
దృఢంగా ఉన్న ఒక పోలీసు అధికారి వీధుల్లో గస్తీకాస్తూ తిరుగుతున్నాడు. జనసంచారం పలచగా ఉన్న ఆ వీధిలో పోలీసుని గమనించేవారిని వేళ్ల మీద లెక్కపెట్టుకొవచ్చు. రాత్రి పది కావస్తోంది. సన్నని జల్లు, గాలితో వాతావరణం చలి పుట్టిస్తోంది.
ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో నెమ్మదిగా నడస్తూ దుకాణాల తలుపులన్ని మూసున్నాయో లేదో గమనిస్తూ ఆ అధికారి కదలుతున్నాడు. మధ్య, మధ్యలో వీధిని ఆ చివరనుంచి ఈ చివరి వరకు పరికిస్తూ అంతా సజావుగా ఉందో లేదో క్రీగంట గమనిస్తున్నాడు. ఈ ప్రాంతంలో జనాలు పెందరాళే ఇళ్లకు వెళ్లతారు. ఎక్కడో ఒకటో, రెండో దుకాణాల్లో, చిన్న హోటలులో దీపాలు వెలుగుటం తప్పితే అంతా నిర్మనుస్యంగా ఉంటుంది.
అకస్మాత్తుగా పోలీసు దృష్టి ఒక దుకాణం దగ్గర నిల్చున్న వ్యక్తిపై పడింది. నెమ్మదిగా అతని వైపు అడుగులు వేశాడు. పోలీసు తన వైపు రావటం చూసి ఆ అజ్ఞాత వ్యక్తి, ‘ఇక్కడంతా సజావుగానే ఉంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు ఆఫీసర్. నేను నా చిరకాల మిత్రుని కొరకు వేచిచూస్తున్నాను. ఇరవైఏళ్ల తర్వాత ఇక్కడ, ఈ రాత్రి కల్సుకోవాలని మేము అనుకున్నాం. వినడానికి ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా. ఇది నిజం’ అని చెప్పాడు. అంతేకాక, ఇరవై సంవత్సరాల క్రితం ఈ దుకాణం స్థానే బిగ్ జో బ్రాడీ అనే రెస్టారెంట్ ఉండేది అన్నాడు.
‘అవును ఐదు సంవత్సారల క్రితం వరకు కూడా ఆ రెస్టారెంట్ ఉండేద’ని పోలీసు అధికారి బదులిచ్చాడు.
బల్లపరుపు ముఖము, కుడికంటి దగ్గర చిన్న తెల్లని మచ్చతో ఆ అజ్ఞాత వ్యక్తి కళ్లలో ఏదో తెలియని మెరుపు. ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రెస్టారెంట్ లో జిమ్మి విల్స్ తో కలసి భోజనం చేశాను. నాకు అతను ప్రాణస్నేహితుడు, ప్రపంచంలోనే అతి మంచివ్యక్తి అని అడగకుండానే వివరించాడు. మేమిద్దరం ఈ న్యూయార్క్ మహానగరంలో అన్నదమ్ముల్లా కలిసి, మెలిసి పెరిగాము. అప్పుడు నాకు 18, విల్స్ కి 20 సంవత్సారాలుంటాయి. నేను జీవితంలో ఏదో సాధించాలని, గొప్పవాణ్ణికావాలన్న ఆకాంక్షతో ఉద్యోగ వెతుకులాటలో ఈ నగరం విడ్చి వెళ్లాను. కాని విల్స్ కు మాత్రం న్యూయార్కే సర్వస్వం, దాంతో ఇక్కడే ఉండి పోయాడు అని తన కథంతా చెప్పుకొచ్చాడు ఆ అజ్ఞాత వ్యక్తి.
‘ఇరవై సంవత్సరాల సుదీర్ఘప్రయాణం తర్వాత మేము, మా జీవితాల్లో సాధించాలనుకున్నది సాధించగలమని, మాకంటూ ఒక ఉనికి, వ్యక్తిత్వం అప్పటికి ఏర్పడగలవని భావించాము. అందుకే ఇక్కడే, ఇదే ప్రదేశంలో ఇరవై ఏళ్ల తర్వాత కల్సుకోవాలని నిర్ణయించుకున్నాం.’ అన్నాడా ఆజ్ఞాత వ్యక్తి.
‘వినడానికి ఏదో కాశీమజలీ కథలా ఉంది. ఈ ఇరవైఏళ్లలో నీ స్నేహితుని కలవడంగాని, మాట్లాడటం గాని చేయలేదా’ సంభమాశ్చర్యంతో ప్రశ్నించాడు పోలీసు అధికారి.
‘ఒకటి, రెండు సంవత్సరాలు ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. కాని క్రమంగా అవి తగ్గిపోయాయి. నా జీవిత గమనంలో ఎక్కడెక్కడో ప్రయాణించాను. కాని ఏ మాత్రం వీలున్నా, నా స్నేహితుడు జీవించి ఉంటే తప్పకుండా తన మాట నిలబెట్టుకుంటాడు.ఈ రోజు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. చాలా దూరం నుంచి నేను వ్యయప్రయాసలకు ఓడ్చి ఇక్కడికి వచ్చాడను. నా స్నేహితుడు నన్ను నిరాశపర్చడని’ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ అజ్ఞాత వ్యక్తి సమాధానమిచ్చాడు.
ఇంతలో తన జేబులోంచి వజ్రాలు పొదిగిన గడియారం బయటకు తీసి పదికావడానికి ఇంకా మూడు నిమిషాలు ఉందని తనలో తాను అనుకుని బయటకి మాత్రం మేము విడిపోయినప్పుడు సమయం సరిగ్గా రాత్రి పది గంటలు అన్నాడు. ఆ వ్యక్తి వేషధారణ, ఖరీదైన గడియారం గమనించిన పోలీసు అధికారి, నీవు జీవితంలో అనుకున్నది సాధించినట్టున్నావన్నాడు.
‘అందులో అనుమానమేలేదు. జిమ్మి కూడా తన ప్రయత్నాల్లో విజయం సాధించుంటాడని నా ఆశ. న్యూయార్క్ అప్పటికి, ఇప్పటికి ఏమీ మారలేదు. కానీ నేను మాత్రం బయట ప్రపంచంలోకి వెళ్లి ఎంతో కష్టపడ్డాను, నేర్చుకున్నాని’ గర్వంతో కూడిన ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చాడు.
ఆ అజ్ఞాత వ్యక్తి మాటలు వింటూ వెళ్లిపోవడానికి రెండడుగులు ముందుకు వేసిన పోలీసు అధికారి ఆగి వెనక్కి చూసి ‘నీ విశ్వాసం నిజంకావాలని, నీ స్నేహితుడు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక వేళ అతను రాకపోతే ఏం చేస్తావు, వెళ్లిపోతావా’ అని ప్రశ్నించాడు.
‘లేదు. తప్పకుండా వస్తాడు. కనీసం ఒక గంటైన ఎదురుచూస్తాను. గుడ్ నైట్ ఆఫీసర్’ అన్నాడు.
అతనికి వీడ్కోలు చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు పోలీసు అధికారి.
చల్లని జడివాన వేగాన్ని పుంజుకుంటోంది. వాన పెరగకముందే ఇళ్లకి చేరుకోవాలని ఆ వీధిలో మిగిలిన ఒకరో, ఇద్దరూ పరుగులుపెడుతున్నా. స్నేహితుడొస్తాడన్న ఆశతో ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం ఎదురు చూపులు చూస్తూ ఆ వానలో ఆ దుకాణం ముందు అలానే నిల్చుని ఉన్నాడు.
సమయం భారంగా గడుస్తోంది. ఇరవై నిమిషాల తర్వాత పైనుంచి కిందవరకున్న కోట్ ధరించి ఒక పొడవాటి వ్యక్తి, ఆ అజ్ఞాతవ్యక్తి వైపు వేగంగా వచ్చాడు. వస్తూనే ‘అది నువ్వేనా, బాబ్’ అని ఆత్రుతగా ప్రశ్నించాడు.
‘నువ్వు జిమ్మి విల్స్’ ఆజ్ఞాత వ్యక్తి ఒక్కసారిగా అరిచాడు.
ఆ పొడవాటి వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి చేయిపట్టకుని కుదుపుతూ, ‘నాకు తెలుసు. నువ్వు బాబ్ వేనని, నువ్వు తప్పక వస్తావని. సుదీర్ఘమైన ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ పాత రెస్టారెంట్ లేదు. ఉంటే ఇక్కడ తప్పకుండా మరోసారి నీతో కల్సి విందు చేసేవాడిని. నీవు అనుకున్నది సాధించావా అంటూ,’ ఊపిరి సలపకుండా ప్రశ్నల వర్షం కురిపించటం మొదలుబెట్టాడు.
నేనెలా ఉన్నా, నువ్వుమాత్రం చాలా మారిపోయావు. నీవు ఇంత పొడుగున్నట్టు లేదు. నువ్వెలా ఉన్నావు జిమ్మి అని ఆప్యాయంగా పలకరించాడు అజ్ఞాత వ్యక్తి.
నేను బావున్నాను. మనం చాలా మాట్లాడుకోవాలి. పద ఇక్కడి నుంచి ముందర అని అతని చేయిపట్టుకుని జిమ్మి ముందుకు కదిలాడు. పాతిక సంవత్సరాలలో తాను సాధించిన విజయాలను అజ్ఞాతవ్యక్తి ఏకరువు పెడుతుంటే, నెమ్మదిగా చీకటిలోంచి వీధిదీపం వెలుగులోకి వచ్చిన స్నేహితులిద్దరు ఒకరినొకరు ఏరిపార చూసుకున్నారు.
అకస్మాత్తుగా ఆ అజ్ఞాత వ్యక్తి నువ్వు జిమ్మి విల్స్ కాదు. ఇరవై సంవత్సరాలు చాలా కాలమే కావచ్చు, నిన్ను పోల్చుకోలేనంత సమయం కాదని నిలదీశాడు.
‘కాలం మనిషిని మంచివాడి నుంచి చెడ్డవాడిగా మర్చేస్తుంది. నీవు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నావు బాబ్. చికాగో పోలీసులు నువ్వు న్యూయార్క్ రావచ్చని హెచ్చరించారు. నువ్వు మారుమాట్లాడకుండా, నాతో వస్తే నీకే మంచిద’ని బదులిచ్చాడు ఆ పొడవాటి వ్యక్తి.
అలా అంటూనే జేబులోంచి ఒక కాగితం తీసి ముందు ఇది చదువు. ఇది పోలీసు ఆఫీసర్ జిమ్మి విల్స్ నీకిమన్నాడని, మడచిన కాగితాన్ని అజ్ఞాతవ్యక్తి చేతిలో ఉంచాడు.
అంతా అయోమయంగా ఉండటంతో, నెమ్మదిగా, వణుకుతున్న చేతులతో కాగితాన్ని విప్పి చదవటం ప్రారంభించాడు బాబ్.
‘బాబ్. మనమనుకున్న స్థలానికి నేను వచ్చాను. నీలో చికాగో పోలీసులు వెతుకున్న వ్యక్తి పోలికలు గమనించాను. నా చేతులతో నేను నిన్ను అరెస్టు చేయలేక, ఆ పని చేయడానికి మరో అధికారిని పంపించాను.’ జిమ్మి.
రచన: ఓ. హెన్రీ
అనువాదం: తేటగీతి
భారత, రామాయణాలు మన జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నది నిర్వివాదాంశం. అయితే, రామాయణ గాథలు చొప్పించుకు పోయినంతగా భారతం వ్యాపించలేదు. జానపద గేయ సాహిత్యంలో రామాయణం పెద్దపీట వేసుకుని కూర్చునప్పటికీ, భారతం కూడా ఏమీ తీసిపోలేదు. జానపద కళారూపాలలో భారతమే అగ్రగామిగా నిలిచింది. ఆయుష్షు కోరుకునేవారికి ఆయుష్షుని, అర్ధార్ధులకు విపులార్ధాన్ని, ధర్మార్ధులకు నిత్యధర్మ సంప్రాప్తిని, వినయార్ధులకు మహావినయ సంపత్తిని, పుత్రార్ధులకు పుత్ర సమృద్ధిని, సంపదార్ధులకు సంపదలను భారత పఠనం కల్గిస్తుందని భారత గొప్పదనాన్ని చెపుతూ నన్నయ్య చెప్పాడు. అటువంటి భారతం మన జానపద కళారూపాలైన చెక్కభజన, కోలాటం వంటి కళలలో భారత ఘట్టాలను విరివిగా చిత్రీకరించారు.
‘‘తమ్ముడా ఒరె భీమసేనా ఎంతమోసము జరిగెర’’, అంటూ రాయలసీమలో చేసే పాండవవనవాసం చెక్కభజన ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఇక భారతంలో ఎంతో ఉదాత్తపాత్రైన ద్రౌపదిని గూర్చిన అనేక పాటలను జానపదులు కూర్చారు. ఆమె అవమనాలు తమ అవమానాలుగా, ఆమె కష్టాలు తమ కష్టాలుగా భావించి ఎంతో సానుభూతితో గేయాలు పాడారు. వీటిలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం అతి ముఖ్యమైనది.
‘‘నీలవరన పాలశమన నిన్ను నమ్మినానురా
నన్ను సభకు తీసి అవమానింప బోతున్నారురా
అచ్చుతా నను బ్రోవరా యిక దిక్కు ఎవ్వరున్నారురా
దిక్కు నీవే దీన బాంధవ గ్రక్కుననన్ను బ్రోవరా
కంస మర్ధన వంశపాలన కలిగి కృష్ణా బ్రోవరా’’ అంటూ ద్రౌపది ఆక్రందన జానపదుల గుండులోతుల్లోంచి వచ్చింది.
జానపదుల దృష్టిలో ధర్మరాజు ధర్మపరాయణుడే, శ్రీకృష్ణుని మాయవలనే పాండవులు అరణ్యవాసం చేయవచ్చిందని జానపదుల నమ్మిక. అందుకే ద్రౌపది కష్టాల్ని తెల్సుకొని కృష్ణుడి మాయల్ని మర్మంగానే భీముడికి చెప్పినట్టగా పాండవుల అరణ్యవాస ఘట్టంలో వారు ఈ క్రిందివిధంగా చిత్రీకరించారు.
‘‘......
పులులు మేకలు కొన్ని దినములు జూదమాడెను తమ్ముడా
ఆకుపూతలేని అడవిలో ఆ ఆరు మేకలు మేశర
అడ్డమొచ్చు పెద్దపులులను సంహరింపుము అర్జున
ఎవరు చేసిన మాయకాదు బావ చేసిన మాయర
బాకు పదహారువేల భార్యలు కలవాడురా...
వద్దు పగవానికైన వాసుదేవుని సాక్షిగా
ఆడజన్మము కంటె అడవిలో వృక్షజన్మము మేలురా
చేత చెక్కలు కాలి గజ్జెలు ఘల్లుఘల్లున మ్రోయగ
జల్లుజల్లున మ్రోయగ యిక గల్లుగల్లున మ్రోయగ
పరగకంభము పాటి కోదండరామ నిన్ను కొలిచెదము మేము
సకలము రామా’’
ఈ పాట వీథి నాటకాలలో, చెక్కభజనల్లో పాడుకుంటారు.
ఈ పాటలో జానపదులు తత్త్వజ్ఞాననంతటిని ఇనుమడింపచేశారు. ‘ఆకుపూతలేని అడవి’ అంటే మానవ శరీరం. ఆరుమేకలు ఆరిషడ్వర్గాలు. ఇవి క్రూరమృగాలు సాధుజంతువులను చంపినట్టుగా, మనిషిలోని మంచి గుణాలను చంపి, మోహం, లోభం, స్వార్ధం వంటి మృగతత్వాలను ప్రజ్వరిల్లచేస్తాయి. వాటిని తుదముట్టించమని అర్జునికి తత్త్వబోధన చేయటమే ఈ గేయోద్దేశము.
భారతంలో నాటకీయతను తెలిపే అనేక ఘట్టాలను జానపద కళారూపాల్లో మనం చూడవచ్చు. సుదేష్ణ కొలువులో సైరంధ్రిగా ద్రౌపది దుస్థితి, కీచక వధ, అరణ్యవాసానంతరం ధృతరాష్ట, ధుర్యోధనల సంవాదం, అభిమన్యు,శశిరేఖల పరిణయ విషయంలో సుభద్రా,బలరాముల సంవాదం, ఇలా రోజూవారీ జీవితంలో ప్రతి యింటిలోనూ ఎదురయ్యే సంబంధ, బాంధవ్యాలకు సంబంధించిన అనేక వృత్తాంతాలను జానపదులు పాటలు కట్టి పాడారు, కోలాటాలు, చెక్కభజనలో రసవత్తరంగా ఆడారు.
సుభద్రా, బలరాముల సంవాదం:
సుభద్ర: సిన్నాది శశిరేఖ చిన్నవాడు అభిమన్యు యిద్దరికీ డేరన్నా ఓ బలరామన్నా యిద్దరికీడేరన్నా
పుట్టింది శ్రీ పుత్రి పుట్టినప్పుడు వాశ పుట్టినే నోస్తీరన్నా ఓ బలరామన్నా కన్నెనడగవస్తిరన్నా
బలరామ: ఉయ్యాల తోట్లల్లో ఊగేటి నాపుత్రి అడవులకెటుపంపుదూ ఓ సుభద్రమ్మా అడవులకెటులంపుదూ
పాలుహన్నము పెరుగు భుజియించే నాపుత్రి ఏ పాకు తిన పెడుదునా ఓ సుభద్రమ్మ ఏ పాకు తినబెడుదునా
సుభద్ర: మేనత్త కొడుకని మెచ్చిననిచ్చినారూ హెచ్చు తక్కువ లెంచితిరా ఓ బలరామన్నా హెచ్చు తక్కువలెంచిరా...
తేటగీతి
గురజాడ వారి కలం నుండి నేలరాలిన చుక్కే మధురవాణి. వృత్తిపరంగా వేశ్య అయినప్పటికి ఉన్నతమైన వ్యక్తిత్వంతో, కొంటెతనంతో, మాటకారితనంతో, జాణతనంతో నాటి, నేటి సమాజంలో మంచికి, చెడుకి మధ్య ఆనకట్టుగా నిలిచే అందాల భరిణే. కాదు, కాదు విచక్షణతో వ్యవహరించే ధీర వనిత. మంచివాళ్ల పట్ల మంచిగానూ, చెడ్డవాళ్లపట్ల చెడ్డగానూ ఉండమన్న తల్లి బోధనను అక్షరాలా అమలు పరస్తూ, ఎదుటి మనిషిని అంచనా వేసి లోకజ్ఞానంతో వ్యవహరించే కొంటె కొణంగి. ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుష్యులోయ్’ అన్న గురజాడ వారి దృక్ఫదానికి నిలువుటద్దం మధురవాణి. ‘వేశ్యజాతి చెడ్డది కావచ్చు గాని ... చెడ్డలో మంచి ఉండకూడదా’ అని సమాజంలోని ద్వంద్వనీతిని ఎత్తిచూపిన ధీశాలి. నిడివి మీద బంగారాన్ని, యిత్తడినీ లోకం యేర్చేస్తుందని చెపుతూనే, ‘మంచి ఎక్కడున్నా, గ్రాహ్యం కాదా’ మంచి చెడ్డలు యెంచే వారెవరని నిగ్గతీసీన వనిత.
నాటి సనాతన స్త్రీ నుంచి నేటి ఆధునిక మహిళ వరకు ప్రతి ఒక్కరు అలవర్చుకోవల్సిన ఆత్మవిశ్వాసానికి, స్వావలంబనకు ప్రతీకగా నిల్చే మృదుస్వభావి మధురవాణి. పేరుకు తగ్గట్టుగానే మృదువైన సంభాషణలతో, నిశ్చలమైన ఆలోచనలతో సమాజాన్ని నిశితంగా పరిశీలించి బేరీజు వేయడమే కాదు, అవసరమైతే ‘యిటుపైన ఊర కుక్కలను, సీమ కుక్కలను దూరంగా ఉంచడానికి ఆలోచిస్తున్నా’ని స్వప్రయోజనాపరులనుద్దేశించి ఘాటుగా కుండబద్దలు కొట్టినట్టు జవాబునూ ఇవ్వగలదు. మధురవాణి మాట కటువుగా అన్పించినా, తరచి చూస్తే ఒక స్త్రీలో ఉండే సౌకుమార్యం ఆమెలోనూ మనకు కన్పిస్తుంది. వృత్తి వల్ల వేశ్య గనుక చేయాల్సిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందేమో కానీ, ఆమెలో దయాదాక్షిణ్యాలు సున్నా అనుకుంటే పొరపాటే. స్త్రీ జనోద్దరణను గురజాడ వారు ఆమెతో ఆరంభించలేదు, ఆమెతో మొదలు పెట్టించారంటే సబబుగా ఉంటుంది .
ఆమెలోని సమయస్ఫూర్తి, వాక్ చాతుర్యం మనకు అడుగడుగునా ముచ్చట కల్గిస్తూనే చురకలు అంటిస్తాయి. ‘తాను చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం అనరాదా ? అబద్దానికి అర్ధం ఏమిటి ? తనకి రొట్టా, ఒహడికి ముక్కా అని మనుష్యులోని సంకుచితత్వాన్ని ఎత్తి చూపిస్తూనే, పరువైన మగవాళ్లున్నప్పుడు పరువైన ఆడవారెందుకుండరని మగవారి మనోభావాలను తూర్పారబట్టడం ఆమెకే సాధ్యం. సంబాషణాలో హాస్యాన్ని రంగరించి చురకత్తుల్లా ఉపయోగించటం ఆమెకే చెల్లింది. ‘ఈ కన్నె పిల్ల నోరు కొంచెం చుట్టవాసన కొడుతూ ఉంది,’అనడంలోనే చూపితే చాలు అందుకు పోయే చురుకుదనం మధురవాణి సొంతమని అర్థమవుతుంది.
విద్వాంసుల ఇచ్చకాలకు మైమరచి, మెరమెచ్చు మాటలకి పొంగిపోకుండా, ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని కార్యాన్ని సాధించగల వ్యూహాపరురాలు. వెరసి నాటకరచయితనే సమ్మోహితుణ్ణి చేసే అమాయకత్వం, చమత్కారం, అజ్ఞానం, మొరటుతనం, పెంకెతనం, సౌజన్యం, పరోపకారబుద్ధి మెండుగా గల వేకువజామున మెరిసే వేగుచుక్క మధురవాణి.
సౌమ్యశ్రీ రాళ్లభండి
‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని ఏనాడో శ్రీశ్రీగారు అన్నారు. ఆ నరజాతి ఘోషను, మహాప్రస్థానాన్ని వెయ్యి పద్యాలలో ఇనుమిండించుకున్న దృశ్య,శ్రవణ కావ్యం శ్రీ గరికపాటి నరసింహరావుగారు రచించిన ‘సాగరఘోష’ పద్యకావ్యం. ఆది శంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో ప్రపంచ దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన దర్శనకావ్యమిది.
మొత్తం 1116 పద్యాలతో నిండిన ఈ కావ్యంలో అవతారికలో 36పద్యాలు, ఒక అశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడిని పారవేస్తామా? లేదే? దాచుకుని, దాచుకుని తింటాము. అలాగే వృత్తాలు పాతవే అయినా కొత్త ఇతివృతంతో కొత్త ఆవకాయలా నోరూరిస్తుంది ఈ కావ్యం.
ఉ|| వేదము కన్న ముందుగ వివేకము నేర్పును కన్నతల్లి, ఆ
పాదము నాకు సర్వ సమభావము. భావము నందు నిల్పె, ఓం
నాద శిఖాగ్ర సీమయగు నా జనయిత్రిని గొల్చినంత ఏ
భేదము లేమి నిల్చునిక! వేదములౌను సమస్త వేదముల్
అంటూ మాతృదేవతకు అంజలిఘటించి, భారతీయ తత్త్వానికి, ఆథ్యాత్మికతకు మూలస్తంభమైన, ఆ ఆదిశంకరునికే
కన్యాదానము జేసెడి ధన్యత చేకూరలేదు, తప్పదు కవితా
కన్యాదానము చేసెద, సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే
అంటూ తన కావ్యపుత్రికను అంకితమిచ్చే సాహసం చేశాడు కవి.
పాఠకుని ఊహలకతీతంగా ఈ కావ్యానికి కవి నాంది పలికాడు. ప్రౌఢవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చుని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉండగా, ఆవును చేరిన లేగదూడ వలే ఒక సుడికూన, ఆ కవి ఒళ్ళో చేరుతుంది. ఆ కూనను చూసి ఒడిలో చేరిన పసిపాపగా భావించి, కవి ప్రేమగా చేరదీసి, లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా తగులుతుంది. ‘పాల మీగడ వలె, దూదిపింజె వలె, స్వచ్ఛంగా ఉండవలసిన నీటి కెరటానివి, ఇలా ఉన్నావేమిటి?’ అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుండి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఈ విధంగా ఉందని ఆ సుడికూన వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే సేదతీరి పయనమవుతానని అర్ధిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే స్వాగత సత్కార్యాలు చేసి,
కం: జోజో తరంగ బాలా!
జోజో! డిండీర చేల! జో! ఘననీలా!
జోజో! మౌక్తిక డోలా!
జోజో! మృదుభావలీల! జో! జలకీలా!
అంటూ జోలపాడి సేదతీరుస్తాడు. తరంగం మేల్కొన్న తర్వాత అది తాకి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని కవి అర్ధిస్తాడు. కవి హృదయాన్ని ఎరిగిన ఆ తరంగబాల చెప్పిన మానవుని జీవితగాథే సాగర ఘోషై మానవాళిని ఉప్పెనలా ముంచెత్తింది.
ఇందులో ప్రతి పద్యము నేటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు నిదర్శనము. ప్రత్యక్ష సాక్ష్యము!
చూచెడి దెల్లమిథ్య, కనుచూపును మిథ్యయె, నిన్నునీవుగా
చూచెడి దాక ఈ జగతి జూచెడి దెల్ల వృథా వృథా వృథా!
చూచెడి చూపువెన్కగల చూపును శోధన చేయుమయ్యదే
చూచిన నింక లోకమును చూచెడిదేమి? సమస్తమయ్యదే!
మానవ జీవన స్రవంతిలో కొట్టుకొనిపోయిన వైశిష్ట్యాలకు, మరుగునపడిన మానవతకు మూగసాక్షి సాగరఘోష. ఆదిశంకరాచర్య, రామానుజాచార్య, మహ్మద్ ప్రవక్త, ఏసుక్రీస్తు, రామకృష్ణ, వివేకానందుడు, రమణ మహర్షి వంటి ప్రవక్తలు, నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య, షేక్స్పయిర్, టాల్ స్టాయి, విశ్వకవి రవీంద్రుడు సాక్ష్యాలుగా నిలువగా నీటి పుట్టుకతో ప్రారంభమై, దశావతారాలు, ప్రాచీన నాగరికత, జైన-బుద్ద మార్గాలు, శైవ-వైష్ణవ తత్త్వాలు, గ్రీకుల నుంచి మొదలై గజనీ-ఘోరీ దండయాత్రలతోపాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, ఫ్రెంచి, రష్యా విప్లవాలు, కమ్యూనిజం, మార్క్సిజం, వైజ్ఞానికావిష్కరణలు, మందుపాతరలు, అణుబాంబులు, అందాలపోటీలు, కాలుష్యాలు, వసుధైక కుటుంబంలో మమేకమై సాగర గర్భంలో మౌనంగా మిళితమైపోయాయి.
మానవ పరిణామ క్రమానికేకాదు, కవి హృదయ ఘోష కూడా నిలువుటద్దం ఈ పద్యకావ్యం. పరిణామాలు కాలానుగుణమైనా మితిమీరిన మానవ దృక్ఫథాలను కవి అడుగడునా దుయ్యపట్టి, తనదైన రీతిలో వ్యంగ్య బాణాలు సంధించారు. సాగర ఘోషలోని కవి దార్శించిన జీవన పరిణామాలలో కొన్ని మచ్చుతునకలు.
ఆ.వె||వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొంద
వచ్చు, సుఖము పొందవచ్చు కాని
భూతదయయె లేని భోగమ్ము లందటే
కలియుగాంత మనుచు తెలియరేల?
తే.గీ|| గుండెలో దూరినట్టి గుండుకాదు
పుణ్యభూమికి ఒక రాచపుండుగాని
నేలకూలిన వాడొక్క నేతగాడు
జాతి కేతనమును నేయు నేతగాడు|| (గాంధీజీ గురించి)
చ||మగడు గతించినాడనిన మానిని దుఃఖము పట్టలేము, మీ
తెగువ విచిత్రమౌను, వెతతీర్చుటకై పతిపీఠమిచ్చి ఆ
మగువను మంత్రి చేయుదురు మానవతా గుణమన్న మీయదే!
తగదని పల్కువారెవరు తప్పును నొప్పగు సానుభూతిలో|| (భారతీయ రాజకీయాలపై చురక)
కం|| ధరలాకాశము నంటెను
సరకులు పాతాళమందు చక్కగ దా
ధరకింక భగీరథుడో
నరుడో దిగిరావలెగద! న్యాయము చేయన్
సీ|| పూటపూటకు పెక్కుపోటీల పరీక్షల
తలనొప్పిచే మను తల్లడిల్ల
బస్తాల బరువున్న పుస్తకాలను మోసి
బంగారుమైదీవ క్రుంగిపోవ
కాపీలు సాగించు కన్నబిడ్డలగాంచి
కాటుక మొగమొల్ల క్రమ్ముకొనగ
పాండిత్యమేలేని పంతులయ్యల చూచి
నెరివేణి సవరంపు నీడనిలువ. (విద్యారంగ దుస్థితి)
ఉ|| నాటికి నిప్పు విప్లవమె, నాటికి నాటికి వృద్ధిజెంద పై
నాటికి చక్రవిప్లవము, నవ్యయుగమ్మున దివ్యమైన కం
ప్యూటరు పూర్ణవిప్లవము, మూడును ముఖ్యములైన, వేల వే
మాటలు? మానవ ప్రగతి మార్గము నందున మైలురాళ్లివే! (శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి)
శా|| మూఢాగ్రేసర చక్రవర్తు లిటలీ ముస్సోలినీ హిట్లరుల్
గాఢద్వేషము చూపగా అమెరికా గత్యంతరాపేక్షతో
గూఢత్వంబున మిత్రరాజ్యములతో కూటమ్ముగావించి శం
భో! ఢాంఢాం ఢఢఢాం ఢఢాంఢ మణుబాంబుల్ పేల్చె పృథ్వీస్థలిన్||
ఉ|| గుండెకుగుండె చూపగల గుండెలులేక పరోక్షమందు బ్ర
హ్మాండము బుగ్గిచేయుటె మహాహవ ధర్మమటన్నచో జగ
ద్భాండము వీరిహస్తముల భద్రముగా నెటులుండు? ఇంకనె
ట్లుండును చిత్తశాంతి? ఎటులండును గుండెలపైన చేతులున్. (అణుబాంబులపై వ్యథ)
ఇలా మొత్తం వెయ్యి పద్యాలు దేనికదే ధీటుగా ఉండిగా, ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నముద్ద ఇస్తే, ఎలా గబుక్కున అంతా నోటిలో పెట్టుకుని తబ్బిబ్బవుతాడో అలాగే సాగరఘోష పద్యాలన్నీ మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరగా, కొనమెరుపులా, పాల కొసరులా తెలుగు సంస్కృతిని గురించిన పద్యాలు-
చ|| కనగ విచిత్రమయ్యె! వడగట్టిన గంగను బోలు పంచెయున్
కనబడబోదు, పద్యములకట్టలు దాచిన రెండుజేబులన్
ఘనమగు లాల్చిలేదు, కనగా భరతావని కేతనమ్ము పో
లిన పొడవైన కండు వరింపదు కంఠము, వాణికన్నులం
దున తెలిమోదబిందువలు దూసినహారము కానరాదు, నే
ననుటయుకాదు కాని తగునా! కవిగారికి మ్లేచ్ఛవేషముల్.
ఉ|| భాషయు దూరమయ్యె, పరభాషయె మీప్రియభామయయ్యె, ఇం
గ్లీషును మాధ్యమంబుగ వరించిరి, అద్దియటుండనిండు, సం
భాషణకైన చెల్లదొకొ! పద్య మనోహరమైన భాష, స్వ
ర్భాషకు తుల్యభాష, పదబంధ సుగంధమయాంధ్ర భాషయే.
సీ|| భాషయా తెలుగన్న! భావనాంభోధిలో
బంగారు నోడలో పయనమౌను
భావమా తెలుగన్న! భాషావధూటికి
పాదార్చనము చేయు పద్మమగును
పద్యమా తెలుగన్న! పట్టాభిషిక్తులౌ
తెలుగు మారాజుల తేజమగును
వచనమా తెలుగున్న! బండరాళ్లనునైన
చెమ్మ పుట్టించెడి సేద్యమగును.
గీ|| అట్టిమీభాష హృదయమ్ము పట్టుకొనుడు
వట్టి పరభాషపై మోజు వదలుకొనుడు
మమ్మిడాడీల మాటలు మానుడింక
అమ్మనాన్నల అనురాగమందు డింక||
సౌమ్యశ్రీ రాళ్లభండి
తెలుగు నాటక సాహిత్యంలో సింగరాజు లింగరాజు ఒక విలక్షణమైన పాత్ర. భారతీయ సాహిత్యంలోనే ఒక అపూర్వ సృష్టి. స్వార్ధం, లౌక్యం, పిసినిగొట్టుతనం కలబోసుకుని పుట్టిన పాత్ర. ‘ధనం మూలం మిదమ్ జగత్తు’ అనే సూత్రానికి భాష్యకారుడు అతనే! లింగరాజుకు డబ్బే సర్వస్వం! ఈ చరాచర ప్రపంచంలో ప్రతి వస్తువునూ డబ్బు అనే కళ్లద్దాల ద్వారానే చూస్తాడు ఆ మహానుభావుడు. అతడు దేవుణ్ని ప్రార్ధించేది తనకు సుఖశాంతులు ప్రసాదించమని కాదు, తన ఇంట్లో ధనరాసులు కుమ్మరించమని. కట్నంతో మూటలు కట్టుకోవచ్చని అతడు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. కుర్నవాణ్ణి కాలేజీకి పంపిస్తున్నాడే డబ్బు ఖర్చుపెట్టి అనుకుంటే పప్పులో కాలేసినట్టే! కాలేజీ విజ్ఞాభివృధ్ధికోసం కాదు, కట్నం ‘రేటు’ పెరగటం కోసం. లింగరాజు చేసే ప్రతీ పనికీ, వెనుక పద్మవ్యూహంలాంటి తిరకాసు ‘కాసే’.
అందుకే ప్రొద్దునే నిద్రలేచి లింగరాజు, ‘‘భగవతీ! భాగ్యలక్ష్మీ, ప్రణామంబు, నీదాసానుదాసుండ, నీ పాదముక్తుండ, నీ దివ్యరూపంబె నిత్యంబు భావింతు నీ దివ్యనామెంబే నిక్కంబుగా నిద్రలో గూడా జపింతు, నాదిక్కు, నా మొక్కు, నాయండ, నా దండ నీవే సూమా! భార్యయుం, గీర్యయుం, బిడ్డలుం, గిడ్డలు, దేవుడుం, గీవుడున్, మోక్షముం, గీక్షమున్, సర్వమున్నీవే! సత్యంబు, నీకై నిరాహారినై యుందు, నీకై నిశలు నిద్రమాన్కోందు, నీకై శరీరాభిమానంబు వర్జింతు, నీకై యతస్య ప్రమాణంబు లెన్నేనియు గావింతు నీ యాన! ఈ పెట్టెయే నీ పవిత్రాలయం, నేనే నీయర్చకుండన్, యదార్ధంబుగా నాదు ప్రాణంబులె నీదు పూజాసుమంబుల్ శరీరంబే నైవేద్య కుంభంబు, నా ఇంటనే యుండి, నీ పూజం గొంచునే ఇంటికి నంపింనం బోయి, యా ఇల్లుమట్టంబు గావించి, నా ఇంటికిందెచ్చి నాకిచ్చు దుండంగదే కన్నతల్లీ! నమస్తే, నమస్తే నమః’’ అంటూ లక్ష్మీదండకం ముమ్మారు పఠించి, సర్వే జనః దుఃఖినోభవంతు అని శాంతి వచనాలు పలుకుతాడు.
లింగరాజు జననం 1922లో జరిగినప్పటికీ, నేటికీ మన సమాజంలో లింగరాజులకు కొదవలేదు. ధన రాకాసి, కట్న పిశాచి నేటి సమాజంలో కూడా ప్రబలంగానే ఉంది. కాళ్ళకూరి నారాయణరావు గారు సృష్టించిన లింగరాజు మీద ఈ భూమండంలో ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. మనిషన్నవాడెవడూ లింగరాజును గౌరవించిన ఆనవాళ్ళు లేవు. ఎవరేమనుకున్నా లింగరాజుకి కలిగే నష్టంలేదు. అతనికి సంఘంతో పనిలేదు. పరువు, మర్యాద, ఆత్మాభిమానం వంటి భేషజాలకు అతను బహుదూరం. లోభత్వానికి లింగరాజు నిలువుటద్దమే కాదు. పొదుపును గురించి అనర్ఘళంగా ఉపన్యసించ గలిగే ఘనాపాఠి. వంటమనిషికి ప్రతిపూట వంట సామాను వంట కట్టెలు, పిడకలు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, చివరికి నిప్పు పుల్ల కూడా గీచి, గీచి లెక్కలడిగి మరీ యిస్తాడు. పొయ్యిలో కట్టెలు కావల్సివస్తే, కరివేపాకు చెట్టుమీది కాకి గూడు పడద్రోసి ఆ పూట వంట చేయ్యమని సలహా యివ్వటం అతనిలోని పినాసితనానికి పరాకాష్ట. ‘‘పక్షిగూడు పడగొట్టడం పాపం కదండీ’ అని అంటే, ‘పాపమేమిటి నీ బొంద! ఖర సంవత్సరంలో మా యింటి వంటంతా కాకి గూళ్లతోనే వెళ్ళిపోయిందని గత చరిత్రను చెప్పుకొని మురిసిపోతాడు.
అంతేకాక, లోకం పోకడ గురించి లింగరాజు అభిప్రాయం, అవగాహన నేటి సమాజ తీరుతెన్నులు చూస్తే తప్పుకాదేమో అన్నట్టుగా ఉంటాయి. ఈ కింది గేయంలో పరికించండి:
ప్రాయికంబు జెట్టు పాతువాడొకండు
వరుస బండ్ల మొక్కు వాడొకండు
కష్టపడి గృహంబు గట్టువాడొకండు
వసతిగ నివసించు వాడొకండు
ఆస్తికై వ్యాజ్యంబు లాడువాడొకండు
వచ్చినది మృంగు వాడొకండు
కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు
వలపు కాండై పొందు వాడొకండు
అట్లే, ధనము కూర్చునట్టి వాడొక్కండు
పడిగం దగులబెట్టు వాడొకండు
ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన
లీలగాదు దీని కేల గోల?
ధనమునే ప్రధానంగా కొలిచే ప్రబుధ్దులకు తలమాణికం లింగరాజు సింగరాజు అనడానికి ఈ కింది పద్యమే మచ్చుతునక.
సంపద మహత్వమెరుగని చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని సలుపండైయ్యె
చచ్చునప్పుడు వెనువెంట సకలధనము
తీసికొనిపోవు విధమేని తెలుపండైయ్యో
లింగరాజు ఎంతటి పినాసీ అయినా అతనిలో ప్రత్యేకత అతని చమత్కార ధోరణి. నిత్య సంభాషణల్లో కురిసే హాస్యరసం నయగారా జలపాతాన్ని గుర్తుకి తెస్తుంది. లింగరాజులాంటి స్వార్ధచింతుడిలో హాస్యమేమిటా అని మీకు అనుమానం రావచ్చు. నిజానికి లింగరాజు హాస్యచతురుడు కాడు. అతని లోభితనం నుంచి, పేరాశ నుంచి, సంకుచిత మనస్తత్వం నుంచి, డబ్బుకోసం ఏ గడ్డయినా కరిచే అతని నైచ్య ప్రవృత్తి నుంచి స్వభావసిద్ధంగా హాస్యం పెల్లుబుకుతుంది. ఎదుటి మనిషిని నవ్వించాలనే ధృక్ఫథం అతనిలో ఏ కోశానా లేని హాస్యపాత్ర. నాటక కర్త కాళ్ళకూరి గారి కలం కన్ను గప్పి ఎదిగిన సింగరాజు లింగరాజు పాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారి లోగిళ్ళలో నవ్వుల చిరుజల్లులు వెదజల్లూతూ నిత్యనూతనంగా భాసిస్తూనే ఉంటుంది.
సౌమ్యశ్రీ రాళ్లభండి
భాషా సంపర్కము కీడెంత చేసిందన్న విషయాన్ని పక్కన పెడితే, కవులను, భావుకలను విశేషంగా ప్రభావితం చేసిందనటంలో సందేహంలేదు. ఆంగ్ల సంపర్కంతో ఆంధ్ర సారస్వతం కూడా కొంతపుంతలు తొక్కాలని భావించి రచనలు చేసినవారిలో తాపీ ధర్మారావుగారు ప్రముఖలు. ఇంగ్లీషులో ఉన్న అనేక వాఙ్మయశాఖలు మన భాషలో కనపడవు. కాబట్టి మన రచనలలను కొత్త పుంతలు తిప్పాలని ఆయన అనేక ప్రయోగాలు చేశారు. వాటిలో ‘‘ఎలిజీ’’ రచన ఒకటి. ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన ఎలిజీ రచనలు చేసినవారు గ్రే, మిల్టన్, ఆర్నాల్డ్, డెనిసన్ కవులు. ఎలిజీ ప్రాచీన గ్రీకు భాషనుంచి పుట్టింది. ఇది విషాద పద్యం. ఎవరైనా మరణించినప్పుడు ముఖ్యంగా వారి స్మృత్యార్ధం ఈ పద్యాలను రచిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. మొదట కవి తన బాధను వెల్లడిస్తాడు. తర్వాత పోయిన వ్యక్తిని కీర్తిస్తాడు. చివరగా దుఃఖాన్ని వీడి తనని తాను సమాధాన పరుచుకుంటాడు. ఇటువంటి రచనలు మన భాషలో అరుదు అనడంకంటే లేవని చెప్పవచ్చు. తాపీ ధర్మారావుగారు ఎలిజీని మన భాషలో ఏమనాలో తెలియక ‘కారుణ్యము’ అని నామకరణం చేసి నల్లిపై కారుణ్యం అనే కారుణ్యాన్ని రచించి అకాలంలో బొంబాయి నుంచి వెలువడుతున్న ఆంధ్రపత్రికలో ప్రకటించారు.
ఈ కారుణ్యములోని విషయం ఎంతో సునిశితమైనది, సూక్ష్మమైనది. ధర్మారావుగారు మంచంమీద పడుకొని ఏదో రాయలని ప్రయత్నిస్తుంటే, దానికి విఘ్నం కల్గిస్తున్న నల్లిపై విపరీతమైన కోపంతో దానిని వేటాడిపట్టి, ఎండలో బాగా కాలిన గచ్చుపై వేసి అది మాడి చస్తే వైరాగ్యం కల్గి, గోల్డు స్మిత్ ‘‘పిచ్చి కుక్క చావుమీద’’ కారుణ్యాన్ని ప్రదర్శించిన విధాంగా ఙ్ఞప్తికి వచ్చి. నల్లిమీద కారాణ్యాన్ని రాసి దాని జన్మను కృతార్ధపర్చారు. అది ఏవిధంగానంటే –
నల్లిరొ! నిన్ను జేకొని ఘ
నంబగు నా తపమందు వైచి, నీ
వల్లల నాడుచుండ, దర
హాసము చేయుచు జూచుచుండు నీ
కల్లరివాని దూఱవు; ము
ఖంబున గోపము జూప; వెంతయో
చల్లగ నోర్చి; తౌర! ఘన
సౌఖ్యము నాకమునందు గాంచవే ?
ఎండ కన్నెఱుగక యేవేళ బ్రాసాద
వీధుల జరియించు విధము యిద్ది ?
మెత్తని పాన్పుల మెలగుచుండెడు నట్టి
దేహమా యిటులయ్యె తీవ్రవదన ?
పలు భోజ్యముల సోలు వారియందలి మేలు
నారగించెడి జీవమా సువర్ణ ?
నానాటికిని లలనామణు లెల్లెడ
నుష్ణోదకంబుల నోలలాడ
జేయుచుండుదురా నిన్ని చిన్ని జీవ
అనుచు గన్నులు గ్రమ్మెడి యశ్రు లిన్ని
కుఱియనీకుండ బోయెడి క్రూరు డెవడు ?
మాన్యసుఖవాసి, పోతివా మమ్ముబాసి!
నీకతంబున గదా లోకాన బాలురు
నిశలందు జదువుచు నిద్రబోరు;
నీ కతంబునకదా నిండు జవ్వనులెప్డు
జెలువులతో గూడి మెలగుచుంద్రు;
నీ కతంబున గదా నిరతమ్ము వృద్ధులు
హరినామ సంస్మృతి నలియుంద్రు;
నీ కతంబున గతా నిలయాల కపుడప్డు
సంస్కార ధూపముల్ జరుగుచుండు;
తగ ‘‘బరోకపకార్ధ మిదం శరీర’’
మనుట నీ కతంబునగదా మానుట ధాత్రి;
అట్టి నిన్నెంచ జాలక, యల్పబుద్ధి
బాప మొడిగట్టుకొని చంప బాడి యగుదె ?
చంపినవాని కేమి ఘన
సంపద కల్గెనో, కీర్తి హెచ్చెనో;
సొంపగు భక్ష్యముల్ రుచుల
జూడ విచిత్రములైన పాకముల్
పెంపును బొందెనో; యకట!
పెల్లగు నా నరకంపు కంపుగా
కింపులు గల్గునా ? మతి వి
హీనున కెందును మేలు కూడునా ?
ఎంత విషాద మందితివో;
యెవ్వరి నేమని చీరితో కదే!
వంతను మాను; మీ పగ న
వారిత రీతిని దీర్ప నీదు సత్,
సంతతి లేదె ? నన్ను రభ
సంబున బట్టదె ? నిద్ర దోలదే ?
చెంతను జేరి జీవన మి
సీ యన గుట్టదె ? నెత్రు ద్రావదే ?
తేటగీతి
ఆమె నవ్విస్తుంది. కవ్విస్తుంది. చక్కిలిగింతలు పెడుతుంది.ఆలోచింపచేస్తుంది. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తుంది కూడా. అది ఆమెకు మాత్రమే సొంతమైన జీవనసరళి. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి. ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు కాంతం కన్పిస్తుంది.
కాంతం అంత పొడగరీకాదు, పొట్టికాదు. ఛామన ఛాయ, నవ్వు మొగము, చక్కని నేత్రాలు బాపు బొమ్మకాదు కానీ అందగత్తే. కాంతానికి ఇంగ్లీషు రాదు. కానీ భర్త మాట్లాడుతుంటే నాకేదో అర్ధమయినట్లే ఉందని అనుకునే అమాయక స్త్రీమూర్తి. వారప్రతికలను చదవాలనే ఆసక్తి లేకపోయినా, కుమారీ శతకం, నృసింహ శతకం, ప్రహ్లాద చరిత్ర మున్నగు పుస్తకాలు మాత్రం చదవి అర్ధం చేసుకోగలదు.
సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. ఆమెకు మల్లెపూలు, తెల్ల చీర అంటే మహా ఇష్టం. మంచి పొదుపరి. ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బదులు చెప్పింది. ఆమె హాస్యచతురతకు మరో ఉదాహరణ. ఎంతోసేపు కాలేదే, నాలుగైదు నిమిషాల సంభాషణలో నన్నాయన ఫూల్ అన్నాడు అని భర్త చెప్పగానే, అంత ఆలస్యం ఎందుకైందండీ అని అమాయకంగా చురక వేయటం కాంతానికే చెల్లు.
దాంపత్యంలో ఉండే విలువలకు కాంతం జీవితం ఒక మంచి నిదర్శనం. అసంతృప్తికి ఆమె జీవితంలో చోటులేదు. ఆదర్శ గృహిణియైన మునిమాణిక్యం వారి కాంతం తెలుగు నాయికలలో మాణిక్యం వంటింది. ఒకసారి భర్త పిలిచి ‘నా కలం కనపట్లేదు,వెతికి పెట్ట’మంటే ఆవిడ వంటింట్లోనుంచి ‘నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి’ అందిట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు, కాంతం నిత్య నూతనమనిపిస్తాయి.
ఒకసారి విశ్వనాథవారు మునిమాణిక్యంగారిని ముట్నూరి కృష్ణారావుగారి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే ‘కాంతం భర్త కాదూ’ అన్నారట. ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పడానికి. నాయకుల్లో ‘గిరీశం’, ‘పార్వతీశం’ ఎలా అయితే తెలుగు సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిల్చారో, అలాగే ‘కాంతం’ ధృవతారగా వెలుగొందుతోంది.
సౌమ్యశ్రీ రాళ్లభండి

పిల్లలకు పేరుపెట్టడం అంటే, అదో మహాయుద్ధం. ఫ్యాషన్ గా పేర్లుపెట్టడం, బారసాలనాడు ఒక పేరు రాసి, తర్వాత వాడకానికి మరో పేరు పెట్టుకోవడం, ఇంట్లో ఒకటి, వీధిలో ఒకటి, సర్టిఫికెట్టుల్లో ఒకటి, పెళ్ళికార్డులో మరోకటి, ఇంక ముద్దుపేర్లు, అమ్మమ్మ, తాతయ్య పేర్లు, ఇలవేల్పుల పేర్లు, జ్యోతిష్యానికి అనువైన పేర్లు, పలకలేక కుదించేసుకున్న పేర్లు ఇలా బారసాలనాటి పేరుకి తర్వాత పేరుకి పొంతన లేకుండా అర్ధరహిత పేర్లు అనేకం. అలాంటి ఒకానొక ప్రహసనమే మునిమాణిక్యం నరసింహరావుగారి ‘నామకరణం’ కథ. సాంతం చదివి ఆనందించండి.
పసిపిల్లలను పక్కలో పడుకో పెట్టుకొని పురిటిగదిలో నులకమంచంలో పడుకుంది కాంతం. పండబారిన తమలపాకులాంటి చెక్కిళ్లపై లేత గులాబి రేకుల పసిచేతులు నిమురుకుంటుంటే కెంపులతో కాంతం తన మాతృత్వాన్ని పూజించుకుంటున్నట్టున్నది.
పురిటిగది ప్రక్కన నేను మంచంపైన పడుకొన్నాను. కొంతదూరాన మా బావమరిది పడుకొని ఏదో చదువుకొంటున్నాడు. కాంతం విప్పారిన నేత్రాంచలములనంటి కనీనికలదాకా ప్రవహించే తన చూపును సవరించుకొంటూ ‘‘మరి – పేరేమి పెడతాము’’ అన్నది.
‘‘ఏమండోయి మిమ్మలనే.’’
‘‘ఏమిటి?’’
‘‘ఈ చిట్టితల్లికి పేరేం పెడదాము?’’
‘‘ఏదో ఒకటి పెడద్దాంలేద్దూ.’’
‘‘అదిగాదండీ, రేపేగదా బారసాల. అప్పకప్పటికి ఏమి తోచకపోవటం ఏదో ఒకటి హడావుడిగా వ్రాయటం’’ అన్నది కాంతం గుంటలు పడ్డ చెక్కిళ్ళలో వెలుగులు చక్కలిగిలి పెట్టుకున్నవి.
‘‘సరే, అయితే ఏమి పేరుపెడదాం.’’
‘‘అదే మిమ్ములను అడగటం.’’
‘‘నాకేం తోటచంలేదు. ఇదివరలో అంటే పేర్లు సిద్ధంగా ఉండేవి, మొదటిపిల్లకు మా అమ్మపేరూ, రెండోదానికి మీ అమ్మపేరూ, మూడో బిడ్డకు మా తాతపేరు పెట్టాము. తరువాత పుట్టినవాడికి నీ ఇష్టదైవం యొక్క పేరు పెట్టుకున్నావు. ఇక దీనికి పేరు కుదరటం కష్టమే’’ అన్నాను నేను.
‘‘ఈ దఫా మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి’’ అన్నది కాంతం నా వంకనైన చూడదు. పుట్టుగుడ్డ తెలిమొగములో పుణ్యలోకాలు వెదుకుతుందా!
‘‘పూర్తిగా నా యిష్టమేనా? అంత దయా!’’
బాగుందండోయి! మీ కుతురుకు మీ కిష్టమైన పేరు పెట్టుకుంటానుకి ఒకరి ఆజ్ఞ ఏమిటి?’’
‘‘కూతురైతే నీకు కూతురేగా?’’
‘‘అయితేనేం మీ కిష్టమైన పేరు చెప్పండి.’’
‘‘సరే అయితే, జానకి పెడదాం.’’
‘‘జానకా?’’
‘‘అవును.’’
‘‘బాగానే ఉంది కాని.....’’
‘‘ఆ కానీ ఏమిటో చెప్పు? ఏదో ఉంది.’’
‘‘అది కాదండీ, ఏదైనా పేరు పెడితే ముద్దుగా ఉండాలె, మంచి సంగతులు జ్ఞాపకానికి రావలె.’’
‘‘ఇపుడుమటుకేం జానకి జగత్ మాత మహాసాధ్వి, అంతకంటె మంచి పేరేముంది.’’
‘‘మంచిపేరే కాని, సీత కష్టాలు జ్ఞాపకానికి వస్తవి. అదీగాక నీళ్లాడక మునుపు మీరు నాకు ఉత్తర రామాయణం నాటకము చదవి విన్పించారు జ్ఞాపకం ఉందా ? సీత కష్టాలు చూచి ఏడ్చాను, అప్పటి నుంచి ఆమెపేరు తల్చుకుంటే భయం వేస్తుందండీ?’’
‘‘సరే పోనీ మానేద్దాం. ఇంకేదైనా పేరు పెడదాం.’’
‘‘సుగుణ అని పెడదాం.’’
‘‘సుగుణా? ఆ సుగుణ, ఎందుకండీ? సుగుణ వివేకం అవన్నీ కిరస్తాని పేర్లు.’’
‘‘ఓహో ఆ మాటా నిజమే, అదీగాక నీ మోస్తరుగా పెంకెతనం, మొగుడ్ని లక్ష్యం చేయకపోవటం మొదలుగా గల సుగుణాలు గలదైతే నేతిబీరకాయవంటి వ్యర్ధమైన పేరు అవుతుంది, మరేమంటావు?’’
‘‘శేషగిరి అని పెడితే? ఆ పేరు మా నాన్నకెంతో ఇష్టం’’
‘‘మీ నాన్నకు ఇష్టమైతే నీకు పెట్టాలిసింది. కొండలపేర్లు, నదుల పేర్లునా, పిల్లలకు పెట్టుకోటం. మా మాష్టరుగారు ఒకాయన ఉండేవాడులే. ఆయన శేషాచలం, వింధ్యాచలం, హిమాచలం అని పేర్లు మొగపిల్లలకూ, గంగ, యమునా, కృష్ణా, గోదావరీ అని ఆడపిల్లలకు పేర్లు పెట్టాడు. అట్లా చేయమంటావా? ఉండు, ఉండు నాకో పేరు తోచింది. మనకు ఇక పిల్లలు వద్దే. ఇదే ఆఖరు కాన్పు అనుకో, అంటే కోరుకో ఆ అర్ధాన్ని సూచించేటట్లు, ఆ సంగతి ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చేటట్లు, సంపూర్ణం అని పేరు పెడదాం. నీవు అడ్డు చెప్పక. అంతే అదే నిశ్చయం.’’
‘‘అయితే బావా, ఒకవేళ ఇంకోపిల్ల పుడితే ఏం చేస్తావు’’ అన్నాడు మా బావమరిది.
‘‘అయ్యో, మన నిశ్చయాలు, మనం ..... అన్నది’’ కాంతం, ఎత్తిపొడుస్తూ.
‘‘పుడితే ఎట్లా చెపుదూ’’ అన్నాడు మా బావమరిది.
‘‘ అంతగా పుడితే మంగళహారతి అని పెడదాం. మంగళహారతితో ప్రతిపనీ పూర్తిచేస్తారు. భజనలు, పురాణ కాలక్షేపాలు, పూర్తి అయిన తరువాత మంగళహారతి ఇస్తారు.’’
‘‘ముందు సంపూర్ణం అయిన తరువాతగా మంగళహారతి కాబట్టి దీనికి సంపూర్ణం’’ అని పేరు పెడదాం. ‘‘అమ్మ! ఏదో ఒకటి తేలింది’’ అన్నాను నేను.
‘‘బాగానే ఉంది?’’
‘‘ముక్కు విరిస్తేగాదు. ఆ పేరు పెడితేనేం?’’
‘‘చాల్లేండి, పాండిత్యము మా బంగారుతల్లికి మంచి పేరు పెట్టరూ?’’ అని పిల్లను తన మృదుహస్తాలతో నిమిరింది కాంతం.
‘‘సరే పోనిలేవే నీకంత కష్టమెందుకూ, ఊర్వశి అని పెడదాం పోనీ, ఊర్వశి చక్కనిదని ప్రసిద్ధం.’’
‘‘చాల్లెండి వేళాకోళం. రంభ, ఊర్వశీ, తిలోత్తమా ఇవా మనం పెట్టుకునే పేర్లు ? అయినా ఆ భోగంముండల పేర్లేమిటి?’’
‘‘మరి ఎట్లాగే, ఒకాయన ఇట్లాగే పేరు దొరకొక పేరు పెట్టన్ అని నామకరణం చేశాడట. ఇక నాకు తోచడంలేదు నీ ఇష్టం.’’
‘‘నా ఇష్టమెందుకు? మీ చిత్త మొచ్చిన పేరు పెట్టుకోండి. నేనొద్దంటే అప్పుడనండి. ఏదో ఆడదాన్ని కాబట్టి చెప్పవలసినది చెపుతున్నా, శుక్రవారం పుట్టింది, కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది.’’
‘‘లక్ష్మి? లక్ష్మి – బావుంది. లక్ష్మి, నీ నామమెంత లలిత మహహ – అని ఒక కవి వ్రాశాడు. బాగుంది. సరే ఇంకేం! అదే పేరు’’ అన్నాను.
‘‘బావా! ఏమైనా కొత్తపేరు పెట్టరాదూ? ఉత్తర హిందుస్థానంలో వాళ్ల పేర్లు చూడూ, ఎంత చక్కగా ఉంటవో! కమలాబాయి నెహ్రూ, ఇందుబాల, జటాజూట శిరోమణి, శిరీషకుసుమకోమలి, ఇట్లాంటి పేరు పెడితే ముందు పేరు వినటానికి ఎంతో poetic గాను శ్రావ్యంగా ఉంటుంది! పేరు మనోహరంగా వుండాలి. ఒక పేరు ఒక భావగర్భితమైన ఖండకావ్యంగా ఉంటుంది. The name itself is a beautiful Poem అన్నాడు మా బావమరిది.
‘‘నాకూ మంచి పేరంటే సరదా. వాడు చెప్పిన పేర్లలో జటాజూట శిరోమణి అంటే చంద్రునికి చెందుతుంది. చంద్రుడు చల్లనివాడు. బాగుంది ఆ పేరు చదువుకోనివాళ్లు చంద్రమ్మ అని పెట్టుకుంటారు. జటాజూట శిరోమణి అని పేరు పెడితే పండిత కుటుంబములోనిదని ముందు తెలుస్తుంది, రెండోది చంద్రుడు కావ్యానికి వస్తువ. వెన్నలనూ చంద్రుడ్నీ కవులు ఊ, మెచ్చుకొంటారు కాబట్టి ఆ పేరు పెడదాం’’ అన్నాను కాంతంతో సరదాపడుతూ.
‘‘ఆ పేరు పెడితే అందరూ తిట్టరూ?’’
‘‘ఏమి’’
‘‘చంద్రదూషణ అన్ని కావ్యాలలో ఉండదూ?’’
‘‘అదీగాక అమ్మాయి పెద్దదైన తర్వాత దాన్ని అంత పెద్దపేరుతో ఎవరు పిలుస్తారు అయినా మన పేర్లు కావు అవి ఎవరో బెంగాలీవాళ్లు పెట్టుకునే పేర్లు మనకెందుకు. మనకు తగిన పేరు మనం పెట్టుకుందాం’’ అన్నది కాంతం.
సరే, పోనీ లక్ష్మి అని పెడదాం అన్నాను.
లక్ష్మి నిశ్చయమైపోయింది. మర్నాడు ఇల్లంతా అలంకరించారు. నలుగురు బంధువులూ వచ్చారు. ఇల్లు కళకళలాడుతున్నది. పీటలమీద కూర్చున్నాం పేరు వ్రాయటానికి. పళ్ళెంలో ముత్యాలలాంటి సన్నబియ్యంపోసి నా ముందు పెట్టారు. కళ్లుమూసుకుని నిద్రపోతున్న బిడ్డకేసి గర్వంగాను సంతోషంగాను చూస్తున్నది కాంతం.
‘‘సరే ఏం పేరు వ్రాయమంటారు?’’ అన్నాను.
‘‘సుబ్బలక్ష్మి’’ అన్నది కాంతం.
ఈ ‘‘సుబ్బేమిటి’’ అన్నాను.
‘‘మా నాయనమ్మ వచ్చి తన పేరుకూడా కలపమని అడిగింది పాపం. ముసలమ్మగారి మాట తీసివేయటం ఎందుకు? ఆమె మనస్సు సంతోషిస్తేనే మనకు క్షేమం’’ అన్నది కాంతం.
‘‘వ్రాయమంటావా?’’
‘‘మీ ఇష్టం’’
‘‘ఇంకా నా యిష్టమేమిటి? వ్రాస్తున్నానని బంగారపు ఉంగరం తీసుకొన్నాను. ఇంతలో మా నాన్న వచ్చి అబ్బాయీ, మనకు వేంకటేశ్వర్లు ఇంటి ఇలవేల్పు ప్రతి పేరు ముందరా ‘వెంకట’ చేరుస్తున్నాము. నీ పేరు అందుకనే వెంకట్రావు అని పెట్టాము. కాబట్టి వెంకట సుబ్బలక్ష్మి అని వ్రాయమన్నాడు. కాంతం నా వంక ఓరకంటితో చూసి నవ్వుకొని మామిడి చిగుళ్లలాగున్న పిల్లదాని చేతులు చెక్కిళ్లకేసి అదుముకొంటున్నది.’’
‘‘సరే, వ్రాసేదీ కాంతం?’’
‘‘నా దేముంది మీ ఇష్టం’’
‘‘అంతా నా యిష్టమే?’’ అని ఇంకా ఆలస్యం చేస్తే పేరుకు ఆద్యాంతాలలో ఏం జేరుతువో అని వెంటే వ్రాశాను. మా చిట్టితల్లికి నామకరణం అయింది. వెంకటసుబ్బలక్ష్మి అని పేరు వ్రాస్తేనేం? లక్ష్మి అని పిలుచుకుంటాను. లక్ష్మి అన్న పేరు బాగానే ఉంది అనుకున్నాను.
పిల్లకు ఎనిమిదో నెలలో మా బావమరిది చూడటానికి వచ్చి అవీఇవీ మాట్లాడుతూ ‘‘వెంకటసుబ్బలక్ష్మి ఏమంటున్నది?’’ అన్నాడు.
‘‘ఎవరు?’’ అన్నది కాంతం ఆ పేరు ఎప్పుడు విననట్లు.
‘‘ఎవరేమిటి? మొన్న పుట్టినదాని పేరు వెంకట సుబ్బలక్ష్మి కాదుటే?’’ అన్నాడు మా బావమరిది వాళ్ల అక్కయ్యతో.
అదా! మా ‘‘పద్మ’’ సంగతా? అదుగో ‘‘పద్మతల్లి తప్పటడుగులు వేస్తున్నది’’ అన్నది కాంతం.
‘‘పద్మావతి అని మార్చామురా చిట్టితల్లి పేరు ‘‘పద్మావతి’’ బాగందా?’’
‘‘బాగుండ కేం! బాగుంది బావేడి?’’
‘‘వసారగదిలో వ్రాసుకుంటున్నారు.’’ అన్నది కాంతం. మా బావమరిది నా గదిలోకి వచ్చాడు నవ్వుతూ, నేనూ సంతోషించి, ఏవో అవీ ఇవీ మాట్లాడుకొన్న తరువాత ‘‘బావా’’ పద్మావతి చేతులకు బంగారపు వత్తులు తెచ్చాను ఇవిగో’’ అన్నాడు.
‘‘పద్మావతి ఎవరు?’’ అన్నాను నేను.
మా బావమరిది తెల్లపోయి ‘కలలో ఉన్నానా, లేక పోతే మీ అందిరికి పిచ్చిఎత్తిందా?’’ అన్నాడు.
‘‘ఏమిటి’’ అన్నాను నేను.
‘‘మొన్న పుట్టిన దానికి పేరుమార్చి పద్మావతి అని పెట్టారని అక్కయ్య చెప్పిందే, నీవు పద్మావతి ఎవరు అంటావేం?’’ అన్నాడు.
‘‘ఓహో మా ‘సరోజని’ సంగతా, దాన్ని నేను సరోజని అని పిలుస్తాలే’’ అన్నాను.
‘‘మా అక్కయ్య?’’
‘‘ఆవిడ ఇష్టం ఆవిడిది, ఆ విషయంలో మేము ఇద్దరం పోట్లాడుకొన్నాము.’’
అల్లాగా, అయితే పోనిలే. నీవు పెద్దవాడివి నీ ఇష్ట ప్రకారం సరోజని అని పిలుద్దాము. ఈ భాగ్యానికి పోట్లాట ఎందుకూ అన్నాడు. నేను సంతోషించాను, మా పోట్లాటను మా బావమరిది సద్దేసినందులకు కాసేపుండి నేను లోపలికి పోయినాను. పసిబిడ్డ చేతులకు బంగారపు వత్తులు తొడిగినారు. పాలమిసమిసలతో మెరుస్తున్న ఆ ముద్దొచ్చే చేతులకు ఆ పచ్చని బంగారపు వత్తులెంతో అందంగా ఉన్నవి.
‘‘మా తల్లి – మా పద్మకు, ఈ వత్తులు ఎంత అందంగా ఉన్నవిరా, నాన్నా’’ అంటూ కాంతం పిల్లను ఎత్తుకొని ఆడిస్తున్నది.
పద్మావతి, పద్మతల్లీ అని అంటూ పిల్లను తన చేతులలోకి తీసుకొని గులాబీరేకుల వంటి దాని బుగ్గలు ఎరుపెక్కిన కొద్దీ ముద్దాడుతున్నాడు మా బామవరిది. నేను తెల్లపోయినాను. అక్కా తమ్ముడూ మహా సంతోషంతో ఉన్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందం పొంగిపొరలిపోతూ ఉన్నది. నన్ను జూచిన వాళ్లులేరు.
నేను బయటికి వచ్చాను. అప్పుడే అస్తమయం అవుతున్నది. రంగు రంగుల చీరలు కట్టుకొన్నవాళ్లు ఎవరో పశ్చిమదిక్పతి ఒళ్లో ఉన్న సూర్యుని ముద్దాడుతున్నారు. ఆ దిక్కు మహా ఆనందంలో పొంగిపోతున్నది. ఇటు ప్రక్కను ఉన్న శుద్ధాష్టమి చంద్రుడు తెల్లపోయి ఆ ఆనందాన్ని చూస్తూ, నిలబడి ఉన్నాడు.



‘కోకు’ గా ప్రసిద్ధికెక్కిన కొడవటిగంటి కుటుంబరావుగారు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న రచయిత. ఆయన రచించిన కథలు, నవలలు మధ్య తరగతి జీవితానికి దర్పణలు వంటివి. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన కుటుంబరావుగారు బాల్యం నుంచే రచనా వ్యాసంగంపై మక్కువ చూపారు. గురజాడ తర్వాత వ్యావహారిక భాషలో రచనలను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన రచయితలల్లో కుటుంబరావుగారు ప్రముఖులు. ఆయన రచనలలో మధ్యతరగతి జీవితాలు ప్రతిబింబిచడతంతోపాటు, సామాజిక స్పృహ, దృక్పధం కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఆయర రాసిన నవల ‘తారా'కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆధునిక సాహిత్యం, మార్క్సిజంలతో ప్రేరణ చెందిన కుటుంబరావుగారు నవ్య సాహిత్య పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం ఇలా పలు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమేగా కోకు భావించేవారు. యువతరాన్ని ఆకర్షించే సాహిత్యం ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకున్న కోకు ‘యువ‘ అనే మాసపత్రికను చక్రపాణిగారితో కలిసి ప్రారంభించారు. ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రవారపత్రిక, భారతి మున్నగు పత్రికలలో పనిచేసి వాటి అభివృద్ధికి కృషి చేశారు. నేటి పత్రికలలో కన్పిస్తున్న అనేక శీర్షకలు ఉదాహరణకు, రాజకీయ వ్యంగ్య వ్యాసాలు, కార్టున్లు, సినిమా స్టిల్స్, పిల్లలకు ప్రత్యేక శీర్షికలు, అనువాద నవలలు మొదలు పెట్టినది కుటుంబరావుగారే. భౌతిక శాస్త్రంలో పట్టభధ్రులైన కుటుంబరావుగారు ఏ రచన చేసినా అందులో శాస్త్రీయ దృక్పధం, హేతువాదం కన్పిస్తాయి. ఆయన 1952లో బాలల పత్రిక ‘చందమామ’లో చేరారు. చనిపోయేవరకు ఆయన చందమామకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యరంగానికి ఎనలేని కృషి చేసిన కొడవటిగంటి కుటుంబరావు గారు దాదాపు 18 నవలలు, 159 కథలు, 75 గల్పికలు, 12 నాటికలు అనేక వ్యాసాలు రాశారు. ఆయన రాసిన అనేక కథలలో ప్రజల మూర్కత్వానికి అద్దం పట్టే కథ అసలు మాది కిష్కింధ ఇక్కడ మీ కోసం...
మా వూరికో కోతి వచ్చింది. ఓ రోజు పొద్దున్నే మావూరి పిల్లకాయలు దాన్ని ఆంజనేయస్వామి ఆలయం గోడ మీద చూశారు. అది పేలకోసం వెతుక్కుంటుంటే నవ్వారు. కాని అది కనిబొమలు పైకెత్తి నుదురు ముడతలు పది దీర్ఘాలోచనల ఉన్నప్పుడు పిల్లకాయలకి ఆశ్చర్యం వేసింది.
పెద్దవాళ్ల జోక్యం కలిగించుకోకబోతే కోతి ఏమయి ఉండేదో మరి. పిల్లకాయలు కోతిని చూసి గంటసేపైనా ఆనందించారో లేదో ఈలోపుగా ఆ దారినే పోతూ, పురాణం చెప్పే శాస్తుల్లుగారు గుదిముందాగి, మనోజంమారుత తుల్యవేగం... “ శ్రీరామ దూతం శిరసా నమామి ” అంటూ దో గొణగొసాగాడు. కోతి కాస్తా ఆయన కెదుగుగా వచ్చి నుంచుని కిచకిచలాడింది.
సాయంకాలానికల్లా కోతి మావూరికి అతిధి అయిపోయింది. రామకోటి రెండోసారి రాస్తున్న రామదాసుగారూ, ఆ మధ్యనే చచ్చి బతికిన గుప్తగారూ, పురాణం చెప్పే శాస్త్రులుగారు, హనుమదుపాసి గౌరిశంకర పార్వతీ పరమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర్లుగారూ వగైరాలంతా కోతికి భక్తులయినారు.
పిల్లలు పుట్టనివాళ్లు, పిల్లలు దక్కనివాళ్ళూ పొద్దుపోని వితంతువులూ వగైరాలు ఆరోకాలం కింద తయారయింది.
కోతి కలిసొచ్చిందని పుకారు పుట్టింది. కోతి వచ్చిన తరవాత మా వూరికి కలరా రాలేదు. మా వూళ్లో ఇల్లేనకాలలేదు, మా వూరికి ఉప్పెన కూడా రాలేదు. (మావూరికి సముద్రం పాతికమైళ్ల దూరము ఉంటే ఏం. మా తాత అయిదేళ్ల వాడై ఉండగా వచ్చిన బందరు గాలివానకి వరదవచ్చి మావూరి బయటవున్న తాళ్లెక్కితే అంత దూరాన స్పష్టంగా కనిపించిందిట. ఇది మా తాత స్వయంగా చూసిన విషయం)
కోతి బలిసింది మరి. అది ఏ ఇంటో జొరబడి అందిన ఆహారం పుచ్చుకోవటానికైనా హక్కుంది. మా వూరికి పురపాలక సంఘంలేదు గాని ఉంటే ఈ హక్కు తీర్మాన రూపంలో ఇవ్వబడి ఉండేదే.
బీదలూ, సాదలూ, అలగా జనమూ చాటుబాటున కోతిని కొడుతున్నట్లు ఊళ్లో తెలియగానే ఊరంతా అట్టుడికిపోవటమేగాక ఊళ్లో పౌరసభ కూడా ఒకటి జరిపి అందులో కోతిని కొట్టిన వాళ్ల మీద భయంకర నిరసన తీర్మానం కూడా చెయ్య బడింది.
క్రమంగా కోతి తనబలం తెలుసుకోసాగింది. అది మొదట్లో చిన్న పిల్లల్ని మాత్రమే భయపెట్టుతూ ఉండేది. రానురాను అది పెద్దవాళ్లను కూడా భయపెట్టసాగింది. ఎటువంటి విచక్షణా లేకుండా అందర్నీ అటకాయించి పిలకలూ వగైరా పీకసాగింది.
కోతిక్కోపం వచ్చింది. ఉపశాంతికోసం ఓ యజ్ఞమో సప్తాహమో చేతామనుకున్నారు. మావూరి కోటయ్య శ్రేష్టి, యగానికి కావలసిని వస్తువులన్ని తను సరఫరా చేసే షరతుమీద ఓ వంద చందాకూడా వేస్తానన్నాడు. కాని అదిపడలేదు. చందాలు బాగా పోగుకాలేదు.
ఆఖరుకు ఊరిబయట మరో పౌరసభ జరిగింది. అందులో కోతి ఊరికి హానికరమని దాన్ని వదిలించేటందుకు సాంఘిక సేవకులంతా నడుములు కట్టుకోవలసిందని తీర్మానం జరిగింది.
ఈ సభకు వెనుక కమ్యూనిస్టులున్నట్టు వదంతి పుట్టింది. వెంటనే ఊళ్లో మరోసభ చేసి పెద్దలు, కోతిమీద కుట్ర చేస్తున్నందుకు కమూనిస్టుల మీద ఒక నిరసన తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి వోటు చెయ్యటానికి కిసాను పార్టీని, కాంగ్రెసు పార్టీని, హిందు మహాసభనూ, జస్టిసు పార్టీని ఇంకా తదితర హంగులను సభకాహ్వానించారు.
కోతి యథాప్రకారం స్వైరవిహారం చేస్తున్నది.
ఓనాడు షేక్ మస్తాన్ గుడిపక్కగా ఖాళీ ఒంటెద్దు బండి తోలుతూపోతూ పురాణం చెప్పే శాస్తుల్లుగార్ని చూసి, కోతి మాచెడ్డా గడ్బచ్ గాహుంది, చాస్తుల్లుగారు! అన్నాడు.
“ఆ కమ్యూనిస్టులు నీకేమన్నా గడ్డి పెడుతున్నారా ఏం? వాళ్లమాటవిని మాదేముణ్ణి తిడితే నీకు పాకిస్తానిస్తామనుకున్నావుగామాలు?” అన్నాడు శాస్తుల్లుగారు నిప్పులు కక్కుతూ.
“ఈ కాబోతే ముడ్డికింద యేసుక్కూకొంది మారాజ్!” అంటూ మస్తాన్ ఎద్దునదిలించాడు.
ఇంతట అకస్మాత్తుగా కోతి మాయమైంది.
మళ్లీ పౌరసభ జరిగింది. కోతిని మాయం చేసిన వాళ్లమీద నిరసన తీర్మానం చేయబడింది.
కోతిని మాయం చేసింది కమ్యూనిస్టులే అనే తీర్మానం ప్రతిపాదించి, బలపరిచి క్షణంలో నెగ్గించారు. మావూరి పంతులు మాట్టాడుతూ కమ్యూనిస్టుల వల్ల మావూరికి జరుగుతున్న అపచారాలను గురించి ఉపన్యసించి నిర్మాణ కార్యక్రమం గురించి అరగంటసేపు చెప్పి కూచున్నాడు.
కోతి మాలపల్లి చేరగా అక్కడ పోలిగాడు వగైరాలు దాన్ని పట్టుకొని బస్తీకి తీసుకుపోయి అక్కడక్కడ నడుస్తున్న సర్కసువాళ్ల కమ్మినట్టు వదంతిగా ఉన్నదని ఎవరో లేచి అన్నారు.
వెంటనే సభాధ్యక్షుడు లేచి ఇటువంటి దుర్వార్తలు పుట్టిస్తున్నది కమ్యూనిస్టులేనని, మావూరి పౌరులు హరిజనులమీద ఇటువంటి నిందలు ప్రచారం చేయ్యటం ద్రోహమనీ అన్నాడు.
మావూరి పంతులు మళ్లాలేచి హరిజనోద్ధరణ మీద మరో అరగంట మాట్లాడాడు. హరిజనుల్లో కూడా ఇప్పుడిప్పడే కొందరు కమ్యూనిస్టుల మాటలు విని చెడిపోతూ ఉన్నట్టు తెలిసి తన హృదయం దహించుకుపోతున్నదన్నాడు.
అప్పటికే కాలాతీతమైనప్పటికీ, హరిజనులను చెడగొట్టుతున్నందుకు కమ్యూనిస్టుల్ని నిరసించుతూ ఒక పెద్ద తీర్మానం చెయ్యబడింది.
“నేను రహస్యంగా అధ్యక్షుడితో, కోతిని వెతికి పట్టుకొచ్చేటందుకొక తీర్మానం చేసి దానికిగాను చందాలు వసూలు చేస్తే ఏం ?” అన్నాను.
“కాలాతీతమైపోయింది,” అన్నాడధ్యక్షుడు.
(ప్రథమ ముద్రణ: మార్చి 1945, పెంకిపిల్ల మాసపత్రిక)