సంగీతం

సంగీతం

“శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి:” చిన్న పిల్లలు, పశువులు, పాములు, ఇలా జీవజాలాన్నంతటిని రంజింపచేయగలిగే ధ్వనే సంగీతం. వినడానికి, హాయిగా ఉండే శబ్దాల సమ్మేళనమే సంగీతం అని చెప్పవచ్చు. అయితే, “గీతం వాద్యం తధా నృత్యం త్రయం సంగీతముచ్చతే”, గీతము, వాద్యము, నృత్యము అను నీ మూడింటి చేరిక సంగీతమని పిలవపడుతుందని, మరియు రాగము, స్వరము, తాళము అను నీ మూడింటి చేరికయు సంగీతమని సంగీత రత్నాకరంలో చెప్పపడింది. సంగీతం ఎప్పుడు, ఎలా ఏర్పడిందో చెప్పటం కష్టం. అయితే, ఇంద్రుడు, బ్రహ్మను ఒక కళను సృష్టించమని అడగగా, బ్రహ్మ సామవేదం నుంచి పరమశివుని సన్నిధానంలో సంగీతాన్ని సృష్టించాడని అంటారు. బ్రహ్మ ఈ సంగీతాన్ని భరతునికి నేర్పగా ఆయన భూలోకంలో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడని చెపుతారు. సంగీతం ముఖ్యంగా మార్గ సంగీతం, దేశ్య సంగీతం అని రెండు విధాలుగా విభజింపబడింది. మార్గ సంగీతం గురించిన ప్రస్తావన సంగీత రత్నాకరం, సంగీత పారిజాతం, సంగీత దర్పణం వంటి గ్రంధాలలో మనకు కన్పిస్తుంది. “గీతం ద్వేదా మార్గోదేశీ మార్గ: సయోవిరించాద్యై:| అన్విష్టో భరతాద్యై: శంభోరగ్రే ప్రయక్తోర్చ్య:|| (రాగ విభోధ:) దుహిణేన యదన్విష్టం ప్రయుక్తం భరతేనచ, మహా దేవస్య పురత: సన్మార్గాఖ్యం విముక్తదం|| (సం.పారిజాతం) వీటి తాత్పర్యం – బ్రహ్మ సంకల్పంతో ఆవిర్భవించినట్టి మోక్షప్రదంబైన సంగీతం, మార్గ సంగీతమనపడును. ఈ మార్గ సంగీతం భూలోకంమందు లేదనియు, దేవతల వల్ల, భరతాదుల వల్ల దేవలోకమునందు మాత్రం మభ్యసించపడి వెలుగొందుచున్నదని భావము. ఇక “దేశేదేశేతు సంగీతం తద్దేశీ త్యభిధీయతే”, ఆయా దేశములయందు జనరంజకముగా చేయపడు గానమును, వాయించే వాద్యమును, ఒనర్చే నృత్యం దేశ సంగీతమందురని సంగీత దర్పణము తెలియచేస్తోంది. సంగీత విశిష్టత: ధర్మార్ధకామ మోక్షాలకు సంగీతమే ముఖ్య సాధనమని శాస్త్రలు వెల్లడిస్తున్నాయి. సంగీత దర్పణమందు “శారీర వివేక” మను ప్రశంసలో మనుష్య శరీరమందు గల మూలాధారాది ఆరు యోగధార చక్రములను చెప్పి, నాదము మూలాధారము నుండి వెలువడి క్రమేణా గాత్రమగుచున్నదని పేర్కొంది. నాదోపాసన యాదేవ బ్రహ్మవిష్ణు మహేశ్వర: | భవం త్యుపాసితా నూనం యస్మాదేతే తదాత్మకా: || బ్రహ్మ, విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు నాదముచే స్వరూపముగా గలవారు. గాన, వారు నాదముచేతనే ఉపాసించపడుచున్నారని సంగీత రత్నాకరం తెలుపుతోంది. నాదోత్పత్తి: శరీరమందుగల ఆత్మ మనస్సును ప్రేరేపించుచున్నది. మనస్సు దేహమందుగల వహ్నిని గొట్టుచున్నది. ఆ వహ్ని వాయువును ప్రేరేపంచగా, ఆ మారుతము బ్రహ్మగ్రంధియను మూలాధారమునుండి ఊర్ధ్వముఖముగా నాభి, హృదయము, కంఠము, శిరము, ముఖము వీటియందు క్రమేణా చరించునపుడు నాదము ఆవిర్భవించుచున్నది. నాదము వ్యవహారమునందు మంద్ర, మధ్య, తారమని మూడు విధములు. నాదము హృదయమందున్నపుడు మంద్రమని, కంఠమునందు మధ్యమనియు, శిరస్సునందు తారమని చెప్పపడుతున్నది. శృతి అనగా నేమి? “శ్రూయాన్త ఇతి శ్రుతయ:”... శ్రోత్రమునకు వినని శ్రతియని చెప్పపడుతున్నది. “శ్రవణార్ధస్య ధాతో:క్తి ప్రత్యయేచ సునంశ్రితే, శ్రుతిశబ్ద: ప్రసాధ్యోయం శబ్ధజ్ఞై కర్మసాధనై:” -- చెవులకు వినునదియును శ్రోత్రోంద్రియములకు గ్రాహ్యమగునదియు శ్రుతియనపడును. వీణయందు గల మెట్లపైనున్న తంత్రుల నుండి వెలువడే శబ్ధం శ్రుతియనపడునని రాగవిభోధము తెలుపుతోంది. వీణయందుగాని, శరీరమందుగాని షడ్జపంచమ ప్రకారం గలుగు శ్రుతులు 22 అని శార్జ్గదేవుడు రత్నాకరంలో పేర్కోన్నాడు. అయితే, స్థాయి ఒక్కక్కటికి 22 చెప్పున మొత్తం 66 శ్రుతులని కూడా వాదన కలదు. సంగీతపారిజాతంలో ప్రకారం ఈ 22 శ్రుతుల నామాలు వరసగా: తీవ్రా, కుముద్వతీ, మన్దా, ఛన్దోవతీ, దయావతీ, రంజనీ, రతికా, రౌద్రీ, క్రోధీ, వజ్రికా, ప్రసారణీ, ప్రీతీ, మార్జనీ, క్షితీ, రక్తా, సన్దీపనీ, ఆలాపనీ, మదన్తీ, రోహిణీ, రమ్యా, ఉగ్రా మరియు క్షోభిణీ. సప్త స్వరాలు పూర్వమానవులు తమ చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి అనేక స్వరాలను కనుగోన్నారు. నెమలి కూతలోను, ఏనుగు ఘీంకారంలోనూ, కోకిల కూతలోను, గుర్రం సంకిలింపులోనూ, ఎద్దులు వేసే రంకెల్లోనూ ఇలా అనేక జంతువుల ధ్వనుల నుంచి స్వరాలను ఏర్పరిచారు. ఈ ఆధునిక కాలంలో మనకు తెలిసిన స్వరాలు ఏడు. ఈ సప్తస్వరాలను నేడు పిలిచినట్టు షడ్జమం (నెమలి), రిషభం (వృషభ ధ్వని), గాంధారం (మేక), మధ్యమం (క్రౌంచము), పంచమం (కోకిల), దైవతం (గుర్రం) మరియు నిషాదం (గజము) అని పిలిచేవారు కాదు. పూర్వం వీటిని కృష్ణ, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, మన్ద్ర, అతిస్వర్య అని పిలిచేవారు. ఇప్పటి స్వరాలతో పోలిస్తే, ఈ స్వరాలు ‘మగరసనిదప’ అనే స్వరాలన్నమాట. ఇవే క్రమేణా రూపాంతరాలు చెందుతూ, నేటి స్వరాల క్రమం ‘సరిగమపదని’ గా రూపుదాల్చాయి. ‘మగరసనిదప’అనే వరుసలో ఉన్న స్వరాలను మధ్యమ గ్రామం అని పిలిచేవారు. కొత్తగా ఏర్పడిన స్వరాల క్రమం ‘సరిగమపదని’ ని షడ్జగ్రామం అంటారు. స్వరశ్రుతి స్థానాలు: మొదటినుండి నాల్గవశ్రతి వరకు షడ్జమ స్థానాలు, ఐదు నుండి ఏడు వరకు రిషభ స్థానాలు, ఎనిమిది, తొమ్మిది గాంధార స్థానాలు, పదిమొదలు పదమూడు వరకు మధ్యమ స్థానాలు, పదునాలుగు మొదలు పదిహేడువరకు పంచమ స్థానాలు, పద్దెనిమిది నుండి ఇరవై వరకు ధైవత స్థానాలు, ఇరవై ఒకటి, రెండు నిషాధ స్థానాలు. తేటగీతి
పాశ్చ్యాత జీవిన విధానం, సంస్కృతి ప్రభావం నేడు మనపై చాలా ఉందని పదే, పదే అంటుంటాం. దానికి కారణం, ఆంగ్లేయులు చాలాకాలం మన దేశాన్ని పరిపాలించటం కావచ్చు. అలాగే, పాశ్చ్యాత సంగీతం కూడా మన పూర్వీకులని, సంగీతజ్ఞులను అమితంగా ప్రభావితం చేసిందనటంలో సందేహంలేదు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారే అందుకు నిదర్శనం. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో చెన్నపట్టణంలోని సెయింట్ జార్జ్ ఫోర్టులో జరిగే ఆంగ్లేయుల బ్యాండ్ వీక్షించి ప్రభావితులైన దీక్షితారు వారు ఆంగ్ల సంగీతానికి ప్రభావితులై ఆ బాణీలను అనుకరిస్తూ, కర్ణాటక సంగీతంలో ‘నొట్టు స్వరాల’ పేరిట రచనలు చేశారు. దాదాపు 30, 40 రచనల దాకా ఉన్న ఈ నొట్టుస్వరాలకు ఆంగ్ల జానపద గీతాలతోపాటు ఐర్లాండు, స్కాంట్లాండు జానపద సంగీతం కూడా ప్రేరణగా నిల్చాయి. పాశ్చ్యాత, కర్ణాటక సంగీతానికి వారధిగా నిలిచిన ఈ నొట్టు స్వరాలు పాశ్చ్యాత సంగీతంలో ‘సి’ మేజర్ స్కేలుకు దగ్గరగా ఉండే, శంకరాభరణ రాగంలో తిశ్ర, చతురశ్ర ఏకతాళాలలో రచించబడ్డాయి. పాశ్చ్యాత సంగీతంలో ఈ తాళ నిబద్ధతను 3/4 , 4/4 లయగా వ్యవహరిస్తారు. ఆంగ్లంలో ‘నోట్’ అంటే స్వరం అని అర్ధం. ఈ పదం భాషానుగుణంగా రూపాంతరం చెంది నొట్టుగా మారింది. విలియం బ్రౌన్ అనే ఆంగ్ల అధికారి అభ్యర్థన మేరకు ఆంగ్ల బాణీలకు సంస్కృతంలో పదరచన చేసి, కర్ణాటక బాణీలతో ముత్తుస్వామి దీక్షితార్ మెరుగులు దిద్దినట్టుగా చరిత్రకారులు చెపుతున్నారు. మొదట కేవలం 13 నొట్టు స్వరాలనే ముత్తుస్వామివారు రచించారు. చాలా వరకు నొట్టుస్వరాల సాహిత్యం సంస్కృతంలోనే రచించినా, కొన్ని తెలుగులో కూడా కూర్చారు. నొట్టు స్వరాలలో కూడా దీక్షితార్ వారి ముద్ర ‘గురుగుహ’ మనకు కన్పిస్తుంది. విచిత్రంమేమంటే, ఈ నొట్టు సాహిత్యాన్ని ముత్తుస్వామి దీక్షితార్ తన మొదటి కృతి రచించడానికి చాలాకాలం ముందే రచించారు. ముత్తుస్వామివారి సమకాలీకులైన మోజార్ట్, బేథోవన్ల ప్రభావం కూడా వారిపై మనకు కన్పిస్తుంది. వారి రచనలను అనుకరించి కూడా కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి వారు నొట్టు స్వరాలను, ఇతర కృతులను రచించారు. కర్ణాటక సంగీతంలో ప్రధానంగా కన్పించే గమకాలు ఈ నొట్టు స్వరాలలో ఉండవు. అందువల్ల ప్రాథమిక సంగీత అభ్యాసకులకు ఇవి పాడుకొవడానికి వీలుగా ఉంటాయి. అలాగే ఇవి గణపతి, సరస్వతి, శివుడు, విష్ణువు, రాముడు, స్కంధుడు, మరియు ఆంజనేయుడు వంటి దేవతామూర్తులను, శ్రీనగరం, కంచి, తిరుపతి, మథుర వంటి పుణ్య క్షేత్రాలను కీర్తించే చిన్న, చిన్న ప్రార్థనా గీతాల రూపంలో ఉంటాయి. కర్ణాటక సంగీతంలోని గీతాలు, కీర్తనలలో లక్షణాలకు విరుద్ధంగా పల్లవి, అనుపల్లవి, చరణాలు ఈ నొట్టు సాహిత్యంలో ఉండవు. నొట్టు సాహిత్యానికి ఆలంబనగా నిలిచిన పాశ్చ్యాత గీతాలలో ప్రముఖమైనవి, ‘సంతానం పాహిమాం, సంగీత శ్యామలే’ – ‘గాడ్ సేవ్ ద కింగ్’, ఇది ఇంగ్లాండు జాతీయ గీతం. అలాగే, ‘శ్యామలే మీనాక్షి’కి ప్రేరణ మోజార్ట్ 12 వేరియేషన్స్ లోని ‘ఆహ్ ఔస్ డిరైజే మామన్’ అనే ఫ్రెంచ్ జానపద గీతం పిల్లల పాట ‘ట్వింకిల్, ట్వింకిల్ లిటిల్ స్టార్’కి కూడా ఈ బాణీయే ప్రేరణ. ఇక ఐరిష్ గీతం ‘లిమరిక్’ ఆధారంగా ‘వందే మీనాక్షీం’, ‘ఓల్జ్ వాజ్ డాన్సర్’ బాణీలో ‘శక్తి సహిత గణపతిం’ రచించబడ్డాయి.

నొట్టు స్వరము		      పాశ్చాత్య సంగీత ప్రేరణ

సంతతం పాహిమాం సంగీత శ్యామలే	    God save the King/queen – British National Anthem
శ్యామలే మీనాక్షీ		        Twinkle twinkle little star. Based on French tune ‘Ah! Vous dirai-je’    
జగదీశ గురుగుహ				Lord MacDonald’s Reel
పీతవర్ణం భజే				Persian verse ‘taza ba-taza nau ba-nau’ with English jingle
సుబ్రహ్మణ్యం సురసేవ్యం			British Army regimental march – British Grenadiere
కంచీశం ఏకాంబరం			Country dance
రామచంద్రం రాజీవాక్షం			Let us lead a life of Pleasure
సకల సురవినుత				Quick March
శక్తి సహిత గణపతిం			Voleuz –Vous-dancer
శౌరి విధినుతే				Oh Whistle and I will come to you, my lad.
వర శివబాలం				Castilian Maid
కమల వందిత				Playful tune of ‘Galopede’ folk dance
వందే మీనాక్షీ				Limerick

నొట్టు స్వర సాహిత్యం

1. సంతతం పాహిమాం సంగీత శ్యామలే సర్వాధారే జనని
  చింతితార్థప్రదే చిద్రూపిణి శివే శ్రీ గురుగుహ సేవితే శివ మోహాకారే

2. శ్యామలే మీనాక్షీ సుందరేశ్వరసాక్షి శంకరీ గురుగుహ సముద్భవే శివేవా
  పామరలోచని పంకజలోచని పద్మాసనవాసిని హరి లక్ష్మివినుతే శాంభవి

3. జగదీశ గురుగుహ హరవిధి వినుతం దేహాత్రయ విలక్షణమానంద లక్షణం
  నిత్యం శుద్ధం బుద్ధం ముక్తం సత్య నిర్వికల్పం నిశ్ప్రపంచమానంద మజం

4. పీతవర్ణ భజే భైరవం భూత వేతాళ సంసేవ్యమానం
  పీత వస్త్రం సువర్ణప్రదం వీతరాగం గురుగుహాత్మజం

5. కంచీశం ఏకామ్రనాయకం నిత్యమహం భజే కామాది షట్చోరవృత్తమహం త్యజే
  పంచాక్షర స్వరూపమాగమాంతసారం పంచాస్యమాది కారణం విశ్వేష్వరం గురుగుహం

6. రామచంద్రం రాజీవాక్షం శ్యామళాంగం శాష్వత కీర్తిం కోమలహస్తం కోశలరాజం
  మామక హృత్కమలాకరం మారుతియుక్తం ధిమంతం మానిత భక్తం శ్రీమంతం
  కౌమారవరం గురుగుహ మిత్రం కారుణ్యనిధిం దశరథ పుత్రం భూమిసుతాభం
  భూపతి రూపం కోమల పల్లవ పాదం మోదం కామగురుం సితారామం కౌస్తుభభూశం వందేహం

7. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత సేవితం
  భక్తాళిపోషకం భవసుతం వినాయకం భక్తిముక్తిప్రదం భూశితాంగం రక్తపదాంబుజం భావయామి

8. వరశివ బాలం వల్లీలోలం వందే నందం హరిహరమోదం హంసానందం హససముఖం
  గురుగుహ రూపం గుప్తాకారం ఘోరక్షంతం సురపతిసేనంసుబ్రహ్మణ్యం సురవినుతం

9. వందే మీనాక్షి త్వాం సరసిజ వక్రే పర్ణే దుర్గే నటసుర బృందే శక్తే గురుగుహ పాలిని జలరుహచరణే
  సుందర పాండ్యానందే మాయే సూరిజానాధారే సుందరరాజ సహోదరి గౌరి శుభకరి సతతమహం

10. శౌరి విధినుతే శాంభవి లలితే శాంతే అతీతే శంకరముదితే గౌరి సురహితై ఏకామ్రపతియుతే
   కామాక్షీ మాం పాహి వీరవర వినుత చరణాంభోజే ఘోరతమలయవర హిమగిరిజే
   శూరహరణ గురుగుహ మాతహ సంసారతర చరణతర కమలే

11. కమలాసన వందిత పదాబ్జే కమనీయ కరోదయ సామ్రాజ్యే కమలానగరే సకలాకరే
   కమల నయన ధృత జగదాధారే కమలే విమలే గురుగుహ జనని కమలాపతినుత
   హృదయే మాయే కమల శశి విజయ వదనే అమేయే కమలేంద్రాణి వాగ్దేవి శ్రీ గౌరీపూజిత
   హృదయానందే కమలాక్షి పాహి కామాక్షి కామేశ్వరసతి కల్యాణి

12. సకల సురవినుత శంభో స్వామిన్ వికట గురుగుహ విజయ త్రిపురహర ఏకామ్రపతే
   కరుణామూర్తే ఏకానేక విభూతే ఏకాంత హృదయ ఏకభోగ దాయకనందకర విభో

13. సుబ్రహ్మణ్యం సురసేవ్యాబ్జపదం సుందర వదనం సుకుమార వినుత లావణ్యం
   శుభగాత్రం శుభకర నేత్రం సోమాత్మకమాశ్రిత కల్పభూరుహం
   సూరి గురుగుహం సురరాజ విధి వినుతం సర్వజ్ఞం సుమతే చింతయ గురునాథం
   స్వజ్ఞాన విదారణ ఫణితం సాధుజన సూనృత వచనం

తేటగీతి
కర్ణాటక సంగీతత్రయంలో రెండవవాడైన ముత్తుస్వామి దీక్షితార్ సంగీత విధ్వాంసుల కుటుంబానికి చెందిన వారు. వీరి తండ్రి రామస్వామి దీక్షితార్ గొప్ప సంగీతవిధ్వాంసులేకాక, హంసధ్వని రాగం సృష్టికర్త . కర్ణాటక ప్రాంతానికి చెందిన రామస్వామి దీక్షితార్‌, సుబ్బలక్ష్మి అంబాళ్‌ పుణ్యదంపతులకు ముత్తుస్వామి 1775లో పుట్టారు. ఆయన తండ్రి వద్ద సంగీతంతోపాటు తెలుగు, సంస్కృత భాషలు కూడా నేర్చారు. ముత్తుస్వామి దేశమంతటా పర్వటించిన కారణంగా ఆయనపై హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతాల ప్రభావం చూపింది. ఒకసారి ఇంటికి అతిధిగా వచ్చిన చిదంబరనాధ యోగి బాలునిగా ఉన్న ముత్తుస్వామి దీక్షితార్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ముత్తుస్వామికి ఉపాసనా మార్గాన్ని బోధించారు. వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. ‘శ్రీనాథాదిగురుగుహో జయోతి జయతి’ ఆయన తొలి కీర్తన. తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడెైన కుమారస్వామి (మురుగన్) పై ఈ సంకీర్తనను ముత్తుస్వామి రచించారు. ఆ తర్వాతికాలంలో ‘గురుగుహ’ ఆయన ముద్రగా రూపుదిద్దుకుంది. వేదవేదాంగాలు, పౌరాణిక ధర్మాలను, వ్యాకరణ, జ్యోతిష్య, వైద్య విద్యలను క్షుణంగా అభ్యసించిన ముత్తుస్వామి కీర్తనలలో ధ్యాన యోగం, జ్యోతిష్యశాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలెైనవి ప్రస్ఫుటంగా మనకు గోచరిస్తాయి. దీక్షితార్ కృతులు మంద్రస్థాయిలో నున్నప్పటికీ, గమకాలను ఉపయోగించిన రీతి ఆయా రాగాల ఔనిత్యాన్ని వెలికితీస్తాయి. చాలావరకు ఈయన రచనలు సంస్కృతంలో ఉన్నప్పటికీ, కొన్ని కృతులను తెలుగులో కూడా రచించారు. మరికొన్ని కీర్తనలలో తెలుగు. తమిళం, సంస్కృత భాషలను కలిపి మణిప్రవాళిశైలిగా ఉపయోగించారు. మధ్యమకాల సాహిత్యాన్ని దీక్షితార్ తమ కృతులలో అద్భుతంగా పలికించారు. ఆయన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని 72 మేళకర్త రాగాల్లో, సూలాదిసప్త తాళాలకు మేళవిస్తూ రచనలు చేశారు. ఇందు ఆయన 191 రాగాలలో రాసిన 461 కృతులు మాత్రమే నేడు మనకు లభ్యమయ్యాయి. ముత్తుస్వామి తన మాతృభాషైన తమిళంలోకాక, శ్రావ్యమైన తెలుగులోనూ కాక సంస్కృతంలో రచనలు చేయడానికి కారణమున్నది. సంస్కృత శబ్ధోచ్ఛరణలో గంభీర ధ్వని కల్గి ప్రత్యేకతను సంతరించుకుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలో ప్రత్యేకత వాటియందున్న రాగసంచారముల యొక్క సౌందర్యశ్రేష్టత, ఉత్కృష్టలలో ఉంది. ఆయన కీర్తనలన్ని దేవతా సంకీర్తనములగుట వల్ల ఆయనకు కావాల్సిన భాష గాంభీరత, సాహిత్య భావములు సంస్కృతభాష యందు అనంతముగా లభించింది. అందుకనే వారు ఆ భాషను ఎన్నుకున్నారని విశ్లేషకుల అభిప్రాయం. దీక్షితార్ తండ్రిగారు వెంకటకృష్ణ మొదలియార్ ఆస్థానంలో సంగీతకారులుగా ఉన్నకాలంలో, ముత్తుస్వామివారికి ఈస్టిండియా కంపెనీవారి బ్యాండ్ వినే అవకాశం కల్గింది. దాని వలన ముత్తుస్వామి దీక్షితార్ పాశ్చాత్య సంగీతంలోని మర్మాలను గ్రహించగలిగారు. అనంతరం ఆంధ్రులకు తెలుగు నిఘంటవును ప్రసాదించిన బ్రౌను దొర ప్రోత్యాహంతో ఆంగ్లపాటలకు దీక్షితార్ బాణీలు కట్టారు. అందులో ప్రధానమైనది ‘గాడ్ సేవ్ ది కింగ్’ అనే బ్రిటన్ వారి జాతీయం గీతం. దీనికి ముత్తుస్వామి దీక్షితార్ సంస్కృత శబ్ధాల తొడుగును అమర్చి దేవీస్తుతి చేశారు. అదే, ‘సతతం పాహి మాం సంగీతశ్యామలే సర్వాధారే జననీ చింతితార్ధప్రదే చిద్రూపిణీ శివే శ్రీ గురుగుహ పూజితే శివమోహాకారే సతతం పాహిమాం’ గమకాలకు ఆస్కారంలేని నొట్టుస్వర సాహిత్యాన్ని పాశ్చాత్యసంగీత బాణీలలో ముత్తుస్వామి రచించి, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలకు శేతుబంధం చేయటంతోపాటు, పాశ్చాత్య సంగీతానికేపరమైన వయలిన్ (ఫిడేల్)ను కర్ణాటక సంగీతానికి పక్క వాయిద్యంగా చేసి రెండు సంగీతాలను పెనవేశారు. అయితే ఫిడేల్ను కర్ణాటకసంగీతంతో మేళవించిన ఘనత ముత్తుస్వామి కనిష్ట సోదరుడు బాలస్వామి దీక్షితులకు చెందుతుంది. నేటికీ హిందుస్తానీ సంగీతంలో వయలిన్ కు చోటులేదు. తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయిన దుఃఖ సమయంలో ఆయన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. అక్కడే అతడు ‘మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి’ అనే కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు. ఆ తదనంతర కాలంలో ముత్తుస్వామి కమలాంబ అమ్మవారిపై ‘నవావర్ణ కీర్తనలను’ ఆలపించారు. దేవీనవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజుకు ఒక కీర్తన చొప్పున ఈ రచనలు చేశారు. ఈ కీర్తనలలో ఆయన శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యాలను నిగూఢపర్చారు. అదేవిధంగా ‘వర కృతుల’ను ఆయన వారంలోని ఒక్కొక్కరోజుకి ఒకటి చొప్పున రచించారు. అలాగే షోడశ (పదహారు) గణపతి కృతులను వ్రాశారు. అందులోనిదే ఎంతో ప్రసిద్ధి చెందిన హంసధ్వని రాగంలోని ‘వాతాపి గణపతిం భజే’ కృతి. ఈ కృతిలో ముత్తుస్వామి ఎంతో అందంగా ఆద్యక్షర ప్రాసను పల్లవిలో (ఉదా: వాతాపి, వారణాస్యం, వరప్రదం), అనుపల్లవిలో (ఉదా: భూతాది, భూతభౌతిక; అలాగే వీత, వినుత, విఘ్న, విశ్వ మొదలయినవి) వాడారు. ఇక ద్వితీయాక్షర ప్రాస (పురా, మురా, పరా, నిర, కరా, హరా) మరియు అంత్యాక్షరప్రాస (చరణం, భరణం, రాగిణం, యోగినం, కారణం, వారణం; అలాగే తుండం, ఖండం, దండం మొదలయినవి) లను చొప్పించటం ఆయన ప్రతిభకు తార్కాణం. ఇవికాక, భూత అనే పదాన్ని మూడు చోట్ల మూడు వేర్వేరు అర్ధాలతో వాడారు - భూతాది, భూత-భౌతిక, భూతాకారం. అంతే కాక, తన వాగ్గేయకార ముద్ర అయిన 'గురుగుహ'ను, రాగం పేరైన 'హంసధ్వని'ని కృతి సాహిత్యంలో నిక్షిప్తం చేసి ఈ కృతికి మరింత సొగసు తెచ్చిపెట్టారు. ఆయన రూపొందించిన కృతులలో కమలాంబా నవావర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు, పంచలింగ కృతులు, తమ గురువుగారిని స్తుతిస్తూ చేసిన గురుగుహ కృతులు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేతః శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవెైభవం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలెైనవి వీరి యితర ప్రముఖ రచనలు. పున్నాగవరాళి రాగంలోని ‘ఏహి అన్నపూర్ణే సన్నిధేహి, సదాపూర్ణే, సువర్ణే, చిదానందవిలాసిని’ అను కృతి ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఆఖరి కీర్తన. క్రీ.శ. 1835 సంత్సరం ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, నరకచతుర్ధశి దినమున ఆయన శిష్యులు ‘మీనాక్షి మేముదం దేహి’ (గమక క్రియరాగం) అను కృతి ఆలపిస్తుండగా, అందు అనుపల్లవిలో ‘మీనిలోచనను, పాశమోచని’ అను పదాలు రాగా ఆయన చేతులు జోడించి కనులు మూసుకొని, ‘శివే పాహి’ అనుచు ప్రాణాలు వదిలారని కథనం. (తరవాయిభాగంలో ముత్తుస్వామి దీక్షితార్ రచనలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.) సౌమ్యశ్రీ రాళ్లభండి
భాగవతపుదైవము భారతములో దైవము సాగినపురాణ వేదశాస్త్రదైవము పోగులైన బ్రహ్మలను బొడ్డున గన్న దైవము శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము || వేదాంతవేత్తలెల్ల వెదకేటి, ఆదిఅంతములు లేని రూపము, వైకుంఠాన వెలసిన పరిపూర్ణమైన రూపము, శేషగిరివాసి రూపము. బ్రహ్మాదులకు మూలమైన రూపము, పరబ్రహ్మమై మనల్ని ఏలేటి రూపము, అట్టి శ్రీ వేంకటేశ్వరుని సాకారమును ‘వెదికిన నిదియే వేదాంతార్ధము, మొదలు తుదలు హరిమూలంబు’ అంటూ, మనోఫలకంపై దర్శించి మనోరంజకంగా వర్ణించాడు అన్నమయ్య. ఆ సుందర స్వరూపాన్ని చూచి మోహించని వారుండరు. చూచి మోహించకుందురా సురలైన నరులైన తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను || భాగీరథి పుట్టిన పాదపద్మములు భోగపుమరుని జన్మభూమి నీ తోడలు యోగపునవ బ్రహ్మలుండిన నీనాభి సాగరకన్యకలక్ష్మి సతమైనవురము || అందరి రక్షించేటి అభయహస్తము కంద నసురలఁజంపే గదాహస్తము సందడిలోకముల యాజ్ఞాచక్రహస్తము చెంది ధ్రువు నుతియించఁజేయు శంఖహస్తము || సకల వేదముండే చక్కనినీమోము వొకటై తులసిదేవివుండేటి శిరసు ప్రకటపు మహిమలఁ బాయనినీరూపము వెకలి శ్రీవేంకటాద్రివిభుఁడ నీభావము || ఆనందనిలయంలో బ్రహ్మస్థాన మనబడే దివ్యస్థలంలో స్వయంవ్యక్తమూర్తిగా వెలసిన ఆ ఆర్చారూపాన్ని, ‘‘స్థానకమూర్తి’’ అంటారు. స్థిరంగా కదలకుండా ఉన్నందున ‘ధ్రువమూర్తి’ లేక ‘ధ్రువ బేరం’ అని కూడా పిలుస్తారు. దేవేరులు లేకుండా కేవలం వ్యూహాలక్ష్మిని వక్షస్థలంలో కలిగి దర్శనమివ్వడం వల్ల ‘స్థానక విరహమూర్తి’ అని కూడా పిలవపడతాడు. వ్యూహాలక్ష్మిని వక్షఃస్థలంలో నిలుపుకొని, కుడి,ఎడమ చేతుల్లో శంఖచక్రాలనుంచుకొని, మరో ఎడమచేతిని కటిపై ఉంచి, వరదహస్తంతో వరాలనొసిగే ఆ ఏడుకొండలవాడు విచిత్రభంగిమతో భక్తులను భవసాగరం దాటిస్తానని అభయమిస్తుంటాడు. భవాభ్దితారం కటివర్తిహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలమ్ ఆలంబిసూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వేంకటశైల నాయకమ్ || శ్రీమన్నారాయణునికి ఐదు రూపాలున్నాయని శాస్ర్తాలు చెపుతున్నాయి. ముక్తపురుషులచే ఆరాధించపడే ‘పరస్వరూపం’, సృష్టి, స్థితిలయలను నిర్వహించే ‘వ్యూహా స్వరూపం’, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్ధం ‘విభవ స్వరూపం’, యోగులు ధ్యానించే చైతన్య రూపం‘ అంతర్యామి స్వరూపం’, ఆలయ గృహాదులందు పూజలందుకునే ‘అర్చాస్వరూపం’. సాలగ్రామ శిలారూపంతో వెలసిన శ్రీవారి మూలవిరాట్టు స్వయంభువు. చతుర్భుజాలతో అర్చారూపాన్ని పొందిన ఈ స్వరూపం శ్రీనివాసుని ధ్రువబేరం. ఇందుకు తార్కాణం, ‘వనమాలి గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీచ నందకీ, శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు’ అనే విష్ణుసహస్రనామ వర్ణనే! బంగారు పద్మపీఠంపై, గజ్జెలు, అందెలు ఘల్లు, ఘల్లుమన బంగారు పాదాలతో, ఘనపట్టు పీతాంబరాలపై జిలుగుమంటూ వేలాడుతున్న సహస్రనామాల మాలతో, నడుమున వజ్రాలుతాపిన సూర్యకఠారి అనబడే నందకఖడ్గం, ఒడ్డాణాలతో, వజ్రఖచిత వరద, కటి హస్తాలతో, ఉరముపై కౌస్తుభమణితో, నవరత్నహారాల నుడుమ వక్షఃస్థలంలో పొదువుకున్న సిరితో, పసిడి యజ్ఞోపవీతంతో, నాగాభరణాలు, భుజకీర్తులు, సాలగ్రామ మాలలు, వజ్రకిరీటం, మకర తోరణంతో వెలుగొందుతన్న ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ‘సందడి సొమ్ములతోడి సాకరమిదె వీఁడె, యిందరు వర్ణించరే యీరూప’మంటూ, ఆపాదమస్తకం వర్ణించటం ఒక్క అన్నమయ్యకే సాధ్యం! చేరి కొల్వరో యాతఁడు శ్రీ దేవుఁడు యీరీతి శ్రేవేంకటాద్రి నిరవైన దేవుఁడు || అలమేలుమంగ నురమందిడుకొన్నదేవుడు చెలఁగి శంఖచక్రాలచేతి దేవుఁడు కలవరదహస్తముఁ గటిహస్తపుదేవుఁడు మలసీ శ్రీవత్సవనమాలికలదేవుఁడు || ఘనమకరకుండలకర్ణముల దేవుఁడు కనకపీతాంబర శృంగారదేవుఁడు ననిచి బ్రహ్మాదుల నాభిఁగన్నదేవుఁడు జనించెఁ బాదాల గంగ సంగతైనదేవుఁడు || కోటిమన్మథాకారాసంకులమైన దేవుఁడు జాటపుఁగిరీటపుమించులదేవుఁడు వాటపుసొమ్ములతోడి వసుధాపతి దేవుఁడు యీటులేని శ్రీవేంకటేశుఁడైన దేవుఁడు || ‘చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి....కంటి గంటి ఘనమైన ముత్యాలు, కంటమాల లవె... పొడువైనట్టి మించు కిరీటం, జంటల వెలుగు శంఖచక్రా లవె...’ భుజకీర్తులును, మొలకఠారును, ముంగిటి నిధానమైన మూలభూతమదె, వేంకటాచలము మీద విశ్వరూపము, కందర్పు పుట్టించిన ఘన విశేషము, యోగీంద్రులెల్ల భావించిన వేదవేదాంతార్ధ విశేషము, అలమేలుమంగపతియైన దేవదేవుడితడే దివ్యమూరితి, ఎచ్చటజూచిన తానే యీరుపై ఉన్నాడంటూ, ఇహపరములన్నీ ఆ శ్రీనివాసుడేనని, నీయందె బ్రహ్మ మరి నీయందే రుద్రుఁడు నీయందే సచరాచరమును నీయందే యీజగము చాయలనే యెడనెడ నే నేమిచూచినా సర్వము నీధ్యానమేకాక యీయెడ నీయర్ధములో నితరంబిది యౌఁగాదన నెడమేదయ్య || అంటూ ఆ చిత్తజ గురుని, ఆ కొండల కోనలలోన కోనేటిరాయుని, నవ్వులమోముతో, సంకుజక్రముల సొంపుతో, బంగారుమేడలో వెలుగొందుతున్న ఆ శ్రీపతి, భూపతి రూపాన్ని మనోఫలకంపై ముద్రించాడు అన్నమయ్య. వాడివో కంటిరటిరే వన్నెలవాడు పైడి మోలముకటారుపరుజులవాడు || పెద్దకిరీటమువాడు పీతాంబరమువాడు వొద్దిక కౌస్తుభమణిపురమువాడు ముద్దులమొగమువాడు ముత్తేలనామమువాడు అద్దిగో శంఖచక్రాల హస్తాలవాడు || అందిన కటిహస్తము నభయహస్తమువాడు అందెల గజ్జల పాదాలమరువాడు కుందణంపు యీ(?) మకరకుండలంబులవాడు కందువ బాహుపురుల కడియాలవాడు || నగవుజూపులవాడు నాభికమలమువాడు మొగవుల మొలనూళ్ళా మొలవాడు చిగురుమోము (వి?)వాడు శ్రీవేంకటేశుడు (వాడు) తగు నలమేలుమంగ తాళిమెడవాడు || సౌమ్యశ్రీ రాళ్లభండి
శ్రీ కృష్ణలీలలు బ్రహ్మ, విష్ణు, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, కూర్మ, పద్మ, మార్కండేయ పురాణాలలో శ్రీగర్గ, శ్రీదేవీ భాగవతాల్లో, భారత, హరివంశాల్లో వర్ణించపడింది. సమ్మోహనాత్మకమైన కృష్ణ స్వరూపం పండితులను, పామరులను ఒకే విధంగా అలరించింది. లీలాశుకుడు, నారాయణతీర్ధులు, పురందర మరియు అన్నమయ్య వంటి వాగ్గేయకారులెందరో బాలకృష్ణుని లీలా విశేషాలను అభివర్ణించి తరించారు. ‘‘భక్తవత్సలు డౌటపరమ సంప్రీతి పరమ పదంచిచ్చు బాలకృష్ణుడు’’అంటూ ఫలశ్రుతి చేసింది తన ‘శ్రీకృష్ణమంజరి’లో తరిగొండ వేంగమాంబ. వేదాలలో ప్రాచీనమైన ఋగ్వేదంలో కూడా కృష్ణ శబ్ధం పలుచోట్ల విన్పిస్తుంది. శ్రీ భాష్యం అప్పలాచార్యులుగారు ‘‘తిరుప్పావు’’ అనే గ్రంధంలో ‘కృష్ణ’ శబ్ధానికి ఈ విధంగా నిర్వచనం చెప్పారు – కృష్ – అపరిమితము, ణ – ఆనందము, కృష్ణ – అపరిచ్ఛిన్న ఆనందము. అదియే బ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణతత్త్వాన్ని, లీలా వైభవాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో సాక్షాత్కరింప చేశాడు. అన్నమయ్య తీర్ధయాత్రల సందర్భంలో దర్శించిన ఉద్దగిరి, మాడుపూరు, విజయనగరం వంటి కృష్ణ క్షేత్రాలపై సంకీర్తనలు పాడాడు. అవేకాక పర్వ సంకీర్తనలు, బాలకృష్ణుని లీలావైభవ సంకీర్తనలు కూడా ఆయన కీర్తనల్లో ప్రముఖంగా కన్పిస్తాయి. ‘ఓయమ్మ చూడగదరె వుద్దగిరి కృష్ణుడు’, ‘చేరి యందల మోతతో చెన్నకేశవా, యీరీతి మాడుపూరిలో నిట్లాడేవా’, ‘వేడుకకాదు గదమ్మ విజయనగరములోన, వేడెవెట్టి సతులను వెన్నముద్ద కృష్ణుడు’ వంటివి క్షేత్ర సంకీర్తనల్లో కొన్ని ఉదాహరణలు. ఇక అన్నమయ్య కృష్ణ పర్వ సంకీర్తనలను, జయంతి సంకీర్తనలు, కృష్ణాష్టమి సంకీర్తనలు, తిధి జయంతులను గూడ సూచించే సంకీర్తనలు, చివరగా ఉట్ల పండుగ సంకీర్తనలు అను నాలుగు విధాలుగా విభజించవచ్చు. ‘జోజోయని మీరు జోలపాడరో, సాజపు జయంతి నేడే సఫల మిందరికి’, ‘హరి కర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరో’ అంటూ, శ్రావణ, భాద్రపద మాసాల్లో అష్టమితో కలిసి వచ్చే రోహిణి నాడు కృష్ణజయంతిగా సూచిస్తూ అన్నమయ్య సంకీర్తనలు చేశాడు. ‘సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమినాడు’ అంటూ, ఎంతో విశిష్టమైన శ్రావణ బహుళాష్టమి ప్రాముఖ్యాన్ని, తత్ ప్రాశస్త్యాన్ని అన్నమయ్య తన సంకీర్తనల్లో భావబంధురంగా అభివర్ణించి ఆలపించాడు. ఇందు కొన్ని మచ్చుతునకలు -- ‘కొడుకై జన్మించినాడు కూరిమి శ్రీ కృష్ణుడు, నడురేయి నిదే శ్రావణ బహుళాష్టమినాడు’ ‘శ్రావణ బహుళాష్టమి చంద్రోదయము రోహిణి కావింప జన్మదినమిదివో శ్రీ వేంకటపతికి’ ‘గోవిందుడు జనించె గోకులాష్టమిదే నేడు’ ‘అందమై మధురలోన నదివో కృష్ణావతరామందెను శ్రావణ బహుళాష్టమి నేడు’ ‘దేవకి కొడుకుగన్న దినమిది శ్రీజయంతి, వసుదేవుడెత్తెను శ్రావణ బహుళాష్టమిని‘, ‘పురాణ పురుషుడు భువి నవతరించె, సిరుల జయంతి నేడు సేయరో పండగలూ, శ్రావణ బహుళాష్టమిఁ జందురు డుదయించెను’ అంటూ శ్రీకృష్ణజన్మాష్టమి తిధి, నక్షత్రాలను మేళవించి కూడా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించాడు. ‘పలువురు వుట్లపండుగను, చిలుకు చిడుక్కొని చిందగను’ అంటూ జన్మాష్టమినాడు భారతదేశ యావత్తు ఎంతో ఉత్సాహంగా, వినోదాన్ని పంచుకునే ఉట్లపండగకు అన్నమయ్య తన సంకీర్తనల్లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. ‘బాలులతో వీధులలో బారాడువాడు, కోలలెత్తుక వుట్లు కొట్టిఁజుండీ’ ‘అక్కలాల చూడు డందరును, నిక్కి నారవట్టి నేడు కృష్ణుడు’ ‘పైకొని చూడరో వుట్లపండుగ నేడు, అకడ గొల్లెతలకు నానందము నేడు’ ఇలా సంకీర్తనల్లో ఉట్లపండగను ఉల్లేఖించడమేకాక, ఎన్ని రకాల ఉట్లు కట్టబడేవో, కొట్టబడేవో కూడా అన్నమయ్య తన సంకీర్తనల్లో తెలియ చెప్పాడు. వక్కల, సెనగల, పప్పుల, తేనెల, చెక్కరల, నేతుల, బియ్యాల, చక్కిలాల, అటుకుల, చెఱకుల, నువ్వుల, బెల్లాల, చిమ్మిలాల, ఆనవాల, అడుకుల, పానకాల, పెరుగు, వెన్నఉట్లను బలరామకృష్ణులు కొట్టారని అన్నమయ్య సంకీర్తనల్లో తెలుస్తుంది. ఇక భాగవత దశమస్కంధంలో ఊటంకించిన శ్రీ కృష్ణుని దివ్యలీలలే అన్నమయ్య లీలావైభవ సంకీర్తనలకు ఆధారము. అన్నమయ్య తన సంకీర్తనల్లో పూతన, శకటాసుర, తృణావర్త, కంసాదుల సంహారం, ఉలూఖల బంధనం, కాళీయ మర్ధనం, గోవర్ధనోద్ధరణ మొదలైన ఘట్టాలను కూర్చి ఎంతో రసవత్తరంగా ఆలపించాడు. ‘ఎక్కడి కంసుడు యికనెక్కడి భూభారము, చిక్కువాప జనియించె శ్రీ కృష్ణుడు’ ‘కావిరి విరెసె కంసుడిగినిసె, వావిరి పువ్వుల వానలు కురిసె’ ‘చన్నుదాగి పూతనను సగ్గుడుగా చప్పరించె’ ‘పిసికిపూతకి చన్ను బిగియించి పట్టిన, యిసుమంతలు చేతులివియపో’ ‘చిమ్మెడి విషములు చేసిన రొమ్ములు, కొమ్మని యిచ్చిన గుడిచేని బొమ్మర పోవడు పూతకి బొరిగొని, అమ్మరో గయ్యాళి శిశువు’ ‘కాళింగు దొక్కితివట కటకట వుద్దండాలు, వోలిజేయ దొరకొంటివొ’ ‘బాలునీ కోపమిది సరిలేని మద్దలివి, రోలనే యిట్లను విరుగద్రోయుడు’ ‘కరికరించగ రోలగట్టితే నప్పుడు మా, హరిగాడుగదా ఆడనున్న బిడ్డడు’ ‘కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన, యినుమువంటి చేతులివియపో’ ‘గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు’ ‘తొల్లె గోవర్ధనమెత్తి దొరతనాలెల్లాజేసి, అల్లవాడె నిలుచున్నాడాతుడీతడా’ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంకీర్తనల్లో శ్రీ కృష్ణలీలలు మనకు దర్శనమిస్తాయి. బాలకృష్ణుని భక్తితత్వం: కేవలం కృష్ణలీలలను కీర్తనలుగా ఆలపించడమేకాక, తన సంకీర్తనల్లో భక్తి తత్వాన్ని ఇనుమడింపచేశాడు అన్నమయ్య. ‘నానాభక్తులివి నరుల మార్గములు’ అంటూ భక్తిలో అనేక విబేధాలను తెలిపాడు. ఉన్మాదభక్తి, పతివ్రతాభక్తి, విజ్ఞానభక్తి, ఆనందభక్తి, రాక్షసభక్తి, తురీయభక్తి, తామసభక్తి, వైరాగ్యభక్తి, రాజసభక్తి, నిర్మలభక్తి మరియు నిజభక్తి, ఇలా అనేకానేక భక్తితత్వాలను అన్నమయ్య తన సంకీర్తనలలో పొందుపర్చాడు. ‘ఇట్టి ముద్దులాడి బాలుడేడి వాడువాని, బట్టితెచ్చి పొట్టనిండ బాలుపోయరె’ అంటూ యశోద బాలకృష్ణునిపై కురిపించే వాత్సల్యం, ‘మొత్తకురె యమ్మలాల ముద్దులాడు వీడె, ముత్తెము వలె నున్నాడు ముద్దలాడు’ అని గోపికలు చిన్నారి కృష్ణుని యశోద శిక్షిస్తే నిలువలేక కురిపించే వాత్సల్యం, ‘తోయపుం గురులతోడ దూగేటి శిరసు, చింత కాయలవంటి జగడములతోడ మ్రెయుచున్న కనకంపు మువ్వల పాదాలతోడ పాయక యశోదవెంట బాఱాడు శిశువు చిన్ని శిశువు, చిన్నిశిశువు ఎన్నడు జూడమమ్మా యిటువంటి శిశువు’ అంటూ బాలకృష్ణుని సౌందర్య దర్శనంతో ఆ దేవదేవునిపై పెంచుకునే వాత్సల్యం భక్తితత్వానికి పరాకాష్ఠ. నవవిధ భక్తిమార్గాల్లో కీర్తనమొకటి. అన్నమయ్య గుణసంకీర్తనం మనకు ప్రధానం కన్పిస్తుంది. ‘కొండగొడుగుగబట్టి గోకులమునెల్లగాచి మెండుగు గొల్లెతలతో మేలమాడి అండనె నోరుదెరచి యశోదకు లోకములు దండిగాజూపె నితడెదంట యైనబాలుడు’ అని చెప్పడంలో గోవర్ధనోద్ధరణ, విశ్వరూప దర్శనం వంటి దివ్యలీలలను కీర్తించాడు అన్నమయ్య. సౌమ్యశ్రీ రాళ్లభండి
కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలలో విరివిగా ఉపయోగించే ఉపాంగ రాగం హంసధ్వని. ఇది 29వ మేళకర్త శంకరాభరణ జన్యరాగం. ఈ ఔడవ రాగం ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి గారైన శ్రీ రామస్వామి దీక్షితార్ సృష్టి. ఇది ప్రాచీన గ్రంధాల్లో మనకు కన్పించదు. ఈ రాగం అన్నివేళలా పాడుకోడానికి అనువైనది. ఈ రాగంలో గణపతిని ప్రార్ధిస్తూ అనేక కృతులు వాగ్గేయకారులు ఆలాపించారు. వీటిలో ‘వాతాపి గణపతిః’ ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకలినిషాదం (స,రి,గ,ప,ని,స / S R2 G3 P N3 S). ఆరోహణ, అవరోహణలు: సరిగపనిస, సనిపగరిస. హిందుస్తానీ సంగీతంలో సరితూగే రాగం ఏదీ లేదు. అయితే బండిబజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమన్ ఆలీఖాన్ ఈ రాగాన్ని ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. సంగీత కచేరీల్లో హంసధ్వని రాగాన్ని సభారంభంలో ఆలపిస్తుంటారు. ఇందు హాస్య, వీర రసాలు రక్తికడతాయి. చలనచిత్రాల్లో ప్రయోగాత్మకంగా భక్తి భావాన్ని వ్యక్తపర్చటానికి, జావళీలకు వినియోగించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకుడు సలీల్ చౌదరి వాతాపి గణపతిః కీర్తనను యథాతధంగా అనువాదం చేసి ‘పరిహార్’ చిత్రంలో లతా, మన్నాడేల చేత పాడించారు. ఈ రాగంలో వెలువడ్డ ప్రముఖ కృతులు: రఘనాయకా నీపాదయుగ, శ్రీ రఘుకులమందు బుట్టి,– త్యాగరాజు వాతాపి గణపతిః – ముత్తుస్వామి దీక్షితార్ వర్ణముఖ వా – కోటేశ్వర అయ్యర్ మూలాధార మూర్తి, కరుణై సేవై – పాపనాశం శివన్> గజవదన బేడువే – పురందరదాసు వరవల్లభ రమణ – జి ఎన్ బాలసుబ్రహ్మణియమ్ గమం గణపతే – ముత్తయ్య భాగవతార్ పాహి శ్రీపతే – స్వాతి తిరునాళ్ వందేహం జగద్వల్లభం -- అన్నమయ్య వినాయక – వీణ కుప్పయ్య మనసుకరుగదేమి, పగవారు (వర్ణం) – పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గాయియే గణపతి జగ్ వందన్ – తులసీదాస్ షోడశ కళా పరిపూర్ణ నమో – శ్రీకాంత కృష్ణమాచార్యులు (క్రిష్ణమయ్య) ఈ రాగంలో సినీగీతాలు: శ్రీ రఘురాం జయరఘురాం – శాంతినివాసం తరలిరాదతనే వసంతం – రుద్రవీణ ఈనాడే ఏదో అయ్యింది – ప్రేమ నాయింటి ముందున్న పూదోటనడిగావో -- జెంటిల్మెన్ మౌనంగా గానం మధురం మధురాక్షరం – మయూరి మనసు దోచే దొరవునీవే – యశోద కృష్ణ స్వాగతం, సుస్వాగతం – శ్రీ కృష్ణపాండవీయం గోపాలా ననుపాలింపరార – మనుష్యుల్లో దేవుడు జాతో నహి బోలు కన్నయ్య – పరిహార్ ఓ చాంద్ జహాన్ వోహ్ జాయే, కరంకి గతిన్యారి -- శారద బిలహరి: ఇది 29వ మేళకర్త ధీరశంకరాభరణ జన్యరాగం. ఇది ఔడవ – సంపూర్ణ భాషాంగ రాగం ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కాకలినిషాదం (స,రి,గ,మ,ప,ద,ని,స / S R2 M1 G3 P D2 N3 S). ఆరోహణ, అవరోహణలు: సరిగపదస, సనిదపమగరిస. ఇందు కైశిక నిషాదం కూడా అప్పుడప్పుడు అన్యస్వరంగా వస్తుంది. ఇది ఉదయమున పాడదగిన రాగం. ఉత్సాహమును, వీరాన్ని కలుగచేసే ఈ రాగం గమక వరిక రక్తి రాగం. ఈ రాగము ప్రాణమునచ్చే సంజీవినీ రాగమని ప్రసిద్ధి. త్యాగరాజు ఈ రాగంలో ‘నీ జీవాధార’ అనే కృతిని ఆలపించి మృతిచెందిన బ్రాహ్మణుని సజీవుని చేశారని ప్రతీతి. శ్లోకాలు, పద్యాలు పాడటానికి అనువైన ఈ రాగం పద్యనాటకాల ద్వారా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ రాగం నాదస్వరం వాయించేవారికి ఎంతో ఇష్టమైన రాగం. ఇది ఉదయరాగం. హిందుస్తానీలో దీన్ని సరిపోలే రాగం ‘ఆలైయా బిలావర్’. ఈ రాగంలో సంగీత ప్రారంభదశలో ‘రారావేణు గోపబాల’ గోపాలయ్య సర్వరచన చేసిన స్వరజతిని, వీణకుప్పయ్యర్ రచన ‘ఇంతచౌకసేయ’ అనే వర్ణాన్ని విద్యార్ధులకు నేర్పుతారు. ఈ రాగంలో ప్రఖ్యాతినొందిన రచనలు: దొరకునా ఇటువంటి సేవ, కనుగొంటిని శ్రీరాముని, నా జీవధార, నరసింహా నన్ను – త్యాగయ్య పరిదానమిచ్చితే పాలింతువేమో – పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కామాక్షివరలక్ష్మి, హటకేశ్వర, శ్రీబాల సుబ్రహ్మణ్య – ముత్తుస్వామి దీక్షితార్ ఇంతపరాముఖ, ఇంతచౌక (వర్ణం) – వీణ కుప్పయ్య పూరయమమ – నారాయణతీర్ధులు ఎ షుందాళే పూంగోదే – అరుణాచల కవిరాయరుగారి రామనాటకములో రచన. రారాగురు రాఘవేంద్ర -- బాలమురళీకృష్ణ ఈ రాగంలో సినిగీతాలు ఎవరునేర్పేరమ్మ ఈ కొమ్మకు – ఈనాటి ఈ బంధమేనాటిదో నీతోనె ఆగేన బిలహరి – రుద్రవీణ ఏదో, ఏదో అన్నది ఈ మసక, మసక వెలుతురు – ముత్యాలముగ్గు రండయ్య పోదాము – రోజులు మారాయి కలడందురు దీనులయెడ (పద్యం) – భక్త ప్రహ్లాద కొళ్లాయి గట్టితి, కోక జుట్టితి (పద్యం) – భక్త పోతన సౌమ్యశ్రీ రాళ్లభండి
అంతారామమయం ఈ జగమంతా రామమయం అంటూ అవతారమూర్తులైన సీతారాములపై ఆత్మీయ భావాన్ని తెలుగువారికి కలిగించటంలో రామదాసు కీర్తనలు, ఆయన రచించిన దాశరథీ శతకంతోపాటు ఉన్నత పాత్ర వహించాయి అనడంలో సందేహంలేదు. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి, శ్రీ రాముని విమల రూప సుధా రసమును రామదాసుతోపాటు తెలుగు పలక నేర్చిన, విన నేర్చిన భక్తులందరు ఆస్వాదించి తరించారు. ‘గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్చతే’. సంగీతమంటే గీత, వాద్య, నృత్యాల మేటి సమ్మేళనమని సంగీత రత్నాకరమందు చెప్పబడింది. అయితే కాలక్రమేణా గీత, వాద్యముల కలయిక సంగీతంగా రూపాంతరం చెందిది. నేడు కేవలం గానమే సంగీతమని వ్యవహారిస్తున్నారు. అయితే శృతి, లయ, స్వరములతో కూడిన సంగీతము రెండు విధాలు ఒకటి గాత్ర గానము రెండు వాద్యగానము. ప్రాచీన సంగీత సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా గాత్ర, వాద్య గానాలను పెర్త్ మహానగరంలోని తెలుగువారికి అందించాలని మా ‘తేటగీతి’ సంకల్పించింది. ఆ సంకల్పనకు రూపకల్పనే ‘భక్తరామదాసు వాగామృతవర్షిణి’. రామదాసు కృతులలోని నవరత్న కీర్తనలకు దీటైన దాశరథీ శతకంలోని పద్యాలను ఎన్నుకొని, సమన్వయించి కీర్తనలతోపాటు శతక సౌరభాన్ని మార్చి 1, 2014న తేటగీతి తెలుగు సంగీతాభిమానులకు అందించింది ఈ కార్యక్రమానికి పెర్త్ లో దౌత్యకార్యాలయానికి కాన్సుల్ జనరల్ గా వ్యవహరిస్తున్న శ్రీ సుబ్బారాయుడుగారు ముఖ్యఅతిధిగా విచ్చేస్తారు. వారి సతీమణి శ్రీమతి హేమగారు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారాయుడుగారు మాట్లాడుతూ, ‘తాను ఎన్నో దేశాల సందర్శించినప్పట్టికీ, పెర్త్ లో తెలుగువారు భాషపట్ల చూపుతున్న అభిమానం, జరుపుతున్న కార్యక్రమాలు మరెక్కడా చూడలేదన్నారు.’ ప్రత్యేకంగా తేటగీతి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి సంగీత కార్యక్రమాలు భావితరాలవారికి మన భాష పట్ల, సాహతీ, సంస్కృతుల పట్ల అవగాహన కల్పిస్తాయన్నారు సంగీతాభిమానలను రజింపచేసిన ఈ కార్యక్రమం తేటగీతి వెబ్ సైట్ పాఠకులకు కూడా శ్రవణానందం కల్గిస్తుందని ఆశిస్తూ, పూర్తి కార్యక్రమం ఆడియో మీకోసం.. భక్తరామదాసు వాగామృతవర్షిణి-1 భక్తరామదాసు వాగామృతవర్షిణి-2 తేటగీతి, మార్చి 13, 2014
ఒకనాడు హనుమ శ్రీ రాముని పాదాల చెంత చేరి, నారద,తుంబురులను తమ గానాన్ని విన్పించమని కోరాడు. ఇద్దరు వీణెలు సారించారు. గమక యుక్తంగా అలంకారాలు, గీతాలు మధురంగా పలికించారు. స్వర సందర్భం, శ్రుతులు, ఆలాపన, గమకాలూ గీత సరణి, ముక్తాయింపు భలేగా, అమోఘంగా వున్నాయని హనుమ మెచ్చుకున్నాడు. ఇంతటి ఉద్దండ పండితుల గానంలో లోటుపాట్లను విమర్శించటం తనకు సాధ్యం కాదేమో అని సవినయంగా విన్నవించుకున్నాడు. తాను నేర్చిన కొన్ని గీతాలను సీతా రాములకు వినిపిస్తానని, వారిద్దరిని కూడా వినమని హనుమ ప్రార్ధించాడు. తమ గానాన్ని అంతగా మెచ్చిన హనుమ తన గానాన్ని వినమనటంలో అర్ధమేమిటో నారద, తుంబురలకు అర్ధం కాలేదు. ”కోతులు సంగీత సభ చేస్తే కొండముచ్చు అగ్రాసనం మీద కూర్చున్నట్లు ఉంటుంది హనుమ గానమని”, ఎగతాళి చేశారు. అంత గొప్ప సంగీతాన్ని తాము వినిపిస్తే, ఇంకా హనుమకు ఏం మిగిలింది విని పించాటానికి అని విసుక్కున్నారు. తమ గానం ముందు ఇంకెవరి గానమైనా బలాదూరే అని వారి గర్వం. రామ సన్నిధానంలో ఏమీ చేయడానికి పాలుపోక తమ,తమ వీణలను హనుమకు అందించారు. నారదుని వీణను తీసుకొని హనుమ ఓంకారం పలికించాడు. ఓంకారం త్రిగునాత్మకము, త్రి మూర్త్యాత్మకము దీనినే ప్రణవం అంటారు. ఇందులో అ, ఉ, మ ఉన్నాయి. ఆకారం రజో గుణాత్మకం -బ్రహ్మ. ఉ కారం సత్వ గుణాత్మకం -విష్ణువు. మ కారం తమో గుణాత్మకం -రుద్రుడు. అ కారం ఎడమ నాసిక పుట -ఇడ. ఉ కారం కుడి నాసా పుట. పింగళ. మ కారం వాటి మధ్య లో వున్న సుషుమ్న. ఈ విధం గా ఓంకారం మూడు నాడుల సమాహారం. ఇడా నాడి-చంద్రుడు. పింగళ నాడి -సూర్యుడు . సుషుమ్న నాడియే అగ్ని. ఈ విధం గా ఓంకారం త్రయాగ్న మైంది. ఓంకారంలో దశ విధ నాదాలు జన్మించాయి. నాభి, ఉదర, కంత, స్ధానాలు వాటి ఉత్పత్తి స్థానాలు. ఆ నాదాలే వాయు చలనం వల్ల హృదయ, కంత, శిరః స్ధానాల నుండి అభి వ్యక్తమై, మందార, మధ్యమ, తారకం అనే మూడు స్వర భేదాలను పొందాయి. ఆ స్వరాల నుండి ” స,రి ,గ ,మ ,ప ,ద ,ని ” అనే సప్త స్వరాలు క్రమంగా శివుని యొక్క ”పరమశివ, ఈశ్వర, సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పురుష, ఈశాన” అనే ఏడు ముఖాల నుండి పుట్టి, ”షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద ”అన బడే పేర్లతో వ్యాప్తి చెందాయి. వాటి జన్మ స్థానాలు క్రమంగా కంత, శిర, నాస, హృదయ, ముఖ, నాలుక, పూర్వాంగాలు. మయూర,రిషభ, అజ, సింహ,కోకిల, అశ్వ, మదగజ ధ్వనులే షడ్జం మొదలైన స్వర ధ్వని భేదాలు. షడ్జ స్వరం నుంచి నాలుగు శ్రుతులు, రిషభం నుంచి మూడు, గాంధారం నుండి రెండు, మధ్యమ నుంచి నాలుగు, పంచమం నుండి నాలుగు దైవతం నుంచి మూడు, నిషాదం నుంచి రెండు - సప్త స్వరాలనుండి ఇరవై రెండు శృతి భేదాలు ఏర్పడ్డాయి. ఈ శ్రుతులకు ఇరవై రెండు శృతి గమకాలూ, ఏడు దేశీ గమకాలున్నాయి. ఈ స్వర శృతి గమకాలలో ఆరు లక్షణాలు గల గీతాలు, ఆ రాగాలకు గ్రామ త్రయం, దాని వల్ల పదిహేను రాగాలు -వాటికి ఆరు జాతులు, వాటికి ముప్ఫై ఆరు రాగాలు, - వాటికి నాలుగు అంగాలు, వాటికి నూటఆరు రాగాలు పుట్టి అనంత కోటి రాగాలుగా విస్త రించింది. ఇన్నిటిలో ముప్ఫై రెండు రాగాలు మాత్రమే లోకంలో ప్రసిద్ధ మైనవి. వాద్యాలలో తథా, ఆనద్ధ, సుషిర, ఘన అనే నాలుగు వున్నాయి. కాహల, పటహ, శంఖ, భేరి జయ, ఘంటికలు అనేవి అయిదు మహా వాద్యాలు. వీణా మొదలైనవి ఇరవై రెండు రకాలు. త కారం రుద్రుడు. ల కారం పార్వతి. ఆ రెండిటి సంపుటినే తాళం అంటారు. తాళానికి కాల, మార్గ, క్రియ, అంగ, జాతి, గ్రహ కళ, లయ, యతి, ప్రస్తారం అనేవి పది ప్రాణాలు. హనుమ భరత శాస్త్రంలో కూడా నిష్ణాతుడు. ప్రవర్త కుడు, దర్శన కారుడు కూడా. భ అంటే భావం. ర అంటే రాగం. త అంటే తాళం. భావ ,రాగ ,తాళాలు అంటే సాహిత్య, సంగీత, నాట్యాల ఉపయోగం ఇందులో వుంది కనుక ”భరతం” అని పేరు వచ్చింది. రసాలు, భావాలు, అభినయాలు, ధర్ములు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, ఆతోద్యమములు, గానాలు, రంగాలు అనే పద కొండు విషయాల స్వరూపమే ”నాట్య వేదం ”. అలాంటినాట్య వేదానికి ప్రవర్తకుడు హనుమయే. గాన్ధర్వాన్ని సూర్యుని నుంచి హనుమ నేర్చుకొన్నాడు. శ్రీ రాముని కొలువులో తన గాంధర్వ విద్యను మనో ధర్మంగా అమోఘంగా ప్రదర్శించాడు హనుమ. ఆ గానానికి హృదయాలు పద్మాల్లా వికశించాయి. చంద్ర కాంత శిలలు కరిగాయి. మ్రోడులు చిగిర్చాయి. లోకం సమ్మెహ మైంది. అతని వల్లకీ (వీణ) వాద్యానికి రాళ్ళే కరిగి పోయాయి. సభాసదులు పరవశించి పోయారు. బొమ్మల్లా అచేతను లైనారు. వీణ పై హనుమ” మేఘ రంజని ”రాగాన్ని సమ్మోహనం గా విని పించాడు. అతను ప్రదర్శించిన మెళకువలు, ప్రౌఢిమ, రాగాలాపన, గ్రామ స్ఫూర్తి, తారలో అంతర స్ఫురిత నాద ప్రౌఢి, మీటు, కంపితం, ఆన్దోలితం, మూర్చన, శ్రుతులు, డాలు, అనేక మైన తాళ మానాలు విని జనం మైమరచి పోయారు. ఆకాశం మేఘాలతో నిండి పోయింది. కొంగలు బారులు తీరాయి. చాతక పక్షులు నోళ్ళు తెరిచి ఆకాశం వైపు చూశాయి. నీటి చుక్క కోసం నెమళ్లు పురి విప్పి నాట్యం చేశాయి. పాతాళం లోని పాములు పడగ లెత్తి నర్తించాయి. వర్షం పుష్ప వర్షంగా కురిసింది. సభ్యుల దివ్య ఆభరణాలన్నీ కరిగి పోయాయి. శశి కాంత వేదికలు కరిగి శ్రవించాయి. దంతపు బొమ్మలకు ప్రాణాలు వచ్చాయి. హనుమ గానం చేస్తున్నంత సేపు శ్రీ రాముడు మెచ్చికోలుగా ”ఓహ్, ఔరా, భళా, మజ్జ్హారే, బాపురే ”అని అభినందిస్తూనే వున్నాడు. హనుమ వీణా నాదానికి దగ్గర లో వున్న పెద్ద రాయి కరిగి పోయింది. సభలోని వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకున్నారు. నారద ,తుంబురుల తాళపు చిప్పలు తీసుకొని హనుమ ”గుండా క్రియ ”రాగాన్నివీణా పై పలికించాడు. మళ్ళీ ఆ రాయి కఠిన శిలగా మారి పోయింది. తన చేతి లోని వీణను నారదునికి ఇచ్చి ఆ రాయిని మళ్ళీ కరిగించ గలవాడే విద్యా ధికుడని, ఈ తాళాలను తీసుకోవాటానికి అర్హుడు అని చెప్పాడు. నారద, తుంబురులిద్దరు విశ్వ ప్రయత్నం చేశారు. రాయి కరగ లేదు. వీణలను నెలపై పెట్టి తలలు వంచుకొని అహంకారం పోగొట్టుకొని సిగ్గుతో నిలబడ్డారు. ”మీలో ఎవరో ఒకరు రాయిని కరిగించక పొతే ఎవరు అధికులో నిర్ణయించ లేము కదా. తాళాలు కూడా నా దగ్గరే విడిచి పెట్టాల్సి వస్తుంది మీరు. అది వాగ్గేయకారులైన మీకు ఆవమానం కదా”, అన్నాడు హనుమ. పాపం వారిద్దరూ మరింత సిగ్గుపడి ”గాయక సార్వభౌమా! హనుమా! మా గర్వం అణగి పోయింది. మేము మా చేష్టలకు సిగ్గు పడుతున్నాము. మీ ముందు మా గానం ఎంత. పద్నాలుగు లోకాల్లో మీ వంటి గాయకుడు లేడు. కఠిన శిలను కరిగించే నేర్పు ఎక్కడా మేము చూడ లేదు. మా తాళాలు మాకు ఇప్పించి మమ్మల్ల్ని కనికరించండ”, ని పశ్చాత్తాపం తో హనుమను వేడుకున్నారు నారద, తుంబురులు. దయామయుడైన హనుమ వారిద్దరిని శ్రీ రాముని అనుగ్రహంతో క్షమించి, వారివీణలు, తాళాలు తిరిగి ఇచ్చి వేశాడు. హనుమ కీర్తి గానం చేసుకొంటు, వాళ్ళిద్దరూ శలవు తీసుకొని వెళ్లి పోయారు. హనుమ సీతా రాముల వద్ద సెలవు తీసుకొని గంధ మాదనం చేరాడు.
తిరువారూరు త్యాగరాజస్వామివారిపై కీర్తనలు: తిరువారూరు త్యాగరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కీర్తనలనేకం ప్రసిద్ధి చెందాయి. తిరువారూరులోనున్న అనేక ఆలయాలు రమణీయ శిల్పచాతుర్యంతో ఉట్టిపడుతుంటాయి. తిరువారూరులోని త్యాగరాజస్వామి, శ్రీ కమలాంబ, శ్రీనీలోత్పలాంబ, గణేశుడు, సుబ్రహ్మణ్యస్వామి, రేణుకాదేవిలపై దీక్షితులవారు పెక్కు రచనలు చేశారు. అచ్చటి త్యాగరాజస్వామివారిపై విభక్తి కృతులను రచించాటమేకాక అనేక ఇతర కృతులను కూడా రాశారు. అందు గౌళ రాగంలో ‘శ్రీ త్యాగరాజ పాలయాశుమాం’, ఆనందభైరవిలో ‘త్యాగరాజ యోగవైభవం’, శ్రీరాగమున ‘త్యాగరాజ మహాధ్వజారోహ’ అను కృతులు ప్రసిద్ధాలు. ఇక వారు రాసిన విభక్తి కృతులు... 1. త్యాగరాజో విరాజితే – అఠాణ రాగం – ప్రథమా విభక్తి 2. త్యాగరాజం భజరే – యదుకుల కాంభోజి – ద్వితీయా విభక్తి 3. త్యాగరాజేన సంరక్షితోహం – సాలగ భైరవి – తృతీయా విభక్తి 4. త్యాగరాజాయ నమస్తే – బేగడ – చతుర్థీ విభక్తి 5. త్యాగరాజాదన్యం – దర్బారు – పంచమీ విభక్తి 6. శ్రీ త్యాగరాజస్యభక్తో – రుద్రప్రియ – షష్ఠీ విభక్తి 7. శ్రీ త్యాగరాజే కృత్యకృత్యం – సారంగ – సప్తమీ విభక్తి 8. వీరవసంత త్యాగరాజ – వీరవసంత – సంభోదనా ప్రథమా విభక్తి ఇక అచ్చటి అమ్మవారు శ్రీనీలోత్పలాంబ. ప్రాంతీయకథనాలననుసరించి, శివుని కొరకు తపస్సు చేసి స్వామివారిని వివాహమాడిన అనంతరం అమ్మవారి రూపం నీలోత్పలాంబ. ఆ అంబను కీర్తిస్తూ కూడా దీక్షితారు వారు విభక్తి కృతులు రచించారు. ఈ కృతులన్నీ గౌళవర్గ కృతులు కావటం విశేషం. అమ్మవారిపై రాసిన గౌళకృతులు.... 1. నీలోత్పలాంబ జయతి – నారాయణ గౌళ – ప్రథమా విభక్తి 2. నీలోత్పలాంబాం భజరే – రీతిగౌళ – ద్వితీయా విభక్తి 3. నీలోత్పలాంబికయా – కన్నడగౌళ – తృతీయా విభక్తి 4. నీలోత్పలాంబికాయై – కేదారగౌళ – చతుర్ధీ విభక్తి 5. నీలోత్పలాంబికాయాః - - గౌళ – పంచమీ విభక్తి 6. నీలోత్పలాంబాయాస్తవ – మాయామాళవగౌళ – షష్ఠీ విభక్తి 7. నీలోత్పలాంబికాయాం – పూర్వగౌళ – సప్తమీ విభక్తి 8. శ్రీ నీలోత్పలాంబికే – ఛాయాగౌళ – సంభోధనా ప్రథమా విభక్తి అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో గల పంచ శివలింగాలు అచలేశ్వరుడు, హటకేశ్వరుడు, వల్మీకేశ్వరుడు, ఆనందేశ్వరుడు మరియు సిద్ధీశ్వరులపై దీక్షితారువారు కృతులను రచించారు. కాగా, ఇచ్చటే ఆగమసంప్రదాయముననుసరించి, వివిధ మంత్ర, తాంత్రిక పూజా విధానాలతో, నామాలతో గణపతి మూర్తులు పదహారు కలవు. శ్రీ ముత్తుస్వామివారు ఆయా గణపతిమూర్తులను స్తుతిస్తూ ఆలపించిన హంసధ్వని రాగంలోని ‘వాతాపి గణపతిం’, గౌళలో ‘శ్రీ మహాగణపతి రవతు మాం’, శ్రీరాగంలో ‘శ్రీమూలాధారచక్ర వినాయక’, మలహరి రాగంలో ‘పంచమాతంగముఖ గణపతినా’, సావేరినందు ‘కరికలభముఖం’ కృతులు బహుళ ప్రాచుర్యం పొందాయి. తమ శిష్యుని శూల నొప్పి తీర్చే నిమిత్తం జోతిష్య పాండిత్యంలో నిష్ణాతులైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారు గురు, శని గ్రహాల శాంతి కొరకు ‘బృహస్పతే’ (అఠాణ రాగం), ‘దివాకర తనుజం’ (యదుకుల కాంభోజి) కృతులను రచించి వారిని నిత్యం గానం చేయవల్సిందిగా చెప్పారు. వారు అటులే చేసి నొప్పి నుంచి ఉపశమనం పొందారు. తదనంతరం ముత్తుస్వామి వారు మిగిలిన గ్రహాలపై కూడా కీర్తనలు రాసి నవగ్రహా (వార) కీర్తనలు పూర్తిచేశారు. ఈ కీర్తనలలో మొదటి ఏడు శూలాది సప్త తాళములలో (ధ్రువాది సప్తతాళాలాకు శూలాది తాళములని పేరు) నుండగా, పల్లవిలో గ్రహముద్రను నిక్షేపించారు. నవగ్రహ కీర్తనలు.... సూర్య గ్రహం – సూర్యమూర్తే -- సౌరాష్ట్ర రాగం (ధ్రువతాళం) చంద్ర గ్రహం – చంద్రం భజ – అసావేరి రాగం (మఠ్య తాళం) కుజ గ్రహం – అంగారకం – సురటి రాగం (రూపక తాళం) బుధ గ్రహం – బుధమాశ్రయామి – నాట కురంజి (ఝంపక తాళం) గురు గ్రహం – బృహస్పతే – అఠాణ (త్రిపుట తాళం) శుక్ర గ్రహం – శ్రీ శుక్ర భగవంతం – ఫరజు రాగం (అట తాళం) శని గ్రహం – దివాకరతనూజం – యదుకుల కాంభోజి (ఏక తాళం) రాహు గ్రహం – స్మరామ్యహం – రామ మనోహర రాగం కేతు గ్రహం – మహాసూరం – చామర రాగం ఇక మధుర మీనాక్షి అమ్మవారిపై ఎనిమిది భక్తి కీర్తనలు రచించారు. అందు దేవక్రియ రాగమున ‘మధురాంబా సంరక్షతు’, అఠాణా రాగామున ‘మధురాంబాయ’, దేవగాంధారి రాగమున ‘శ్రీ మీనాక్షికాయాః’, బేగడ రాగమున ‘మధురాంబికాయస్తవ’ కీర్తనలు ప్రచారమునందున్నవి. శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో గోపుచ్ఛ, ‘స్రోతోవాహ’ యతి నిర్మాణము ప్రత్యేకత. ఉదాహరణకు శ్రీరాగంలో ‘శ్రీ వరలక్ష్మీ నమామ్యహం’ అనే కృతి నందు ‘శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే’ అని వస్తుంది. అలాగే పూర్ణచంద్ర బింబ అనే రాగమాలిక చివరలో ‘నాగధ్వనిసహితే, ధ్వనిసహితే, సహితే, హితే, తే’ అని, ఆనందభైరవి రాగంలో ‘త్యాగరాజయోగ వైభవం’ అనే కృతియందు ‘త్యాగరాజయోగ వైభవం, అగరాజ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం’ అని, ‘మాయేత్వంకయాహి’అను కృతిలో ‘సరసకాయే, రసకాయే, సకాయే, కాయే’ అని కలదు. స్రోతోవాహయతి నిర్మాణమునకు ‘త్యాగరాజయోగ వైభవం’అను కృతిలో అనుపల్లవిలో ‘శివశక్త్యాది సకలతత్త్వ స్వరూప ప్రకాశం’ అనే చోట ‘స్రోతోవాహయతి – శం, ప్రకాశం, స్వరూపప్రకాశం, తత్త్వస్వరూపప్రకాశం, సకలతత్త్వ స్వరూపప్రకాశం, శివశక్త్యాది సకలతత్త్వ స్వరూప ప్రకాశం’ అని కలదు. సౌమ్యశ్రీ రాళ్లభండి
తెలుగు సాహిత్యమందు విశేష ప్రజ్ఞగల ముత్తుస్వామి దీక్షితార్ తెలుగు కావ్యశిల్పాననుసరించి కృతులను రచించినట్టుగా మనకు గోచరిస్తుంది. అనగా విభక్తిపరంగా కృతులను రచించుట. ముత్తుస్వామి దీక్షితులు శైవ, వైష్ణవ, దేవీ, సుబ్రహ్మణ్య, గణపతి ఇలా అందరి ఆలయాలను దర్శించి వారిపై కృతులను రచించారు. ఆయన కృతులలో కాశీదేవతలైన విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, గంగాది మూర్తుల ప్రస్తుతేకాక నేపాలులోని పశుపతినాధుని ప్రస్తుతి, బదరీలోని నారాయణుని ప్రస్తుతి మనకు కన్పిస్తుంది. ఆయన విష్ణ్వీశభేద మెరుగని అద్వైత, స్వార్త మతస్ధుడు. శ్రీశంకరభగవత్పాదమతావలంబి, ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలలో భక్తి, జ్ఞాన, వైరాగ్య భావముల సమ్మేళనము సుందరముగా సమ్మిళితమై ఉంది. రామాష్టపది అనే సంగీతరూపకాన్ని రచించిన ఉపనిషద్బ్రహ్మేంద్ర సరస్వతిల వారి వద్ద వేదాంతగ్రంథ అధ్యయనము చేయటం వల్ల ముత్తుస్వామివారిపై రామభక్తి ప్రభావం ప్రస్ఫుటం. మాంజిరాగంలోని ‘రామచంద్రేన సంరక్షితోహం’ అనే కీర్తనలో ఆయన శ్రీరాముడు త్రిమూర్తుల సమిష్టిరూపమని (రమా భారతి గౌరీరమణ స్వరూపేణ రామచంద్రేణ సంరక్షితోహం) వర్ణించారు. అలాగే శ్రీరాముని పరబ్రహ్మతత్త్వాన్ని మాహురి రాగంలో ‘మామవ రఘువీరా’ అనే కృతిలో తెలిపారు. ఈ కృతిలో శ్రీరాముని పామరపండిత పావనకర నామధేయుడని, గురుగుహనుతుడని ముత్తుస్వామి స్తుతించారు. క్షేత్రదేవతా కీర్తనలు: ముత్తుస్వామి తన జీతకాలమంతా క్షేత్రాటన చేస్తూ తత్తద్దేవతా సంకీర్తనలు చేస్తూ కాలం గడిపారు. ఆయన దర్శించిన ప్రతీ క్షేత్రానికున్న విశిష్టత ఆయన చేసిన ప్రతీ కృతీలో ఇనుమడించింది. దీక్షితారు వారు ఆయా క్షేత్ర దేవతలపై చేసిన కీర్తనలలో కొన్ని మచ్చుతునకలు. తిరుపతి వేంకటేశ్వరునిపై వరాళి రాగంలో ‘శేషాచల నాయకం భజామి’ అనే కీర్తన, కంచి కామాక్షిపై చేసిన అనేక కీర్తనలో కమలా మనోహరి రాగంలో ‘కంజదళాయతాక్షి’, హిందోళ రాగంలో ‘నీరజాక్షి కామాక్షి’, శుద్ధసావేరి రాగంలో ‘ఏకామ్రేశనాయకీ’ ప్రసిద్ధాలు. కాంచీపురంలోని కైలాసనాథునిపై కూడా దీక్షితార్ పెక్కు కృతులు రచించారు. వీటిలో వేగవాహిని రాగంలోని ‘కైలాసనాథం’, కాంభోజి రాగంలో ‘కైలాసనాథేన’ ప్రసిద్ధమైనవి. చిదంబర సమీపంలోని గోవిందరాస్వామిపై ఆయన చేసిన కృతులకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా మేచబౌళి రాగంలో రచించిన ‘గోవింద రాజేన’ అనే కృతి కర్ణాటక సంగీత సముద్రంలో ఈ రాగంలో రాసిన ఏకైక కృతని సంగీతజ్ఞలు అభిప్రాయం. అయతే, ఈ రాగంలో వేంకటముఖి రచించిన కొన్ని గీతాలు మాత్రం లేకపోలేదు. అలాగే చిదంబరం సమీపంలోని వైదీశ్వరన్ దేవాలయ దేవతలపై చేసిన పెక్కు కృతులలో బాలాంబికాదేవిపై రాసిన ‘భజరేరే చిత్త బాలాంబికాం’ అనే కల్యాణరాగ కృతి, వైద్యనాథస్వామిపై కూర్చిన అఠాణ రాగంలోని ‘శ్రీ వైథ్యనాథం’ బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. పంచలింగ స్థల కీర్తనలు: ఆకాశాది పంచభూతముల ప్రత్యేకాంశలతో పంచలింగ క్షేత్రములు దక్షిణభారతంలో ప్రసిద్ధిగాంచాయి. వీటిలో శ్రీకాళహస్తిలోని లింగం స్వాయంభువు, వాయులింగము. ఇక కాంచీపురంలోని ఏకామ్రనాథుడు పృథ్వీలింగము, శ్రీరంగ సమీపంలోని జంబుకేశ్వరుడు ఆపోలింగం, తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు తేజోలింగం, చివరగా చిదంబరంలోని శివలింగం ఆకాశలింగమని ప్రసిద్ధి. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని స్తుతిస్తూ, ‘శ్రీ కాళహస్తీశ’ అని, కాంచీపురంలోని ఏకామ్రనాధుని ప్రస్తుతిస్తూ, అనేక కీర్తనలు రచించినా భైరవి రాగంలోని ‘చింతయ మాకంద’ అనే కృతి పంచలింగకృతులలో ఒకటి. ‘అరుణాచలనాథం స్మరామ్మనిశ’, ‘జంబూపతే మాంపాహి’, ‘ఆనందనటన ప్రకాశం చిత్సభేశం’ మిగిలిన మూడు పంచలింగ కృతులు. చిదంబర నటరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కేదార రాగంలో ‘ఆనందనటన ప్రకాశం’ కృతి నటరాజు ఆనందనృత్యానికి సంబంధించినదై ఎంతో రమణీయంగా నాట్యమునకు పనికివచ్చునట్టు సొల్లుకట్లు ఈ కృతికి అనుబంధంగా ఉండటం ఈ కృతి విశిష్టత. అభయాంబ కృతులు: వైదీశ్వరన్ దేవాలయ అధిష్టాన దేవన అభయాంబపై రాగప్రస్తార సౌలభ్యమునందేకాక, తాంత్రిక విషయస్ఫురణమునందు కూడా గణ్యమైనవి. ‘అంబికాయాః అభయంబికాయాః’ అనే కేదార రాగ కృతియందు కుండలినీశక్తి నిగూఢమై ఉన్నది. అభయాంబపై దీక్షితార్ అన్ని విభక్తులందు కృతులు రచించారు. 1. అభయంబ జగదాంబ – కల్యాణి రాగం – ప్రథమా విభక్తి 2. ఆర్యామభయాంబాం – భైరవి రాగం – ద్వితీయా విభక్తి 3. గిరిజయా అపజయ – శంకరాభరణ రాగం – తృతీయా విభక్తి 4. అభయాంబికాయై – యదుకుల కాంభోజి రాగం – చతుర్థీ విభక్తి 5. అభయాంబికాయాః – కేదారగౌళ రాగం – పంచమీ విభక్తి 6. అంబికాయాః అభయంబికాయాః – కేదార రాగం – షష్ఠీ విభక్తి 7. అభయాంబికాయాం – శహనా రాగం – సప్తమీ విభక్తి 8. దాక్షాయణి – తోడి రాగం – సంబోధన ప్రథమా విభక్తి ఈ కృతులకు చివరగా మంగళహారతిగా పాడే ముగింపు కృతి ‘శ్రీ అభయాంబ నిన్ను’ అనునది తెలుగు పల్లవితో శ్రీరాగంలో రచించారు. అయితే తర్వాత కాలంలో సంస్కృత, తమిళ భాషలలో ఈ మంగళహారతి ప్రాముఖ్యం పొందింది. ఈ కృతి ముత్తుస్వామివారు రచించిన మణిప్రవాళ శైలిలో రచించిన అనేకానేక కృతులలో ఒకటి. మణిప్రవాళ శైలి కృతులలో బహుళప్రాచుర్యం పొందిన కృతి కాఫీరాగంలోని ‘శ్రీ వేంకటాచలపతే నిన్ను నమ్మితి’. ఈ మణిప్రవాళి శైలి కృతులలో ఆంధ్ర, తమిళ, సంస్కృత భాషలను ముత్తుస్వామి దీక్షితార్ వారు విశిష్టంగా వినియోగించినప్పటికీ, పల్లవికి మాత్రం తెలుగు భాషనే ఉపయోగించటం విశేషం. రాగప్రస్తారమునకు, పల్లవికున్న ప్రాముఖ్యాన్ని బట్టి సహజ సంగీత మాధుర్యయుక్త ప్రవాహమునకు తెలుగుభాషే అధికయోగ్యత కలదని పండితులు స్పష్టీకరించారు. (తదుపరి భాగంలో తిరువారూరు క్షేత్రంపై, త్యాగరాజస్వామివారిపై ముత్తుస్వామి వారు చేసిన కీర్తనలను గురించి తెలుసుకుందాం.) సౌమ్యశ్రీ రాళ్లభండి
సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం 5వ బాణ చక్రంలో 5వ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ అని, పార్శవదేవ ‘రాగాంగ రాగ’ అని కొనియాడారు. కటపయాది సంఖ్యానియమంలో ఇమడ్చడానికి ఈ రాగం ముందు ‘ధీర’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ఈ రాగం ‘ధీర శంకరాభరణం’గా ప్రసిద్ధి కెక్కింది. ఇది సంపూర్ణ, సర్వస్వరగమక వరిక రాగము. ఈ రాగ స్వర స్థానములు షడ్జమము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము (సరిగమపదనిస / SR2G3M1PD2N3S). ఇందు అన్ని స్వరములు రాగచ్ఛయా స్వరములు. షడ్జము గ్రహ స్వరము. స,గలు న్యాస స్వరములు. ని,గ,మ,పలు జీవ స్వరములు. అన్నివేళలా పాడుకోగల రక్తి రాగము. శ్లోకములు, పద్యములు పాడటంతోపాటు రాగాలాపనకు కూడా చాలా అనువైన రాగం. స,ప,మలతో ఈ రాగంలో రచనలు ప్రారంభమవుతాయి. ఈ రాగానికి అన్ని స్వరాలు మూలస్తంభాలై నిలచి రాగాన్ని రక్తి కట్టిస్తాయని సుబ్బరామ దీక్షితార్ అభిప్రాయపడ్డారు. ప్రతి రెండో స్వరము ఇందు కంపిత స్వరము. అలాగే మధ్యమము ఇందు కొన్నిసార్లు అర్ధ కంపితం. జంట స్వర, దాటు స్వర ప్రయోగాలు ఈ రాగానికి అందాన్ని చేకూరస్తాయి. హిందుస్థానీ యందు దీని సరిసమానమైన రాగం ‘బిలావల్’. దీనినే పూర్వం వేళావళి అని కూడా అనేవారు. సిక్కుల పవిత్ర గ్రంధం ‘గురు గంథ్ర సాహెబ్’లో కూడా ఈ రాగం ప్రస్తావన ఉంది. గురునానక్, గురు తేజ్ బహదుర్, గురు అర్జున్లు ఈ రాగంలో రచనలు చేశారు. పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ స్కేల్ దీనికి సమానము. ఈ రాగాన్ని ఔపోసన పట్టిన సంగీతకారునిగా తంజావూర్ ఆస్థానానికి చెందిన నరసయ్యను చెప్పుకోవచ్చు. శంకరాభరణ రాగ, భావాలను ఎంతో అద్భుతంగా గానం చేయగల నేర్పరితనం, ఆ రాగమందు ఆయనకు గల ప్రతిభను గుర్తించి తంజావూరు ఆస్ధానాధీశుడు శరభోజీ ఈయనను ‘శంకరాభరణం నరసయ్య’గా గౌరవించారు. నాటినుండి శంకరాభరణం ఆయన ఇంటి పేరైంది. ఎక్కడ నరసయ్యగారు సంగీత కచేరీలు చేసినా శంకరాభరణ రాగంలో తప్పక ఒక కృతిని ఆలపించేవారు. ఒకసారి పాడిన సంగతిని మరోసారి పాడకుండా గంటల తరబడి ఆయన శంకరాభరణ రాగంలో పాడేవారట. చాలా జన్యరాగ సంతతిగల ఈ జనకరాగంలోని ప్రసిద్ధ జన్యరాగాలు: ఆరభి, బిలహరి, హంసధ్వని, శుద్ధ సావేరి, కదనకుతూహలం, దేవగాంధారి, కానడ, కురుంజి, అఠాణా, కేదారం, బేగడ, పూర్ణచంద్రిక, జనరంజని, దర్బార్, బేహాగ్, వసంత, పూర్వగౌళ, నారాయణి, నీలాంబరి, నారాయణ దేశాక్షి, కోలాహలము, శుద్ధవసంతం మరియు సహన మొదలగునవి.
 • సామినిన్నే (వర్ణము)
 • చలమేల (వర్ణము)
 • మనవి చేకొనరాదా (వర్ణము)
 • వీణ కుప్పయ్య
 • స్వాతి తిరునాళ్
 • పొన్నయ పిళ్లై
 • దశరధరామ గోవింద నన్ను- దయజూడు పాహి ముకుంద
 • ఇతడేనా ఈ లోకములో గల
 • తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు
 • రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె
 • ఎంతో మహానుభావుడవు నీవు
 • నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ
 • రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా
 • రామదాసు
 • మరియాద
 • ఎదుట నిలచితే
 • మనసు స్వాధీనమైన
 • స్వరరాగ సుధ
 • ఎందుకు పెద్దలవలె బుద్ధినీయవు
 • బాగు మీరగను (వేంకటేశ పంచరత్రాలలో ఒకటి)
 • త్యాగయ్య
 • అక్షయలింగ విభో
 • శక్తిసహిత గణపతిం
 • సదాశివం ముపాస్మహే
 • దక్షిణామూర్తే
 • ముత్తుస్వామి దీక్షితార్
 • సరోజదళ నేత్ర, దేవి మీన నేత్రి
 • పశ్యతి దిశ్యతి (అష్టపది)
 • హిమ తెలియ తరమా
 • దేవీ జగజ్జననీ (నవరాత్రి కృతి)
 • అలరులు కురియగ
 • శంకరాచార్యం
 • అష్టాంగయోగ
 • శారదే సదాస్రయే
 • శంభో జగదీశ
 • శ్యామశాస్త్రి
 • జయదేవుడు
 • ఆనయ్య
 • స్వాతి తిరునాళ్
 • అన్నమాచార్య
 • సుబ్బరాయ దీక్షితార్
 • ఎట్టప్ప మహారాజు
 • కృష్ణస్వామి అయ్యర్
 • రామస్వామి దీక్షితార్
ఈ రాగంలో ప్రసిద్ధికెక్కిన రచనలు: త్యాగయ్య ఈ రాగమందు దాదాపు 20 కృతులను రచించారు. ముత్తయ్య దీక్షితార్ శంకరాభరణంలో రచించిన నవావర్ణ కృతి, పాశ్చాత్య ప్రక్రియలో రచించిన చింతాయ ఆంజనేయం, గురుగుహ సరసిజ, పాహి దుర్గే, రామ జనార్ధన, పార్వతీపతే, సామగానప్రియ, వందే మీనాక్షి, సకలసుర వినుత మొదలగు 40 నొట్టు స్వర రచనలు ఈ రాగానికి ప్రసిద్ధిని చేకూర్చాయి. సినీ సంగీతం: పాశ్చాత్యలు ఈ రాగాన్ని ఎంతగానో అభిమానించారు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రంలో జూలియా అండ్రూస్ పాడిన ఈ రాగానికి చెందిన ‘డో ఎ డియర్, ఫీమ్యేల్ డియర్’ పాట బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ఇక తెలుగులో శంకరాభరణం రాగము కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా తెలియనివారుండరు. ఆ సినిమాలోని ‘ఓంకార నాదానుసంధానమౌ గానమే’ అన్న పాట ఈ రాగంలోనిదే. అలాగే రోజా సినిమాలోని ‘చిన్ని, చిన్ని ఆశ’ పాట. భార్యాభర్తలలోని ‘జోరుగా, హుషారుగా షికారుపోదమా’, సితారలోని ‘వెన్నెల్లో గోదారి అందం’, బొంబాయిలోని ‘ఉరికే చిలకా, వేచి ఉన్నాను కడవరకు’, ఆరాధనలో ‘నా హృదయంలో నిదురించే చెలి’, విప్రనారాయణలో ‘బుద్ధేనాంజలి నమామి’ చెప్పుకోదగ్గవి. ఇక భారతీయుల జాతీయగీతం ‘జనగణమణ’ బిలావల్ లోనే రూపకల్పన చేసుకుంది. హిందీ సినిమా పరిచయ్ లోని ‘సారె కె సారే గామాకొలేకేర్ గాతే చలే’, బావర్చీలోని ‘భోర్ ఆయి, గయా అంధియారా’ మొదలగు పాటలున్నాయి. సౌమ్యశ్రీ రాళ్లభండి
ఎవ్వడే ఎవ్వడే ఓ భామ వీడెవ్వడే ఎవ్వడే నేను పవ్వళించిన వేళ పువ్వుబాణము వేసి రవ్వ చేసిపోయె || మొలక నవ్వుల వాడే-ముద్దు మాటల వాడే తళుకారు చెక్కు-టద్దముల వాడే తలిరాకు జిగి దెగడ-దగు జిగి మోవి వాడే తలిదమ్మి రేకు క-న్నుల నమరు వాడే || ఎలమావి తోటలో - నింపొంద నొకనాడు యెలమి గౌరిపూజ - సలుపుచుండగా అల మువ్వగోపాలుడగు వేంకటేశుడు కలువల శయ్యపై - గలసే మన్నది నిజమై || అంటూ సరళమైన అచ్చతెనుగు పదాలతో పండితపామరులను రజింపచేసిన పదాలను రచించిన వాగ్గేయకారుడు క్షేత్రయ్య. క్షేత్రయ్యగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు వరదయ్య. కృష్ణాజిల్లాకు చెందిన మొవ్వ గ్రామానికి చెందినవాడు. ఈ మొవ్వని మువ్వ, మూవ, మవ్వ అని కూడా అంటారు. క్షేత్రయ్య జీవితానికి సంబంధించి స్ఫష్టమైన వివరాలు తెలియదు. అయితే ఈయన పదిహేడవ శతాబ్ధకాలంలో జీవించి ఉండి ఉంటాడని చారిత్రకారుల అభిప్రాయం. కాగా, వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించి, ఆయా దైవాలపేర మువ్వగోపాల పదాలను రచించటం ద్వారా ఆయనకు క్షేత్రయ్య అన్నపేరు వచ్చిందని కథనం. క్షేత్రయ్య వరహూరు (వరయూర్ వరాహస్వామి), చిదంబరం (తిల్లై గోవిందుడు), కడప (వెంకటేశుడు), కంచి (వరదరాజస్వామి), వేదపురి (వేదనారాయణుడు), హేమాద్రి (సామి), యదుగిరి (చెలువరాయుడు), ఇనపురి (సామి), పాలగిరి (చెన్నడు), తిరుమల (వేంకటేశుడు), తిరవళ్ళూరు (వీరరాఘవుడు), శ్రీరంగం (రంగేశుడు), మధుర (మధురాపురీశుడు), సత్యపురి (వాసుదేవుడు), శ్రీనాగశైలము (మల్లికార్జునుడు), చలువ చక్కెరపురి, కోవళ్ళూరు మున్నగు క్షేత్రాలను దర్శించి ఆయా దేవుళ్లపేర్ల పదాలను రచించాడు. సుమారు నాలుగువేలకు పైగా క్షేత్రయ్య పదాలను రచించగా అందు నేడు మనకు లభ్యమవుతున్న పదాలు, మువ్వగోపాల ముద్రతో ఉన్నవి 372, రాజాంకితాలు, ముద్ర లేనివి 25 మాత్రమే. అలాగే, క్షేత్రయ్య మధుర తిరుమలనాయకుని (1623-59), తంజావూరు విజయరాఘవుని (1633-73), గోలకొండ పాదుషా (1622-72) ఆస్థానాలలో అగ్రకవిగా విరాజిల్లాడని ఆయన పదాల ద్వారా వెల్లడవుతోంది. భాగవతా భక్తినిరూపకమైన క్షేత్రయ్య పదాలలో అష్టవిధనాయికా శృంగారంతోపాటు మధురభక్తి కూడా నిక్షిప్తమైవుంది. ముఖ్యంగా క్షేత్రయ్య తానే నాయిక అయి మువ్వగోపాలుని ప్రియునిగా భావించి వర్ణించిన మధురభక్తి అనన్యసామాన్యం. ''చూడరె అది నడిచే హోయలు సుదతి చేయు జాడలు; ఆడది కులకాంత అత్తింటి కోడలు, అలగోపాలునిని ఉదికి వెడలెను'' అనే పదంలో భాగవతులని గోపికా మధురభక్తిని స్పష్టం చేశాడు క్షేత్రయ్య. క్షేత్రయ్య ఒకనాడు ‘సావిరహే తవ దీన కృష్ణా’ అనే జయదేవుని సంస్కృత అష్టపదికి నర్తకీమణులు చేసిన నృత్యాన్ని చూసి ప్రభావితమై తేనెలొలికే తెలుగులో అటువంటి పాటలు ఉంటే అందరికీ అర్ధమై మరింత రక్తికడతాయన్న భావన ఏర్పడింది. అచ్చ తెలుగులో అందరికి అర్ధమయ్యే పదాలు రాయాలన్న తపన పెరిగింది, అలాగే తెలుగు భాష ఉన్నంతకాలం తన పదాలు, పాటలు జీవించి ఉండాలని మువ్వగోపాలుని పేరు ప్రతినోట విన్పించాలన్న సంకల్పం ప్రభలమైంది. అందుకు అనుగుణంగా క్షేత్రయ్య సంగీత, సాహిత్యాలను, అభినయరీతులను ఆకళింపు చేసుకున్నాడు. ఆయన సంగీత, రాగ,తాళ విన్యాసాలలో, ఛందస్సు, వ్యాకరణాలలో పటిమ ఉన్నదనడానికి ఆయన పదాలే తర్కాణాలు. తంజావూరు రఘునాథరాయలను చూడటానికి వెళ్లినపుడు ఆయన చెప్పిన ఈ కందపద్యం అందుకు నిదర్శనం – తము దామె వత్తురర్ధులు క్రమ మెరిగిన దాతకడకు రమ్మన్నారా కమలంబులున్న చోటికి భ్రమరంబుల యచ్యుతేంద్ర రఘనాథనృపా క్షేత్రయ్య మొట్టమొదట రాసిన పదం ఆనందభైరవిరాగం, ఆదితాళంలో ‘శ్రీపతి సుతుబారికి నేనోపలేక నిను వేడితే కోపాలా? మువ్వగోపాలా.’ క్షేత్రయ్య రచనలు పదాలుగా ప్రసిద్ధి చెందాయి. పదం కూడా కీర్తనవంటిందే. అయితే ఇందు కవి తన భావాలను నాయికా-నాయకుల మధుర, శృంగార భావాలుగా వర్ణించి దేవునికి అంకితం చేస్తాడు. సంగీత, సాహిత్యాలు సమపాళ్లలో కల్గి, పల్లవి, అనుపల్లవి, చరణాలతో ఇది కూడి ఉంటుంది. క్షేత్రయ్య రాసిన ఈ మొదటి పదంలో మాత్రం మనకు పల్లవి, అనుపల్లవులు కన్పించవు. క్షేత్రయ్య పదములలో ముఖ్యమైన రసము రసరాజమైన శృంగారము. సంభోగ, విప్రలంభాదులను గురించి అష్టవిధ నాయికలు పడే అనుభావలు ఇందు కథా వస్తువు. ఉదాహరణకు కంచి వరదరాజస్వామి వారి కేళమందిరంనుంచి మీనాక్షీ అమ్మవారు తెలతెలవారే వేళలో శృంగారాంచిత చిహ్నాలతో సుప్రభాత సేవకంటే ముందుగా చెలులతో కలిసి చెలువం మీరేలా వచ్చే సొగసులన్నీ కళ్ళారా దర్శించి క్షేత్రయ్య రాసిన అద్భుత పదమిది - ప: మగువ తనకేళికా మందిరము వెడలెన్ అను: వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు చ1: విడజారు గొజ్జంగి విరిదండ జడతోను కడు చిక్కపడి పెనగు కంట సరితోను నిడుద కన్నుల దేరు నిదుర మబ్బుతోను తొదరి పదయుగమున దడబడెదు నడతోను చ2: సొగసి సొగయని వలపు సొలపు జూపు తోను నగవగల ఘనసార వాసనలతోను జిగమించి కెమ్మోవి చిగురు కెంపులతోను సగము కూచముల విదియ చందురుల తోను చ3: తరిదీపు సీయు సమసురతి బడలికతోను యిరుగడల కైదండలిచ్చు తరుణులతోను పరమాత్మ మువ్వగోపాల తెల్లవారెనునుచు మగువ తనకేళికా మందిరము వెడలెన్. (మోహన – ఝంప) పై పదము అన్నమాచార్యులవారి ‘పలుకు దేనెల తల్లి పవళించెను కలికి తనమున విభుని గలసినది గాన’ అన కీర్తనను పోలి ఉండడం కాకతాళీయమే. జయదేవుని అష్టపదులు సంస్కృతాన ఎంత అందంగా పొదగాయో, క్షేత్రయ్య పదాలు తెలుగు సొగసులను, సొబగులను అదేవిధంగా పొదవుకున్నాయని అనేకమంది పరిశోధకులు కొనియాడారు. ప్రాసలు, అనుప్రాసలు, ఎంచుకున్న అచ్చ తెనుగు పదాలు క్షేత్రయ్య కవితా సౌందర్యానికి ప్రతీకలు. మచ్చుకు కొన్ని -- మోనిపానక మిచ్చునా? కొసరి కొసరి ముద్దులాడ నిచ్చునా” తావి పువ్వులు దెచ్చునా? తన సొగసుకు తగినవాడని మెచ్చునా? మన సిచ్చునా? దేవరే మొగడు గావలెనని భావజుని పూజలొనరించిన యా వనిత పేరేమి సెలవీరా, సిగ్గేలరా? పడతి నే నొకచోట ప్రాణేశుడొకచోట నెడబాసి మరునిచే నిడుములకు లోనై కడలేని విరహాగ్ని గ్రాగి వేగితి చాల పుడమిలో వేరె జన్మము లేదె సుదతి నల్లని మేని వాడట ఓయమ్మ! వాడు – నయము లెన్నో చేసునట! చల్లగా మాటాడు నట! – సరసము వాని సొమ్మట! కల్లగాదట వాడు – కళలంట నేర్చునట! తెలుగు భాషలో పదకేళిక చేయడం సాధ్యం కాదనే అభిప్రాయమానాడు ఉండేది. సంస్కృత ప్రభావం అటువంటిది. ఆ దశలో అభినయానికి అనుగుణమైన పదాలను తెలుగలో రచించి పండితులు ముక్కుమీద వేలేసుకొనేటట్టు చేశాడు క్షేత్రయ్య. అయితే రావే, పోవే, ఒసే, ఏమే వంటి పదాలు కవిత్వమేమిటని విమర్శించిన వారూ లేకపోలేదు. తంజావూరు విజయరాఘవ నాయకుల అస్థానంలో ఇటువంటి విమర్శలే ఎదురైనపుడు, కాంభోజి రాగం, త్రిపుట తాళంలో ఈ కింది పదం పల్లవి, అనుపల్లవి, రెండు చరణాలు రాసి వారి ఆస్థాన కవులను పూర్తిచేయమని అభ్యర్ధించగా, వారి వల్ల సాధ్యం కాలేదు. ‘‘వదరక పోపోవే వాడేల వచ్చీని వద్దూ రావద్దనవే అది యొక్క యుగము, వేరే జన్మమిపుడు అతడెవ్వరో, నేనెవ్వరో ఓ చెలియా నిచ్చ నిచ్చలు, నేదో వచ్చీని రేపైన వచ్చిననచు మదిలో నిచ్చగా బరు వేడి, నిట్పూర్పుల చేత నింతిరో పెదవులెండి హెచ్చైన, వెన్నల చిచ్చుల రాత్రులు యెన్నెన్నో గడిపితిని నేటి మాటలే’’, అంటూ ఈ పదం సాగుతుంది. తన పదాలలో స్త్రీ అనే పదాన్ని తరుణీ, ముదిత, కొమ్మ, అక్కరో, సుదతి, పడుపగత్తి, మానిని, జవ్వని, ఎలనాగ, ఉవిద, ముచ్చు, మొలక, కంజాక్షి అంటూ దాదాపు 100 పర్యాయ పదాల్లో సంబోధించాడు. అలాగే నాయకులను అన్నెకాడు, చిన్నెలవాడు, నళినాక్ష, ఎమ్మెకాడు అంటూ అనేక పర్యాయ పదాలతో సంబోధించి తెలుగు భాషా విస్తృతను చాటిచెప్పాడు. క్షేత్రయ్య పదాలలో దృశ్యాలను సాహితీవేత్తలొక మాదిరిగా, చిత్రకళాకారులోక మాదిరిగా, సంగీతజ్ఞులొక మాదిరిగా, నృత్యకళాకారులు మరోకమాదిరిగా, సంగీతాన్ని, సాహిత్యాన్ని, భాష అలంకార, ఛందస్సులను అధ్యయనం చేస్తారు. సంగీత, రాగతాళాలతోపాటు సాహిత్య భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తేనే క్షేత్రయ్య పదాల సోయగం, మాధుర్యం, మృదుత్వం, లాలిత్యం, గాంభీర్యం, క్షేత్రయ్య నాయికా, నాయకులను మలిచిన తీరును, వారి భావాలను అర్ధం చేసుకోగలరని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అంటారు. క్షేత్రయ 49 రాగాలలో పదాలను అల్లినట్టు పరిశోధకులు తెలుపుతున్నారు. ఎక్కువగా కాంభోజి, పంతువరాళి, కేదారగౌళ, కల్యాణి, హుసేని, ముఖారి, తోడి, భైరవి, ఆనందభైరవి, మోహన, మధ్యమావతి, బిలహరి, శంకరాభరణం వాడారు. అయితే, కాంభోజి, కల్యాణి, హుసేని రాగాలను శృంగార రసాన్ని ఆవిష్కరించడానికి, ముఖారి, భైరవిలను శోకరసానికి, మోహన రాగాన్ని సంతోషాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించారు. క్షేత్రయ్య ఎక్కువగా భాషాంగరాగాలానే వాడారని మంచాళ జగన్నాథరావుగారు చెప్పారు. అలాగే క్షేత్రయ్య ఎక్కువగా త్రిపుట తాళంలో పదాలను పొందుపర్చాడు. సాంప్రదాయానికి విరుద్ధంగా క్షేత్రయ్య పదాలను పాడేటప్పుడు మొదట అనుపల్లవినీ, తర్వాత పల్లవిని పాడుతారు. క్షేత్రయ్య పదాలను భరతనాట్యం, కూచిపూడి పద్దతులలో సొగసుగా అభినయించి, బోధించినవారిలో ప్రముఖులు బాలసరస్వతి, వెంపటి సత్యం, నటరాజు రామకృష్ణ, కలానిధి నారాయణన్ గార్లు. సౌమ్యశ్రీ రాళ్లభండి