అనువాద కథలు 1
ఇరవైఏళ్ల నిరీక్షణ....

మూలకథ రచన: ఓ. హెన్రీ

దృఢంగా ఉన్న ఒక పోలీసు అధికారి వీధుల్లో గస్తీకాస్తూ తిరుగుతున్నాడు. జనసంచారం పలచగా ఉన్న ఆ వీధిలో పోలీసుని గమనించేవారిని వేళ్ల మీద లెక్కపెట్టుకొవచ్చు. రాత్రి పది కావస్తోంది. సన్నని జల్లు, గాలితో వాతావరణం చలి పుట్టిస్తోంది.

ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో నెమ్మదిగా నడస్తూ దుకాణాల తలుపులన్ని మూసున్నాయో లేదో గమనిస్తూ ఆ అధికారి కదలుతున్నాడు. మధ్య, మధ్యలో వీధిని ఆ చివరనుంచి ఈ చివరి వరకు పరికిస్తూ అంతా సజావుగా ఉందో లేదో క్రీగంట గమనిస్తున్నాడు. ఈ ప్రాంతంలో జనాలు పెందరాళే ఇళ్లకు వెళ్లతారు. ఎక్కడో ఒకటో, రెండో దుకాణాల్లో, చిన్న హోటలులో దీపాలు వెలుగుటం తప్పితే అంతా నిర్మనుస్యంగా ఉంటుంది.

అకస్మాత్తుగా పోలీసు దృష్టి ఒక దుకాణం దగ్గర నిల్చున్న వ్యక్తిపై పడింది. నెమ్మదిగా అతని వైపు అడుగులు వేశాడు. పోలీసు తన వైపు రావటం చూసి ఆ అజ్ఞాత వ్యక్తి, ‘ఇక్కడంతా సజావుగానే ఉంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు ఆఫీసర్. నేను నా చిరకాల మిత్రుని కొరకు వేచిచూస్తున్నాను. ఇరవైఏళ్ల తర్వాత ఇక్కడ, ఈ రాత్రి కల్సుకోవాలని మేము అనుకున్నాం. వినడానికి ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా. ఇది నిజం’ అని చెప్పాడు. అంతేకాక, ఇరవై సంవత్సరాల క్రితం ఈ దుకాణం స్థానే బిగ్ జో బ్రాడీ అనే రెస్టారెంట్ ఉండేది అన్నాడు.

‘అవును ఐదు సంవత్సారల క్రితం వరకు కూడా ఆ రెస్టారెంట్ ఉండేద’ని పోలీసు అధికారి బదులిచ్చాడు.

బల్లపరుపు ముఖము, కుడికంటి దగ్గర చిన్న తెల్లని మచ్చతో ఆ అజ్ఞాత వ్యక్తి కళ్లలో ఏదో తెలియని మెరుపు. ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రెస్టారెంట్ లో జిమ్మి విల్స్ తో కలసి భోజనం చేశాను. నాకు అతను ప్రాణస్నేహితుడు, ప్రపంచంలోనే అతి మంచివ్యక్తి అని అడగకుండానే వివరించాడు. మేమిద్దరం ఈ న్యూయార్క్ మహానగరంలో అన్నదమ్ముల్లా కలిసి, మెలిసి పెరిగాము. అప్పుడు నాకు 18, విల్స్ కి 20 సంవత్సారాలుంటాయి. నేను జీవితంలో ఏదో సాధించాలని, గొప్పవాణ్ణికావాలన్న ఆకాంక్షతో ఉద్యోగ వెతుకులాటలో ఈ నగరం విడ్చి వెళ్లాను. కాని విల్స్ కు మాత్రం న్యూయార్కే సర్వస్వం, దాంతో ఇక్కడే ఉండి పోయాడు అని తన కథంతా చెప్పుకొచ్చాడు ఆ అజ్ఞాత వ్యక్తి.

‘ఇరవై సంవత్సరాల సుదీర్ఘప్రయాణం తర్వాత మేము, మా జీవితాల్లో సాధించాలనుకున్నది సాధించగలమని, మాకంటూ ఒక ఉనికి, వ్యక్తిత్వం అప్పటికి ఏర్పడగలవని భావించాము. అందుకే ఇక్కడే, ఇదే ప్రదేశంలో ఇరవై ఏళ్ల తర్వాత కల్సుకోవాలని నిర్ణయించుకున్నాం.’ అన్నాడా ఆజ్ఞాత వ్యక్తి.

‘వినడానికి ఏదో కాశీమజలీ కథలా ఉంది. ఈ ఇరవైఏళ్లలో నీ స్నేహితుని కలవడంగాని, మాట్లాడటం గాని చేయలేదా’ సంభమాశ్చర్యంతో ప్రశ్నించాడు పోలీసు అధికారి.

‘ఒకటి, రెండు సంవత్సరాలు ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. కాని క్రమంగా అవి తగ్గిపోయాయి. నా జీవిత గమనంలో ఎక్కడెక్కడో ప్రయాణించాను. కాని ఏ మాత్రం వీలున్నా, నా స్నేహితుడు జీవించి ఉంటే తప్పకుండా తన మాట నిలబెట్టుకుంటాడు.ఈ రోజు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. చాలా దూరం నుంచి నేను వ్యయప్రయాసలకు ఓడ్చి ఇక్కడికి వచ్చాడను. నా స్నేహితుడు నన్ను నిరాశపర్చడని’ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ అజ్ఞాత వ్యక్తి సమాధానమిచ్చాడు.
ఇంతలో తన జేబులోంచి వజ్రాలు పొదిగిన గడియారం బయటకు తీసి పదికావడానికి ఇంకా మూడు నిమిషాలు ఉందని తనలో తాను అనుకుని బయటకి మాత్రం మేము విడిపోయినప్పుడు సమయం సరిగ్గా రాత్రి పది గంటలు అన్నాడు. ఆ వ్యక్తి వేషధారణ, ఖరీదైన గడియారం గమనించిన పోలీసు అధికారి, నీవు జీవితంలో అనుకున్నది సాధించినట్టున్నావన్నాడు.

‘అందులో అనుమానమేలేదు. జిమ్మి కూడా తన ప్రయత్నాల్లో విజయం సాధించుంటాడని నా ఆశ. న్యూయార్క్ అప్పటికి, ఇప్పటికి ఏమీ మారలేదు. కానీ నేను మాత్రం బయట ప్రపంచంలోకి వెళ్లి ఎంతో కష్టపడ్డాను, నేర్చుకున్నాని’ గర్వంతో కూడిన ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చాడు.

ఆ అజ్ఞాత వ్యక్తి మాటలు వింటూ వెళ్లిపోవడానికి రెండడుగులు ముందుకు వేసిన పోలీసు అధికారి ఆగి వెనక్కి చూసి ‘నీ విశ్వాసం నిజంకావాలని, నీ స్నేహితుడు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక వేళ అతను రాకపోతే ఏం చేస్తావు, వెళ్లిపోతావా’ అని ప్రశ్నించాడు.

‘లేదు. తప్పకుండా వస్తాడు. కనీసం ఒక గంటైన ఎదురుచూస్తాను. గుడ్ నైట్ ఆఫీసర్’ అన్నాడు.

అతనికి వీడ్కోలు చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు పోలీసు అధికారి.

చల్లని జడివాన వేగాన్ని పుంజుకుంటోంది. వాన పెరగకముందే ఇళ్లకి చేరుకోవాలని ఆ వీధిలో మిగిలిన ఒకరో, ఇద్దరూ పరుగులుపెడుతున్నా. స్నేహితుడొస్తాడన్న ఆశతో ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం ఎదురు చూపులు చూస్తూ ఆ వానలో ఆ దుకాణం ముందు అలానే నిల్చుని ఉన్నాడు.

సమయం భారంగా గడుస్తోంది. ఇరవై నిమిషాల తర్వాత పైనుంచి కిందవరకున్న కోట్ ధరించి ఒక పొడవాటి వ్యక్తి, ఆ అజ్ఞాతవ్యక్తి వైపు వేగంగా వచ్చాడు. వస్తూనే ‘అది నువ్వేనా, బాబ్’ అని ఆత్రుతగా ప్రశ్నించాడు.

‘నువ్వు జిమ్మి విల్స్’ ఆజ్ఞాత వ్యక్తి ఒక్కసారిగా అరిచాడు.

ఆ పొడవాటి వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి చేయిపట్టకుని కుదుపుతూ, ‘నాకు తెలుసు. నువ్వు బాబ్ వేనని, నువ్వు తప్పక వస్తావని. సుదీర్ఘమైన ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ పాత రెస్టారెంట్ లేదు. ఉంటే ఇక్కడ తప్పకుండా మరోసారి నీతో కల్సి విందు చేసేవాడిని. నీవు అనుకున్నది సాధించావా అంటూ,’ ఊపిరి సలపకుండా ప్రశ్నల వర్షం కురిపించటం మొదలుబెట్టాడు.

నేనెలా ఉన్నా, నువ్వుమాత్రం చాలా మారిపోయావు. నీవు ఇంత పొడుగున్నట్టు లేదు. నువ్వెలా ఉన్నావు జిమ్మి అని ఆప్యాయంగా పలకరించాడు అజ్ఞాత వ్యక్తి.
నేను బావున్నాను. మనం చాలా మాట్లాడుకోవాలి. పద ఇక్కడి నుంచి ముందర అని అతని చేయిపట్టుకుని జిమ్మి ముందుకు కదిలాడు. పాతిక సంవత్సరాలలో తాను సాధించిన విజయాలను అజ్ఞాతవ్యక్తి ఏకరువు పెడుతుంటే, నెమ్మదిగా చీకటిలోంచి వీధిదీపం వెలుగులోకి వచ్చిన స్నేహితులిద్దరు ఒకరినొకరు ఏరిపార చూసుకున్నారు.

అకస్మాత్తుగా ఆ అజ్ఞాత వ్యక్తి నువ్వు జిమ్మి విల్స్ కాదు. ఇరవై సంవత్సరాలు చాలా కాలమే కావచ్చు, నిన్ను పోల్చుకోలేనంత సమయం కాదని నిలదీశాడు.

‘కాలం మనిషిని మంచివాడి నుంచి చెడ్డవాడిగా మర్చేస్తుంది. నీవు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నావు బాబ్. చికాగో పోలీసులు నువ్వు న్యూయార్క్ రావచ్చని హెచ్చరించారు. నువ్వు మారుమాట్లాడకుండా, నాతో వస్తే నీకే మంచిద’ని బదులిచ్చాడు ఆ పొడవాటి వ్యక్తి.

అలా అంటూనే జేబులోంచి ఒక కాగితం తీసి ముందు ఇది చదువు. ఇది పోలీసు ఆఫీసర్ జిమ్మి విల్స్ నీకిమన్నాడని, మడచిన కాగితాన్ని అజ్ఞాతవ్యక్తి చేతిలో ఉంచాడు.

అంతా అయోమయంగా ఉండటంతో, నెమ్మదిగా, వణుకుతున్న చేతులతో కాగితాన్ని విప్పి చదవటం ప్రారంభించాడు బాబ్.

‘బాబ్. మనమనుకున్న స్థలానికి నేను వచ్చాను. నీలో చికాగో పోలీసులు వెతుకున్న వ్యక్తి పోలికలు గమనించాను. నా చేతులతో నేను నిన్ను అరెస్టు చేయలేక, ఆ పని చేయడానికి మరో అధికారిని పంపించాను.’ జిమ్మి.

మూలకథ: ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్

అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి

One thought on “అనువాద కథలు 1
ఇరవైఏళ్ల నిరీక్షణ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *