నల్లిపై కారుణ్యము

భాషా సంపర్కము కీడెంత చేసిందన్న విషయాన్ని పక్కన పెడితే, కవులను, భావుకలను విశేషంగా ప్రభావితం చేసిందనటంలో సందేహంలేదు. ఆంగ్ల సంపర్కంతో ఆంధ్ర సారస్వతం కూడా కొంతపుంతలు తొక్కాలని భావించి రచనలు చేసినవారిలో తాపీ ధర్మారావుగారు ప్రముఖలు. ఇంగ్లీషులో ఉన్న అనేక వాఙ్మయశాఖలు మన భాషలో కనపడవు. కాబట్టి మన రచనలలను కొత్త పుంతలు తిప్పాలని ఆయన అనేక ప్రయోగాలు చేశారు. వాటిలో ‘‘ఎలిజీ’’ రచన ఒకటి. ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన ఎలిజీ రచనలు చేసినవారు గ్రే, మిల్టన్, ఆర్నాల్డ్, డెనిసన్ కవులు. ఎలిజీ ప్రాచీన గ్రీకు భాషనుంచి పుట్టింది. ఇది విషాద పద్యం. ఎవరైనా మరణించినప్పుడు ముఖ్యంగా వారి స్మృత్యార్ధం ఈ పద్యాలను రచిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. మొదట కవి తన బాధను వెల్లడిస్తాడు. తర్వాత పోయిన వ్యక్తిని కీర్తిస్తాడు. చివరగా దుఃఖాన్ని వీడి తనని తాను సమాధాన పరుచుకుంటాడు. ఇటువంటి రచనలు మన భాషలో అరుదు అనడంకంటే లేవని చెప్పవచ్చు. తాపీ ధర్మారావుగారు ఎలిజీని మన భాషలో ఏమనాలో తెలియక ‘కారుణ్యము’ అని నామకరణం చేసి నల్లిపై కారుణ్యం అనే కారుణ్యాన్ని రచించి అకాలంలో బొంబాయి నుంచి వెలువడుతున్న ఆంధ్రపత్రికలో ప్రకటించారు.

ఈ కారుణ్యములోని విషయం ఎంతో సునిశితమైనది, సూక్ష్మమైనది. ధర్మారావుగారు మంచంమీద పడుకొని ఏదో రాయలని ప్రయత్నిస్తుంటే, దానికి విఘ్నం కల్గిస్తున్న నల్లిపై విపరీతమైన కోపంతో దానిని వేటాడిపట్టి, ఎండలో బాగా కాలిన గచ్చుపై వేసి అది మాడి చస్తే వైరాగ్యం కల్గి, గోల్డు స్మిత్ ‘‘పిచ్చి కుక్క చావుమీద’’ కారుణ్యాన్ని ప్రదర్శించిన విధాంగా ఙ్ఞప్తికి వచ్చి. నల్లిమీద కారాణ్యాన్ని రాసి దాని జన్మను కృతార్ధపర్చారు. అది ఏవిధంగానంటే –

నల్లిరొ! నిన్ను జేకొని ఘ
నంబగు నా తపమందు వైచి, నీ
వల్లల నాడుచుండ, దర
హాసము చేయుచు జూచుచుండు నీ
కల్లరివాని దూఱవు; ము
ఖంబున గోపము జూప; వెంతయో
చల్లగ నోర్చి; తౌర! ఘన
సౌఖ్యము నాకమునందు గాంచవే ?
ఎండ కన్నెఱుగక యేవేళ బ్రాసాద
వీధుల జరియించు విధము యిద్ది ?
మెత్తని పాన్పుల మెలగుచుండెడు నట్టి
దేహమా యిటులయ్యె తీవ్రవదన ?
పలు భోజ్యముల సోలు వారియందలి మేలు
నారగించెడి జీవమా సువర్ణ ?
నానాటికిని లలనామణు లెల్లెడ
నుష్ణోదకంబుల నోలలాడ
జేయుచుండుదురా నిన్ని చిన్ని జీవ
అనుచు గన్నులు గ్రమ్మెడి యశ్రు లిన్ని
కుఱియనీకుండ బోయెడి క్రూరు డెవడు ?
మాన్యసుఖవాసి, పోతివా మమ్ముబాసి!
నీకతంబున గదా లోకాన బాలురు
నిశలందు జదువుచు నిద్రబోరు;
నీ కతంబునకదా నిండు జవ్వనులెప్డు
జెలువులతో గూడి మెలగుచుంద్రు;
నీ కతంబున గదా నిరతమ్ము వృద్ధులు
హరినామ సంస్మృతి నలియుంద్రు;
నీ కతంబున గతా నిలయాల కపుడప్డు
సంస్కార ధూపముల్ జరుగుచుండు;
తగ ‘‘బరోకపకార్ధ మిదం శరీర’’
మనుట నీ కతంబునగదా మానుట ధాత్రి;
అట్టి నిన్నెంచ జాలక, యల్పబుద్ధి
బాప మొడిగట్టుకొని చంప బాడి యగుదె ?
చంపినవాని కేమి ఘన
సంపద కల్గెనో, కీర్తి హెచ్చెనో;
సొంపగు భక్ష్యముల్ రుచుల
జూడ విచిత్రములైన పాకముల్
పెంపును బొందెనో; యకట!
పెల్లగు నా నరకంపు కంపుగా
కింపులు గల్గునా ? మతి వి
హీనున కెందును మేలు కూడునా ?
ఎంత విషాద మందితివో;
యెవ్వరి నేమని చీరితో కదే!
వంతను మాను; మీ పగ న
వారిత రీతిని దీర్ప నీదు సత్,
సంతతి లేదె ? నన్ను రభ
సంబున బట్టదె ? నిద్ర దోలదే ?
చెంతను జేరి జీవన మి
సీ యన గుట్టదె ? నెత్రు ద్రావదే ?

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *