భారతంలో నీతి కథలు – 2
అన్నదాన మహిమ


ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. పద్దెనిమిది అక్షోణులసేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. పాండవులయిదుగురు, ఇటు కృష్ణుడు, సాత్యకి మిగిలిలారు.

ధర్మరాజుకి పట్టాభిషిక్తుడయ్యాడు. ధర్మజునికి సర్వధర్మ విషయాలు బోధించి, ఉత్తరాయణ పుణ్యకాలంలో అంపశయ్యను వీడి యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు భీష్మపితామహ. ఆత్మయులను కోల్పోయి కలత చెందుతున్న ధర్మరాజుని అశ్వమేథయాగం చేసి ప్రాయశ్చితం చేసుకోమని పండితులు సలహాయిచ్చారు.

వారి ఆదేశానుసారం ప్రారంభించిన యాగానికి దేశ,దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు విచ్చేసి యాగాన్ని తిలకించారు. యాగానికి వచ్చిన వారిలో యోగ్యులకు సువర్ణ, రత్న, మణిదానాలతోపాటుగా అందరికి వస్త్రదానంతోపాటు అన్నదానం కూడా జరిగింది. అలా సర్వజనులను సంతృప్తి పర్చిన ధర్మరాజుని చేసి దేవతలు పూలవానలు కురిపించి ఆశీర్వదించారు.

అదే సమయంలో యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది. అందరూ యాగశాలలోకి ముంగిస ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి చూస్తుండగా,

ఆ ముంగిస నవ్వుతూ, ‘దేవతలు ఆనందించే యాగమా ఇది’ అంది. ఆ పలుగులకు అందరూ తెల్లబోయారు. దాని శరీరం ఒక భాగం బంగారు కాంతులీనుతుండగా, మరోవైపు మామూలు చర్మం ఉంది.

‘సక్తుప్రస్థుడి ధర్మ బుద్ధితో పోలిస్తే యీ యాగశాలలో జరిగిన దానం ఏ మాత్రం,’ అంది.

అందరూ తెల్లబోయి, ఎవరా మహనీయుడు, ఏమా కథ అన్నారు. అతురతగా ప్రశ్రించిన వారిని చూసి ముంగిస ఇలా చెప్పింది.

ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాక్రితం సక్తుప్రస్థుడనే పేరు గల గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒకేఒక్క కుమారుడు. ఆయన భార్య, కొడుకు, కోడలుతో కలిసి సర్వభూతకోటిని దయచూస్తూ, కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకొంటుడేవాడు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ, ఎవరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినదాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు.

పరబ్రహ్మమీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వరునికే అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు:
వారు తమ పరిసరప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడా రాలిన ధాన్యపుగింజలు ఏరి తెచ్చుకుని, దంచి, పిండిచేసి, వండుకుని నలుగురూ సమంగా పంచుకుని, తినడానికి సిద్ధమవుతుండగా, ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్లులోతుకు పోయాయి. ఎముకలు బయటపడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి, ఆకలి అని నీరసంగా అడిగాడు.

ఆయనను ఆదరంగా తీసుకువచ్చి, ఆర్యా, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి, అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా, మేం తెచ్చుకున్న ధాన్యపుగింజల పిండితో వండిన ఆహారమిది. దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి, అని ఆ గృహస్థు తన భాగం ఆయనకు వడ్డించాడు.

అది ఆరగించి తనకు ఇంకా ఆకలిగా ఉందన్నాడు. ఆ మాట వింటూనే భార్య తన భాగం కూడా ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలి తీరలేదని తెలిసి, కొడుకు, కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయనా మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతోపాటే నీ కుటుంబమంతా తో ఆకలితో ఉన్నా, మీరు తినపోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్దిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి.

ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్ని దారుణాలైనే చేస్తాడు. అటువంటి దశలో మీదానబుద్ది ఎంత గొప్పదో దేవతలు గ్రహిస్తారు. దయగలవారే ఆశలకు దూరం కాగలరు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి యింత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పదికాదు. అటువంటి అన్న దానం చేసిన పుణ్యాత్ములు మీరు అని చెబుతుండగా దేవవిమానం వచ్చి వారందరిని తీసుకుని వెళ్లింది.
ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్లిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ఆ ప్రక్క పాదతీర్ధం తగిలి నా శరీరంలోని ఆ భాగం బంగారు మయమయింది. దానం అంటే అదే.
అనంతరం ఎన్నో, ఎన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండి పోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది ముంగిస.

(సేకరణ: భారతంలో నీతికథలు, రచన: ఉషశ్రీ; ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *