ఆ రోజులలో ఒకానొక గురుకులంలో పైలుడే గురువుండేవాడు. అతని వద్ద అనేక మంది విద్యనభ్యసించేవారు. ఆనాటి ఆనవాయితీ ప్రకారం గురుకులంలో విద్యను అభ్యసించే వారందరూ ఆశ్రమంలోనే ఉండాలి. వారికి అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పించే భారం రాజు మీద ఉండేది. నిరంతరం గురు సన్నిధిలో ఆయనకు సేవచేస్తూ, విద్యార్ధులు వినయ విధేయతలతో విద్య నేర్చుకునేవారు. గురువు కూడా తండ్రి వలే విద్యార్థి అభిరుచిని గ్రహించి అందుకనుగుణంగా వారికి విద్యను నేర్పేవాడు. తమకు అనువైన గురువును ఎంచుకుని విద్యార్ధులు గురుకులాలలో అభ్యాసం చేసేవారు.
అలాంటి గురుకులాల్లో పైలుని వద్ద ఉదంకుడనే శిష్యుడుండేవాడు. సాంప్రదాయం ప్రకారం విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఉదంకుడు గురువు దగ్గర సెలవు తీసుకునే ముందు గురుదక్షిణ ఏమికాలో తెలపమని పైలుడుని కోరాడు.
అప్పుడు పైలుడు చిరునవ్వుతో, ఆశీర్వదించి, ‘నాయనా, నీవంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం. గురుదక్షిణ వలనదని,’ అన్నాడు.
‘ఆచార్యా, గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్లడం న్యాయంకాదు. కనుక మీరు ఆజ్ఞాపించడని,’ ఉదంకుడు సవినయంగా కోరాడు.
వాని పట్టుదల, ధర్మనిరతి చూసి సంతోషంతో, ‘నాయనా, ఇంతకాలంగా నువ్వు చేసిన సేవను మించిన గురుదక్షిణ లేదు. అయినా నువ్వు తప్పదంటున్నావు కనుక ఆశ్రమంలోకి వెళ్లి అమ్మగారు ఏం కోరుకుంటారో అడుగు,’ అన్నాడు పైలుడు.
ఉదంకుడు గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆయన భార్యకు నమస్కరించి విషయాన్ని తెలిపాడు. అందుకు ఆమె ‘నాయనా, మీ గురువుగారి వద్ద సౌమ్యుడనే రాజు విద్య నేర్చుకున్నాడు. ఆ రాజుగారి భార్య ధరించే కుండలాలు నాకు తెచ్చిపెట్టు,’ అని కోరింది.
ఉదంకుడు పరమానందంగా బయలుదేరుతుండగా ఆవిడ పిలిచి, ‘నాయనా, ఇంక నాలుగురోజులలో నేను ఒక వ్రతం చేస్తున్నాను. అప్పటికి ఆ కుండలాలు తీసుకురమ్మని’ పలికింది.
‘చిత్తం తల్లి,’ అని ఉదండకుడు బయలుదేరాడు. దారి మధ్యలో ఒక మహావృషభంపై ఒక మహాపురుషుడు ఎదురుపడి, ‘ఈ గోమయం భక్షించి వెళ్లు, నీకు శుభం కలుగుతుంది. సందేహించకు దీనిని మీ గురువుగారు కూడా స్వీకరించారని,’ అని చెప్పగా, ఉదంకుడు మారుమాట్లాడకుండా ఆ మహాపురుషుడు చెప్పినట్టు చేసి రాజభవనానికి చేరుకున్నాడు.
మహారాజు ఉదంకుడుని చూసి చిరునవ్వుతో ఆహ్వానించి, ‘మీ రాకవల్ల మాజన్మధన్యమయ్యింది. ఏ పనిమీద వచ్చారో సెలవీయమని,’ కోరాడు. అంత ఆయనకు గురుపత్ని కోరికను విన్నవించాడు ఉదంకుడు.
అంత ఆ మహారాజు సవినయంగా, ‘మహాత్మా, మీ కోరిక అవశ్యం నెరవేర్చవల్సిందే. మీరు అంతఃపురానికి వెళ్లి మహారాణిని అడగండి. ఆమె సంతోషంగా ఇస్తుంద,’ ని అన్నాడు. ఉదంకుడు వెంటనే అంతఃపురానికి వెళ్లి తిరిగివచ్చు, ‘మహారాజా, మాతో పరిహాసాలాడుతున్నారు. మహారాణి అంతఃపురంలో లేదని,’ అన్నాడు.
రాజు: మహాత్మా, క్షమించాలి, అపవిత్రులకు నా భార్య కన్పించదు. మీరు అశుచిగా ఉన్నారని నేను అనలేనన్నాడు.
ఉదంకుడు: గుర్తుకువచ్చింది. నేను వచ్చేదారిలో ఆ పొరపాటు జరిగింది. ప్రయాణాపు తొందరలో విస్మరించానని, తిరిగి శుచిగా అంతఃపురానికి వెళ్లి రాణిగారి ముందు వినయంగా నిలచి తన రాకకు కారణం తెలిపాడు.
రాణి: ఉదంకుని కోరిక విని. ఇవిగో కుండలాలు. ఒక మాట. ఈ కుండలాలు దొంగిలించాలని చాలాకాలంగా తక్షకుడు వేచి ఉన్నాడు. జాగ్రత్తగా తీసుకువెళ్లండి.
ఉదంకుడు వాటిని తీసుకుని వస్తుండగా, ఒక ముసలి బిచ్చగాడు అతనిని వెన్నంటి రాసాగాడు. ఇంతలో సాయంసంధ్య కావస్తుండటంతో, కుండలాలను ఒడ్డున పెట్టి నదిలో సంధ్యావందనం ముంగించికుని వచ్చేటప్పటికి ఆ బిచ్చగాడు కుండలాలు అపహరించాడు. ఉందకుండు చూస్తుండగానే ఆ బిచ్చగాడు పాము రూపం ధరించి బిలంలోకి దూరాడు. ఆ బిలాన్ని తవ్వడానికి ప్రయత్నిస్తుండగా, దేవేంద్రడు తన వజ్రాయుధంతో ఆ బిలాన్ని వెడల్పుగా చేశాడు. ఆ బిల్వం గుండా ఉందంకుడు నాగలోకం చేరి అనేక విధాల ప్రయత్నించినా తక్షకుని ఆచూకీ తెలియలేదు.
అంతేకాకా, ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చుని తెలుపు, నలుపు దారాలతో వస్త్రాలను నేస్తూ కన్పించారు. నేత చక్రాన్ని ఆరుగురు తిప్పుతున్నారు. ఆ చక్రానికి పన్నెండు ఆకులున్నాయి. ఎదురుగా అశ్వంమీద ఒక దివ్యపురుషుడు కన్పించాడు. వారందరిని ఉదంకుడు ప్రార్థించగా, ఆ పురుషుడు వరం కోరుకోమనగా, నాగలోకమంతా తన వశంకావలని వరం కోరాడు.
‘అయితే ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదమన్నాడు,’ ఆ పురుషుడు. ఉదంకుడు అలాగే చేయగా, నాగలోకమంతో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. మంటలకు తాళలేక తక్షకుడు కుండాలలను సమర్పించి శరణు కోరాడు. అప్పటికే ఆలస్యమవుతుండటంతో గురుపత్ని వ్రత సమయానికి చేరుకోవటం ఎలా అని ఉదంకుడు విచారిస్తుండగా, ఆ పురుషుడు తన అశ్వాన్నిచ్చి అదృశ్యమయ్యాడు.
అభ్యంగాన స్నానం చేసి వ్రతం చేయడానికి సిద్ధంగా ఉన్న గురుపత్నికి ఉదంకుడు కుండలాలు అందించి, ఆమె ఆశీర్వాదం తీసుకుని గురువుగారి పాదాలకు నమస్కరించాడు. తన ప్రయాణ విశేషాలను గురువుగారికి విన్నవించి అంతరార్థం బోధించమని కోరాడు.
అంత గురువుగారు, ‘నాయనా, నీకు ఎదురుపడిని పురుషుడు దేవేంద్రుడు. ఆ వృషభం ఐరావతం. నీవు భక్షించిన గోమయం అమృతం. అది గ్రహించనిచో నీవు నాగలోకంలో జీవించి ఉండేవాడివి కావు. నాగలోకంలోని స్త్రీలు ధాత -విధాతలు. నలుపు, తెలుపు దారాలు రాత్రింబవళ్లు. చక్రాన్ని తిప్పే ఆరుగురు ఋతువులు, పన్నెండాకులు మాసాలు. ఆ చక్రం సంత్సర రూపమయిన కాలచక్రం. అక్కడ కన్పించిన పురుషుడు దేవేంద్రుడు, అశ్వం అగ్రిహోత్రుడు.
ఇంద్రుడు నాకు ఆప్తమిత్రుడు. నువ్వు నా శిష్యుడవని తెలిసిన దేవేంద్రుడు నీకు అపాయం కలగకుండా కాపాడాడు. నీ వలె వినయవిధేయతలతో గురుశుశ్రూష చేసిన విద్యార్ధులను దేవతలెప్పుడు కాపాడుతారు. ఇక నీవు స్వగృహానికి వెళ్లు. నీకు అంతా శుభంకలుగుగాకా,’ అని ఆశీర్వదించాడు.
(సేకరణ: భారతంలో నీతికథలు, రచన: ఉషశ్రీ; ఆదిపర్వంలో కథ: గురు సేవ ప్రాశస్త్యాన్ని తెలిపే కథ)
తేటగీతి