సాంకేతిక పరిజ్ఞానం పెంపొందక ముందు అందరికి ఉన్న ఏకైక వినోద, విజ్ఞాన కాలక్షేపం కథలు. పేదరాశి పెద్దమ్మ కథలు, బేతాళ కథలు, పంచతంత్ర కథలు, తెనాలి రామలింగ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, మర్యాద రామన్న కథలు ఇలా అనేక కథలు భోజనానంతరం ఆరు బయట వెన్నల కింద పక్కలు పర్చుకుని పడుకునే పిల్లలకు, పెద్దలకు ఇంట్లోని తాతయ్యలో, బామ్మలో చెప్పటం కద్దు. అనగనగా ఒక రాజు తో మొదలై కథ కంచికి మనం ఇంటితో ముగించే కథ అంటే అర్థం నివేదించు, ప్రకటించు, ప్రదర్శించు మొదలగునవి. క్లుప్తంగా కథ అంటే కాల్పనిక గాథ.
ఇతర భాషల నుంచి అనువదించబడిన కథలను, అలాగే ఇతర కథలను అనుకరించి రాసిన కథలను పక్కన పెడితే, జనపదులలో నిక్షిప్తమై, ఆ నోట, ఈ నోట తమ భాషలో, తమదైన రీతిలో పాటను, వచనాన్ని ఏర్చి, కూర్చి అందించేవే జానపద కథలు. పురాణేతిహాసాలు కూడా జానపదుల నోటిలో నాని కొత్త హంగులను దిద్దుకున్నా, వీటిని పూర్తిగా జానపద కథలు అని చెప్పలేం. జానపద కథా లక్షణాలని చెప్పాల్సి వస్తే, వీటిలో కథావస్తువు, పాత్ర చిత్రీకరణ చాలా సరళంగా ఉంటుంది. కథ యందు అతి తక్కువ పాత్రలండి, తమ సమకాలీన సంఘటనలు, వ్యక్తులు. జీవన పోకడ ప్రధాన ఇతివృత్తాలయి ఉంటాయి. జానపద కథల్లో యక్షలు, గంధర్వ, కిన్నెరలు, రాక్షసులు, మాంత్రికులు, భూతప్రేతాలు ఎక్కువగా మనకు తారసపడుతుంటారు. ఇంద్రజాల, మహేంద్రజాలాలు, పశుపక్ష్యాదులు మాట్లాడటం వంటి అవాస్తకత గోచరించినా, మానవులే సాహసాలు చేసి సమస్యలను తెలివిగా పరిష్కరించటంతోపాటు, ఆయా కాలానికి అనుగుణమైన ఆచారవ్యవహారాలు కథల్లో చోటుచేసుకుని వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. అలాంటి ఒక జానపద కథ మీ కోసం…
పేదరాశి పెద్దమ్మ
అనగనగా ఒక పేదరాసి పెద్దమ్మ ఉందంట. ఆ పెద్దమ్మక్కి నలుగురు కూతుళ్లున్నారంట. పెద్దమ్మ నలుగురు దగ్గరా తలొక మూడు నెలలు ఉంటా కాలం గడుపుతా ఉంటదంట. ఒకసారి మొదటి కూతురింటి నుండి రెండో కూతురి ఇంటికి పోతావుందంట. దారిలో పెద్ద అడవి. అడవిలో ఎల్తావుంటే ఒక పులి నరవాసన కనిపెట్టి వచ్చి పేదరాశి పెద్దమ్మని తినేత్తానందంట. పెద్దమ్మకి బయం వేసింది. బాగా ఆలోసించి, పెద్దపులితో ఇలా అన్నదంట. పెద్దపులీ, పెద్దపులీ నేను ముసలిదాన్ని, వళ్లు అంత చిక్కిపోయి ఉన్నాను. నేను ఇపుడు నా రెండో కూతురింటికి ఎల్తన్నాను. ఆళ్లు బాగా ఉన్నోళ్లు. అక్కడ పదిరోజులుండి, గార్లెలు, మినప సున్ని ఉండలు, అరిసెలు తిని బలిసి వత్తాను. అప్పుడు తిందువుగాని. కమ్మగా ఉంటది నా నెత్తురు అని చెప్పిందంట. దాని మాటలు పులి నమ్మి వదలి పెట్టిందంట. పదిరోజులు అయినా పెద్దమ్మ తిరిగి రాలేదు. పులికి చాలా కోపం వచ్చింది. ఈదారి తప్పితే మరోదారి లేదుగదా రాకపోద్దా సూద్దాం అనుకుందంట.
పెద్దమ్మ తన కూతురికి పులితో జరిగిన గొడవ చెప్పిందంట. మూడునెలలు వంతు అయిపోయా పెద్దమ్మ బయల్దేరవలసి వచ్చింది. కూతురు బాగా ఆలోచించి, ఒక పెద్ద బానతెచ్చి అందులో పెద్దమ్మని కూకోపెట్టి మూతపెట్టి ఒక గుడ్డ గట్టిగా కట్టి దొర్లించి ఒదలిపెట్టింది. బాన దొర్లుకుంటూ అడవిలోంచి పోతాఉంది. లోపల ఉన్న పెద్దమ్మకు హుషారు వచ్చింది. ఇక పులి తనను ఏమీ చేయలేదనుకుంది. సంతోషంతో ‘బానా బానా బాగా దొర్లు టమకాటు’ అంటా పాడుకుంటా పోతావుంది. పెద్దపులి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా పాడుతూనే ఉంది. పులి బానని ఆపి పంజాతో ఒక పెద్ద దెబ్బకొట్టింది. బాన భడేల్ మని పగలిపోయింది. ఇంక పేదరాశి పెద్దమ్మకు బయం ఏసింది. మళ్లీ ఆలోచించి, పెద్దపులీ, పెద్దపులీ ప్రయాణంలో నా ఒళ్లంతా చెమట పట్టింది గదా. ఆ చెరువులోకి వెళ్లి తానం చేసి వత్తాను హాయిగా తిందువుగాని అంది. అప్పుడు పెద్దపులి సరే అని ఒప్పుకుంది. ముసలమ్మ ఎన్ని గంటలయినా చెరువులోంచి బయటకు రాలేదు. పెద్దపులికి కోపం వచ్చి ఎన్నోసార్లు పిలిచింది. ఒత్తనా, ఒత్తనా అంటదిగాని ముసలమ్మ వత్తల్లేదు. పులికికోపం వచ్చి చెరువులోకి దిగి మీదకి దూకబోయింది. ముసలమ్మ నోట్లో ఇసుక పెట్టుకొని ఉంది. ఒక్కసారి పులి కళ్లల్లోకి ఊసింది. పులి కళ్లల్లో ఇసుకపడి మంటెక్కి బాదపడుతా వుంటే ముసలమ్మ సంతోసంతో పారిపోయింది.
కథ కంచికి ముసలమ్మ ఇంటికి…
తేటగీతి