జానపద సాహిత్యంలో కృష్ణామృతం

పాల్కురికి సోమనాథుడు తెలుగులో మొట్టమొదట రచించిన బసవ పురాణం మొదలుకుని, తర్వాత వెలువడిన మార్కండేయ పురాణం, వెన్నలకంటి సూరన విష్ణు పురాణం, నందిమల్లయ్య, ఘంట పింగనల వరాహ పురాణం, ఎర్రన రాసిన నరసింహ పురాణం, శ్రీనాథుని భీమేశ్వర పురాణాలతోపాటు అనేక క్షేత్ర పురాణాలను అనేక మంది కవులు తెలుగువారి ముంగిళ్లలోకి తీసుకువచ్చారు. ఈ పురాణాలు మన జానపదులను, వారి సాహిత్యాన్ని కూడా ప్రభావితపర్చాయి. శ్రీకృష్ణలీలలు, శ్రీరామ పట్టాభిషేకం, శశిరేఖా పరిణయం, రుక్మిణీ కళ్యాణం, భక్త ప్రహ్లాద, మహిషాసుర వధ ఇలా అనేక పురాణ ఘట్టాలు జానపద కళారూపాలకు ఇతివృత్తాలై, జనబాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లాయి.
జానపద కళారూపాల్లో రామాయణ, భారత గాథలు ప్రస్ఫుటంగా కన్పించినా, భాగవత ఇతివృత్తాలకు కూడా తగిన ఆదరణ లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా, కృష్ణలీలలు, రేపల్లెలో చిన్నికృష్ణుని చిలిపి చేష్టలు, గోపికా గీతాలు వంటివి జానాదరణ పొందాయి. యశోద లాలి —

‘‘లాలి కృష్ణయ్య నీలమేఘ శ్యామన్న
పాలా గోపాలన్న పవ్వళించగ రావయ్య
శృంగారించీన మంచి బంగారు ఉయ్యాలలో
ఆదిశేషుని పాన్పుమీద పవ్వళించగ రావయ్య
ఇంద్రలోకాన నీకెవ్వరు కావలనయ్యా
లలితాంగ శ్రీ సత్య భామాదేవి కావలనా…
రుక్మిణీయు కావలెనా రాధాదేవి కావలనా…’’

బృందావన కృష్ణుని రాసలీలలు, రాధాకృష్ణుని ప్రణయ గాథలు, గోపికలు కృష్ణుని చిలిపి చేష్టల గురించి ఫిర్యాదు చేసిన సందర్భంలో యశోద-గోపిక-కృష్ణుల సంవాదాలు, హృదయరంజకంగా జానపదులు మలిచారు.

గోపిక: పెరుగు చిలుకుచుండగా నా మరుగున నిలుచున్న కృష్ణుడు
పెరుగు చారెడు నించుకొని జుర్రి పరుగిడి పోయినాడు
అడుగవే తల్లి అడుగావే

యశోద: అడిగినంత వెన్న నీకు పెడుదునే మన యింట్లో లేదా
దుడుకుతునమున పొరుగిండ్లకు దొంగిలి తిన బోవనేల కృష్ణా
పడుచులపై నీకు చలమేలనురా.

కృష్ణుడు: దేవరాకు పెట్ట వలెనని యీవరా కనుకొంటుయంటిరి
ఆ దేవుడేమొ జుర్రిపోతే తెలియకానా మీద పెట్టిరి

గోపికలు: గొల్ల భామలంతా గూడి చల్లలమ్మను బోవుచుండగ
చల్లబానకు సుంకమిమ్మని చిల్లులూ పడగొట్టినాడు అడుగావే తల్లీ

యశోద: యేమిరామృష్ణయ్య గొల్లభామలు చల్లనమ్మబోతె
చల్లబానకు సుంకమిమ్మని చిల్లులూ పడగొట్టినావట కృష్ణా

కృష్ణుడు: చిల్లులూగ సమయమున, వడగండ్ల వర్షమొచ్చి బానలు
చిల్లులూ పడగొట్టనేమొ, చిల్లరాపనులెగుర తల్లి తెలియాచెతల్లి

గోపిక: గొల్లభామలంతా గూడి, స్నానమాచరించేటప్పుడు చీరల్నియు
తీసుకొని చెట్టుపై గూర్చిండినాడు.
తల్లీ తనయుని తప్పులు దెల్పెదమె

యశోద: యేలరా కృష్ణయ్య గొల్లభామలు స్నానము జేయగ
చీరెలన్నియు తీసుకొని చెట్టుపై కూర్చిండి నావట కృష్ణా

కృష్ణుడు: చెట్టుపై కూర్చిండి నేను పండుతినే సమయమందు సుడిగాలి వచ్చి
చీరల్నియు చెట్టుపైబడ నేసెతల్లి తెలియదె తల్లితెలియదె.

ఇలా కృష్ణుని తుంటరి పనులను గోపికలు ఏకరువు పెట్టగా యశోద, కృష్ణుని నిలదీసిన తీరు, కాళీయ మర్ధనం, గోవర్ధన గిరి నెత్తడం వంటి అనేక దివ్యగాథలను మనోజ్ఞంగా జానపదులు తమ పదాలలో రక్తి కట్టించారు. ఇక మధురానగరికి చల్లనమ్మబ్రోవ దారివిడవమని గోపికలు కృష్ణుని వేడు కోలాట పాటలు –

కృష్ణుడు: మత్తగజగమనరో మీ అత్త ఆజ్ఞ మీరనుచు
తత్తరీనని బొంకెదవు నీటక్కరి తనమెల్ల మానుము

గోపిక: బల్లు బల్లున తెల్లవారెను పల్లెలకు చల్లలమ్మ పోవల
మల్ల వచ్చిన వెనకనీతో మాటలుంటె నిలుతుగానీ

కొత్త కోడళ్లతో కృష్ణస్వామి చేసే పరాచికాలు –

గోపిక: రేపెల్ల వాడలాకు కృష్ణమూరితీ నీవు ఏమి పని కొచ్చినావు చిన్ని మాధవా

కృష్ణుడు: రేపల్లె వాడలకు గొల్లభామా నేను పాలు పెరుగు వెన్న కొస్తి పల్ల వాధరీ

గోపిక: కొత్త కొడలినయ్య క్రిష్ణమూరితీ మా అత్తానన్న అడగవయ్యా చిన్ని మాధవా

కృష్ణుడు: కొత్తా కోడలివైతే గొల్లభామా నీకు రొక్క మిస్తా పుచ్చుకొయె పల్లవాధరీ

గోపిక: నీ రొక్కములు నా కొద్దు కృష్ణమూరితీ నీకు కోటప్ప కన్న కట్టవయ్యా చిన్ని మాధవా

కృష్ణుడు: కోటప్ప కన్న కడతానే గొల్లభామా నా కల్లలాడు కోర్కెదీర్చు పల్ల వాధరీ

గోపిక: అట్లా మాట్లాడబోక కృష్ణమూరితీ నీవు రోత పట్టి పోతువు చిన్నిమాధవా

కృష్ణుడు: ఉల్లి మల్లి చీర దెస్తి గొల్లభామా నా కల్ల చూడు కోర్కె దీరు గొల్లభామా

గోపిక: మంచిపని చేస్తివయ్యా కృష్ణమూరితీ మా యింటి వాడు గోపగాడు చిన్ని మాధవా

కృష్ణుడు: మంచిపని చేయకుంటే గొల్లభామా నన్ను మాధవుడందురంటే పల్లవాధరీ.

ఇలా అనేక విధాలుగా రేపల్లెలో చిన్నికృష్ణుని చిలిపి చేష్టలలో జానపదులు ఓలలాడారు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *