చాలా రోజుల క్రితం, అగస్తుడ్యనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన త్రీవ నిష్థతో తపస్సు చేస్తూ, సర్వ ప్రాణి కోటినీ దయా హృదయంతో చేసే వాడు. ఆయన తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుచుండగా వాని పితృ పితామహులు కన్పించి, ‘నాయనా, యోగ్యురాలైన కన్యను వివాహం చేసుకొని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు’ అన్నారు.
కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన భార్యను అన్వేషిస్తూ విదర్భదేశానికి చేరుకుని, నిర్మల సరోవరంలోని నల్లకలువ వలె పెరుగుతున్న రాజుగారి కుమార్తె, లావణ్యవతైన లోపాముద్రను చూశాడు. అందచందాలలోనే కాక, వినయగుణ శీలాలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహించాడు.
ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి, అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. వారి పరిచర్యలకు సంతసించి ఆ మునివరుడు ‘మహారాజా మా వంశాన్ని ఉద్దరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను భార్యగా కోరుతున్నాను’ అన్నాడు.
ఆ మాటవినగానే, చీని చీనాంబరాలతో మణిరత్న భూషణాలతో, హంసతూలికా తల్పాల మీద రాజభవనంలో వందలాది దాసీజనాల సేవలందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవించవల్సిన కూతురు నారచీరలు కట్టి, వనవాసం చేస్తూ, కందమూలలా భక్షిస్తూ, పర్ణకుటీరాలలో జీవించగలదా అని ఆ మహారాజు, మహారాణి ఆందోళనతో విచార సాగరంలో మునిగారు.
అంత లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి, నేను సంతోషంగా ఆ మునీశ్వరుని భార్యగా, ఆయనకు సేవలు చేసి అనుగ్రహం పొందగలనని, విచారించవలదని చెప్పింది.
పిదప ఆ మునిచంద్రుని పరిణయమాడి, ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొంది. అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడువకుండా వేదవిహిత కర్మలే కొనసాగిస్తుండగా కొంతకాలం గడిచింది.
ఒకనాడు లోపాముద్ర ఋతుస్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడుచుండ చూసి, దగ్గరకు చేరబోయిన మహర్షిని చూసి, స్వామి ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ పటకుటీరంలో దర్భ శయ్యలపై జీవితం గడుపుతున్నాం. సంసార జీవితంలోకి అడుగుపెట్టాలంటే మా తండ్రిగారింట ఉన్న భోగభాగ్యాలు సమకూర్చండని కోరింది. సంసార సుఖం కొరకు తన తపశ్శక్తిని వినియోగించటం ఇష్టంలేక రాజాశ్రయం కోరటం ఉత్తమమని ముగ్గురు రాజులను దర్శించాడు. వారందరు ఇల్వలుడనే రాజు సిరిసంపదలు కలవాడని ఆయనను కోరవల్సిందిగా సూచించారు.
ఈ ఇల్వలుడు వాతాపి సోదరుడు. వారిద్దరు అరణ్య దారిని వచ్చేవారిని భోజనానికి పిలుస్తూ, వారు రాగానే వాతాపి మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ మేకను చంపి వారికి వండి పెట్టేవాడు. వారు హాయిగా భుజించాక సోదరా వాతాపి అని పిలిచేవాడు. వెంటనే వాతాపి పొట్టను చీల్చుకుని బయటపడగానే అన్నదమ్ములిద్దరు ఆ అతిధిని వండుకుని తినటం వారి నిత్యకృత్యం.
అగస్త్యుడు రాజులు వెంటరాగా ఇల్యలుని వద్దకు వెళ్లాడు. అంత యాధావిధిగా మేకను వండి పెట్టబోగా రాజులు భయంతో వెనక్కి తగ్గారు. అగస్త్యుడు వారికి అభయమిచ్చి వండినదంతా తనకు పెట్టమని తృప్తిగా భుజించాడు. సరిగ్గా అదే సమయంలో ఇల్వలుడు సోదరా వాతాపి అని పిలిచాడు. ఇంకెక్కడ వాతాపి, ఇక రాడని మహర్షి బదులివ్వటంతో భయపడి, తన సర్వసంపదలు తమకు ఇస్తానని, మణిరత్న సువర్ణరాసులను ఆయనకు సమర్పించి, అదును చూసుకొని సంహరించపోగా, మహర్షి ఒక్కసారిగా హూకరించటంతో ఇల్వలుని శరీరం గుప్పెడు బూడిదయ్యింది.
పిదప సంపదతో ఆశ్రమానికి తిరిగి వచ్చి, ధర్మాచారిణీ, లోకంలో అందరిలా ఉండే పుత్రులు అసంఖ్యాకులు కావాలా? గుణశీలవంతుడయిన ఒక్క కుమారుడు కావాలా? అని ప్రశ్నించాడు. అంత ఆమె గుణవంతుడైన ఒక్క కుమారుడు చాలని సమాధానమిచ్చింది. అనంతరం వారికి దృఢదన్యుడనే మహాతపస్వి ప్రభవించాడు.
వాతాపి జీర్ణం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి ఈ కథ వల్లే పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్ఛరిస్తే తిన్నది బాగా జీర్ణిస్తుందని ఒక నమ్మకం.
(సేకరణ: భారతంలో నీతికథలు, రచన: ఉషశ్రీ; ఈ కథ అరణ్య పర్వంలోనిది)