తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు 5 కాంతం

ఆమె నవ్విస్తుంది. కవ్విస్తుంది. చక్కిలిగింతలు పెడుతుంది.ఆలోచింపచేస్తుంది. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తుంది కూడా. అది ఆమెకు మాత్రమే సొంతమైన జీవనసరళి. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి. ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు కాంతం కన్పిస్తుంది.

కాంతం అంత పొడగరీకాదు, పొట్టికాదు. ఛామన ఛాయ, నవ్వు మొగము, చక్కని నేత్రాలు బాపు బొమ్మకాదు కానీ అందగత్తే. కాంతానికి ఇంగ్లీషు రాదు. కానీ భర్త మాట్లాడుతుంటే నాకేదో అర్ధమయినట్లే ఉందని అనుకునే అమాయక స్త్రీమూర్తి. వారప్రతికలను చదవాలనే ఆసక్తి లేకపోయినా, కుమారీ శతకం, నృసింహ శతకం, ప్రహ్లాద చరిత్ర మున్నగు పుస్తకాలు మాత్రం చదవి అర్ధం చేసుకోగలదు.

సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. ఆమెకు మల్లెపూలు, తెల్ల చీర అంటే మహా ఇష్టం. మంచి పొదుపరి. ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బదులు చెప్పింది. ఆమె హాస్యచతురతకు మరో ఉదాహరణ. ఎంతోసేపు కాలేదే, నాలుగైదు నిమిషాల సంభాషణలో నన్నాయన ఫూల్ అన్నాడు అని భర్త చెప్పగానే, అంత ఆలస్యం ఎందుకైందండీ అని అమాయకంగా చురక వేయటం కాంతానికే చెల్లు.

దాంపత్యంలో ఉండే విలువలకు కాంతం జీవితం ఒక మంచి నిదర్శనం. అసంతృప్తికి ఆమె జీవితంలో చోటులేదు. ఆదర్శ గృహిణియైన మునిమాణిక్యం వారి కాంతం తెలుగు నాయికలలో మాణిక్యం వంటింది. ఒకసారి భర్త పిలిచి ‘నా కలం కనపట్లేదు,వెతికి పెట్ట’మంటే ఆవిడ వంటింట్లోనుంచి ‘నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి’ అందిట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు, కాంతం నిత్య నూతనమనిపిస్తాయి.

ఒకసారి విశ్వనాథవారు మునిమాణిక్యంగారిని ముట్నూరి కృష్ణారావుగారి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే ‘కాంతం భర్త కాదూ’ అన్నారట. ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పడానికి. నాయకుల్లో ‘గిరీశం’, ‘పార్వతీశం’ ఎలా అయితే తెలుగు సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిల్చారో, అలాగే ‘కాంతం’ ధృవతారగా వెలుగొందుతోంది.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *