తిలాపాపం తాల పిడెకుడు అన్నట్టు. ఇటీవల విడుదలైన పుష్పా-2 సినిమా సందర్భంగా హైద్రాబాద్ లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఈ విషయలో బాధ్యత ఎవరిది అన్న విషయంపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా వివాదం పెనుతుఫానుగా మారుతోంది. బందోబస్తు ఇవ్వని పోలీసులదా? వద్దన్నా థియేటర్ కు వచ్చిన హీరో అల్లు అర్జున్ దా? ప్రేక్షకులకు తగిన సదుపాయాలు కల్పించలేని థియేటర్ యాజమాన్యానిదా? మీతిమీరిన అభిమానంతో థియేటర్ కు చేరుకొని తొక్కిసలాటకు పాల్పడ్డ అభిమానులదా? బాధ్యతారహితంగా రాత్రి 9.30గంటల ప్రీమియర్ షోకి పిల్లలని వేసుకొని వచ్చి ప్రాణాలు కోల్పోయిన తల్లిదా? అర్ధరాత్రి, అపరాత్రి అనిలేకుండా ఇలాంటి బెనిఫిట్ షోలకు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వాలదా? వీరిలో ఏ ఒక్కరిదో మాత్రం కాదు. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు. ఈ దురదృష్టకర సంఘటనలో అందరి హస్తం ఉంది. ఏ ఒక్కరినో నిందించి లాభం లేదు. హీరో అర్జున్ రావడం తప్పుకాదు. కానీ పోలీసులు వద్దన్నా రావడం తప్పు. తాము వద్దన్నా థియేటర్ వద్దకు వచ్చిన హీరోని వెనక్కి తిప్పి పంపని పోలీసులది తప్పు. రాత్రి ఇలాంటి దిక్కుమాలిన సినిమాకు తమ పిల్లలని తీసుకు వచ్చిన తల్లితండ్రలది పెద్ద తప్పు. హీరో అర్జున్ వచ్చినా, రాకపోయినా ఇలాంటి ప్రీమియర్ షోకి ఇసుకవేస్తే రాలనంత అభిమానులు వస్తారన్నది నిజం. అలాంటప్పుడు థియేటర్ వద్ద తగిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయని యాజమాన్యానిది తప్పే.
కాకపోతే ఇలాంటి సంఘటన జరిగిన ఉత్తర క్షణం ప్రతీవారు తామే ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్న దేశోద్ధారుకులా నిందాస్తుతికి దిగుతుంటారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. ఏదిఏమైనప్పటికీ జరిగినది దురదృష్టకరమైన సంఘటన. భాధ్యలు ఎవరైనా శిక్షార్హులే. అయితే ఇక్కడ ప్రతీవారు విస్మరిస్తున్న విషయం, నేడు సమాజానికి ఇలాంటి సినిమాలు అవసరమా? వీటి ప్రభావం రానున్న తరాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? ఒక వేళ మహిళ మరణించకపోయినట్టయితే, చిత్రానికి బ్రహ్మరథం పట్టి, హింస, సెక్స్, స్మగ్లింగ్ వంటి సంఘవిద్రోహక అంశాలను ప్రేక్షక మహాశయులు ప్రోత్సహిస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, U/A సర్టిఫికెట్ లభించిన సినిమాకు 12 ఏళ్లలోపు పిల్లలని తల్లి, తండ్రులు ఎలా తీసుకువచ్చారని ఎవరూ ప్రశ్నించకపోవడం. U/A సర్టిఫికెట్ ఉన్న సినిమా చూడటానికి 12ఏళ్ల లోపు పిల్లలకి థియేటర్ యాజమాన్యం అనుమతి ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించకపోవడం. ఇలాంటి సినిమాలు మానసిక పరిపక్వతలేని పిల్లలపై ప్రభావం చూపుతాయి అన్న విషయంపై ఏ మానసిక నిపుణుడు, వార్తా ఛానల్స్, విద్యావంతులు చర్చించకపోవడం. ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ కు విలువుందా అనే అనుమానం కలుగుతుంది. సమాజంలో నైతిక విలువలు సంఘటనల బట్టి ఎలా మారుతాయో అర్థమవుతుంది.
సినిమాలు సమాజానికి దర్పణాలయితే, సమాజానికి సినిమా ప్రతిబింబం. ఒకప్పుడు తప్పుగా, అసభ్యంగా, అభ్యంతరకరంగా కన్పించిన అనేక విషయాలు నేటి సమాజంలో సర్వసాధారణమైన అంశాలుగా మారిపోతున్నాయి. కొన్నాళ్ల క్రితం తప్పుగా అన్పించింది, నేడు ఒప్పుగా మారిపోతోంది. ఎవరి దృక్కోణంలో వారు కరెక్ట్. ఇక్కడ మహిళ మృతి పట్ల ఎవరికి సానుభూతి లేదు. ఆమె కుటుంబానికి క్షమాపణ చెప్పలేదు. నష్టపరిహారం తక్కువ ఇచ్చారు. నష్టపరిహారం ప్రకటించటంలో ఆలస్యం చేశారు. ఇంత టికెట్ ధర పెట్టి ఫస్ట్ షో చూడకపోతే ఏమవుతుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఇవే చర్చనీయాంశాలు. అంతేగాని, ప్రేక్షకుని వినోదం ముందు ఒక మనిషి మరణం కేవలం హెడ్ లైన్ గా మరిపోతోందన్న స్పృహ ఎవరికి కల్గకపోవటం శోచనీయం.
ఈ నేపథ్యంలో, సమాజంలో మారుతున్న నైతిక విలువలకు అద్దంపడుతున్న మన సెన్సర్ బోర్డు నియమ, నిబంధనలు గురించి నేను రాసిన వ్యాసాన్ని ఒకసారి పరికించండి. ఈ వ్యాసం వార్త దినపత్రికలో సినిమా పేజీలో నవంబర్ 27, 1996 లో ప్రచురితమైంది.నింపాదిగా, నిలకడగా మన సభ్య సమాజం ఎలా చెడును ఆశ్వాదించటం నేర్చుకుందో, చెడుకు అలవాటుపడిపోయిందో తెలపడానికి మరుగున పడుతున్న మన సెన్సార్ బోర్డు నిబంధనలే నిదర్శనం.
నియమాలు నూరైనా, ఆచరణలో శూన్యం
‘సెక్సీ సాంగ్స్, డ్యాన్సులు, వల్గర్ డైలాగులున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించే రోజలు పోయాయి. ప్రేక్షకలు పరిణితి చెందారు. ఇలాంటి చిత్రాలు చూడ్డానికి ఎవరు ఇష్టపడట్లేదని’ ఒకానొక సందర్భంలో ప్రముఖ దర్శక, నిర్మాత స్వర్గీయ వి. శాంతారాం అభిప్రాయపడ్డారు. అయితే ఋతుచక్రంలో మార్పులు వచ్చినట్టే ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులు వచ్చాయి. ‘ఛోళీకే ఫీచే క్యా హై,’ ‘సెక్సీ, సెక్సీ ముఝే లోగ్ బోలే (వివాదం రేకెత్తటంతో తర్వాత ఈ పదాన్ని బేబీ,బేబీగా మార్చారు), ‘సర్కాయిలో కటియా’ లాంటి వివాదాస్పద గీతాలు వెలువడి, మంచి చిత్రం అంటే ఏమిటి? అశ్లీలం, వల్గారిటీ లేని చిత్రాలు వెలువడాలంటే ఏం చేయాలి? తదితర ప్రశ్నలు ఉదయించాయి.
ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకే సెన్సార్ బోర్డు ఉన్నది. కొన్ని హద్దులకి లోబడి యథోచితంగా చిత్రాలు నిర్మించాలి. అందుకు సెన్సార్ బోర్డు కొన్ని చిత్రాల్లో అశ్లీలం, శృంగారం, హింస పెచ్చుపెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకునే వీలుంది. సినిమాల్లో అభ్యంతరకరమైన సన్నివేశఆలను కత్తిరించి, ప్రేక్షకులకి ‘నీట్’గా సినిమాని అందించటం ఈ నియమావళి ముఖ్యోద్ధేశం. అయితే ఎటువంటి సన్నివేశాలకి అభ్యంతరం చెప్పాలి అనే విషయమై సినిమాటోగ్రహీ చట్టం – 1952 కొన్ని సన్నివేశాలను ఉదహరించింది. 1. వేశ్యా గృహాల ఇతివృత్తాలాధారంగా చిత్రాలు నిర్మించకూడదు, 2. స్త్రీలపై అత్యాచారాలు, బలాత్కారం, వరకట్న వేధింపులు చూపకూడదు, 3. దారుణంగా హత్యలు చేయటం. సినిమాల్లో పైన పేర్కొన్న అంశాలపై ఎటువంటి సన్నివేశమైనా అభ్యంతరకరంగా ఉన్నట్టయితే సెన్సార్ బోర్డు వాటిని తొలగించవచ్చు. అలాగే, 1. చట్టవ్యతిరేక పనులకు ప్రేక్షకుల సానుభూతి లభించేలా చిత్రీకంరించకూడదు, 2. ఎటువంటి హింసాయుత సన్నివేశాలు సానుభూతిని పొందకూడదు, 3. ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం హత్యలు చేయటం చూపరాదు, 4. క్రిమినల్ క్యారెక్టర్లకు హీరోయిజం ఆపాదించరాదు, 5. చట్టాన్ని ధిక్కరిస్తూ చర్యలు తీసుకోవటం, 6. చిన్నపిల్లలపై అత్యాచారాలు, వారు హింసాత్మక సంఘటనల్లో పాత్రులు కావటం, 7. శారీరిక, మానసిక వికలాంగులను బాధపెడుతున్నట్టు, ఎక్కిరిస్తున్నట్టు, 8. జీవహింస, 9. వినోదం కోసం హింసను చూపటం, 10. మద్యాన్ని సేవింటచం, దానికి గ్లామర్‌ని జోడించటం, 11. ద్వంద్వార్థ డైలాగులు, 12. విదేశాలతో చేతులు కలిపి జాతీయ సంపదకు హాని కలిగించినట్టు చూపటం, తదితర అనేక అంశాలకు లెక్క ప్రకారం సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పవచ్చు. చెప్పాలి. కాని నేడు వస్తున్న చిత్రాలను ఒక్కసారి పరికిస్తే, ఈ నియమ, నిబంధనలు గాలికి కొట్టుకుపోయాయని, పేపర్లకి మాత్రమే అంకితమయ్యాయని వేరే చెప్పక్కర్లేదు.
నాలుగు దశాబ్ధాల క్రితం అంటే 1950, 60 సంవత్సరాలలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన కొన్ని హిందీ చిత్రా సన్నివేశాలను గమనిస్తే, అప్పటికి, ఇప్పటికి నియమాల ఆచరణలోగాని, మన సంస్కృతిలోగాని వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఉదాహరణకు ‘నాస్తిక్’ అనే చిత్రంలో ‘యహా మేరీ ఇజ్జత్ లూఠీ బాజార్ మే..(ఇక్కడ నడిబజారులో నా శీలం దోచుకున్నారు) అనే డైలాగ్ ను కత్తిరించారు. ఇక ‘దుర్గాపూజ’ అనే సినిమాలో ‘ఛుడేల్’ అనే తిట్టుకు కత్తెర పడింది. ‘ప్రిజనర్స్ ఆఫ్ గోల్కొండ’ చిత్రంలో ‘హమే దౌలత్ నహీ చాహియే, హుస్ను చాహియే (మాకు డబ్బు వద్దు, అందం కావాలి) అనే డైలాగును తొలగించారు. ‘నాగిన్’ లో‘తన్ సే లిపట్ జాయేగా,’ ‘తుమ్హారా దిల్ మేరే సంగ్ సంగ్ ధఢకే’ వంటి వాఖ్యాలను, ‘చాబుక్ వాలీ’లో పోలీసు అధికారి మెడల దండలు వేసినట్టు చూపిన దృశ్యాన్ని తొలగించారు. కాగా, ‘ధన్ వాలే’లో ‘ఔరత్ కో డేఖ్ కర్ మూమే పానీ భర్ ఆతా హై’ (ఆడదాన్ని చూస్తే నోట్లో నీళ్లూరుతాయి) అనే డైలాగుకు అభ్యంతరం చెప్పారు. నేడు ఇలాంటి అనేకానేక డైలాగులు లేకుండా ఒక్క సినిమా అయినా రూపొందుతోందా? అది ఏ భాషలోనైనా కావచ్చు. ఇంచుమించు ఇవే డైలాగులు మనకి విన్పిస్తాయి.
1955లో విడుదలైన ‘నాగిన్’ చిత్రంలోని ‘పీకా, పీకా ఖజరా, టూఠా హువా గజరా, కెహదేగా సారి బాత్’ (కారిన కాటుక, వాడిన పూలు చెపుతాయి ముచ్చట్లు) అనే వాఖ్యం అశ్లీలంగా ఉందని ఆనాడు అభ్యంతరం తెలిపారు. కానీ, నేడు ‘మై సోలా బర్స్ కి హోగయి, మేరీ ఛోళీ ఛోటీ హోగయి’ (నాకు 16 ఏళ్ల వయసు వచ్చింది. నా రవిక చిన్నదైంది) అనే పాటలో సెన్సార్ బోర్డుకు ఎటువంటి అభ్యంతరం గోచరించకపోవటం సోద్యం. ఇదే సినిమాలో ‘మై నిగాహోంసే మస్త్ కర్నేవాలా జాదూగర్ హూ’ అనే డైలాగులో అప్పటి బోర్డుకు ఎటువంటి అభ్యంతరం కన్పించిందో ఇప్పటివారికి అర్థంకాదు. ఎందుకంటే, ఖల్ నాయక్ లో హీరో ‘షరాఫత్ కి కితాబో మే ముఝే ఖల్ నాయక్ కహతే హై’ అని చెపితే ప్రేక్షకులు చప్పట్లు చరిచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ నియమాల ప్రకారం హింసాత్మక పాత్రలు లేదా యాంటీ హీరో పాత్రలు ప్రేక్షకుల సానుభూతిని పొందే విధంగా చిత్రీకంరించకూడదు. వాస్తవంలో ఇందుకు భిన్నంగా జరుగుతొందనటానికి పైన చెప్పిన ఉదాహరణే నిదర్శనం. ఈ పాత్రే కాదు, ఇటీవల విడుదలైన ‘డర్,’ ‘బాజీగర్,’ల హీరో పాత్ర కూడా నిజానికి ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకూడదు. మూడేసి హత్యలు చేసినవాడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేటట్టు చిత్రీకరించడం అభ్యంతరానికి తావిస్తుంది. కాని మన సెన్సార్ బోర్డుకు ఇందులో ఎటువంటి అభ్యంతరం కనిపించలేదు. మన తెలుగులో వచ్చిన ‘ప్రతిఘటన’, ‘ఆహుతి,’ ‘తలంబ్రాలు,’ ‘చట్టానికి కళ్లులేవు,’ ‘శివ,’ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలన్నీ హింసనే ఆయుధంగా చేసుకున్నాయి. కాని నియమాలకు ఇవి విరుద్ధం.
అలాగే, వేశ్యాగృహాల మీద సినిమాలు తీయకూడదు. ఆచరణ సాధ్యమేనా? శ్యాం బెనగల్ ‘మండీ,’ మహేష్ భట్ ‘సడక్’ల ప్రధాన ఇతివృత్తం వేశ్యలు, వారి జీవన విధానం. ఆఖరికి ఒకప్పటి కళాత్మక సినిమా, మీనాకుమారి నటించిన ‘పాకీజా’ ఇతివృత్తం కూడా ఇదే. ఇక మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రగా విడుదలైన ‘దామిని’, డింపుల్ కపాడియా ‘జక్మి ఔరత్’ల ప్రధాన ఇతివృత్తం అత్యాచారం. ఈ సినిమాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఇటువంటి ఇతివృత్తాలపై చిత్రాలను తీయకూడదన్న సెన్సార్ బోర్డు నియమం మాత్రం గాలికి కొట్టుకుపోయింది. మద్యం సేవించినట్టు చూపరాదు. ముఖ్యంగా చిత్రంలోని పాత్ర తాగడాన్ని సమర్థిస్తూ చూపకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉంటే మని ‘దేవదాస్,’ ‘ప్రేమ్ నగర్’ వంటి చిత్రాలను చూసే భాగ్యం కలిగి ఉండేది కాదు. చట్టాలని దిక్కరించరాదు. ఏ సినీ నిర్మాత, దర్శకుడు దీనిని ఆచరిస్తున్నారు. 1955లో పోలీసు అధికారి మెడలో చెప్పుల దండను వేయటం తప్పుగా భావిస్తే, నేడు అందులో తప్పు ఏమీ కన్పించట్లేదు. ద్వంద్వార్ధ డైలాగులు ఉండకూడదు. ‘నీక్కావల్సింది.. నా దగ్గరుంది..,’ ‘కట్టుజారిపోతా ఉంది, చీర కట్టు జారిపోతా ఉంది,’ ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ…,’ ‘మేరి ఫ్యాంట్ భీ సెక్సీ, మేరీ షర్ట్ భీ సెక్సీ,’ ‘క్యా బాడీ హై, క్యా బంపర్ హై,’ లాంటి గీతాలను వినడానికి అలవాటుపడ్డ మన ప్రేక్షకులు పదాలకుండే విపరీతార్థాలని అర్థం చేసుకునే శక్తిని ఎప్పుడో కోల్పాయారు. వీటిల్లో ఎవరికి పెద్దగా అభ్యంతరాలేవి కన్పించట్లేదు. వినిపించట్లేదు. వానపాటలు, జలపాతాల్లో శ్వేత వస్త్రాలు ధరించి అందాలని ఆరబెట్టడం నేడు మామూలు. హింసను చూపరాదు. అసలు హింస లేకుండా చిత్రాలేంటి? యాక్షన్‌కి, ఫైటింగ్‌కి, హింసకి మధ్య ఉన్న వ్యత్యాసం చెరిగిపోయింది.
సెన్సార్ బోర్డు విధించిన నియమావళికి కొత్త భాష్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమయింది. సెన్సార్ బోర్డు ఏర్పడిన కాలంలో తయారు చేసిన నియమావళి, సూత్రాలు బూజుపట్టి పాతపడిపోయాయి. కాలానుగుణంగా వీటిల్లో మార్పులు రావాలి. కాని, ఈ విషయాన్ని పట్టించుకునే వారెందరు? సెన్సార్ బోర్డు చిత్రం విడుదలకు కావల్సిన సర్టిఫికెట్ ఇవ్వాలి, అంతే. అందరూ కల్సి చూడగలిగేదైతే, ‘యు’ సర్టిఫికెట్, పెద్దలకి మాత్రమే అయితే ‘ఎ’ సర్టిఫికెట్. ఇందులో కూడా మళ్లీ కొన్ని మినహాయింపులున్నాయి. ‘మెసగాళ్లకి మోసగాడు’ సినిమా విడుదలైనపుడు, మొట్టమొదటి కౌబాయ్ చిత్రం, యాక్షన్ చిత్రమని పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. కానీ నేడు మా చిత్రంలో అశ్లీలానికి తావులేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వీలైనంత వరకు కుటుంబ మొత్తం కలిసి సినిమాలను చూడటం అనే విధానానికి మన ప్రేక్షకులు స్వస్తి చెపుతున్నారు. ముందుగా ఇంట్లో ఎవరో ఒకరు చూసి, స్క్రీన్ చేసుకొని, సెన్సర్ చేసుకుని, తమకు తాము పర్వాలేదు అనుకున్నప్పుడు అందరూ కలిసి చూస్తున్నారు. ఇలా చెప్పడంలో అతిశయం లేదు. ఒక వేళ ఇలా జరగట్లేదని ఎవరైనా అనుకుంటే, జరిగే రోజులు త్వరలోనే వస్తాయనుకోవచ్చు.
సౌమ్యశ్రీ రాళ్లభండి