
గురజాడ వారి కలం నుండి నేలరాలిన చుక్కే మధురవాణి. వృత్తిపరంగా వేశ్య అయినప్పటికి ఉన్నతమైన వ్యక్తిత్వంతో, కొంటెతనంతో, మాటకారితనంతో, జాణతనంతో నాటి, నేటి సమాజంలో మంచికి, చెడుకి మధ్య ఆనకట్టుగా నిలిచే అందాల భరిణే. కాదు, కాదు విచక్షణతో వ్యవహరించే ధీర వనిత. మంచివాళ్ల పట్ల మంచిగానూ, చెడ్డవాళ్లపట్ల చెడ్డగానూ ఉండమన్న తల్లి బోధనను అక్షరాలా అమలు పరస్తూ, ఎదుటి మనిషిని అంచనా వేసి లోకజ్ఞానంతో వ్యవహరించే కొంటె కొణంగి. ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుష్యులోయ్’ అన్న గురజాడ వారి దృక్ఫదానికి నిలువుటద్దం మధురవాణి. ‘వేశ్యజాతి చెడ్డది కావచ్చు గాని … చెడ్డలో మంచి ఉండకూడదా’ అని సమాజంలోని ద్వంద్వనీతిని ఎత్తిచూపిన ధీశాలి. నిడివి మీద బంగారాన్ని, యిత్తడినీ లోకం యేర్చేస్తుందని చెపుతూనే, ‘మంచి ఎక్కడున్నా, గ్రాహ్యం కాదా’ మంచి చెడ్డలు యెంచే వారెవరని నిగ్గతీసీన వనిత.
నాటి సనాతన స్త్రీ నుంచి నేటి ఆధునిక మహిళ వరకు ప్రతి ఒక్కరు అలవర్చుకోవల్సిన ఆత్మవిశ్వాసానికి, స్వావలంబనకు ప్రతీకగా నిల్చే మృదుస్వభావి మధురవాణి. పేరుకు తగ్గట్టుగానే మృదువైన సంభాషణలతో, నిశ్చలమైన ఆలోచనలతో సమాజాన్ని నిశితంగా పరిశీలించి బేరీజు వేయడమే కాదు, అవసరమైతే ‘యిటుపైన ఊర కుక్కలను, సీమ కుక్కలను దూరంగా ఉంచడానికి ఆలోచిస్తున్నా’ని స్వప్రయోజనాపరులనుద్దేశించి ఘాటుగా కుండబద్దలు కొట్టినట్టు జవాబునూ ఇవ్వగలదు. మధురవాణి మాట కటువుగా అన్పించినా, తరచి చూస్తే ఒక స్త్రీలో ఉండే సౌకుమార్యం ఆమెలోనూ మనకు కన్పిస్తుంది. వృత్తి వల్ల వేశ్య గనుక చేయాల్సిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందేమో కానీ, ఆమెలో దయాదాక్షిణ్యాలు సున్నా అనుకుంటే పొరపాటే. స్త్రీ జనోద్దరణను గురజాడ వారు ఆమెతో ఆరంభించలేదు, ఆమెతో మొదలు పెట్టించారంటే సబబుగా ఉంటుంది .
ఆమెలోని సమయస్ఫూర్తి, వాక్ చాతుర్యం మనకు అడుగడుగునా ముచ్చట కల్గిస్తూనే చురకలు అంటిస్తాయి. ‘తాను చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం అనరాదా ? అబద్దానికి అర్ధం ఏమిటి ? తనకి రొట్టా, ఒహడికి ముక్కా అని మనుష్యులోని సంకుచితత్వాన్ని ఎత్తి చూపిస్తూనే, పరువైన మగవాళ్లున్నప్పుడు పరువైన ఆడవారెందుకుండరని మగవారి మనోభావాలను తూర్పారబట్టడం ఆమెకే సాధ్యం. సంబాషణాలో హాస్యాన్ని రంగరించి చురకత్తుల్లా ఉపయోగించటం ఆమెకే చెల్లింది. ‘ఈ కన్నె పిల్ల నోరు కొంచెం చుట్టవాసన కొడుతూ ఉంది,’అనడంలోనే చూపితే చాలు అల్లుకు పోయే చురుకుదనం మధురవాణి సొంతమని అర్థమవుతుంది.
విద్వాంసుల ఇచ్చకాలకు మైమరచి, మెరమెచ్చు మాటలకి పొంగిపోకుండా, ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని కార్యాన్ని సాధించగల వ్యూహాపరురాలు. వెరసి నాటకరచయితనే సమ్మోహితుణ్ణి చేసే అమాయకత్వం, చమత్కారం, అజ్ఞానం, మొరటుతనం, పెంకెతనం, సౌజన్యం, పరోపకారబుద్ధి మెండుగా గల వేకువజామున మెరిసే వేగుచుక్క మధురవాణి.
సౌమ్యశ్రీ రాళ్లభండి