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ పదిమంది పూజింపదగినవారు. ప్రాణికి పది దశలు – గర్భవాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగండం, కైశోరం, యౌవనం, ప్రౌఢత్వం, వార్ధక్యం, మృత్యువు.

వంది: ప్రాణికోటికి ఇంద్రియాలు పదకొండు, విషయాలు పదకొండే, జ్ఞాన, కర్మేంద్రియాలతో మనస్సు కలిసి పదకొండు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు జ్ఞానేంద్రియ విషయాలు. మాట, పని, నడక, మలాదుల విసర్జన, భార్యా సంయోగం ఇవి కర్మేంద్రియాలు చేసే పనులు, వీటి మననం మనస్సు చేసే పని. ఇవి పదకొండు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, హర్ష, శోక, అహంకారాది వికారాలు పదకొండు. మృగ, వ్యాధ, సర్ప, అజైకపాద, అహిర్బుధ్న్య, కపాలి, పినాకి, నిర్భితి, దహిన, స్థాణు, ఈశ్వర – వీరు ఏకాదశ రుద్రులు.

అష్టా: పసివాడా, మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకు అక్షరాలు పన్నెండు. ప్రాకృతయజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యులు పన్నెండుగురు.

వంది: తిథులలో త్రయోదశి మంచిది. భూమిమీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ప్రారంభించగా,

అష్టా: మహారాజా, మీ విద్వంసుడు శ్లోకం సగం చదవి విరమించాడు. మిగిలినది నేను చెబుతా. కేశిదానవునితో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేశాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు పదమూడక్షరాల పరిమితితో నడుస్తుంది. అనగా, వంది తల వంచేశాడు.

నియమానుసారం వంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా, వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలనే పసివారి ప్రజ్ఞముందు పతనమయిపోతారు.

విద్య వినయాన్ని కలిగించాలికాని గర్వహేతువు కారాదు.

(సేకరణ: భారతంలో నీతికథలు, రచన: ఉషశ్రీ; ఈ కథ అరణ్య పర్వంలోనిది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *