జానపదాలలో భారతం

అష్టాదశపురాణాలను జాతికి అందించిన వ్యాసభగవానుడు దాదాపు లక్ష శ్లోకాలలో రచించిన భారతం –

సీ. ‘‘ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని
యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని,
కవి వృషభులు మహా కావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణీకుల్ బహు పురాణముచ్చ
యంబని మహిగొనియాడుచుండ’’

ఆయుష్షు కోరుకునేవారికి ఆయుష్షుని, అర్ధార్ధులకు విపులార్ధాన్ని, ధర్మార్ధులకు నిత్యధర్మ సంప్రాప్తిని, వినయార్ధులకు మహావినయ సంపత్తిని, పుత్రార్ధులకు పుత్ర సమృద్ధిని, సంపదార్ధులకు సంపదలను భారత పఠనం కల్గిస్తుందని భారత గొప్పదనాన్ని చెపుతూ నన్నయ్య చెప్పాడు. భారత, రామాయణాలు మన జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నది నిర్వివాదాంశం. అయితే, రామాయణ గాథలు చొప్పించుకు పోయినంతగా భారతం వ్యాపించలేదు. జానపద గేయ సాహిత్యంలో రామాయణం పెద్దపీట వేసుకుని కూర్చునప్పటికీ, భారతం కూడా ఏమీ తీసిపోలేదు. జానపద కళారూపాలలో భారతమే అగ్రగామిగా నిలిచింది భారత, రామాయణాలు మన జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అయితే, రామాయణ గాథలు చొప్పించుకు పోయినంతగా భారతం వ్యాపించలేదు. జానపద గేయ సాహిత్యంలో రామాయణం పెద్దపీట వేసుకుని కూర్చునప్పటికీ, భారతం కూడా ఏమీ తీసిపోలేదు. జానపద కళారూపాలలో భారతమే అగ్రగామిగా నిలిచిందిఅటువంటి భారతం మన జానపద కళారూపాలైన చెక్కభజన, కోలాటం వంటి కళలలో భారత ఘట్టాలను విరివిగా చిత్రీకరించారు.

ఉదాహరణకు ధర్మరాజు జూదంలో సర్వం కోల్పోయి, అన్నదమ్ములతో, ద్రౌపదితో అరణ్యాల పాలవటం, ద్రౌపదీ వస్త్రాపహరణం, వంటి ఘట్టాలు రాయలసీమ ప్రాంతంలో చెక్కభజన గేయాలుగా బహుళ ప్రచారంలో ఉన్నాయి. జానపదులు పాండవుల కష్టాలు తమ కష్టాలుగా భావించారు. ధర్మజుడైన యుధిష్టురుని వారు సర్వజ్ఞుడిగానే తలిచారు. ‘‘తమ్ముడా ఒరె భీమసేనా ఎంతమోసము జరిగెర’’, అంటూ రాయలసీమలో చేసే పాండవవనవాసం చెక్కభజన ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఇక భారతంలో ఎంతో ఉదాత్తపాత్రైన ద్రౌపదిని గూర్చిన అనేక పాటలను జానపదులు కూర్చారు. కోరి పాండురాజు యింటికి కోడాలునై నందుకు వార కాంతల దీటు సేయగ సభలో బ్రతుకెందుకు,’ ‘పతుల ఎదుట కట్టుచీరలు విడుచుట నీకు ధర్మమా, వాసుదేవ వరకుమార వలువలు దయచేయరా’ అంటూ ఆర్తితో ద్రౌపది తరపున అచ్యుతునికి మొరబెట్టుకున్నారు. ఆమె అవమనాలు తమ అవమానాలుగా, ఆమె కష్టాలు తమ కష్టాలుగా భావించి ఎంతో సానుభూతితో గేయాలు పాడారు. వీటిలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం అతి ముఖ్యమైనది.

‘‘నీలవరన పాలశమన నిన్ను నమ్మినానురా
నన్ను సభకు తీసి అవమానింప బోతున్నారురా
అచ్చుతా నను బ్రోవరా యిక దిక్కు ఎవ్వరున్నారురా
దిక్కు నీవే దీన బాంధవ గ్రక్కుననన్ను బ్రోవరా
కంస మర్ధన వంశపాలన కలిగి కృష్ణా బ్రోవరా’’
అంటూ ద్రౌపది ఆక్రందన జానపదుల గుండులోతుల్లోంచి వచ్చింది.

జానపదుల దృష్టిలో ధర్మరాజు ధర్మపరాయణుడే, శ్రీకృష్ణుని మాయవలనే పాండవులు అరణ్యవాసం చేయవచ్చిందని జానపదుల నమ్మిక. అందుకే ద్రౌపది కష్టాల్ని తెల్సుకొని కృష్ణుడి మాయల్ని మర్మంగానే భీముడికి చెప్పినట్టగా పాండవుల అరణ్యవాస ఘట్టంలో వారు ఈ క్రిందివిధంగా చిత్రీకరించారు.

‘‘……
పులులు మేకలు కొన్ని దినములు జూదమాడెను తమ్ముడా
ఆకుపూతలేని అడవిలో ఆ ఆరు మేకలు మేశర
అడ్డమొచ్చు పెద్దపులులను సంహరింపుము అర్జున
ఎవరు చేసిన మాయకాదు బావ చేసిన మాయర
బాకు పదహారువేల భార్యలు కలవాడురా…
వద్దు పగవానికైన వాసుదేవుని సాక్షిగా
ఆడజన్మము కంటె అడవిలో వృక్షజన్మము మేలురా
చేత చెక్కలు కాలి గజ్జెలు ఘల్లుఘల్లున మ్రోయగ
జల్లుజల్లున మ్రోయగ యిక గల్లుగల్లున మ్రోయగ
పరగకంభము పాటి కోదండరామ నిన్ను కొలిచెదము మేము
సకలము రామా’’

ఈ పాట వీథి నాటకాలలో, చెక్కభజనల్లో పాడుకుంటారు.

ఆధ్యాత్మిక చింతన, తత్త్వజ్ఞానాన్ని, సామాజిక స్థితిగతులని వీధినాటకాల్లో భాగంగా చేసి జానపదులు ముందుతరాల వారికి అందించారు. ‘ఆకుపూతలేని అడవి’ అంటే మానవ శరీరం. ఆరుమేకలు ఆరిషడ్వర్గాలు. ఇవి క్రూరమృగాలు సాధుజంతువులను చంపినట్టుగా, మనిషిలోని మంచి గుణాలను చంపి, మోహం, లోభం, స్వార్ధం వంటి మృగతత్వాలను ప్రజ్వరిల్లచేస్తాయి. వాటిని తుదముట్టించమని అర్జునికి తత్త్వబోధన చేయటమే ఈ గేయోద్దేశము.

భారతంలో నాటకీయతను తెలిపే అనేక ఘట్టాలను జానపద కళారూపాల్లో మనం చూడవచ్చు. సుదేష్ణ కొలువులో సైరంధ్రిగా ద్రౌపది దుస్థితి, కీచక వధ, అరణ్యవాసానంతరం ధృతరాష్ట, ధుర్యోధనల సంవాదం, అభిమన్యు,శశిరేఖల పరిణయ విషయంలో సుభద్రా,బలరాముల సంవాదం, ఇలా రోజూవారీ జీవితంలో ప్రతి యింటిలోనూ ఎదురయ్యే సంబంధ, బాంధవ్యాలకు సంబంధించిన అనేక వృత్తాంతాలను జానపదులు పాటలు కట్టి పాడారు, కోలాటాలు, చెక్కభజనలో రసవత్తరంగా ఆడారు. అందులో ప్రజాదరణ పొందిన ఘట్టం, సుభద్రా, బలరాముల సంవాదం.

సుభద్ర: సిన్నాది శశిరేఖ చిన్నవాడు అభిమన్యు యిద్దరికీ డేరన్నా ఓ బలరామన్నా యిద్దరికీడేరన్నా
పుట్టింది శ్రీ పుత్రి పుట్టినప్పుడు వాశ పుట్టినే నోస్తీరన్నా ఓ బలరామన్నా కన్నెనడగవస్తిరన్నా

బలరామ: ఉయ్యాల తోట్లల్లో ఊగేటి నాపుత్రి అడవులకెటుపంపుదూ ఓ సుభద్రమ్మా అడవులకెటులంపుదూ
పాలుహన్నము పెరుగు భుజియించే నాపుత్రి ఏ పాకు తిన పెడుదునా ఓ సుభద్రమ్మ ఏ పాకు తినబెడుదునా

సుభద్ర: మేనత్త కొడుకని మెచ్చిననిచ్చినారూ హెచ్చు తక్కువ లెంచితిరా ఓ బలరామన్నా హెచ్చు తక్కువలెంచిరా…

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *