అన్నమయ్య నుతించిన నృసింహుడు

చెట్టులెక్కగలవా
ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా?
ఓ నరహరి చిగురుకోయగలవా?

ఇది ఒక జానపద గీతం కాదు, పల్లెవాసుల నోటి నుంచి వెలువడిన హాస్య రసానుభూతి. ఉగ్రరూపుడైన నరసింహుడు, దుర్వాసముని శాప కారణాన భిల్ల కన్యగా పుట్టిన సముద్ర తనయ చెంచులక్ష్మిని చూసి తన ఉగ్రాన్ని ఉపసంహరించుకుని మానవ రూపం దాల్చి, ఆమెను పెండ్లాడిన వృత్తాంతం జానపద సాహిత్యంలో చెంచులక్ష్మి యక్షగానంగా, చెంచు భాగవతంగా ప్రసిద్ధిగాంచింది. లక్ష్మీనరసింహుల ఈ సరససల్లాపాలను ఎంతో భావకతతో తన పదాలలో బంధించాడు అన్నమయ్య.

ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
చెంత రమాదేవిఁ గూడె శ్రీ నరసింహుఁడు

సరిఁగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ
సొరిది మోములు తొంగి చూచుకొంటాను
విరులచెండులఁగొని వేటలాడుకొంటాను
సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు

భవనాశిలోని నీరు పైఁ జల్లులాడుకొంటాను
నవకపు సిరులను నవ్వుకొంటాను
జవళిఁ గెమ్మోవులు సన్నలఁజూపుకొంటాను
చివన నిందిరినంటె శ్రీ నరసింహుడు

వేమరుఁ దొడలెక్కువ వీడుదోడులాడుకొంటా
ప్రేమమునఁ గాఁగిళ్ళఁ బెనఁగుకొంటా
ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి
శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుఁడు

తరిగిండ వెంగమాంబ అయితే ఏకంగా చెంచులక్ష్మితో సరసాలలో మునిగిన దేవదేవుడు తన పలుకులను ఆలకించక ఉదాసీనతతో వ్యవహరిస్తున్నాడని తాను రచించిన నృసింహశతకములో ఆ వేంకటనాథునిపై కినుకు వహించింది.

మానక నేను పిల్చినను
	మక్కువ లేక పరాకుసేసితో?
వీనుల సోఁక లేక తగ
	విశ్వము పాలనసేయఁబోతివో?
పూని మహావినోదమున
	భోగము మీఱఁగఁ జెంచుభామతోఁ
గోనలనుండి రావో? తరి
	గొండ నృసింహ! దయాపయోనిథీ!

 

పద్మ, కూర్మ, అగ్ని, విష్ణు పురాణాలు పేర్కొన్న శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో నాలుగవ అవతారమైన నరసింహస్వామిని అన్నమయ్య భక్తిశ్రద్ధలతో, పారవశ్యంతో ‘అనిశము దలఁచరో అహోబిలం, అనంత ఫలదం బహోబిలం’ అంటూ తన పదకవితలతో అలకరించాడు. అన్నమయ్య జీవితాన్ని అహిబిల క్షేత్రం ఎంతగానూ ప్రభావితం చేసింది. అహోబిలం పీఠాధిపతి అయిన శ్రీమాన్ అడివన్ శఠగోపయతి అన్నమయ్యకు వైష్ణవ ధర్మాన్ని, వేదాంతాన్ని ప్రభోదించాడు. అంతేకాక 32 అక్షరాల మహానారసింహమంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీ వేంకటేశ్వరుని తర్వాత పెక్కు కీర్తనలలో నృసింహస్వామిని అన్నమయ్య కొలవటంతోపాటు నారసింహావతార గాథను 11 చరణాలలో ‘నరసింహ విజయము’గా కీర్తించి మనందరిని మోక్షపథం వైపు నడిపించాడు.

వినరయ్య నరసింహవిజయము జనులాల
అనిశము సంపదలు నాయువు నొసఁగును

మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు
చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు
అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె
అదరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె

అంతటఁ బ్రహ్లాదుఁడు ‘అన్నిటానున్నాఁ’డనియె
పంతమున దానవుఁడు బాలునిఁ జూచి
యెంతయుఁ గడఁకతోడ ‘ఇందులోఁ జూపు’మని
చెంతనున్న కంబము చేతఁగొని వేసె

అటమీఁదట బ్రహ్మాండం బదరుచు
కుటిల భయంకర ఘోషముతో
చిట చిట చిటమని పెట పెట పెటమని
పటపట మనుచును బగిలెఁ గంబము

కులగిరు లదరెను కుంభిని వడఁకెను
తలఁకిరి దైత్యులు తల్లడిలి
కలఁగెను జగములు కంపించె జగములు
ప్రళయ కాలగతిఁ బాటిల్లె నపుడు

ఘననారసింహుఁ డదె కంబము నందు వెడలె
కనుపట్టె నదిగొ చక్ర జ్వాలలు
మునుకొని వెడలెఁ గార్ముకముక్త శరములు
కనకకశివునకుఁ గలఁగె గుండియలు

అడరె నద్దేవుని కోపాగ్నులు బెడిదపు –
మిడుఁగురుల తోడుత మిన్నులుముట్టి
పిడుగులురాలేటి భీకర నఖరములు
గడుసు రక్కసునికి గాలములై తగిలె

తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని
కడుపు చించెను వాని గర్వమడఁగ
వెడలెఁ జిల్లున వాని వేఁడి నెత్తురు నింగికి
పొడి వొడియాయ శత్రు భూషణము లెల్లను

నెళ నెళన విరిచె నిక్క వాని యెముకలు
పెళ పెళ నారిచి పెచ్చు వెరిగె హరి
జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె
తళుకుఁ గోరలు తళ తళమని మెరిచె

పెటలించి నరములు పెరికి కుప్పలువేసి
గుటగుటమని రొప్పె గోవిందుఁడు
చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి
కుటిల దానవుఁ జూచి ‘ఖో’ యని యార్చెను

తెంచి శిరోజములు దిక్కులకు వాని –
పంచ ప్రాణములు గొనెఁ బరమాత్ముఁడు
అంచెల నీ రీతిని ప్రహ్లాదుని పగ నీఁగె
మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి

అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె
వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు
తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు
చిప్పిల వరములిచ్చీ శ్రీ వేంకటేశుఁడు

జీవరాశులన్నిటిలో తానే వ్యక్తంగాను, అవ్యక్తంగాను పరమాత్మ భాసిల్లి, సర్వాత్మలలోనూ తన తేజస్సును ప్రజ్వలింపచేసే స్వామి తత్త్వాన్ని ఈ నృసింహ మంత్రం తెలుపుతోంది. అదేవిధంగా, నివురు గప్పిన నిప్పులా పరాక్రమాన్ని తనలో దాచుకోవడేం శ్రేష్టమని నరసింహావతారం మనకు చెప్పకనే చెపుతోంది. ఉగ్రమూర్తి అయిన నరసింహుని హూంకారాన్ని విన్నంతనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది.

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం

ఈ తత్త్వాన్నే అతి సూక్ష్మంగా ‘వెంబడించే కోపాన్ని విడిచిపెడితే మేలు,’ అని కోప స్వభావం నరసింహ అవతార లక్షణమని, అది వీడి వేంకటేశ్వరుని సేవించి చింత లేకుండా జీవించవచ్చని, ‘శరణని బ్రతుకరో జనులారా, గరిమ మెరిసె నిదె కనకసింహము’ అంటూ, దైత్యులను త్రుంచిన ప్రళయ నరసింహునికి, పరాక్రమ నరసింహునికి, శాంత నరసింహునికి, సుజన రక్షక నరసింహునికి, నిశ్చల నరసింహునికి, వీర, శృంగార నరసింహునికి, చతుర నరసింహునికి, యోగానంద నరసింహునికి, ప్రతాప నరసింహునికి, విక్రమ నరసింహునికి, దివ్య నరసింహునికి, గుణగణాకర నరసింహునికి,

మొక్కరే మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి
దక్కి శ్రీ వేంకటేశుఁడే తానైన దేవునికి

కరములు వే యవే కరములును భయం
కరనఖాయుధములు కడలే నవే
సిరి దొడపై నదె సింహపునెమ్మో మదే
నరరూపు సగమదె నరసింహునికి

వంకరకోల లవె వజ్రపుదంతము లవె
సంకుమఁ జక్రము నిరువంకలా నవె
జంకెల నేత్రము లవె జడలు మూఁపున నవె
అంకె నభయహస్తము అదె నరహరికి

నిక్కినకర్ణము లవె నీలిమచ్చవుర మదె
చుక్కల మొలపూసల నొక్కరూ పదె
తొక్కినపాపము లవె తోడనే శ్రీ వేంకటాద్రి
పక్కెరనరసింహపు ప్రళయసింహునికి

అని ప్రబోధించాడు.

చెంచులక్ష్మి జానపద కథారూపకమే గాక, ధర్మపురి నరసింహశతకం, సింహాద్రి నారసింహ శతకాలతోపాటు, అహోబిలం, యాదగిరి, సింహాచలం, మంగళగిరి, కదిరి, కంభం వేదాద్రి, తరిగొండ మున్నగు లక్ష్మీనృసింహ క్షేత్రాలు హరిహరులతోపాటుగా, నరసింహునికి గూడా ఆంధ్రనాట పెద్దపీట వేశాయి. కృష్ణానదీతీరానున్న పంచ నారసింహ క్షేత్రాలలో వెలసిన స్వామిని – మంగళగిరిలో పానకాలయ్య, వేదాద్రిలో స్నానాలయ్య, మట్టపల్లిలో అన్నాలయ్య, వాడపల్లిలో దీపాలయ్య, మరియు కేతవరములో వజ్రాలయ్య పేర్లతో భక్తులు కొలుస్తారు. ఇక హిరణ్యకశుపుని చంపిన నేరుగా స్వామి అనంతపురం జిల్లాలోని కదరి చేరుకున్నాడని ప్రతీతి. ఇక్కడ స్వామిని వేటరాయుడని, బేట్రాయుడని పిలుస్తారు. ఇక వశిష్ట మహాముని కోరిక మేరకు స్వామి అంతర్వేదిలో వెలిశాడు. అలాగే శ్రీ మహాలక్ష్మి తపస్సు చేయట వల్ల మంగళగరిగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో మూడు నరసింహ క్షేత్రాలున్నాయి. వీటిలో కొండపైన పానకాల స్వామి, గిరి శిఖరం మీద గండాల నరసింహుడు, కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహుడు నెలకున్నారు. ఉగ్రనరసింహుని శాంతపర్చడానికి అమ్మవారు అమృతాన్ని సమర్పించినట్టు స్థల పురాణం తెలుపుతోంది. ఆ నేపథ్యంలోనే కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను భక్తులు స్వామి వారికి సమర్పించగా, నేడు కలియుగంలో భక్తులు బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు. యాదర్షి తపస్సుకు మెచ్చి నరసింహుడు జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనే ఐదు రూపాలలో నల్గొండ జిల్లాలో పంచ నరసింహ క్షేత్రంగా బాసిల్లుతున్న యాదగిరిగుట్టపై వెలిశాడు. అలాగే,

జ్వాలాహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవాః
యోగానంద చ్చత్రవట పావనా నవమూర్తయః

జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ, కారంజ (కానుగమాని), భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అనునవి తొమ్మిది నరసింహుని రూపాలు. మహానంది నుంచి సుమారు 70కిలో మీటర్ల దూరంలో ఉన్న అహోబిల క్షేత్రంలో ఈ తొమ్మిది రూపాలతో నవనరసింహుడు కొండపైన, కింద కొలువు తీరి ఉన్నాడు. అన్నమయ్య 12 సంవత్సరాలపాటు ఈ క్షేత్రంలో నివాసమై ఉండటం వల్ల కావచ్చు దాదాపు 40 సంకీర్తనలలో నరసింహుని వర్ణించటంతో పాటు అనేక సంకీర్తనలలో స్వామి వివిధ క్షేత్ర మహిమలను, రూప, లీలా విశేషాలను కొనియాడాడు.

వేదములు నుతింపఁగ వేడుకలు దైవారఁగ
ఆదరించీ దాసుల మోహననారసింహుఁడు

నెఱులజడలతోడ నిక్కుఁగర్ణములతోడ
కుఱుచ కొమ్ములతోడ కోఱలతోడ
వుఱక సిరిఁ దొడపై నుంచుక సింహాసనాన
మెఱసీఁ బ్రతాపముల మేటినారసింహుఁడు

నిడుపమీసాలతోడ నిట్టూరుపులతోడ
మిడిగుడ్లతోఁ దెల్లనిమేనితోడ
వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి
కడు మంచివరాలిచ్చీ ఘననారసింహుఁడు

చిలుకుగోళ్లతోడ సెలవినవ్వులతోడ
బలు జిహ్వతోడ యోగపట్టెముతోడ
అలరి శ్రీవేంకటాద్రి నహోబలగిరిని
అల ప్రహ్లాదునిఁ గాచె నాదినారసింహుఁడు

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *