కలం కాదది.. సాహితీ ఝరి

పదం కాదది, ప్రపంచానికి మేలు కొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, సాహితీ జగత్తుకే మణిహారం. తన అభ్యుదయ కవిత్వాల ద్వారా సమాజంలో కుళ్లుని తూర్పార బట్టిన శ్రీశ్రీ, ఎన్నో కమనీయమైన చిత్ర గీతాలను కూడా సినీ అభిమానులకు అందించారు. కత్తిలాంటి పదునైన మాటనైనా, కోమలమైన పదాన్నయినా శాసించి జనారంజకంగా మలచగలిగే శక్తి ఒక్క శ్రీశ్రీక ఉందంటే అతిశయోక్తి కాదేమో.

`తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు..` అని ప్రశ్నించే, గర్జించే శ్రీశ్రీ, `నా హదయంలో నిదురించే చెలి, కలలోనే కవ్వించే సఖీ…` అనే ప్రణయ గీతం రాయగలగడం ఆయనకే చెల్లింది. అటు విప్లవ కవిగా, ఇటు సినీకవిగా జోడు గుర్రాల స్వారి నల్లేరు మీద బండి నడకలా ఆయన సాగించగలిగారు. ఆహుతి సినిమాలోని `ప్రేమయే జనన మరణ లీల…` గీతం ద్వారా తన సినీ జీవితానికి అంకురార్పణ చేసిన శ్రీశ్రీ సరళమైన పదాలతో ఎంతో లోతైన అర్ధాన్ని తన గీతాల ద్వారా ప్రజలకు అందించారు. `వెలుగు-నీడలు` సినిమాలోని `కలకానిది, నిజమైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు…` అనే పాట అందుకు నిదర్శనం. అక్కా-చెల్లెళ్లు చిత్రంలోని `వినరాని మాటలే..` అనే పాటలే `జీవితమే ఒక చదరంగం పావులే కదా జీవులందరూ, తెలియనిది ఆట, కనబడదొక బాట…` అని జీవిత సారానంతా ఒక్క వాక్యయంలో వివరించాడు. `ఆకాశవీధిలో, అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనె, సయ్యాటలాడెనే..`, `తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో హ్రదయ రాగం`, `మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడకరుండిన అదే భాగ్యమో` వంటి సుమధుర గీతాలను శ్రీశ్రీ కలం నుంచి వెలువడ్డాయంటే ఎందరో నమ్మకపోవచ్చు.

అయితే, శ్రీశ్రీ అభ్యుదయ భావాలను సినీ గీతాల్లో కూడా ప్రదర్శించారు. యమగోల చిత్రంలోని `సమరానికి నేగే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం..`, భూమికోసం లోని `ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా..` మరో ప్రపంచంలోని `ఆకాశమంటే మేడలతో, ఆకలిమంటల పీడలతో ధనికుల కోసం పేదలు కట్టిన మహా మంచి ప్రపంచం.. ఓహోహో మరో ప్రపంచం..`లు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. అలాగే, `పాదవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయగీతికా..` అనే వెలుగు-నీడలులోని దేశభక్తి గీతంలో కూడా `ఆకాశం అందుకునే ధరలోకవైపు, అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకున్న నీదేశం ఎటు దిగజారు..` అని ప్రశ్నించడంలో `ప్రతి మనిషి, మరో మనిషిని దోచుకునేవాడే..` అనడంలోనూ, `ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వ`మని వాపోయినట్టే అన్పిస్తుంది.

జానపదం ధ్వనించే `ఓ రంగయో పూలరంగయో..`పాటను చాలామంది కొసరాజు రచనగా భ్రమిస్తారు. ఈ గీతం రాసిన శ్రీశ్రీ, వాగ్ధానం సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన రేలంగిపైన చిత్రీకరించిన హరికథను, సంగీత లక్ష్మి చిత్రంలోని క్రష్ణార్జున సంవాదాన్ని కూడా రాసి సకల కళాప్రావీణ్యుడననిపించుకున్నాడు. కురుక్షేత్రంలోని పతాక సన్నివేశానికి రాసిన `ధర్మక్షేత్రం, ఇది కురుక్షేత్రం..` అనే పాటలో కఠినమైన పదాలను కూర్చిన శ్రీశ్రీ దేవతలో `బొమ్మని చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుకా…` అని సరళమైన పదాలనుపయోగించి మెప్పించాడు. ఇలా మాటలను, అక్షరాలను శాసించగలడు కనకే తెలుగు సినీ రచయితలలో శ్రీశ్రీకి మాత్రమే జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. అల్లూరి సీతారామరాజు చిత్రానికే హైలెట్ అనిపించుకున్న `తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా` పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. మళ్లీ పాతిక వసంతాలు గడిస్తేగాని మరో తెలుగు సినీరచయితకు ఈ అవార్డు లభించలేదన్నది గమనార్హం.

చిలకా-గోరింక సినిమాలో హాస్యజంట పద్మనాభం, రమాప్రభలపై చిత్రీకరించిన `చెమ్చాతో సముద్రాన్ని తోడశక్యమా` అనే పాటను రాసిన శ్రీశ్రీ పంతులమ్మ, భార్యాభర్తలు సినిమా కోసం పద్యాయలను సైతం రాసి అందరిని మెప్పించారు. మొదట్లో డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు రాసి తిరుగులేనివాడిగా పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ క్రమేపి తెలుగు ప్రేక్షకుల హ్రదయ పీఠాన్ని అలంకరించారు. దేవుడు చేసిన మనుష్యుల్లారా లో టైటిల్ సాంగ్, గాంధారి గర్వభంగంలో మానవుని శక్తి, యుక్తులను తెలిపే `పదునాలుగు లోకముల దురేలేదే .. చూడగా మనుష్యుడిల మహానుభావుడే (ఈ పాటను అనుకరిస్తూ తర్వాత బాలభారతంలో `మానవుడే, మహనీయుడు, శక్తిపరుడు యుక్తిపరుడు..` అనే పాటను మరో సినీకవి రాశాడు), తోడికోడళ్లులో `కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదానా..` గుండమ్మ కథలో `లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..` శభాష్ రాముడులోని `జయంబు నిశ్చయంబురా భయండు లేదురా..` పాడిపంటలు, మనుష్యులు మారాలి, కులగోత్రాలు, విప్లవశంఖం, పునర్జన్మ, శ్రీక్రష్ణతులాభారం, పంతాలు-పట్టింపులు, పెళ్లీడు పిల్లలు, దానవీరశురకర్ణ, ఆరాధన ఇలా ఎన్నో చిత్రాల్లో మరిపించే, మనసుల కదిలించే, ప్రేరణ కలిగించే పాటలను ప్రేక్షకులకు అందించిన శ్రీశ్రీ చెప్పదల్చుకుంటే, అర్ధం చేసుకోగలిగే శక్తి ఉంటే ప్రతిపదం, కోటితంత్రులై జనజీవనహేళను తెలుపుతాయని నిరూపించాడు. జీవితంలోని ఎన్నోచేదు నిజాలను `తలచేది జరగదు, జరిగేది తెలియద`ని చెపుతూ, `శోధించి, సాధించాలి అదే ధీరగుణమని` తన గీతాల ద్వారా ఆంధ్రులకు సందేశాన్నిచ్చి చిత్ర జగత్తులో ధ్రవతారగా నిలిచిపోయాడు.

సౌమ్యశ్రీ రాళ్ళభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *